Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 25


    ఇహ ఒక్కక్షణం కూడా అక్కడ వుండలేకపోయింది వినోదిని. "నేనిక వెళ్లొస్తానండీ!" అంది వలుస్తూన్న  కమలాపండు సగంలోనే వదిలేసి.

     "కారింకా రాలేదుకదా! వచ్చేదాకా వుండరాదా?

    "ఎందుకులెండి టాక్సీ తీసుకుని వెళ్లిపోతాను."

    "ఉన్న విషయం చెప్పి నీ మనసు బాధపెట్టినట్టున్నాను. ఇది కొన్ని గంటలో, కొన్ని రోజులో బాధపెడుతుంది. ఇష్టంలేని పెళ్లి జరిగితే జీవితమంతా బాధపడాల్సి వస్తుందని చెప్పాను."

    "యదార్దం చెప్పి నాకు చాలా మేలు చేశారండీ! మీకు నేను రుణపడి వుంటాను"

    "నీకేం కోపం రాలేదుగా!"

    "కోపం దేనికి?"   

    "అయితే మీ కారొచ్చేదాకా ఆగు."

    ఆ కాసేపు ముళ్ళమీద  ఉన్నట్టుగా ఉన్న వినూ కారు రాగానే వెళ్లిపోయింది.


                        *    *    *    *    *


    ఆ రోజు దిగంబరం  ఇల్లు ఒక ప్రళయ సన్నివేశంలా తయారైంది.

    వినోదిని వస్తూనే తన గదిలోకి వెళ్లిపోయి గదిలో సామానంతా చెల్లాచెదురు చేస్తూ, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏడుస్తూ యివతలి వాళ్లకి దడ పుట్టించసాగింది.

     తల్లి కిటికీ దగ్గరికి వచ్చి - "ఏమైంది వినూ? ఏం జరిగింది అక్కడ? నిన్నేమైనా అన్నారా?" అనడిగింది.

     తండ్రి కూడా వచ్చాడు. "తలుపు తెరూ వినూ! ఏమైందమ్మా? మాతో చెప్పకుండా నీలో నువ్వు ఏడిస్తే మాకేం తెలుస్తుంది చెప్పు?

    "నోట్లో మాట వుండగానే  అడిగింది తెచ్చిపెట్టేవాడివి. నా చిట్టి తల్లి ఆనందమే నా ఆనందం -  అని చెప్పేవాడివి.  ఇప్పుడు నాది ఒకే ఒక్క చిన్న కోరిక! తీరుస్తావా డాడీ?"

    "నా చిట్టితల్లీ! నీ కోరిక నేనెప్పుడైనా కాదన్నానా?"

    "నాకింత విషం తెచ్చివ్వండి డాడీ! నాకు చచ్చిపోవాలని వుంది."

    దిగంబరం దంపతులకి గుండెలు పగిలిపోయినట్టయ్యాయి.

     పువ్వులా పెంచుకున్న కూతురు కాస్త విషం తెచ్చివ్వండి, చచ్చిపోతాను'అంటే ఏ తల్లిదండ్రుల గుండెలు చెరువులై పోవూ?

     అక్కడేదో అవమానం జరిగి వుంటుందన్న అభిప్రాయానికి వచ్చేసిన దిగంబరం  "ఏం జరిగిందో చెప్పమ్మా? నిన్నెవరైనా ఏమైనా అన్నారా?" అనడిగాడు. "చెప్పు వాళ్ల బ్రతుకు ఈరోజే ఆఖరవుతుంది."

    "ఆ పిల్లాడు మతిలేనట్టుగా మంచంలో వున్నాడు. మారుతీరావుకి మన సంబంధం బాగా నచ్చింది.  ఇహ అంటే గింటే ఆ తల్లే అనాలి. ఆవిడ ధోరణి చూస్తే ఆవిడకి మన వినూని చేసుకోవడం ఇష్టం లేదని నాకప్పుడే అనిపించింది"

    "అవిణ్ణేమీ అనకండి. ఆమె నాకు ఉపకారం చేసింది నిజం చెప్పి."

    "ఏ నిజం చెప్పింది?"

    "అతడికి నన్నుపెళ్లి చేసుకోవడం ఇష్టంలేదట. ఇంకెవరినో ప్రేమిస్తున్నాడట."

    "నా కూతుర్ని కాదని వాడు ఇంకెవరినో ప్రేమించడమా? అయితే దానికి నూకలు చెల్లిపోయినట్లే, నా కూతురి జీవితంలో నిప్పులుపోసి ఆ ఆడది ఎవరైనా సరే బ్రతికి వుండడానికి వీల్లేదు."

    "మీదంతా తొందరపాటు. ఆమెను చంపితే మన అమ్మాయికి న్యాయమెలా జరుగుతుంది?" అంది సరోజ.

     "అది చస్తే వాడు చచ్చినట్టు మనమ్మాయిని చేసుకుంటాడు కదా?"

    "తప్పు డాడీ! ఎవరినో చంపి, ఆ నెత్తుటి చాలుమీద నా వైవాహిక జీవితసౌదాన్ని నేనెలా నిర్మించుకోగలను?  అతడి మనసు నాది కాకపోయాక అతడితో మనువు నాకెందుకు? అతడితో మనవు కుదరకపోయాక ఈ బ్రతుకెందుకు?"

    "మనిషి నీ వాడయ్యాక మనసెక్కడికి పోతుందమ్మా?వాడిని నీ కాళ్ల దగ్గర పెంపుడు కుక్కలా చేసి పడెయ్యనూ?"ధీమాగా అన్నాడు దిగంబరరావు.

     "మీ అమ్మను చేసుకోకముందు నేనూ ఒకమ్మాయి ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేననుకునేవాడిని. మంచి సంబంధం అని మీ అమ్మతో నా  పెళ్లి నిశ్చయించాడు మీ తాతయ్య. బలవంతంగానే పెళ్లి పీటలమీద కూర్చున్నాను. బలవంతంగానే మీ అమ్మ మెడలో మూడు ముళ్లు వేశాను. కొంగు కొంగు ముడిపడిన ఆ క్షణం ఎలాంటిదోగాని, ఆ క్షణం నుంచి నా జీవితం  ఆమెతో ముడిపడిపోయింది. ఆమె నా జీవితంలో అడుగుపెట్టిన వేళావిశేషంతో నా దశ తిరిగిపోయింది. నేను పట్టిందల్లా బంగారమైపోయింది.  ఇప్పుడు మీ అమ్మ నాకు దేవత! అదృష్టదేవత! ఇప్పుడు తలుచుకుందామన్నా నేను ప్రేమించిన పిల్ల గుర్తురాదు. యిప్పుడామె ఎక్కడుందో, ఏమైందో కూడా  నాకు తెలియదు. నీ పెళ్లి విషయంలో నువ్వు నిశ్చింతగా వుండు తల్లీ! కొండమీది కోతినైనా సంపాదించి యిచ్చే ఈ తండ్రి నీకుండగా చచ్చిపోతే బాగుండునని  ఎలా ఆలోచించావమ్మా?"

    "నామీది ప్రేమచేత మీరిలా అంటున్నారుగాని ఈ పెళ్లి జరగదని నా మనసు చెబుతోంది డాడీ!"

    "నువ్వు చూసిన ప్రపంచం  చాలా చిన్నది. నేను చూసిన ప్రపంచం  చాలా పెద్దది. ఆ  అనుభవంతో చెబుతున్నాను. శ్రీచక్రే నీ భర్త  ఆపుతాడు. వాడి బాబు నా చేతిలో మనిషి. వాడి రహస్యాలు నా గుప్పిటిలో వున్నాయి.  నాతో వియ్యాన్నే గాని, కయ్యాన్ని పెట్టుకుంటే  కటకటాల పెట్టుకోలేడు వెనకే వుంటాడు."

    "ఏ రహస్యాలండీ?' కుతూహలంగా ప్రశ్నించింది సరోజ.

    "గుప్పిట మూసి ఉన్నంతవరకే కదా రహస్యం!"

    వారం రోజులు గడిచాయి.

    శ్రీచక్రకి జ్వరం తగ్గింది. కాని, నీరసంతో బెడ్ మీదే వుంటున్నాడు.
 
    అతడికి కులాసా చిక్కేంతవరకూ ఓపిక పట్టిన  దిగంబరం  మారుతీరావును ఇంటికి పిలిచి - 'మీ అబ్బాయి ఎవరినో ప్రేమిస్తున్నాడటకదా? ఎవరినో తెలుసుకో.'

    "మా అబ్బాయికి ప్రేమ వ్యవహారం వున్నట్లు నాకు తెలియదే! ఎవరు చెప్పారు?" తెల్లబోయాడు మారుతీరావు.

    "మీ ఆవిడే చెప్పింది. అది మా విసూతో, అలా చెప్పొచ్చా? అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటే? అంతపనీ జరిగేదీ! చచ్చిపోతాను, ఇంత విషం తెచ్చిపెట్టండి డాడీ అని ఒకటే ఏడుపు. నీ పెళ్లి  శ్రీచక్ర తోటే జరిపిస్తానని ధైర్యం చెప్పి ఎలాగో వూరుకోబెట్టాను .నా పిల్లకి ఏదైనా అన్యాయం -జరిగిందా? నువ్వుండవు! నీ కొడుకూ, భార్యా ఎవరూ వుండరు,  సర్వనాశనం చేస్తాను."

    ముప్పై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నడూ భార్యమీద చెయ్యి చేసుకున్న గుర్తులేదు మారుతీరావుకి.

    "మీ తల్లీ కొడుకులు నాకు తెలియకుండా డ్రామాలాడతారా? ఎవతెనే వాడు ప్రేమించింది?"

    "వాడు ఎవరినీ ప్రేమించలేదు. అలా చెబితేనన్నా ఆ పిల్ల మనవాడి మీద ఆశ వదిలేసుకుని ఈ పెళ్లి వద్దంటుందని అలా చెప్పాను. లేకపోతే ఆ కోణంగిపిల్ల నా కోడలు ఏమిటి? మొహం చూస్తేనే డోకొస్తుంది."

    అప్పుడు పడ్డాచి పద్మావతిమీద దెబ్బలు. పిచ్చి కోపంతో కొట్టాడు. కొడుకు అడ్డువస్తే అతడికీ పడ్డాయి దెబ్బలు "దిగంబరం  మనిషికాదని చెప్పానా లేదా? వాడితో పెట్టుకుంటే మనం సర్వనాశనం అయిపోతామని చెప్పానా లేదా? ఎందుకు చేశావీ పని?" అతడి కళ్లు నిప్పులు కురుస్తున్నాయి.

     "మన తిండి మనం తింటున్నాం. మన బట్ట మనం కడుతున్నాం. వాడికి భయపడేదేమిటి? ఏమిటట వాడు చేసేది?" కళ్లు తుడుచుకుంటూ రోషంగా అంది పద్మావతి.

     "వాడు  నా మెడమీద కత్తిపెట్టాడే!నువ్వీ పెళ్లి వద్దంటే ఆ కత్తి మెడలో దిగుతుంది."

    "ఇదెక్కడి చోద్యం? కత్తులు, కటార్లు చూపి పెళ్ళిళ్లు చేస్తారా ఎవరైనా?"

    "ఏరా? నువ్వా పిల్లను చేసుకుంటావా లేదా?"

    "గేదెకు పచ్చిగడ్డి మేపితే అది పాలిస్తుందని సాకుతారు. కోడిని పెంచినా, మేకను పెంచినా అది ఆకలి తీరుస్తుందనే పెంచుతారు. కొడుకూ అలాగేనని  మీరు పెంచితే,  ఈ శరీరం మీద అన్ని హక్కులూ మీకే. పెంచింది కోడినో, గొర్రెనో కాదని, పెంచింది మనిషినని, వాడికి మనసు వుందని మీరనుకుంటే మీ ప్రశ్నకు జవాబివ్వాల్సిన అవసరం లేదునుకుంటాను" అని అక్కడ్నించి విసురుగా వెళ్లిపోయాడు శ్రీచక్ర.

     "అబ్బా! బారీ డైలాగులు కొట్టాడే నీ కొడుకు."

    "వాడికీ ఓ మనసుందని గుర్తిస్తే ఈ సంబంధం కాన్సిల్ చేస్తారు."

    "విడవమంటే పాముకు కోపం! కరవమంటే  కప్పకు కోపం!నాకు ఇదెక్కడి సంకటం తెచ్చిపెట్టావురా దేవుడా!" మారుతీరావు తల పట్టుకు కూర్చున్నాడు.

     "గుర్రాల్ని బలవంతంగా వరిగడ్డి దగ్గరికి తీసుకెళ్ళగలరుకాని తినిపించలేరుగా? ఇదీ అంతే!  బలవంతాన మీరీ పెళ్ళి చేయించలేరు."

    "పెళ్లి జరిపించడంవరకే నా బాద్యత. కాపురం దిగంబరం చేయిస్తాడు వాడితో చచ్చినట్టు."

    "ఈ ఇంటిని మీరు శ్మశానంగా మార్చాలనుకుంటే  ఈ పెళ్లి జరిపిస్తారు."

    "ఏమిటి బెదిరింపు? బెదిరించడం నాకుమాత్రం చాతకాదనుకున్నావా? కణతకు గురిపెట్టి కాల్చుకుంటే ఒక్క గుండు చాలు"

    "శుక్రవారంపూట ఏం మాటలో? ఏం మనుషులో?" నసుగుతూ మాంగల్యాలను కళ్లకద్దుకుంది.

     "భక్తి ఆ బంగారు బిళ్లల మీదే వుంటే చాలదు. మగడిమీద వుండాలి."

    "ఇప్పుడు లేక ఏమైందిట?"

    "ఈ పెళ్లి తప్పితే మరో పెళ్లి నీ కొడుక్కి ఈ జన్మలో  కాదు. ఆ వచ్చే పిల్లను తుపాకీపెట్టి కాల్చేస్తాడు ఆ దిగంబరం! ఎవరో పిల్లను ప్రేమించాడని చెప్పావుగా! ఆ పిల్ల ఎవరో తెలుసుకో! సంగతేమిటో తేల్చేస్తాను."

 Previous Page Next Page