Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 26


    తల పట్టుకోవడం ఇప్పుడు పద్మావతి వంతు అయింది.

    "ఇదెక్కడి అన్యాయం? తన కూతుర్ని తప్ప ఇంకెవర్నీ ప్రేమించకూడదూ, పెళ్లి చేసుకోకూడదంటే ఎలా?"

    "దిగంబరం ముందు ప్రశ్నలుండకూడదు!"


                     *    *    *    *    *


    ఆలస్యంచేస్తే అనుకున్న పెళ్ళికి అవాంతరాలొస్తాయన్న భయంతో వెంటనే ముహూర్తం పెట్టించే ప్రయత్నంలో పడ్డాడు దిగబంరం.

     "సాయంత్రం నాలుగింటికిరా! తాంబూలాలు పుచ్చుకుని ముహూర్తాలు పెట్టుకుందాం! పురోహితుడికి కబురు చేశాను. సాయంత్రం నాలుగింటికి వస్తానన్నాడు."

    "మీ సిస్టర్ని కూడా తీసుకురానా?"

    "ఆవిడొద్దులే. ఇష్టంలేని మనుషులొస్తే లేనిపోని రభస. పెళ్లయి పోయాక మా వినూ అత్తగారిని ఒక పట్టుపడుతుందిలే! నువ్వు చాలు తాంబూలాలు పుచ్చుకుని లగ్నపత్రిక వ్రాసుకోడానికి."

    ఒక్కడే వెళ్లాడు మారుతీరావు.      

    పురోహితుడు కూడా వచ్చేశాడు.    
 
    "సాధ్యమైనంత తొందరలో మా అమ్మాయి పెళ్లికి ముహూర్తం నిర్మయించండి శాస్త్రీజీ!"

    "డెబ్బయ్ రోజుల మూఢమి నిన్ననే ప్రారంభమైంది రావుగారూ! ఆ తరువాత ఆషాడమాసం! మూడు నాలుగు నెలలవరకు ముహూర్తాలు లేవు."

    చావు కబురు విన్నట్టుగా చల్లబడిపోయాడు దిగంబరం.

     "ఇప్పుడెలా మారుతీ?"

    "రిజిష్టర్ మారేజ్ చేస్తేనో?"

    "నాకు ఒక్కగానొక్క పిల్ల. నీకూ అంతే. సంప్రదాయయుక్తం గా గ్రాండ్ గా చేద్దామని వుంది. రిజిస్టర్ మారేజ్ చేయాలన్నా నెలరోజులు పడుతుంది కదా?" ముందు అప్లికేషన్ పెట్టాలి"

    "సరే! ఆషాడం తరువాత వచ్చే ముహూర్తమే నిర్ణయించండి శాస్త్రి గారూ!"

    "అమ్మాయిదీ అబ్బాయిదీ జన్మనక్షత్రం చెబితే వాళ్ల జాతకరీత్యా ఏది సరిపోతుందో చూసి పెట్టొచ్చు."

    "మా అమ్మాయిది పునర్వసు, రెండోపాదం!"

    "మావాడికి జాతకం రాయించలేదు. అంతకుముందు పుట్టిన ముగ్గురికీ రాయించాను. ముగ్గురూ పోయారు. వీడిమీదా పెద్ద ఆశలేం పెట్టుకోలేదు. అందుకే జాతకం రాయించలేదు."

    "అయితే పేరు బలంమీద చూడాల్సిందే!"

    "పుట్టినప్పుడు పెట్టిన పేరు చెప్పాలా? తరువాత పెట్టిన పేరు చెప్పాలా?"

    "రెండు పేర్లున్నాయా మీ అబ్బాయికి?"

    "పిల్లలు చనిపోతుంటే ఎవరో సలహా ఇచ్చారట మా ఆవిడకి, పుటటగానే పెంట మీద పారేసి తరువాత తెచ్చుకుని పెంటయ్యా అని పేరు పెట్టుకుంటే పిల్లాడు బతుకుతాడని! అలాగే చేసింది మా ఆవిడ. వాడి మొదటి పేరు పెంటయ్య."

    "వ్యవహార నామమే ముఖ్యం."

    "శ్రీచక్రకుమార్."

    "మా అమ్మాయి పేరు వినోదిని."

    ఆయన వేళ్లమీద ఏదో లెక్కకట్టి -

    "శ్రావణ మాసంలో బహుళ దశమీ శనివారం మంచి ముహూర్తం వుంది.  మీరు ఖాయం చేయమంటే అది చేస్తాను" అన్నారు.      

    "అదే చేయండి."

    తన పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయమైపోయిందని  హతాశుడయ్యాడు శ్రీచక్ర.   

    కానీ మళ్లీ ధైర్యం తెచ్చుకున్నాడు.    

    ఇంకో మూడునెలల టైము వుంది బలిపీఠం ఎక్కి బలిపశువు కావడానికి.

    ఈలోపల ఏదయినా ఉపాయం ఆలోచించాలి.    

    వినోదినిచేత ఈ పెళ్లి వద్దనిపిస్తే.....

     ఆరోజు ఉదయం శ్రీచక్ర ఇంకా నిద్రలో వుండగానే, ప్రక్కన ఫోన్ మోగింది.
   
    ఫోన్ ఎత్తి - "హలో అన్నాడు బద్దకంగా.

    "ఇప్పుడే నిద్రలోంచి లేచినట్లున్నారు?"

    ఆ గొంతు నిద్రమత్తుగా వుంటేనూ"

    "ఫోన్ లో కూడా  వాయిస్ ని ఇంత బాగా గుర్తుపడుతున్నారంటే మెచ్చుకోవాలి మిమ్మల్ని. ఊ!  ఏమిటి సంగతులు?"

    "సంగతులు నా దగ్గరేం లేవు. మీరే చెప్పాలి మరి."

    "నా దగ్గరా పెద్దగా  సంగతులు లేవు."

    "అయితే మనం సాయంత్రం ఎక్కడయినా కలుసుకుందామా? బోలెడు సంగతులు అవే పుట్టుకొస్తాయి" మరిపెంగా అంది వినూ.

    "నాకు వీలుకాదు. వేరే పనివుంది."

    "నాకోసం ఆ పని మానుకోలేరా?"

    "ఆహా కుదరదు" ఫోన్ పెట్టేశాడు శ్రీచక్ర. పొద్దున్నే ఈ తలనొప్పి ఏమిటాని విరుక్కుంటూనే.
   
    మళ్లీ దుప్పట్లో దూరి  వెచ్చగా పడుకోబోయాడు.      

    ఫోన్ మళ్లీ గణగణ!

    ఎత్తలేదతడు వినోదినే చేస్తుందనుకుని,

    "నిద్రపోతున్నావా కన్నా?ఫోన్ ఎంతసేపటినుండో రింగవుతోంది" అంటూ వచ్చింది తల్లి.

    "ఆ దెయ్యం చేస్తోంది. నేను లేను.బయటికెళ్లానని చెప్పమ్మా " అన్నాడు శ్రీచక్ర.

    "దెయ్యం ఎవర్రా?"

    "దిగంబరంగాడి కూతురు. సాయంత్రం వెళ్లి కలుసుకోవాలిట ఆవిణ్ని"

    "ఫోన్ ఎత్తింది పద్మావతి - "హలో!"

    "అక్కగారా మాట్లాడేది. శ్రీచక్రకివ్వమ్మా ఫోను" దిగంబరం అన్నాడు.

    "వాడు లేడండీ!"

    "ఇందాకనేకదా! మా వినూ ఫోన్ చేస్తే మాట్లాడింది. అప్పుడే ఎక్కడికెళ్ళాడు?"

    "బయటికి వెళ్లాడు"

    "నాకు తెలుసులేమ్మా అతడక్కడే వుండి నీచేత అలా మాట్లాడిస్తున్నాడని. లేకపోతే ఇప్పుడున్నవాడు అప్పుడే ఎక్కడికి వెళతాడు? అతడితో చెప్పండి అక్కగారూ! ఇప్పటినుండి మా వినూని ఏడిపిస్తే బాగుండదని.
   
     అదేదో ముచ్చటపడి సాయంత్రం కలుసుకుందామని కోరితే వీలుకాదంటాడా? కాబోయే భార్యతో ఇలాగేనా ప్రవర్తించేది? కలకంఠి కన్నీరు ఒలికితే  కార్చిచ్చురేగుతుందని చెప్పమ్మా నీకొడుక్కి."

    "ఏమిటండీ మీ బెదరింపు? మీకసలు మర్యాద తెలుసా? కాళ్లు కడిగి కన్యాదానం చేయవలసిన మీకే ఇంత పొగరుంటే మాకెంతుండాలి? మీ అమ్మాయి పిలవగానే మావాడు రెక్కలు కట్టుకుని ఎగిరి రావాలా?  పెళ్లి కాకుండానే మీ అమ్మాయిని  మగపిల్లలతో త్రిప్పడమేమిటి?మీరెక్కడి తండ్రి బాబూ? మీరున్నది  ఇండియాలో అనుకుంటున్నారా అమెరికాలో అనుకుంటున్నారా?" గబగబా కడిగేస్తున్నట్లుగా  అంది పద్మావతి ముందే గిగంబరావంటే  ఆమెకు మంట. కార్చిచ్చు అదీ ఇదీ అనేసరికి మండిపోయింది.    

    "దానిదేముంది అక్కగారూ! ఇండియా అమెరికా అవుతుంది. అమెరికా ఇండియా అవుతుంది. అమెరికావనిత  చీర కట్టుమీద మోజుపడితే మన ఇండియా అమ్మాయివాళ్ల ఆఫ్ లంగాలమీదా, గౌన్ల మీదా మనసుపడుతోంది. వాళ్ల బాబ్డ్ హెయిర్ ను మనవాళ్లు దిగుమతి చేసుకోలేదూ? మీరెక్కడ కళ్లుమూసుకున్నారుఅక్కగారూ! సంప్రదాయాలెప్పుడో తారుమారయ్యాయి. కాబోయే భార్యభర్తలు పెళ్ళికి ముందు కలుసుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని, పరస్పర అవగాహనతో దాంపత్య జీవితంలో అడుగుపెట్టడం మంచిదని చెబుతున్నారిప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు. మీరింకా అజ్ఞానంతో వెనుకబడి వుంటానంటే ఎలా?" కాబోయే వియ్యపురాలికి చురకవేస్తూ అన్నాడు దిగంబరం.

    "మీ అమ్మాయి పెళ్ళికిముందే మిమ్మల్ని తాతని చేస్తేగానీ మీ తిక్క కుదరదులెండి. అప్పుడు అమెరికా వెళ్లి తలదాచుకోవాల్సిందే. ఊ మాట్లాడండి మీ కాబోయే అల్లుడితో" కసిగా శ్రీచక్ర చేతికి యిచ్చింది.
     
    శ్రీచక్ర ఇబ్బందిగానే "హలో" అన్నాడు.

     "సాయంత్రం వినూ నీ కోసం ఎదురుచూస్తూ వుంటుంది. నువ్వు తప్పకుండా రావాలి" జవాబు కోసం ఎదురుచూడకుండా అవతల ఫోన్ పెట్టేశాడు దిగంబరం.

    "ఆ దెయ్యం నుండి నిన్ను రిక్షించాలని చాలాతిప్పలు పడ్డాను. నావల్ల  కాలేదు. మీనాన్నగారు వాడి ఐశ్వర్యం చూసి కక్కుర్తి పడకపోతే బాగుండేది. ఇంటివాడే మనవాడు కాకపోయాక పరాయివాడినని లాభమేమిటి?" పద్మావతి నిట్టూర్పు విడిచింది.

     సాయంత్రం ఆరుగంటలకు తమ బంగళా ముందు కారు దిగుతున్న శ్రీచక్రని చూసి గర్వంగా ఒక నవ్వు నవ్వాడు దిగంబరరావు.

    "వెరీగుడ్! అల్లుడంటే ఇలావుండాలి."

    వినోదిని నవ్వుముఖంతో ఎదురొచ్చింది.

    "ఇంట్లో బోర్ గా వుంది. బయట అలాఅలా తిరిగి  వద్దాం రండి."

    ఆమె అత్యంత శ్రద్దగా అలంకరించుకున్నట్లుగా వుంది. అసలు అందం కాస్త తక్కువే అయినా  అలంకరణలో బాగానే అన్పిస్తోంది. శ్రీచక్ర పట్ల ఆమె కళ్లనిండా తొణికిసలాడే ఆరాధన.

     ఇద్దరూ శ్రీచక్ర కారులోనే  బయలుదేరారు.

 Previous Page Next Page