Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 24

     ప్రస్తుతానికి ఈ గండం గడవనీ. తర్వాత ఆలోచిద్దాం ఏంచేయాలో"అంటూ కొడుక్కి ఉపాయం చెప్పింది పద్మావతి.

     విన్నూని కోడల్ని చేసుకోవడం బొత్తిగా ఇష్టంలేదు పద్మావతికి.

     కానీ నాటకమాడే అవసరం లేకుండాపోయింది శ్రీచక్రకి.

     మానసికంగా నలిగి నలిగిపోయి అది జ్వరంలోకి దిగింది.

     మామూలు జ్వరం కాదు.

    డక్టర్ టైఫాయిడ్ జ్వరం అన్నాడు.

    వినూ బర్త్ డే ఫంక్షన్ లో శ్రీచక్రని కాబోయే అల్లుడిగా పరిచయం చేయాలని ఫంక్షన్ కి ఏర్పాట్లు చాలా భారీగా, స్టార్ హోటల్లో చేశాడు దిగంబరరావు.

     శ్రీచక్రకి టైఫాయిడ్ అని తెలియగానే ఫంక్షన్ కాన్సిల్ చేసేదాకా వదల్లేదు వినోదిని.

    "ఆయనకి జ్వరంవచ్చి పక్కమీద పడుంటే నాకిక్కడ జన్మదిన వేడుకలేమిటి డాడీ? నాకు మనస్కరించడంలేదు. ఆయనకి జ్వరం తగ్గి మామూలుగా అయ్యాక ప్రధానం గ్రాండ్ గా చేద్దురుగాని. అంతవరకూ నాకు ఏ ఆనందోత్సాహాలు అక్కరలేదు" అని చెప్పింది.

     శ్రీచక్రని చూడడానికి తల్లీదండ్రీ  బయలుదేరుతుంటే తనూ వస్తానంది.
 
     వీళ్లు వెళ్లినప్పుడు బాగా జ్వరపు మగతో వున్నాడు శ్రీచక్ర.

     "మా అల్లుడు  ఇంత జ్వరంలో వుంటే మంచి నర్సింగ్ హోమ్ లో చేర్పించక ఇంట్లో వుంచుకున్నారేమిటి అక్కయ్యా? ఇతడిని వెంటనే మా డాక్టర్ గారి నర్సింగ్ హోం లో అడ్మిట్ చేద్దాం. ఆయన చాలా  పెద్దడాక్టర్. ఫారిన్ లో పనిచేసి వచ్చారాయన" అన్నాడు దిగంబరరావు హడావుడి పడిపోతూ.

     "ఏదో పెద్ద రోగం వచ్చినట్లు హాస్పిటల్లో వేయడం ఎందుకండీ? ఇది మామూలుగా వచ్చే టైఫాయిడ్ జ్వరమే. దీనికి అంత కంగారు పడాల్సింది ఏముంది? ఉదయం, సాయంత్రం  మా డాక్టర్ గారు వచ్చి చూస్తూనే  వున్నారు.  ఆయనకీ వున్నాయిలెండి. ఫారిన్ డిగ్రీలు. వేళకి మందులు, ఆహారం ఇస్తుంటే అదే తగ్గిపోతుంది." ఏమాత్రం గాబరాలేనట్టుగా స్థిమితంగా అంది పద్మావతి.

     "చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత. ఎందుకైనా ముందు జాగ్రత్త మంచిదికదా!"        "ఇప్పుడంత ముంచుకుపోయిందేమీ లేదు. మామూలు జ్వరమే. అనవసర హంగామా నాకు నచ్చదు."

    "అక్కయ్య! పాతకాలపు మనిషి ఆమెకు తెలీదు. నువ్వయినా చెప్పకూడదా మారుతీ?"

    "చెప్పడానికి ఏముంది? ఇది మామూలు జ్వరమే, హాస్పిటల్ లో వుంచి తిరగడమంటే  అదో పెద్ద  హైరానా. ముఖ్యంగా ఆ హాస్పిటల్  వాతావరణం,  మందులు వాసనా మీ అక్కయ్యకు పడవు."

    మేముండగా అక్కయ్యని శ్రమపడనిస్తామా? మా వినూ చూసుకుంటుంది. పెళ్లికి ముందు వాళ్లు కొంచెం సన్నిహితంగా మెలగడం కూడా అవసరమని నా ఉద్దేశ్యం."

    "ప్రేమ ఒక గొప్ప అనుభవమంటారు కవులు. పెళ్ళి జరిగి తంపతులయ్యాక ఇహ ప్రేమించుకునే ఛాన్స్ వుండదుగా? ఏం ప్రేమించుకున్నా, ఈ నాలుగురోజులే. మావాడు ఇలాంటి వాటిలో కొంచెం బుద్దు ఏం చొరవ చూపినా మీ అమ్మాయే చొరవ చూపాలి" గడుసుగా అన్నాడు మారుతీరావు.

     "మా అమ్మాయికి అంత చొరవ ఎక్కడిది మారుతీ? ఉంటే కాలేజీలో చదువుతున్నప్పుడే  మీవాడిని  లైన్ లో పెట్టేది దానిది మూగ ఆరాధన. వేరే సంబంధం చూస్తుంటే ఎలాగో ధైర్యం చేసి తన మనసులో మాట చెప్పింది."

    "ఇద్దరుకిద్దరు సరిపోయారన్నమాట'అవసరం లేకపోయినా పెద్దగా నవ్వాడు మారుతీరావు.

     శృ-తి కలిపాడు దిగంబరం.

     పద్మావతికి భరించలేని విధంగా వుంది వాళ్ల ధోరణి.

    "మీ అమ్మాయిని పరాయి మగాడి సేవకు పెట్టడం అంత పరువైన  విషయంకాదు. పెళ్ళి కావాల్సిన పిల్ల" అంది కొంచెం అసహనంగా.

     "అదేమిటక్కయ్యా? ఎలాగో ఈ ఇంటి  కోడలు కోబోతున్న పిల్ల. మీ అబ్బాయి పరాయివాడు ఎలా అవుతాడు?"

    "పెళ్లి మాటలు అనుకున్నామేగానీ ఇంకా నిశ్చితార్దమైనా కాలేదుగా?" చివరికి ఏదో ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు?" పీటలమీది పెళ్లిళ్ళే చెడిపోతుంటాయి ఒకోసారి."

    ఆమె పుల్లవిరుపు ధోరణిని దిగంబరరావు ముఖం ఎలాగో అయింది.

    "అక్కయ్యకి మన వినూని  చేసుకోవడం ఇష్టంలేదా ఏమిటి?"

    "దానిదంతా చాదస్తం. మెట్టవేదాంతం. ఏదీ జరిగేదాకా జరుగుతుందనుకోవడం తప్పటుంది."

    "కానీ అక్కయ్యకి నా సంగతి తెలియనట్టుంది. ఏదైనా అనుకుంటే అది జరిగితీరాలి.  అంత పట్టుదల మనిషిని నేను. మా వినూ  పెళ్ళి అది ఇష్టపడ్డవాడితో జరగాలనుకున్నాను. జరుగుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు అడ్డుకోలేరు"

    అతడి ముఖంలోని కాఠిన్యం చూస్తుంటే భర్త అతడి గురించి చెప్పిన మాట అక్షరాలా నిజమనిపించింది.

     తనకిష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిగితీరుతుందని చెప్పడమన్న మాట.

     "ఏమిటి వీడి గొప్ప? వీడికి వీడి కూతుర్ని చేసుకోవడం ఏమిటి?' మంటగా అనుకుంది పద్మావతి.

     "మీ అత్తగారి మాటలు విన్నావుకదా? ఉంటావా?వస్తావా?" అడిగింది తల్లి.

     "ఒక్క గంట వుండి వస్తాను మమ్మీ! వెళ్లి కారు పంపించండి"
 
    దిగంబరం దంపతులు వెళ్లిపోయారు.

     టేబుల్ మీద ఏదో పుస్తకం వుంటే చేతికి తీసుకుని శ్రీచక్ర  మంచానికి దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుంది వినోదిని.

     పద్మావతి కూడా అక్కడే వుండిపోయింది. ఆ పిల్లనే పరిశీలనగా చూస్తూ.

    వినోదినిది అంతా వాళ్లమ్మ పోలిక వయసులో వున్నందుకేమో తల్లికంటే కొంచెం బాగుంది. కానీ కొడుక్కి తగిన జోడి కాదు.

     "కాలేజీలో నువ్వూ వాడూ కలిసే చదివారట కదా! ఎప్పుడైనా మాట్లాడుకునేవాళ్ళా?" అడిగింది ఆ అమ్మాయిని మాటల్లో దింపాలనే ఉద్దేశ్యంతో.

     "మాట్లాడుకునేవాళ్లం.  పాఠాల గురించీ, ఎగ్జామ్స్ గురించి, కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి. ఒకసారి మేం కలిసి నాటకం కూడా వేసాం."

    "అమ్మా!" శ్రీచక్ర కదిలాడు. అతడి స్వరం చాలా నీరసంగా వుంది.

    "ఏం కన్నా!" తల్లి దగ్గరగా వచ్చింది.

    "దాహంగా వుందమ్మా!"

    "పళ్లరసం ఇవ్వనా?"

    "ఇవ్వు."

    ప్రక్కన స్టూల్ మీద కూర్చున్న వినోదినిని అతడు చూడనేలేదు. అటు తిరిగి పడుకున్నాడు.
 
    "మీకేదైనా పనివుంటే వెళ్లి చూసుకోండి అత్తయ్యా! పళ్లరసం తీసిచ్చి ఏమైనా కావలిస్తే నేను చూసుకుంటాగా?ఏవి ఎక్కడున్నాయో ఒక్కసారి చూపితే చాలు."

    "నీ కర్రె మొహం చేసుకోవాల్సి వస్తుందనే  బెంగతోనే నా బిడ్డడు జ్వరం తెచ్చుకున్నాడు. ఇంకా నువ్వు దగ్గర కూర్చుని సేవలు చేయడం కూడానా?" వాడికిక జ్వరం తగ్గినట్టే!" మనసులోనే రుసరుసలాడిపోయింది.

    "నాకు వేరే పనేమీ లేదమ్మా! వాడిని నేను చేసుకోగలను. అసలు నువ్విలా వుండిపోవడమే నాకు నచ్చలేదు."

    అసలే నలుపు. ఇంకా నల్లబడ్డట్టుగా అయింది వినోదిని ముఖం.

     "ఎందుకండీ?" ఆమెను అత్తయ్య అని పిలిచే సాహసం  ఇక చేయలేకపోయింది.

     "ఏదో పెద్దవాళ్లు పెద్దవాళ్లు ఈ సంబంధం జరిగితే బాగుంటుందని  అనుకున్నారేగానీ వాడికి నీపట్ల ఇష్టమున్నట్టుగా నాకు కనిపించలేదమ్మా! తండ్రి భయానికి నీ మెడలో తాళి కడతాడేమోగాని మనసులేని వాడితో నువ్వేం సుఖపడతావు చెప్పు?"

    చాలాసేపు కొయ్యబారినట్లుగా కూర్చుండిపోయింది వినోదిని.

     దించుకున్న ఆ కళ్లు కన్నీటి కొలనులయ్యాయి.

     "నేనంటే  ఇష్టంలేదని చక్రి మీతో చెప్పాడా?" ఆ గొంతులో గాయపడ్డట్టుగా బాధ.

     "నీపట్ల అలాంటి వూహ తనకి లేదని చెప్పాడు."

    "అలాంటి ఊహ అంటే ఎలాంటి ఊహ?"

    "నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఊహ?"

    "అంటే  ఆయనకి ఎవరినైనా ప్రేమించి పెళ్లిచేసుకోవాలని వుందా?"

    "ఎలా గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతోందో?" చిరాకుగా అనుకుంది పద్మావతి. "అదంతా నాకు తెలీదమ్మా! నీతో  పెళ్లి నిశ్చయించామని తండ్రి చెప్పినప్పుడు వాడంత సుముఖత వ్యక్తం చేయలేదు. నేనూ ఆడదాన్నే. పెద్ద వాళ్ల బలవంతంతో నీ పెళ్లి వాడితో జరిగితే  నీ బ్రతుకు అన్యాయమవుతుందేమోనని  చెబుతున్నాను. నీకేం తక్కువ? నువ్వంటే ఇష్టపడే వాళ్లు కోటిమంది వస్తారు. ఇష్టపడని వాడిని చేసుకునే ఖర్మేమిటి నీకు చెప్పు?"

    "చక్ర ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ఆ ఒక్క మాట చెప్పండి చాలు."

    ప్రేమిస్తున్నాడని చెబితే, ఈ శని వదులుతుందేమో"

    "ప్రేమిస్తున్నట్లే వుంది."

    "ఎవరిని? వినోదిని గొంతులో ఉద్విగ్నత. ఒక విధమైన కంపన.

     "ఎవరినో ఒకరిని. నాకు మాత్రం చెబుతాడా అన్నీ."

    'శ్రీచక్ర జ్వరపు మగతలో వున్నాడు.

    రోగి దగ్గర పెద్దగా మాట్లాడకూడదని వాళ్లు గొంతు తగ్గించి మాట్లాడుకుంటున్నారు.

     వాళ్ళు అంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా అతడికేమీ తెలియడం లేదు!

 Previous Page Next Page