అబద్దాలు చెప్పకండి."
సురేష్ వులిక్కిపడ్డాడు.
"అబద్దాలేమిటి?"
"ఆమె మీ మిసెసా?"
"మిసెస్ అంటే ఆ అవును! నా మిసెస్ ప్రస్తుతానికి , ఎందుకలా అడిగారు?"
ఆమె నవ్వాపుకుంటూ మాట్లాడింది.
"మీ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను, అవతలి గదిలో నుంచి విన్నాను.'
"మైగాడ్! అన్నీనా?"
"ఓ ఎస్!"
"అంటే?"
"అవును! మీ సైన్స్ టీచర్ రాని రోజున మీ వన్ - టూ - త్రీ?"
"సిస్టర్! మీరు సహాయం చేస్తారా?"
"ఏమిటది?"
"దయచేసి విషయం డాక్టర్ కి చెప్పకండీ - ఫీజు లాగేస్తుంది.'
"నేనెందుకు చెప్తాను? అయినా డాక్టర్ కి తెలియకేం కాదు. అన్నీ ఇలాంటి కేసులే వస్తుంటాయ్. అందరూ తన భార్యే అనే చెప్పి తీసుకోస్తుంటారు - ఆపరేషన్ అయితేగాని యిద్దరూ చెరో ఆటోలో యింటి కెళ్ళే భార్యా భర్తలే అందరూ.
సురేష్ కూడా నవ్వేశాడు.
"నిజంగా మీరు ట్రేమండస్ సర్వీస్ చేస్తున్నారు. ఈలాంటి వాళ్ళకు ఈసారి నోబుల్ సీస్ ప్రైజ్ మీకే రావాలని నేను........"
బయటకు నడవబోయి అగాడతను.
"అన్నట్లు మీరు ఆ మాటలు కూడా విన్నారా?"
"ఏమిటవి?" నవ్వుతూ అడిగిందామె.
"అదే - నేనూ, నటాషా మా స్కూలు గార్డెన్ లో ........."
"అవును , మీరు జారిపోయే నిక్కరు పట్టుకుని తోటమాలికి దొరక్కుండా పరిగెడుతూ."
సురేష్ నవ్వాడు . ఆ నిక్కరు యిప్పటికీ వుంది. చూస్తారా?"
"అక్కర్లేదు " సీరియస్ అయిపొయిందామె.
డాక్టర్ బయటి కొచ్చింది.
"ఇదిగో ఈ కాప్యుల్స్ వాడండి" సురేష్ చేతిలో కాగితం పెట్టింది.
"థాంక్యు డాక్టర్!"
"వెల్ కమ్"
"ఈసారి మనకు పాప తప్పదు.'
ఆమె ఆశ్చర్యపోయింది.
"అంటే అదే - ఈసారి నటాషాకి సిజేరియన్ మీరే చేద్దురుగాని ! రేపే కృషి మొదలు."
ఆమెకు అతని మాటలు వచ్చినట్లులేదు.
"అల్ రైట్ !" అంది యింక వెళ్ళమన్నట్లు.
"సీజర్ నివాస్ కి యింకో అంతస్తు వేద్దాం."
ఆమె వెళ్ళిపోతుంది.
సురేష్ గదిలోకి పరుగెత్తాడు.
నటాషా దుప్పటిలో నుంచి అతన్ని చూసి నీరసంగా నవ్వింది.
"హయ్ డియర్! ఆర్ యూ ఒకే?"
"ఊ"
"భయంగా వుందా ఇంకా?"
"ఊహూ"
"అటో తీసుకురానా?"
"ఊ"
ఇద్దరూ ఆటోలో హోటల్ రూమ్ కి చేరుకున్నారు.
నటాషా బెడ్ మీద పడుకుంది.
రాజ్యలక్ష్మి అతన్ని చూసి నవ్వింది.
"చిన్నప్పుడు మీరు బాయ్స్ స్కోట్ లో వుండేవారా?"
"అవును! చాలా మంది ఆడపిల్లలను రోడ్డు దాటించాను. బైదిబై యిప్పుడు మీరు ఏదైనా రోడ్డు దాటాలనుకుంటే.....
"థాంక్స్ సురేష్" అంది నటాషా"
"వెల్ కమ్ డియర్! వెల్ కమ్ " అన్నాడు సురేష్.
రాజ్యలక్ష్మి అతనితో పాటు బయట వరకూ వచ్చింది. "మళ్ళీ ఎప్పుడు?"
సురేష్ అదిరిపడ్డాడు.
"ఏమిటి మళ్ళీ?"
"అదే"
"బెటర్ లక్ నెక్ట్స్ బర్త్."
"బెట్ కడదామా?"
"బెట్ ఎందుకు?"
"ఈ బర్త్ లోనే పాజిబుల్ అని."
"బెట్" అనేసి సురేష్ లిప్టు దగ్గరకు పరుగెత్తాడు.
* * * *
ప్రత్యూష చిరునవ్వు నవ్వింది సురేష్ ని చూసి.
"మీ కోసమే ఎదురు చూస్తున్నాను రోజూ" అందామె.
"ఇంకా వెళ్దామా మరి!" అడిగాడు సురేష్.
ఆమె విస్మయంతో చూసింది. "ఎక్కడికి?"
"ఎక్కడికయినా సరే! లైబ్రరీలో అందరి ఎదురుగా కుదరదు కదా" ఆమె కుదురుగా కూర్చుంటూ అడిగాడు.
ఆమె చిరుకోపంతో చూసింది.
"నా మారేజ్ ఫిక్సయింది. మీకు ఇన్విటేషన్ యిద్దామని......."
"ఓ! అదా! మై హార్టీ కండోలేన్సేస్."
"అదేమిటి?"
"కొన్ని రోజులపాటు నానా చాకిరీ చేయాలి కదా! అన్నట్లు పెళ్ళి చేసుకునే వారి కోసం నేనో కోర్స్ ప్రారంభించాను - చేరతారా?"
"ఏం కోర్స్ అది ?" నవ్వుతూ అడిగి చప్పున తనే అడ్డుపడింది - "వద్దులెండి ! నాకు తెలుసు."
"మరి మీ చేతిలో పోలీస్ గీత సంగతేమిటి?"
"నాకు విసుగు పుట్టింది. మా ఫ్రెండ్ వైశాలి రెడ్డి సెలక్టయే సరికి."
"ఎందుకు?"
"ఎన్సిసీ లోనే తను సరిగ్గా చేయలేకపోయేది. 'సి' సర్టిఫికేట్ ఫెయిలయింది. అయినా దానినే సెలక్ట్ చేసుకున్నారు అంటే సెలక్షన్ కి కావలసింది అసలయిన అర్హతలు కాదు - అందుకే నేను చెప్పేది - కొలతలుంటే...."
"అదేం కాదు. వాళ్ళ మమ్మీకి డిల్లీలో పొలిటికల్ గా చాలా ఇన్ ప్లుయన్స్ వుంది.'
"కొలతలు ఇన్ ప్లుయన్స్ "
ఆమె నవ్వేసింది.
"మీరెంత సేపు అదే మాట్లాడతారెందుకు?"
"మనిషిని చాలావరకూ అదే కంట్రోల్ చేస్తుంది కదా -"
"నామీదేనా? అందరిమీదా యిలాగే వుంటుంది?"
"మీ మీదా, అందరిమీదా."
ఆమె నవ్వాపుకుంది.'
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ ని గుండ్రంగా బొంగరంలా తిప్పిందామే.
"మీకు నిజంగా, అంతగా కావాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు."
సురేష్ అదిరిపడ్డాడు. కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు.
"మీ......మీ ......మీరు......"
"ఎస్! అదో పెద్ద కొంపలు కూలే వ్యవహారంగా, ప్రాణాలు వదిలయినా నిలబెట్టుకునే విషయంగా నేననుకోను. వాటీజ్ నెక్ట్స్! జస్ట్ ఏ నైస్ ఫీలింగ్! విచ్చలవిడితనం నేనూ లైక్ చేయను గాని రిజిడిటి అవసరం. ఆ విషయానికొస్తే దేనికయినా రిజిడిటి అనవసరం. అప్టరాల్ మీకూ, నేనూ మనం అనుభవించే విషయాలు, వస్తువులు అన్నీ తాత్కాలికం. కెన్ యూ ఇమేజిన్? వంద సంవత్సరాల తర్వాత ప్రత్యూష అనే అమ్మాయి వుండేదని , సురేష్ అనే సర్వేయర్ ఉండేవాడనీ ఎవరికైనా తెలుస్తుందా? మన తాలుకూ గుర్తు లేమయినా మిగుల్తాయా? నధింగ్! మన తాతయ్యల గురించి నాయనమ్మల గురించి ఎవరికి కావాలి? ఏం కావాలి? నాకీ సినిమాలు , నవలలు చూస్తే నవ్వొస్తుంది. శీలం కోసం ప్రాణాలు వదిలేయటం, అదిపోతే ఆత్మహత్యలు చేసుకోవటం అది లేని ఆడదాన్ని హీనంగా చూడటం. ఇవన్నీ మతాలు రుద్దిన మూర్ఖత్వం మనుషుల మీద.'
సురేష్ స్పృహలోకి కొచ్చాడు.
"నాకు ఆశ్చర్యంగా వుంది. మన దేశంలో ఓ అమ్మాయి ఇంత ఓపెన్ గా , ఇంత విజ్ఞానంతో మాట్లాడటం - మీరు మతాన్ని నమ్మరా?"
ప్రత్యూష నవ్వింది మళ్ళీ.
"అంటే దేవుడి గురించి అడుగుతున్నారు కదూ! దేవుడున్నాడనను కుంటున్నానా అని. అంతేనా?"
"సరే అదే అడిగాననుకొండి"
"నేను దేవుడిని నమ్ముతానా అనేదే మీ ప్రశ్న అయినట్లయితే - నో! నేను నమ్మను! అంతా శూన్యమని నేనను'కుంటాను పూర్తీ శూన్యం. పూనర్జన్మలు, చనిపోయాక నరకాలు , స్వర్గాలు అంతా ట్రాప్. దేవుడనేదే లేదు. అదంతా మనసు అల్లుకునే ఊహాగానాలు. అసలు నేనేదీ ఋజువు చేయాలనే అనుకోను. ఉన్నాడనీ , లేడనీ - అసలు బ్రతకటమే అనవసరమని నా అభిప్రాయం. అలా అని జీవితం సడెన్ గా ముగించేసే దైర్యమూ లేదు. మిగతా అన్నిటిలాగా మనమూ ఒక 'నధింగ్' గా గడిచిపోవాలి. అంతే!"
సురేష్ ఆమె చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చేతిని లాగేసుకుని లైబ్రరీ వైపు చూసింది ఎవరయినా గమనించారేమోనని.
"అందరూ మీలా ఆలోచించే అమ్మాయిలయితే నాలాంటి వాళ్ళు ఎంత అద్భుతమయిన జీవితం అనుభవిస్తారు" నవ్వుతూ అన్నాడు.