Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 25


    లేదు - అన్నాడు నేరస్థుడిలా వెంకట్రామయ్య.
    "కొంచెం ముందుగా ఆయనకు చెప్పి ఉంటె - ఏ సమస్యా ఉండేది కాదు . కనీసం నిన్నయినా ఆయనతో చెప్పి ఉండాల్సింది -----' అన్నాడు రాజారావు.
    వెంకట్రామయ్య చిరాగ్గా ముఖం పెట్టి ---"బాగుంది! ఆయనూరు వెడతాడని నేనేమైనా కలగన్నానా"-- అన్నాడు.
    "కలగనక్కరలేదు. మన పనులు మనం కాస్త ముందుగా చేసుకుంటే తప్పు లేదు కదా" -అన్నాడు రాజారావు. మనసు నిండా బాధ. నిస్పృహ వున్నప్పటికీ వీలైనంత శాంతంగా. నెమ్మదిగా అన్నాడు రాజారావా మాటలు. కానీ ఆ మాటలు వెంకట్రామయ్య ను బాగా రెచ్చగొట్టాయి.
    నాకు తెలుసు మీరంతా నన్ను దేప్పడం కోసం కాసుకుచ్చున్నారు. కష్టమంతా మీరే పడుతున్నట్లూ - ఇబ్బందులన్నీ నావల్లే వస్తున్నట్లూ మీరు భావిస్తున్నారు. నేను మీ అందరికీ ఎమపకారము చేశానో తెలియదు. నా మీద మీరంతా ఎందుకిలా కక్ష కట్టేరో తెలియదు" వెంకట్రామయ్య కంఠం జీరవోయింది.
    రాజారావు నిశ్చేష్టుడయ్యాడు తండ్రీకీ విధంగా కోపం వస్తుందని అతనూహించలేదు. అతనికీ కోపం వచ్చింది --------" మీ మీ దేవ్వరూ కక్ష కట్టలేదు. - మీరపకారం చేశారని ఎవ్వరూ అనుకోవడం లేదు. కానీ మీ చేతుల్లో ఉన్న పనులు మీరు వాయిదా వేసివేసి పీకెల మీదకు తీసుకొస్తున్నారు. అంటే మీక్కోపం వస్తుంది కాని ఎల్లుండదయానికి పెళ్ళి వారోస్తారు గదా - విడిది సంగతి ఇప్పుడా మాట్లాడుకోవడం ----' అన్నాడతను.
    'అనండిరా అనండి ఇష్టం వచ్చినట్లనండి. అసలు మీరు నన్ను మాటలనటం కోసమే అంతదూరం నించి ఇక్కడకు వచ్చినట్లున్నారు----"
    ఏదో రభస జరుగుతున్నట్లు గ్రహించి అక్కడకు వచ్చిన పార్వతమ్మ కీ మాటలు వినపడ్డాయి. ఆవిడ కావేశం వచ్చింది. ఏ విషయంలో రభస జరుగుతున్నదీ ఆవిడకు తెలియదు.కాని కొడుకు భర్తను మాటలంటున్నాడని ఆవిడ గ్రహించింది.
    "కని పెంచిన పాపానికి కింత శత్రువులమై పోయే మెందుకురా. ఎవర్నీ పల్లెత్తూ మాటనని ఉత్తముడాయన్నెందుకురా - కళ్ళనీళ్ళు పెట్టిస్తారు. ఆయనా మీకులా సంపాదించుకున్న డబ్బంతా బ్యాంకుల్లో దాచుకోలేదురా - అంతా తండ్రికి ధారపోశారు. మీరలా చేయకపోతే పోయారు శూలాల్లాంటి మాటలతో బాధపెట్టడం కూడా ఎందుకురా- అందుకేనా అంత దూరం నించి ఇక్కడ వస్తుండేది?
    పార్వతమ్మ కాకుండా ఆ స్థానంలో మరొకరున్నట్లయితే విషయమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించి - తండ్రీ కొడుకులకు సామరస్యం తీసుకురావడానికి కృషి చేసేది కానీ పార్వతమ్మ మనస్తత్వం వేరు. ఇలా తల్లీ తండ్రీ ఏకమై దెబ్బలాడే సరికి రాజారావు రెచ్చిపోయాడు.
    "ఏమిటమ్మా తండ్రికి ధారపోసింది. వారసత్వంగా వచ్చిన అస్తే కదా - న్యాయానికి ఆ ఆస్తి మాది. దానికి సంరక్షకులుగా ఉండి మా కప్పగించాల్సింది పోయి పూర్తిగా హరింప జేసేశారు. కష్టపడి సంపాదించిన వాళ్ళక్కనీ డబ్బు విలువ తెలియదు. మీమేమీ బ్యాంకుల్లో దాచుకోవడం లేదు డబ్బు. అంతా మీ గురించే ఖర్చు చేస్తున్నాము. మీరు వదిలేసినా బాధ్యతలు స్వీకరిస్తున్నాం. ఇప్పుడొచ్చింది కూడా ఆయనతో దెబ్బలాడ్డానికి కాదు. మీ కూతురి పెళ్ళి చేయడానికి ..." అన్నాడతను కాస్త హెచ్చు స్వరంతో.
    "మీరేమీ చెయ్యనవసరం లేదు. కన్నందుకా మాత్రం బాధ్యత మేమూ స్వీకరించగలం. మా కష్టాలేవో పడతాం ------మమ్మల్ని ఇబ్బంది పెట్టక మీదారి మీరు చూసుకోండి " అంది పార్వతమ్మ.
    రాజారావుకు చాలా ఆవేశం వచ్చింది. ఆ క్షణంలో అతను అన్ని రకాల బంధుత్వాలు మరచిపోయాడు.  ఈ తిరస్కారం అతని శరీరాన్ని దహించి వేయసాగింది. . 'సరే అమ్మా -- ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను. మీకు  ఇబ్బంది కలిగించడం నాకు అభిమతం కాదు. ఇంకెప్పుడూ పొరపాటున కూడా ఈ గడప తొక్కను. ఏదో తెలియక బుద్ది తక్కువై చెల్లెలి పెళ్ళి అన్న ఆనందంలో ఇక్కడికి వచ్చాను."
    "వెళ్ళండిరా వెళ్ళండి. అంతా వెళ్ళిపొండి. ఈపెళ్ళి ఆగిపోయినా నాకు బాధ లేదు. కానీ మీలాంటి కొడుకుల సాయం పొందడము అంత నీచం లేదు" అంది పార్వతమ్మ.
    రాజారావు క్షణాల మీద సూట్ కేసు సర్దుకున్నాడు. తమ్ముణ్ణి పిలిచి రిక్షా కేకేయమన్నాడు. "ఇప్పుడెక్కడి కన్నయ్యా ----' అనడిగితే "ఇప్పుడూ అప్పుడూ అని అడక్కు. ఈ నరకంలో క్షణం కూడా ఉండలేను" అన్నాడతను.
    వెంకట్రామయ్య కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. కోపం ఉక్రోషం వచ్చేస్తున్నాయి. కొడుకీ మాట లనగానే అతను తలబాదుకున్నాడు. రాజారావది చూసి "తలబాదుకోవడం నాకూ వచ్చు....." అంటూ తన తల గోడకు గట్టిగా కొట్టుకున్నాడు. లక్ష్మీ కళ్ళ నీళ్ళతో పరుగెత్తి కొచ్చి 'అన్నయ్య' అని అతన్ని గట్టిగా పట్టుకుంది. కానీ అతని ఆవేశం తగ్గలేదు. అతనింకా తల గోడకు కొట్టుకుంటూనే వున్నాడు. లక్ష్మీ గట్టిగా అతన్ని పట్టుకుని ఏడుస్తోంది. ఇంట్లోని మిగతా సభ్యులందరూ మ్రాన్పడి చూస్తున్నారు. పార్వతమ్మ చటుక్కున వీధరుగుమీది కెళ్ళింది. అలా దారిలో పోతున్న రాజన్న అనే ముసలి రైతు కనిపించాడామెకు.
    "రాజన్నా , ఓసారి లోపలకు రా !" అందామె.
    రాజన్న ఆ ఊళ్ళో కాస్త పెద్ద రైతు. అన్నీ తెలిసినవాడు. చాలామందికి అతను మంచీ చెడు విచారించదానికి సహాయపడుతూ వుంటాడు. ఎన్నో గృహకలహాల్లో అతను కలగజేసుకుని సామరస్యం తీసుకురాగలిగాడు.
    రాజన్న రాగానే 'అయన సంగతి నీకు చిన్నతనం నుంచీ తెలుసు గదా రాజన్నా. జీవితంలో ఎప్పుడయినా సుఖమన్నది ఎరుగునా అయన. ఎంత ఆస్తి వున్నా ఎప్పుడూ కష్టాలే పడ్డారు. ఎన్ని కష్టాలొచ్చినా మౌనంగా భరించడమే కాని ఎవరినీ పల్లెత్తు మాటని ఎరుగరు. ఒకళ్ళకి ఉపకారం చేయడమే కానీ ఎవరికీ వీసమెత్తు అపకారం చేసి ఎరుగరు. ఏదో కొడుకులు సంపాదించుకుంటున్నారు ---- ఇంక సుఖపడవచ్చు ననుకుంటే ఆ ఆశలేకుండా పోయింది. ఆనాడు తండ్రి- ఇప్పుడు కొడుకులు ----అయన వీళ్ళ మాటలు భరించలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు....' అంది పార్వతమ్మ.
    రాజారావు తెల్లబోయాడు. తల్లి యింటి వ్యవహారాలూ వీధిలో పడేస్తుందని అతనూహించలేదు. రాజన్న వచ్చి వెంకట్రామయ్య పక్క కూర్చున్నాడు. అతను రాజారావు వంక చూశాడు.
    "మీరు కుర్రాళ్ళు తెలివయిన వాళ్ళూ కావచ్చు. కాని తండ్రిని ఇలా బాధపెట్టడం తెలివి తేటలనిపించుకోదు....." అన్నాడు రాజన్న.
    రాజారావు నోట మాట రాలేదు.
    "చూడు బాబీ ---మీనాన్న ఉత్త అమాయకుడు. మంచితనం తప్ప ఆయన మనసులో మరేమీ లేదు. మీరు ప్రయోజకులయినందుకాయాన్ని సుఖపెట్టాలి గానీ సాధించకూడదు" అన్నాడు రాజన్న.
    రాజారావు కాస్త ఈలోకంలోకి వచ్చాడు. "రాజన్నా ----అసలు జరిగిందేమిటో నీకు తెలుసా ?" అనడిగాడు. రాజన్న అతనికి చిన్నతనం నించీ తెలుసు. అతను వాళ్ళ కుటుంబ స్నేహితుడు.
    రాజన్న ఆశ్చర్యంగా రాజారావు వంక చూశాడు.
    "మా నాన్నగారికి నువ్వు చిన్నప్పటి నుంచీ స్నేహితుడివి కదా - అయన మేలు కోరేవాడివి కదా - అయన కేదయినా చిన్న సహాయం అవసరపడితే చేయగలవా?" అన్నాడు రాజారావు.
    "బాగుందయ్యా - ఆ మాత్రం చేయకపోతే ఇంక స్నేహమన్న పదాని కర్ధమేముంది?" అన్నాడు రాజన్న.
    "కానీ ఆ నమ్మకం మా నాన్నగారి కున్నట్లు లేదు ....' అన్నాడు రాజారావు తాపీగా. అతనిలోని ఆవేశం క్రమంగా తగ్గుతోంది. విషయాన్ని దారి మళ్ళించి ఇంటి గొడవ వీధిలో పడకుండా కాపాడుకోవాలని అతను ప్రయత్నిస్తున్నాడు.
    "ఏమండీ - నామీద మీకు నమ్మకం లేదూ ....' అన్నాడు రాజన్న వెంకట్రామయ్య వంక చూసి. ఆయనేమీ మాట్లాడలేదు.
    'ఆయనేం చెబుతాడు - ఎల్లుండి పెళ్ళి వారిస్తున్నారు. విడిది కిల్లు కావాలి. రఘురామయ్యగారి నడుగుదామనుకుంటూ వాయిదా వేసేశారు. తీరా అయన నిన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడని ఈవేళ తెలిసింది. రెండు మూడ్రోజులు ముందుగా అదిగుండాల్సిందని నేనన్నానని ఇంత రభసయ్యింది తప్పితే వేరే గోడవేమీ లేదు. అయన బాగా అధైర్యపడిపోవడం వల్ల ఇదంతా జరిగింది. నీలాంటి వాడేవాడన్నా సమయానికి సాయపడతాడన్నా ధైర్యముంటే ఆయనిలా దిగులు పడిపోయేవారు కాదు - నువ్వే చెప్పు రాజన్నా -- ఎల్లుండుదయానికి పెళ్ళి వారోచ్చేస్తున్నారు. ఇంకా ఇంటి ముందు పందిరి లేనే లేదు. ఇలాగే చేస్తారా మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు - "రాజారావు కాస్త గట్టిగానే అడిగాడు.

 Previous Page Next Page