Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 26


    విషయం రాజన్న కర్ధమైంది. అతను వెంకట్రామయ్య కేసి చూసి ----" దిగులు పడకండి. కుర్రాడన్నా మాటల్లో తప్పేం లేదు. రఘురామయ్య ఊళ్ళో లేకపోయినా కొంప మునిగిందేమీ లేదు. జతన్నాధం ఇల్లు కూడా సదుపాయంగానే ఉంటుంది. అతగాడ్నీ ఒప్పించే పూచీ నాది. పందిరి కావాల్సిన వెదురు తాటాకూ అంతా మా ఇంట్లో సిద్దంగా ఉంది. మా పాలేళ్ళలిద్దర్ని పంపిస్తాను. మీరు కూడా మరి నలుగురు మనుషుల్ని చూడండి. ఈ రాత్రికే వీధిలోనూ, దొడ్లో నూ కూడా పందిళ్ళు లేచిపోవాలి - లేవండి - నాతో రండి ....' అన్నాడు.
    వెంకట్రామయ్య లేచి నిలబడ్డాడు.
    "నీపని నువ్వు చూసుకోవయ్యా బాబీ - పందిళ్ళ సంగతీ, విడిది సంగతీ నేనూ మీ నాన్న చూసుకుంటాం ----" అన్నాడు రాజన్న.
    రాజారావు మనసు తేలికపడింది . తండ్రికి ఊళ్ళో పరపతి ఉంది. కాని వినియోగించుకోడం ఆయనకు తెలియదు. బహుశా అందుకే అదింకా నిలబడి ఉందేమో. రాజన్న మాటల్లోని అభిమానానికి అతని మనసు ఆర్ద్రమైంది.
    తండ్రి బయటకు వెళ్ళాక అతను తల్లిని లోపలకు పిలిచి మందలించాడు --"మేమిద్దరం గొడవ పడుతుంటే అసలు విషయమేమిటో తెలుసుకోకుండా ఆయన్ను రెచ్చ గొట్టేస్తే --- కుటుంబాలు విడిపోవడం మినహాయించి ప్రయోజనమేమిటుటుందనుకున్నావ్?"
    పార్వతమ్మ అతని మందలింపుకు లెక్కచెయ్యలేదు ----"నేను రాజన్నను పిలిచాను కాబట్టే వ్యవహారం చక్కబడింది. మీ పట్నం వాసపు నూకరాలు మాకు తెలియవు. మీకు మోటుగా అనిపించినా మా పరిస్థితులు మాకుంటాయి------' అందావిడ.
    తల్లి తత్కాలికా వేషంలో రాజన్నను పిలిచిందా -- లేక అతన్ని పిలవడం సమస్యను పరిష్కరిస్తుందని ఆవిడకు ముందుగానే తెలుసా అన్న ప్రశ్నకు సమాధానం రాజారావు ఊహ కందడం లేదు.
    వసుంధర - అత్తగారితో మాట్లాడుతున్న భర్తను పిలిచి -- "పెద్దవాళ్ళతో మాట్లాడ్డానికి సంబంధించినంతవరకూ మనకూ కొన్ని హద్దులంటూ ఉంటాయి. ఆవేశంలో మీరా హద్డుల్ను తిక్రమించడం నాకు నచ్చలేదు ---' అంది.
    'ఆవేశపడడం మానవ సహజం. నేనూ మనిషినే ------' అన్నాడు రాజారావు.
    "కాదనను. మీ అమ్మా నాన్న కూడా మనుషులేనని మీరూ గ్రహించాలి -----' అంది వసుంధర.
    రాజారావుకు మళ్ళా జ్ఞానోదయమైంది. తను తండ్రి పై దేబ్బలాడ్డానిక్కారణం ఆయనపై ద్వేష మెలా కాదో - అదే విధంగా వాళ్ళకూ తన మీద ద్వేషముండదు ఎటొచ్చీ తరాల అంతరాలు సృష్టించిన అభిప్రాయ బేధాలు సమస్యలను తెచ్చి పెడుతున్నాయి.
    కాసేపట్లో వెంకట్రామయ్య ఉత్సాహంగా వచ్చాడు. విడిదికి ఇల్లు దొరికింది. ఇంటి ముందు పందిరి వేయడానికి ప్రయత్నాలారంభమవుతున్న సమయంలో మోహనరావు రాజమండ్రి నించి వచ్చాడు. అతనూ ఉత్సాహంగానే ఉన్నాడు. డబ్బు అప్పుగా నైతేనేం - దొరికింది.
    తనకు తెలిసిన స్నేహితుడితో మాట్లాడి, పెళ్ళి పందిట్లోనూ- దొడ్లో నూ ట్యూబ్ లైట్లేర్పాటు చేయిస్తానని శ్రీకాంత్ చెప్పాడు. అందుకు సుమారు నూట యాభై రూపాయలవుతుందంటే సరే నన్నాడు మోహనరావు.
    సాయంత్రం ఇంట్లో జరిగిన గలభాని విరజ మోహనరావుకు  వివరించి చెప్పింది . మోహనరావు నిట్టూర్చి "ఏం చేస్తాం - రెండు రకాల మనస్తత్వాలున్న చోట ఎప్పుడో ఒకప్పుడు గొడవ రాక తప్పదు. అది కాస్త ముందుగానే ముగియడం మంచిదే ?" అన్నాడు. కానీ తండ్రి తమ నపర్ధం చేసుకుంటున్నాడని గ్రహించేక అతని మనసుకు బాధ కలిగింది.

                                                17
    
    రేపే మగ పెళ్ళి వారోస్తారనగా ఈరోజు వెంకట్రామయ్య ఇల్లు స్వకీయ బందుజనంలో కలకలాడుతోంది. మోహనరావు ఊహించినట్టుగానే ముందు రోజే చాలామంది బంధువు లోచ్చారు. రకరకాల పలకరింపులు - కులాసా కబుర్లు. ఇంటికి పెళ్ళి కళ వచ్చింది.
    ఇంటి ముందు పందిరి, ఇంటి నిండా బంధు జనం  అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలు.
    ఎన్ని గొడవలు పడితేనేం .....ఏమైతే నెం ....సమయానికి అన్నీ సిద్దమయ్యాయి. రాజారావు, మొహనరావూ కలిపి ఆలోచిస్తున్నారు.
    రాజమండ్రి నుంచి సున్నం డబ్బా తెప్పించి నాలుగు రోజుల క్రితమే ఇంటికి సున్నాలు వేయించారు. అనుకోకుండా దూదేకులవాడోస్తే - శోభనం మంచం మీద కూడా అందాల పరుపు కుట్టించారు. ఇంటికి అవసరమైన మరమత్తులు చేయించారు. దొడ్డి బాగుచేయించారు. వీటి గురించి శారీరకంగా మానసికంగా చాలా శ్రమ అనుభవించారు. కానీ సమయానికి అన్నీ బాగానే అమరినట్లున్నాయి. వీళ్ళిద్దరూ కబుర్లాడుకుంటుండగా ఒక బంధువు పిలిచాడు. ఏమిటో ననుకుని ఇద్దరూ వెళ్ళారు.
    ఆయనకు పెళ్ళి గురించిన వివరాలవసరం లేకపోయాయి. ఎవరి గొడవా అక్కరలేకపోయింది. సంఘ సంస్కర్త గురించి అరా కవాల్సోచ్చింది.
    మోహనరావుకు ఒళ్ళు మండిపోయింది. అయినా తమాయించుకుని - "మొన్ననే ఆయనకు వ్యాపారంలో లక్ష రూపాయలులాభం వచ్చింది. తన కూతురికి పాతిక వేలు కట్నమిచ్చి పెళ్ళి చేస్తానంటున్నాడు. అమ్మాయి వయసు పదిహేనేళ్ళు. మీకబ్బాయుంటే చెప్పండి లేదా బంధు వర్గంలో తెలియజెయ్యండి." అన్నాడు.
    నీలవేణి పెళ్ళిలో హడావుడిగా తిరుగుతోంది. కానీ ఆమెకంత తృప్తిగా లేదు. వెంకట్రామయ్య ఇంట్లో పెళ్ళికి ఇంత పకడ్బందీగా నిర్దిష్టంగా ఏర్పాట్లు జరగడం ఆమెకు ఆశ్చర్యంగా వుంది. వచ్చిన చాలా మంది బంధువులకు ఇబ్బందిగానూ  ఉంది.
    వచ్చినవారంతా అడ పెళ్ళివారే అయినప్పటికీ వారెవ్వరికీ ఏ బాధ్యతలూ ఇవ్వబడలేదు. వాళ్ళనూ మగపెళ్ళి వారిలాగే మర్యాద చేస్తున్నారు. బాధ్యతలన్నీ వెంకట్రామయ్య కుటుంబమే చూసుకుంటుంది. బందుజనాన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టే బాధ్యత మోహనరావు తీసుకున్నాడు. పెళ్ళి తంతుకు అవసరమైన వ్యవహారాలన్నీ రాజారావు విరజ చూసుకుంటున్నారు. బాలింతరాలయిన వసుంధర - వస్తువులకు కాపలాదారుగా ఉంది. ముఖ్యమైన వస్తువులన్నీ ఆమె దగ్గరే వున్నాయి. విలువయిన కొన్ని వస్తువులు నామే పెట్టెలో పెట్టి తాళం వేసింది కూడా.
    ఇంట్లో అన్ని సరుకులూ ఉన్నాయి. వచ్చిన మనుషులకీ రాబోయే మగ పెళ్ళి వారిని జతచేసి దానికో యాభై కలిపి - పాల ఎస్టిమెట్ వేసి పాలతనికి అంచనా పంపిచేశాడు రాజారావు. ఒక పూట ముందుగా చెప్పకపోతే పాలు దొరకవని పాల అతను రాజారావుకి చెప్పేశాడు. అందుకే అతనీ జాగ్రత్త తీసుకున్నాడు.
    నీలవేణి వచ్చి రాజారావుతో కాసేపు కష్టం సుఖం మాట్లాడింది. అనవసరంగా ఖర్చు జోరు చేశాడంది. పెళ్ళివారు వచ్చి మూడ్రోజులుంటే అరిపోతారు ---ఒక్క రోజులో పంపించేసే ఏర్పాటు చేయాల్సిందంది. ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చునో సూచించింది. రాజారావు అన్నీ విని పిన్నికి పరిస్థితులు వివరించాడు ఖర్చు పెట్టడం తమకు సరదా కాదనీ --కానీ తండ్రి మీద గౌరవం కొద్దీ కొన్నింటి కంగీకరించక తప్పడం లేదనీ చెప్పి, తండ్రి తమకు కలిగించిన ఇబ్బందులు వివరించాడు. అంతా విని నీలవేణి నిట్టూర్చి రాజారావు మీద జాలిపడింది. "మీ నాన్న మంచివాడే కానీ పరిస్థితులర్ధం చేసుకోడు మరి ఏం చేస్తాం?' అంది. ఆ సమయంలో అక్కడకు వెంకట్రామణ వచ్చాడు. అతనికి నీలవేణిని పొగిడే బాధ్యత ఇవ్వబడింది. వెంకట్రామణ రాగానే రాజారావక్కడ్నించి తప్పుకున్నాడు. మరుక్షణం లోనే వెంకట్రామణ బాధ్యత ఎంత చక్కగా నిర్వర్తించాడో చెప్పడానికి సాధ్యం కాదన్నట్లు ------ విరజకు సాయంగా వుండడానికి పరుగెత్తింది నీలవేణి.

 Previous Page Next Page