Previous Page Next Page 
8 డౌన్ పేజి 24

    వెంటనే వంటవాడి నడిగిందామె.
    "మీరంతా భోజనం చేశాక చేస్తానంటున్నారమ్మా ఆయన!"    
    "నోనో! ఎందుకలా? కమాన్! పిల్చుకురా! ఇప్పుడే భోజనం చేస్తాడు-"    
    అతను పరుగుతో అజయ్ గదివేపు వెళ్ళాడు.    
    "ఎవరతను?" అడిగాడు వినోద్.    
    "మా అంకుల్ ఫామిలీ ఫ్రెండ్! ఇక్కడ రేపేదో ఇంటర్ వ్యూ వుందని వచ్చాడు"
    "ఓ! అలాగా!"
    అజయ్ వచ్చి ఇబ్బందిగా నిలబడ్డాడు.    
    "మేడమ్! ముందు మీరు భోజనం చేయండి! నేను కాసేపాగి చేస్తాను" అన్నాడు వినయంగా.    
    "అదేమిటి? ఎందుకని?"    
    "మరేం లేదు- అంతఆకలిగా లేదు!"    
    "నోనో- రండి! ఆకలి లేకపొవటమేమిటి?"    
    అతను కూడా కూర్చోక తప్పలేదు. అందరూ కబుర్లూ చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. తను ఫస్ట్ పోస్టింగ్ లోనే ఎలా రాజకీయ నాయకుల్ని ఓ ఆట ఆడించిందీ చెప్పాడు వినోద్.    
    "మేం బాంబే వెళ్ళగానే మీ డాడీకి, మమ్మీకి ఫోన్ చేసి మారేజ్ ఫిక్స్ చేస్తాము" అన్నాడు అతని తండ్రి భోజనం చేశాక. మృదుల ఆనందంతో మాట్లాడలేకపోయింది.    
    సంభాషణ అకస్మాత్తుగా వరకట్నాల మీదకు మళ్ళింది.   
    "వెధవ డబ్బుకోసం ఒక నిండు ప్రాణాన్ని ఎలాతీస్తారో అర్ధం కావటంలేదు" అన్నాడు వినోద్.   
    "నన్నడిగితే వరకట్నం తీసుకున్నట్లు ఋజువయినవాడిని ఉద్యోగాలనుంచి బర్తరఫ్ చేయించటమే కాకుండా విధిగా అయిదు సంవత్సరాలజైలు శిక్ష విధించే ఆర్డినెన్సు తీసుకువస్తే ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది" అన్నాడు అజయ్ సంభాషణలో కల్పించుకుంటూ.        
    "నో! దటీజ్ రాంగ్!" అన్నాడు వినోద్.    
    మృదుల ఆశ్చర్యపోయింది. నిజానికి ఆమెకు అజయ్ చెప్పిన సొల్యూషన్ న వచ్చింది. మనదేశంలో ఏదయినాసరే బలవంతంగా అమలుపరిస్తే తప్ప అది అమలుచేయటం అసాధ్యమని ఆమె అభిప్రాయం. కుటుంబ నియంత్రణ బలవంతంగా అమలు చేయకపోవటంవల్లే జనాభా అడ్డూ, అదుపు లేకుండా పెరిగిపోతోంది. అలాగే అన్నీనూ!   
    "ఎందుకని"? అడిగేడు అజయ్.    
    "ఎందుకంటే వరకట్నం అనేది తప్పుకాదు. వరకట్నం కోసం హింసించటం అనేదే తప్పు! పిల్ల తల్లిదండ్రులకుఇచ్చే స్తోమతవున్నప్పుడు తీసుకోవటంలో తప్పేముంది?" ప్రశ్నించాడు వినోద్.
    "నన్నడిగితే అలా అనుకోవడంతోనే ఈ సమస్య ఇలా పెరిగి పెరిగి రాక్షసిలా తయారయింది. ఎవరికి వారు తన కోరికలన్నీ తీర్చేస్తోమత అత్తమామలకు ఉందనుకుంటారు-అలా-అలా అదే చివరకు హింసలోకి మారుతుంది."    
    "నో! మామూలు మనుషులు ఆలోచించే విధానానికీ, మాలాంటి వాళ్ళు ఆలోచించే విధానానికీ అక్కడే తేడా వుంది. మేము అన్ని విషయాలు అన్ని కోణాల్లోనుంచి చూసి అప్పుడు నిర్ణయాలు, అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం" అన్నాడు వినోద్ గర్వంగా.    
    మృదులకు వినోద్ మీద అంతవరకూ ఏర్పడిన సదభిప్రాయం తొలగిపోయింది.
     "కానీ ఈ విషయంలో అజయ్ ఆలోచనే కరెక్టు అనుకుంటాను" అందామె.    
    వినోద్ ఆశ్చర్యపోయాడు ఆమె మాటలకు!    
    "నో! అయ్ డోంట్ థింక్ సో!" అన్నాడు.    
    సంభాషణ ఇబ్బందికరంగా తయారయేట్లుందని పసిగట్టిన వినోద్ తండ్రి చప్పున కల్పించుకున్నాడు.    
    "టి.వి.లో ఇంగ్లీష్ న్యూస్ వస్తుందనుకుంటాను ఇప్పుడు. మనం ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూకూర్చుంటే అది మిస్ అయిపోతాం" అన్నాడు. అందరూ లేచి హాల్లోకి నడిచారు. న్యూస్ అయిపోయింది.
    అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మృదుల, వినోద్ మాత్రం మిగిలారు. సంభాషణ అనేక విషయాలను చుడుతోంది.    
    "మీకు బాంబే ట్రాన్స్ ఫర్ అవటానికి అవకాశం ఉంటుంది కదూ?" అడిగాడతను.    
    "అయ్ థింక్ సో! వీలయినంతవరకూ వర్క్ చేసే వైఫ్, హజ్ బెండ్ ని ఒకే ప్లేస్ లో ఉంచాలని ఇన్ స్ట్రక్షన్స్ వున్నాయ్!"    
    "మనిద్దరికీ వచ్చే జీతాలతో -మనంబాంబేలో హాపీగానే వుండవచ్చనుకుంటాను కదూ?"    
    "అఫ్ కోర్స్!"    
    "ఏదేమయినా పెళ్లి అయిన కొద్దినెలల్లోగా మనం ఫ్లాట్ కొనుక్కుంటేనేగానీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు."
    మృదుల ఆశ్చర్యంగా చూసింది.    
    "బాంబేలో ఫ్తాల్ అంటే చాలా కాస్ట్ లీ అనుకుంటాను."    
    "త్రీ బెడ్ రూం ఫ్లాట్ పది లక్షలుంటుంది. మీ వాళ్ళెలాగూ మనపెళ్ళికి కొంత డబ్బు ఇస్తామని మా వాళ్ళతో ప్రామిస్ చేశారట! ఇంకా మిగతా డబ్బుదేముందీ? ఇద్దరం కలిసి హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు."    
    మృదుల స్టన్ అయిపోయింది.    
    "మా వాళ్ళు కట్నం ఇస్తున్నారా?" నమ్మలేనట్లు అడిగింది.    
    "నో నో! కట్నం అన్నారు గానీ నేను వప్పుకోలేదు. నో ఫార్మాలిటీస్ అని చెప్పేశాను. మేము బాంబేలో ఫ్లాట్ కొనుక్కునేందుకు సహాయంచేస్తే చాలని చెప్పాను."    
    మృదులకు ఒక్కసారిగా అతనిమీద విరక్తి భావం కలిగింది.    
    "వీళ్ళా ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు? వీళ్ళా దేశాన్ని పరిపాలించే ఇలాంటి దురాశపరుల చేతుల్లో ఇంకా వరకట్నాలకు చావెక్కడ వుంటుంది? ఇలాంటి మూర్ఖులపరిపాలనలో ఇంక స్త్రీకి గౌరవం ఎక్కడ నుంచి వస్తుంది?    
    అదీగాక పెళ్ళికి ముందునుంచే తన జీతం గురించీ, దానినెలా వినియోగించటమూ అని ఆలోచించటం -ఆమెకు చాలా చికాకుగా వుంది.    
    ఒక మనిషిలో చక్కటి సంస్కృతీ, మానవత్వం-ఇవన్నీ చదువునిబట్టి రావు. తెలివి తేటల్నిబట్టి రావని అనిపిస్తోందతన్ని చూస్తుంటే.    
    "ఇన్ ఫాక్ట్ బాంబేలో ఫ్లాట్ తో సహా పిల్లనిస్తామని ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కాని సమ్ హౌనా భార్యక్కూడా మంచిహోదా ఉండాలనుకున్నాను."   
    మృదులకు అతనిమీద వ్యతిరేక భావం పెరిగిపోతోంది- అతని మాటలవల్ల! తనసలు అతనిని చేసుకోవాలా వద్దా అనే కొత్త ఆలోచన ప్రారంభమయింది.    
    "ఓ.కె? గుడ్ నైట్ మృదులా!" అన్నాడతను లేచి తన గదిలోకి వెళుతూ.   
    "గుడ్ నైట్" అంది మృదుల.    
    చాలా సేపు సోఫాలోనే కూర్చుండిపోయిందామె. మనసంతా గజిబిజిగా అయిపోయింది. ఇలాంటి వ్యక్తిని చేసుకోవటమా- లేదా? ఇంతకాలం వేచివుండి పూర్తిగా తన మనసుకి అంగీకారంలేనివ్యక్తిని ఎందుకు చేసుకోవటం? రాత్రి పన్నెండయినా ఆలోచనలు ఎటూతెగకపోయేసరికి బలవంతంగా నిద్రకుపక్రమించిందామె. ఎంతసేపు నిద్ర పట్టిందో తెలీదు.    
    ఫోను బెడ్ పక్కనే భయంకరంగా వదలకుండా మోగుతూంటే మెలకువవచ్చింది. లేచి లైట్ స్విచ్ వేసి ఫోను అందుకుందామె.    
    "మృదుల హియర్" అంది నిద్రమత్తుతో.    
    "గుడ్ మానింగ్ మేడమ్! నేను డెప్టీ- పంక్చువాలిటీ మాట్లాడుతున్నాను"    
    "యస్ రాజూ! వాటీజ్ ది మేటర్!" పూర్తిగా ఎలర్ట్ అయిపోతూ అందామె. ఇంత రాత్రివేళ తనను డిస్టర్బ్ చేశారంటే తప్పకుండా ఏదో అతి ముఖ్యమయిన విషయం చెప్పడానికి పిలిచి వుంటారు.    
    "8 డౌన్ ఎక్స్ ప్రెస్ కి వ్యాక్యూమ్ బ్రేక్స్ ఫెయిలయినట్లు సికింద్రాబాద్ డి.ఆర్.ఎమ్ ఇన్ ఫర్మేషన్ ఇచ్చాడు మేడమ్!"    
    "వాట్? వాక్యూమ్ ఫెయిలయిందా?"
    "అవును మేడమ్!"    
    ఆమెకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది అంతకుముందు రోజు సాయంత్రం 8 డౌన్ చాలా ఆలస్యంగా సికింద్రాబాద్ వదలినట్టు తనకు డెప్టీ కంట్రోలర్ చెప్పాడు.    
    "ఇప్పుడు ఎక్కడుంది?" అడిగిందామె.    
    "కొండపల్లి పాస్ అవుతోంది మేడమ్! స్పీడ్ డౌన్ గ్రేడియెంట్ అవటంవల్ల వందకిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందంటున్నారు".  
    "మైగాడ్! ఆ స్పీడ్ లో విజయవాడ లో కొస్తే..... "ఇంక ఆలోచించలేకపోయిందామె. వెంటనే 8 డౌన్ ని విజయవాడ స్టేషన్ లోకి రిసీవ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. తన ఆఫీస్ కెళ్ళి అక్కడ కూర్చుని ఆర్గనైజ్ చేసే టైమ్ లేదు. కొండపల్లి నుంచి విజయవాడకు కేవలం పదిహేడు నిమిషాల్లో చేరుకుంటుందా ట్రెయిను. అంటే పదిహేడు నిమిషాల లోపల దానికి సంబంధించిన ప్రతి విషయం నిర్ణయించబడాలి. ప్రతి విషయం చాలా విలువయినది తనకు.    
    "ఆల్ రైట్! నాకు వెంటనే రూట్ రిలే కాబిన్ కి కనెక్ట్ చేయండి" అందామె.    
    క్షణాల్లో రూట్ రిలేకాబిన్ ఏఎస్సెమ్ ఫోన్ లో కొచ్చాడు.    
    అప్పటికి 8 డౌన్ విషయం విజయవాడ స్టేషన్ లో ఆపరేటింగ్ స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది.    
    "గుడ్ మాణింగ్ మేడమ్!" అన్నాడు ఏఎస్సెమ్ కాంతారావ్!    
    "8 డౌన్ గురించి మీకు తెలుసుకదూ?" అడిగిందామె.

 Previous Page Next Page