ఏ ప్రశ్నకీ జవాబు లేని ప్రీతి బిక్కచచ్చిపోయి, జరుగుతున్న పరిణామాలను ఎలా అడ్డుకోవాలో, ఎవరిని సాయమడగాలో కూడా తెలియనంత అయోమయ స్థితిలో పడిపోయింది. నాకేం తెలీదన్నమాట తప్ప ఏమీ చెప్పలేక ఏడుస్తూ, గాయాల బాధను తట్టుకోలేక విలపిస్తూ, సెల్ లో తిండి, నిద్ర మాని ఏడవడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో, మూడు రోజులు గడిపింది. వినోద్ తో సహా ఏ ఒక్కరికి ఫోన్ చేసినా, ఎవ్వరూ బదులివ్వలేదు. తల్లికి చెప్పినా ఆవిడ నిస్సహాయురాలు. అన్న ఈ సమయంలో ఆదుకోడానికి ముందుకు రాడని తెలుసు. ఇదంతా వినోద్ చేయిస్తున్నాడన్న కోపంతో, అవమానంతో దహించుకుపోతూ కుమిలిపోవడం తప్ప, ఏ దారీ తెన్నూ తోచని స్థితిలో దేవుడు పంపిన దూతలా నల్లకోటు వేసుకున్న లాయరు ఒకడు దర్శనం ఇచ్చాడు. ఈ కేసులోంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం. ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి. ఏమిటా కాగితాలు? అని అడగకముందే స్టాంపు పేపరు తీసి అందించాడు. వినోద్ పై ఇకపై ఏ సంబంధం ఉండరాదని, అతని దరిదాపులకి రానని, అతని మొహం చూడనని, ఆ కంపెనీతో ఏ సంబంధం పెట్టుకోనని, ఏ విధమైన క్లెయిమ్ లు చేయనని, ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతానని, ఒక్కమాట వినోద్ గురించి గాని, ఆ కుటుంబం గురించి గాని మాట్లాడనని, వెంటనే అబార్షన్ చేయించుకుంటానని అన్ని విధాల అంగీకరించి ఈ పత్రాల మీద సంతకాలు పెట్టాలి. అప్పుడే ఆమె విడుదల అయ్యేందుకు సహాయం అందుతుందని, లేకపోతే డ్రగ్స్ నేరం మీద జీవితాంతం జైల్లో మగ్గాల్సి ఉంటుందని లాయరు చెప్పాడు. దాంతో దిక్కుతోచని స్థితిలో తల ఆడించి, పెట్టమన్నచోట సంతకాలు పెట్టింది. చదువుకున్న ప్రీతికి డ్రగ్స్ నేరం ఎంత పెద్దదో తెలుసు. అందులోంచి బయటపడడానికి తన దగ్గర ఏ దారీ లేదని తెలుసు. మర్నాడు ఉదయం మేజిస్ట్రేట్ ముందుకు కేసు వెళ్లాక విడుదల ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి వెళ్ళాడు లాయరు. ఆ రాత్రి ప్రీతికి ఆసుపత్రి ఖర్చుకూడా అక్కరలేకుండా అబార్షన్ దానంతటదే జరిగింది. పోలీసులు పెట్టిన హింస, మానసిక క్షోభను... ఆ శరీరం తట్టుకోలేక, ఆమెకు భవిష్యత్తులో ఇంకో సమస్య ఎదురుకాకుండా దేవుడు దయతలిచినట్టు, అబార్షన్ ఆ జైలు గోడల మధ్య జరిగింది.
ఇదంతా వినోద్, అతని కుటుంబమే చేయించిందన్న ఆమె అపోహకి సమాధానం ఎవరూ చెప్పలేరు. పోలీసులనబడేవారు, తాము చిక్కుల్లో ఇరుక్కోకుండా నలుగురు గూండాలను పోలీసు వేషాలలో పంపి, ఆమె ఇంట్లో డ్రగ్ ప్యాకెట్లను వాళ్ళే పెట్టి, వాళ్ళే వెతికి పట్టుకొచ్చారని, అప్పుడు నిజం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్న నిజాలు ప్రీతికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేనంత పకడ్బందీగా అంతా జరిగిపోయింది.
ప్రీతి చావుతప్పి కన్నులొట్టయినట్టు జీవచ్చవంలా రెండు సూట్ కేసులు పట్టుకుని పాత స్నేహితుల దగ్గరకి చేరింది.
"ఘోరం, అమానుషం. మరీ ఇంత అన్యాయమా? ఇంతటి ప్రతీకారమా? సినిమాలు, కథలలో లాగా, నిజ జీవితాల్లో కూడా రీలా జరుగుతాయా?" ప్రీతి కథంతా విన్న మహిమ మ్రాన్పడిపోయింది. నోట మాట రానట్టు చాలాసేపు అలాగే కూర్చుంది. తరువాత తేరుకుని "పాపం... ప్రీతి జీవితంలో ఇంత విషాదమా?"
"అందుకే ఆ అవమానం, దుఃఖం, వేదన భరించలేక తాగుడు అలవాటు చేసుకుని, మొదట్లో రోజుల తరబడి గదిలోంచి బయటికి రాకుండా తాగుతూ అలా దొర్లేది. ఎవరన్నా భోజనం పెడితే తినేది, లేకపోతే అడిగేది కాదు. పిచ్చి అవతారంలా తయారయింది. మేమందరం భయపడిపోయాం. ఆ స్థితిలో బయటికి పొమ్మనలేక, ప్రీతి ధోరణి భరించలేక, ఇది తెలిస్తే మా ఉద్యోగాలకి ఏ ముప్పో అని భయపడుతూ బతికామనుకో. లోకానికి మొహం చూపలేక చీకటిగదిలో మగ్గేది. హు... స్వయంకృతాపరాధం కొంత, తెలివితక్కువతనం కొంత, అనాలోచిత చర్యలతో, అన్నింటితో సర్వనాశనం అయింది".
"వినోద్ ఇంత అన్యాయం చేశాడా? అవినాష్, విశాల్ గారిని చూస్తే పెద్ద మనుష్యుల్లా కనపడ్డారు" సందేహంగా అంది మహిమ.
"నో! అందరం ముందు అదే అనుకున్నాం. భయపడిపోయాం. ఇద్దరమ్మాయిలు వినోద్ తో సంబంధం పెట్టుకున్నవాళ్లు భయపడి ఉద్యోగం వదిలి వెళ్లిపోయారు. కానీ, తరువాత తెలిసిందేమిటంటే దీని వెనుక కథ అంతా నడిపింది సుస్మిత తండ్రి కిషన్ లాల్ అగర్వాల్ అని. మన బాస్ విశాల్, అవినాష్ గార్లు కూడా తమ కంపెనీ పరువు ప్రతిష్ఠ దిగజారిపోతాయని భయపడ్డారు. అంచేత వాళ్లే చెప్పమని చెప్పారో లేక అన్వర్ తనే చెప్పాడో కాని అన్వర్ ద్వారా విషయం ఆఫీసులో అందరికీ తెలిసింది. బహుశా తమ పేరు చెడగొట్టుకోడానికి ఇష్టపడక అన్వర్ ని ఉపయోగించి ఉండొచ్చు. లేకపోతే అతనికంత ధైర్యం ఎక్కడిది. మొత్తానికి తండ్రి చేయించిన పనితో సుస్మిత శాంతించింది". సీమ అంది.
"నిజమే. విషయం తీసిపారేసిది కాదు. అది వారి ఇంటి పరువు, కంపెనీ పరువుకి సంబంధించినది. అలాగే చాలా అవమానకరం, ఇబ్బందయిన విషయం కూడా! అయినా వినోద్ ఒక్కడిదే తప్పుకాదు. ఇందులో ప్రీతి తప్పు కూడా ఉంది కదా..."
"ఎందుకు లేదు? సగం తన తప్పే. వినోద్ తో సంబంధం పెట్టుకునే ముందు పెళ్ళయినవాడు, పిల్లాడున్నాడని తెలుసుకదా. అన్నీ తెలిసి తన స్వలాభం కోసం, అతని ఆధారంగా పైకి ఎదగాలని, పేరు, డబ్బు సంపాదించుకోడానికి ఓ ఆలంబన కావాలని, అతని పంచన చేరింది. ఆ బంధం శాశ్వతం కావాలనుకోవడం అత్యాశ. పెళ్ళిచేసుకోమని ఒత్తిడి చేసి, ప్రెగ్నెంట్ అయి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవాలన్న దురాశతో కక్షసాధింపు చేసి అతని మనసుకు దూరమైంది. వినోద్ నచ్చచెప్పినప్పుడైనా అంగీకరిస్తే ఆ బంధం కొన్నాళ్లయినా సాగేది. ఆ కృతజ్ఞతతో వినోద్ శాశ్వతంగా ఆమె బతుకుతెరువుకి లోటు లేకుండా ఏర్పాట్లు చేసేవాడేమో? పోనీ, సుస్మిత తండ్రి వచ్చి బెదిరించినప్పుడయినా భయపడి, ఇచ్చిన డబ్బు పుచ్చుకున్నా సరిపోయేది. ఇంటికెళ్లి వాళ్ల పరువు బజారున పడేసి, తను రోడ్డుమీద పడి, నానా గోల చేసింది. మొగుడి ఇలాంటి వ్యవహారాన్ని ఏ భార్య అయినా ఎందుకు సహిస్తుంది? అందులోనూ డబ్బుతో వచ్చిన భార్య. ఒక్కగానొక్క కూతురి భవిష్యత్తు ఆ తండ్రికి ముఖ్యం. అన్నివిధాల నష్టపోయింది ఆఖరికి ప్రీతేగదా..." సీమ విరక్తిగా అంది.