Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 24


    "ఇవాళ్ళ నుంచీ నీ స్థానం ఇక్కడే! తెలిసిందా! ఇంకేం పని చేయకు!" మృదువుగా అన్నాడు, ఆమె కళ్ళ మీద పెదాలు ఆన్చుతూ.
    "బావుంది! మరి వంటెవరు చేస్తారుట?"
    "నేను!"
    "మీరు వంట చేస్తారా?" నవ్వాపుకుంటూ అంది.
    "ఏం? నువ్వు రాకముందు ఎవరు చేశారనుకున్నావ్ మరి?"
    "ఏం అఖ్కర్లేదు, అయినా నెలతప్పినంత మాత్రాన పని పాటా మానేస్తారా ఏమిటి అందరూ? అలాగయితే కాన్పు కష్టమవుతుందట"
    "ఎవరు చెప్పారు?"
    "ఓ డాక్టరమ్మ రాసిన వ్యాసంలో చదివాను"
    "సరే! డాక్టరమ్మ అంటున్నావ్ కాబట్టి ఊరుకుంటున్నాను. అయినా కొంచెం పనిచేస్తే చాలే నువ్వు! మిగతాది నేను చూసుకుంటాను...సరేనా?"
    "సరే_సరే_సరే" చిరాకు నటిస్తూ అంది సీత.
    ఆ రోజునుంచీ ఓ విధమయిన కొత్త ఉత్సాహం ప్రవేశించింది ఇరువురులోనూ. సగానికి సగం పనులన్నీ తనే చేసేస్తున్నాడు మాధవరావు. సీత పనల్లా కొంతసేపు వంటింట్లో గడపడం_మిగతా సమయం రాసుకుంటూ కూర్చోవడం.
    అప్పుడు ఇంట్లో సామాన్లు ఎక్కువయి పోయాయి. ఫానూ, స్టీలు అల్మరా, మంచాలూ, రేడియో, ఖరీదయిన బట్టలూ_
    "లాభంలేదు. ఈ ఇల్లు మారాలండీ! సామానుతోనే నిండిపోయింది. మనకి తిరగడానికి స్థలమే లేదు. అదీగాక ఇప్పుడో పాప కూడా వస్తోంది. ఇంకెక్కడ సరిపోతుందీ?"
    నిజమేననిపించింది మాధవరావుకి! ఈ ఇల్లు తీసుకునేప్పుడు తన పరిస్థితి వేరు! ఇప్పుడు సీత ఆ పరిస్థితులు గుర్తులేకుండా చేసేసింది. డబ్బుకిప్పుడు ఏమాత్రం కొదవలేదు. ఆమె పేర ఎకౌంట్ లో చాలా డబ్బుందీ. అదెంతో అతనెప్పుడూ అగడలేదు. తెలుసుకోవాలన్న కుతూహలమూ లేదు. షుమారు పదివేల వరకూ వుంటుంది. అయినా తనప్పుడు ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే అద్దె చాలా ఎక్కువే ఇవాల్సి వస్తుంది. కనీసం రెండువందలయినా ఇవ్వాలి. అలా సీత బ్యాంక్ బాలెన్స్ మీద ఆధారపడి అంతంత అద్దె ఎలా ఇవ్వాలో అతనికి అర్ధం కాలేదు.
    "ఇప్పుడెందుకులే సీతా! పాపాయి వచ్చాక అప్పుడు మారుద్దాం! ఏమంటావ్! అన్నాడతను.
    "ఈలోగా చూస్తుండండి! ఎక్కడయినా మంచి ఇల్లు దొరికితే మారిపోదాం!
    "అలాగే!"
    నెలలు నిండగానే సీతను నర్సింగ్ హోమ్ లో చేర్పించాడు మాధవరావు. కాన్పు సమయంలో ఆమె తల్లిదండ్రులొచ్చి ఉన్నారు కొద్దిరోజులపాటు.
    "అమ్మాయికి పాపాయితో చేసుకోవడం కష్టం! రెండు నెలలు మా ఇంట్లో ఉంచుకొని పంపిస్తాం" అంది సీత తల్లి.
    వెంటనే ఒప్పుకున్నాడు మాధవరావు.
    సీత వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది. ఆమెలేని ఆ ఇంట్లో ఉండాలంటే అశాంతిగా ఉండేది మాధవరావుకి. ఆ ఇంట్లో ప్రతి వస్తువూ ఆమెనే గుర్తుకు తెస్తోంది. అతికష్టంమీద మూడు నెలలూ మూడు యుగాల్లా గడిపాడతను.
    "త్వరలో వచ్చేస్తున్నాను ఇల్లు చూడండి" అంటూ ఉత్తరాలు రాసింది సీత. ఇల్లు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు తను. కానీ అదంత సులభమయిన విషయంగా కనిపించలేదు. సీత వచ్చేసినా ఇల్లు మాత్రం దొరకలేదు. పాపాయితో టాక్సీ దిగుతున్న ఆమెను చూస్తూ ఆశ్చర్యపోయాడతను.
    సీత అదివరలా లేదిప్పుడు. ఇప్పుడు ఆమెలో పరిపూర్ణమయిన స్త్రీ రూపం కనిపిస్తోంది. అదివరకటి కంటే లావయింది. తెల్లబడింది. ముఖంలో చిలిపితనం పోయింది. మరింత అందం, ఆకర్షణ, ఏమిటిది? ఇంత మార్పు ఈ మూడునెలల్లోనూ?
    "ఏమిటలా చూస్తున్నారు?" నవ్వుతూ అడిగిందామె.
    "నా భార్యేనా లేక మరే దేవతయినా వచ్చిందా అని చూస్తున్నాను" ఇంకా చూపులు మళ్ళించుకోలేక అన్నాడతను.
    "చాల్లెండి! ఎవరి పెళ్ళాం వాళ్ళకి అప్సరసలాగానే కనిపిస్తుందట" సిగ్గుపడుతూ అంది.
    పాపాయిని అందుకొన్నాడతను.
    అచ్చం సీత పోలికే!
    ఇల్లు సంగతేమయింది?" అడిగిందామె.
    "ఏదీ? ఇంకా వెదుకుతూనే ఉన్నాను"
    "నాకు తెలుసు మీ సంగతి! అద్దె ఎక్కువయిపోతుందని నిర్లక్ష్యం చేస్తున్నారు కదూ?"
    "ఛ! మరీ అంత నిందవేసేయకు. సిన్సియర్ గా వెతుకుతూనే ఉన్నాను"
    "అదంతా నాకనవసరం. మూడు నెలలు టైమిస్తున్నాను. ఈలోగా మారాల్సిందే!"
    "ఓ యస్! ఆ టైమ్ చాలు." ఒప్పుకొన్నాడతను.
    పాపాయితో కొత్త జీవితం మొదలయింది.
    క్షణం తీరిక ఉండటంలేదు మాధవరావుకిప్పుడు! సీత ఇంటి పనంతా చేసుకొనేంతవరకూ పాపాయిని చూసే బాధ్యత అతనిదే. శలవు రోజుల్లో వంటపని కూడా అతనిదే! మరికొద్ది రోజులు గడిచిపోయాయిగాని మరో ఇల్లు మాత్రం దొరకలేదు.
    ఓ రోజు మధ్యాహ్నం సమయంలో ఇంటిముందు కారు ఆగటం గమనించింది సీత. ఎవరో పబ్లిషరేమో అనుకొందామె. ఖరీదయిన టెర్లిన్ బట్టల్లో ఓ వ్యక్తి కారు వెనుక డోర్ తీసుకొని దిగి నిలబడ్డాడు. డ్రయివర్ ముందుగా కాంపౌండ్ లోకి వచ్చి "రచయిత్రి సీతగారి ఇల్లెక్కడ" అంటూ వాకబు చేసి ఇల్లుచూసి వెళ్ళి ఆయనకు చూపించాడు.

 Previous Page Next Page