Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 24


    శంకర్ మరికాసేపు కూర్చుంటే బావుండుననిపించింది సావిత్రికి.
    "ఇంక నే వెళ్తానండీ..." లేచి నుంచుంటూ అన్నాడతను.
    "సరే..." తనూ అనుకోకుండానే నుంచుంటూ అంది సావిత్రి...అతను వెళ్ళిపోయాడు... మరికొద్దిసేపటికి హేమలత రానే వచ్చింది తన దగ్గరకు... తను వచ్చిన సంగతి చెప్పకుండానే ఏవేవో అనవసరమయిన ఆఫీసు విషయాలు కాసేపు మాట్లాడి "అన్నట్లు_ఇందాక నీ టేబుల్ దగ్గర కూర్చున్నతను ఎవరూ?" అనడిగేసింది...సావిత్రికి నవ్వు వచ్చేసింది. ఆమెని ఉడికించాలని అబద్ధం చెప్పాలనీ అనిపించింది.
    "నా బాయ్ ఫ్రెండ్" అంది నవ్వాపుకొంటూ.
    "నిజంగానా!" అంది ఆశ్చర్యపోతూ.
    "అవును! ఏం నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా?"
    "అబ్బే...అదికాదు...నాకెందుకో నమ్మకం కలగలేదు"
    "అది నీ కర్మ."
    "నువ్వు అబద్ధాలు చెపుతున్నావు కదూ?"
    "నీ ఇష్టం నీకెలా అనిపిస్తే అలాగే అనుకో."
    హేమలత వెళ్ళిపోయింది. అనుకున్నట్లే ఆ వార్త సాయంత్రానికల్లా ఆఫీసంతా అల్లుకుపోయింది.
    ఇల్లు చేరేసరికి శంకరం బాలకృష్ణగారితో మాట్లాడుతూ కనిపించాడు...తనని చూసి పలకరింపుగా నవ్వేశాడు...
    "అప్లయ్ చేసేశారా?" తనే అడిగింది.
    "ఆ! ఎలాగోలా ఇవాళ పోస్టులో వెళ్ళేటట్టు చేసేశాను. సమయానికి మీరు సహాయం చేశారు కాబట్టి తేలిగ్గా అయిపోయిందండీ! లేకపోతే ఈ సంతకాలకే నాలుగు రోజులు తిరగాల్సి వచ్చేది" కృతజ్ఞతతో చూస్తూ అన్నాడతను.
    తను నవ్వి వూరుకుంది.
    "అన్నట్లు అమ్మాయ్! నీదగ్గర "హు ఈజ్ హర్" పుస్తకం ఉండాలికదూ?" అడిగాడు బాలకృష్ణ.
    "ఉందండి."
    "అది శంకర్ కి కావాలట ఓసారి, రేపు ఎక్కడ ఇంటర్వ్యూ కెళ్ళాలట."
    "నేనిస్తాన్లెండి" నవ్వుతూ అంది తను శంకర్ తో.
    "వెళ్ళవయ్యా, వెళ్ళి తెచ్చుకో" అతన్నుద్దేశించి అన్నాడు బాలకృష్ణ.
    శంకర్ తనవెనుకే బయలుదేరాడు. గది తలుపులు తాళం తీసి లోపలికి నడిచింది తను. అతను గడప దగ్గరే నిలబడిపోయాడు.
    "ఫర్వాలేదు! లోపలికొచ్చి కూర్చోండి..." ఆహ్వానిస్తూ అంది.
    "కుర్చీలో గుట్టలుగా పడేసివున్న చీరెలన్నిటినీ తీసి మంచంమీద పడేసింది.
    అతను మొఖమాటపడుతూనే వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అల్మరాలోని పుస్తకాలన్నిటినీ కెలికి ఆ పుస్తకం బయటికి లాగింది సావిత్రి.
    "మీరు మరేదయినా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా?" అడిగాడతను.
    "ఏం అలా అడిగారు?" నవ్వుతూ అంది తను.
    "అదే_ఈ పుస్తకం కొనుక్కొంటేనూ?"
    "అది నాదికాదులెండి! మా ఫ్రెండ్ ది. ఆమెకూడా ఇక్కడే ఉంటుంది. ఆమధ్య సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కి అప్లయ్ చేసింది. దాని ఇంటర్వ్యూ కెళ్ళేటప్పుడు కొనుక్కొందది."
    "సెలక్టయ్యారా?"
    "ఊహు."
    "బ్యాడ్ లక్!"
    "మీరింతకు ముందెక్కడైనా ఉద్యోగం చేశారా?" అడిగింది సావిత్రి.
    "ఏమీ చేయలేదండీ! అదే నేను చేసిన తప్పయిపోయింది... డిగ్రీ అవగానే ఉద్యోగ ప్రయత్నాలలో వుంటే ఈనాడు ఈ గొడవంతా ఉండేదికాదు...అప్పట్లో మావాళ్ళంతా నెత్తిన నోరు పెట్టుకొని చెపుతున్నా వినకుండా "హాకీ హాకీ" అంటూ తిరిగాను...ఎప్పటికయినా నేషనల్స్ లో సెలక్టు అవుతానని ఓ పిచ్చి నమ్మకం ఉంది. అది కాస్తా దెబ్బ తిన్నాక అప్పుడు తెలిసొచ్చింది. తెలిసొచ్చే సమయానికి మా ఫ్యామిలీ పరిస్థితులు కూడా తలక్రిందులయ్యాయి. సరిగ్గా సంవత్సరం నుంచి తిరుగుతున్నాను ఉద్యోగం కోసం. ఇక లాభం లేదనుకుని ఇక్కడకు చేరుకున్నాను. బాలకృష్ణగారు మా బాబాయికి తెలుసటలెండి! ఆయన లెటరిచ్చి నన్నిక్కడికి పంపించారు. బాలకృష్ణ గారేమైనా ఉద్యోగం ఇప్పించగలరేమో అనుకొంటే_ఆయనేమో కథల్రాయ్ ఉద్యోగమెందుకు అంటున్నారు.
    "అదెలా కుదురుతుందండీ, రచయిత అవ్వాలంటే అది మన చేతిలో లేదు కదా. అదొక వరం అంటే ఆయన వినటం లేదు. తను ఎంతోమంది అనామకుల్ని తీసుకొచ్చి రచయితలగానూ, రచయిత్రులుగానూ తాయారుచేశాను. ఈ ఉద్యోగాలు చేయడంకంటే ఆ వృత్తే మంచిదట... నవ్వాపుకొంటూ చెప్పాడతను.
    తనూ నవ్వేసింది సావిత్రి.
    "నన్నూ, మా ఫ్రెండ్ ని కూడా కథల్రాయాలని గొడవ చేస్తుంటారండీ ఆయన."
    "బావుంది! ఆయన దృష్టిలో అంతా రచయితలేనేమో!" ఇద్దరూ నవ్వుకున్నారు.

 Previous Page Next Page