Previous Page Next Page 
తదనంతరం పేజి 24


    ఇది తను డ్యూటీలో చేరిన మొదటిరోజు...అప్పుడే...ఆమెకు వళ్ళంతా జలదరించినట్టయింది.


    "ఎందుకంటారు?"


    "ఏమిటి?" అనడిగింది అప్రయత్నంగా తల ఎత్తి.


    "మళ్ళీ ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. ఆ కలుసుకోవటంలో తానేదో గొప్పపని చేసినట్టు తృప్తిననుభవించాడు.


    "మిమ్మల్ని చూడగానే మరిచిపోవటం"


    అతని మాటలో మితిమీరిన చనువుచూసి ఆమెకసహ్యమేసింది. తనకున్న డబ్బు, అధికారం కారణంగా యాభైయ్యేళ్ళు దాటుతున్నా కూడా అతనో హీరో అనుకుంటున్నాడు.


    చేసేదేముంది? అనుకోనియ్ అనుకుంటూ మౌనంగా వూరుకుంది.


    "మాట్లాడరేం?"


    "ఏం మాట్లాడమంటారు?"


    మీకేమీ మాట్లాడాలని అనిపించటం లేదా?"


    "అనిపించటం లేదు."


    కొంచెం కటువుగానే జవాబు చెప్పింది. చెప్పాక అతనికి కోపమొస్తుందేమోననుకుంది.


    కాని అతనికి కోపం రాలేదు. వచ్చిందో రాలేదో తెలీదుగాని, బయటకు మాత్రం నవ్వి వూరుకున్నాడు. విస్తృతమైన జీవితానుభవం నుంచి అతను నేర్చుకున్నదేమంటే...ఎలాంటి పరిస్థితుల్లోనూ కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వు చూపిస్తూ వుండటం. ఈ కలాపంతో అతను చాలా సందర్భాలలో నెగ్గుకుంటూ వచ్చారు.


    "మీకు కొంచెం కోపమొచ్చినట్లుందే" అన్నాడు పెదవులమీద చిరునవ్వు చెదిరిపోనివ్వకుండా.


    అతన్ని చూస్తుంటే ఆమెకు జూలో జంతువు గుర్తుకు వచ్చింది. ఏదో ఒక జంతువు.


    కొందరుంటారు. వాళ్ళకి జీవితంలో డబ్బే ప్రధానం. అది ఒక్కటి ఉంటే ఏ శక్తినైనా అవలీలగా జయించగలననుకుంటారు. ఆ డబ్బులు ఉంటే అహర్నిశలూ ఆలోచిస్తూ ఎన్ని అవమానాలనైనా భరిస్తూ వుంటారు. అసలు దానిని అవమానాలుగా భావించరు.


    సాంఘిక జీవితం, రోటరీ లేకపోతే లయన్స్...రకరకాల యాక్టివిటీలు...వీటిలో మునిగితేలుతూ తమకో ప్రత్యేకతనూ, గుర్తింపునూ, ఘనతనూ ఆపాదించుకుంటూ వుంటారు.


    ఆ కోవకి చెందినవాడు శ్రీనివాసరావు.


    అతను మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళ మూడ్స్ స్టడీ చేస్తూ ఉంటాడు. ఆ మూడ్ తన కనువుగా లేకపోతే ఆంతర్యాన్ని విప్పటం ఎన్ని నెలలకైనా వాయిదా వేసుకునే నేర్పు తనకి వుంది.


    ఆమె ఎంతకూ మాట్లాడకుండా వుండటం, ముఖం కొంచం ఎర్రబడుతూ వుండటం గమనించి "ఈ ఉద్యోగం మీకు నచ్చిందా?" అన్నాడు.


    "డెడికేషన్ తో చేస్తే ఏ ఉద్యోగమైనా బావుంటుంది" అన్నది నీరజ.


    "గుడ్" అన్నాడు.


    "నేనింకా వెళ్ళవచ్చా? అక్కడ టైపు చెయ్యవల్సిన లెటర్సు చాలా వున్నాయి" అంది.


    "అవునవును. ఈ మధ్య పేమెంట్స్ సరిగ్గా లేవు. ఎవరి మట్టుకు వారు చీటీ పాడేసుకుని డబ్బు కట్టకుండా ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్నారు. కొంతమంది ఎడ్రెస్ కూడా తెలీటం లేదు."


    ఆమె వెళ్ళవచ్చునా లేదా అని ఆలోచిస్తోంది.


    "వెళ్ళండి" అన్నాడు.


    "హమ్మయ్య" అనుకుని గదిలోంచి బయటికొచ్చి గుండెల మీద నుంచి ఏదో బరువు తొలగిపోయినట్లయింది.


    సీటులో కూచోబోతూ గమనించింది...ఇంచుమించు ఆఫీసులో ఉన్నవాళ్ళందరి కళ్ళూ తనమీద వున్నాయి. కొందరి చూపుల్లో వ్యంగ్యం, కొందరి చూపుల్లో కుతూహలం...


    "అబ్బ! చూపులెంత దారుణంగా గుచ్చుకుంటాయని.

 Previous Page Next Page