Previous Page Next Page 
రక్షరేకు పేజి 24


                                        12
    "అప్పుడప్పుడు మిలటరీ కేంటీన్ కి వచ్చి సరళ యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండటం జైహింద్ బాబుకి అలవాటే!
    జైహింద్ బాబుని చూడగానే సరళ సంతోషంగా "జయన్నా! ఈ సంవత్సరం మా సారధి కూడా కాలేజీలో చేరుతున్నాడు! మీ కాలేజీలోనే చేర్పించు" అంది.
    "అలాగే సరళమ్మా!" అన్నాడు జైహింద్ బాబు.
    తన కష్టార్జితం..... తను అపురూపంగా దాచినది. డబ్బుతీసి లెక్క పెట్టి తమ్ముడి చేతిలో పెట్టింది సరళ.
    చటుక్కున ముందుకు వంగి అక్క పాదాలకు నమస్కారం చేశాడు సారధి.
    "ఛ! ఛ! ఏమిటిరా ఇది?" అంది సరళ వెనక్కు తగ్గుతూ.
    "ప్రస్తుతానికి చెయ్యగలిగింది ఇదొక్కటే! ఇంతకంటే ఏమైనా, ఎప్పటికైనా చెయ్యగలిగితే అదృష్టవంతుణ్నే!"
    "ఏడిశావ్! పో!" ముద్దుగా కసిరింది.
    పుస్తకాలు పట్టుకొని జైహింద్ బాబుతో కలిసి కాలేజీకి వెళుతున్న సారధిని కళ్ళ పండువుగా చూసుకొంది.
    ఒక గంటలోనే తిరిగి కేంటీన్ కి వచ్చేశాడు జైహింద్ బాబు.
    సరళ ఆశ్చర్యపోతూ "అదేం? అప్పుడే వచ్చేశావు? కాలేజి లేదా? సారధి ఏడి?" అంది.
    "కాలేజీ ఉంది. సారధి కాలేజీలో చేరాడు.... చదువుకుంటున్నాడు."
    "మరి, నువ్వు వచ్చేశావేం?"
    "నేను కాలేజి మానేశాను."
    "అదేం?"
    "ఇక్కడే నేను సర్వర్ గా చేరాను."
    సరళ తెల్లబోయి నిలబడిపోయింది.
    "ఏయ్ సర్వర్! రెండు బ్రెడ్ అండ్ బటర్, రెండు ఆమ్లెట్స్ తీసుకురా!"
    అని డైనింగ్ హాలులోంచి కేక వినిపించేసరికి అవి తీసుకొని డైనింగ్ హాలులోకి వెళ్లిపోయాడు జైహింద్ బాబు.
    తల్లి అనారోగ్యం..... మందులు. ఆహారం.....ఇవన్నీ కాక, తల్లి సంపాదన లేకపోవటం...... రత్నమ్మ పెళ్ళి సమస్య.....వీటన్నిటితో తన చదువు కొనసాగించుకోవటం అసంభమనిపించింది జైహింద్ బాబుకి.
    అన్ని విషయాల్లోనూ, తనకు అండగా ఉంటోన్న వ్యాసమూర్తినే ఈవిషయంలోనూ ఆశ్రయించాడు. కాలేజి మానేసి ఉద్యోగం చేస్తానంటున్న జైహింద్ బాబుని చూసి చాలా బాధ పడిపోయాడు వ్యాసమూర్తి.
    "వద్దు! నువ్వు కాలేజీ మానకు. మీవాళ్ళలో నీబోటి వాళ్ళు వొకరిద్దరన్నా కనిపిస్తున్నారని ఎంతో ఆనందించాను. నువ్వూ కూలిపనిలోకి దిగిపోతావా? వీల్లేదు. నిన్ను నేను చదివిస్తాను!....." ఆవేశంగా అన్నాడు వ్యాసమూర్తి.
    "బాబుగారూ! చదువు మానుకోవటం నాకు సరదా అనుకుంటున్నారా? చదువు మానుకోవలసి వచ్చినందుకు నేను అనుభవించే క్షోభ తక్కువది అనుకొంటున్నారా? నన్నెవరూ చదివించనక్కరలేదు. నాకు స్కాలర్ షిప్ వస్తుంది. కానీ తన రక్త మాంసాలన్నీ మాకోసం కరిగించి, ఇప్పుడు రోగంతో మంచమెక్కిన తల్లి, పెళ్ళి కావలసిన ఇద్దరు చెల్లెళ్ళూ - వీళ్లందరినీ ఎవరు పోషిస్తారు సార్?"
    "ఏం? మీ నాన్న ఏమయ్యాడు? చచ్చాడా?"
    "చచ్చి ఉంటే, మా అమ్మకీనాడు ఈ రోగం వచ్చేదికాదేమో! మా నాన్నకి అన్నీ అమరించి పెట్టలేక, మా నాన్న చేతిలో దెబ్బలు తినలేక..... మా అమ్మ ఓపికంతా హరించుకుపోయి జీవచ్ఛవంలా తయారయింది. ఎప్పుడో వస్తాడు - తిన్నది తింటాడు - అందింది పట్టుకుపోతాడు - అంతే, మా నాన్న......"
    "మీ నాన్నకి పట్టని సంసారం నువ్వెందుకు పట్టించుకోవాలి? ఎవరికీ పట్టనిది నువ్వొక్కడివే అందరికోసం ఎందుకు పాటుపడాలి? నువ్వెందుకు చదువు మానుకొని నీ జీవితం నాశనం చేసుకోవాలి?"


    తనమీది అభిమానంతో ఆవేశంగా మాట్లాడుతోన్న వ్యాసమూర్తిని చూస్తే గౌరవం పొంగుకొచ్చింది జైహింద్ బాబు మనసులో.
    "బాబుగారూ! దేశంలో యింతమంది ఉన్నారు. అందరికీ జరుగుతోన్న అన్యాయాలు తెలుసు. ఎవరికీ పట్టని ఆ అన్యాయాలు కొందరే ఎందుకు పట్టించుకొంటున్నారు? అని కండించాలని కొందరే ఎందుకు తాపత్రయపడుతున్నారు?
    ఎక్కడో, ఎవరి సంగతో ఎందుకు బాబుగారూ! మీరే వున్నారు - ఎవరూ పట్టించుకోని మీబోటి వాళ్ళ కష్టసుఖాలు మీరొక్కరే ఎందుకు పట్టించుకొని, మమ్మల్ని పైకి తేవాలని పాటుపడుతున్నారు? ఒక కుటుంబంలోనైనా, దేశంలోనైనా, ప్రపంచంలోనైనా అందరికోసం పాటుపడేది ఎప్పుడూ కొందరేకదా సార్!"
    "నువ్వు బాగా చదువుకొని ఎంతో ఎంతో పైకివస్తావని చాలా ఆశపడ్డాను...." నిరాశగా అన్నాడు వ్యాసమూర్తి.
    "అదేమిటి సార్! మీరు అలా మాట్లాడతారు? చదువు మానేసి ఉద్యోగంలో చేరినంత మాత్రాన పైకి రాలేనంటారా?"
    వ్యాసమూర్తి నాలుక కరుచుకొని జైహింద్ బాబు భుజంతట్టి, "ఎందుకు రాలేవూ? నీలాంటి వాళ్ళు ఎక్కడున్నా పైకి వస్తారు" అన్నాడు. కానీ, ఆ కంఠంలో ఏ కోశానా ఉత్సాహం లేదు.
    సరళ ఇది భరించలేకపోయింది!
    "నాకు సారధి ఒకటీ, నువ్వు వేరొకటీ కాదు. నువ్వూ చదువుకో! ఎలాగో అవస్థపడదాం!" అంది.
    "నా అదృష్టం సరళమ్మా! నన్ను చదివిస్తామని ఉన్న వాళ్ళూ, లేనివాళ్ళూ, యజమానులూ, స్నేహితులూ అందరూ అంటున్నారు. కానీ, నేను నా కుటుంబాన్ని ఆదుకోవాలి, సంపాదించాలి."
     "ఇంకేం మాట్లాడగలదు సరళ.

 Previous Page Next Page