Previous Page Next Page 
కళ్ళు పేజి 24


    "డాక్టర్ల నైతిక విలువలు పడిపోతున్నాయనటానికి, వాళ్ళు కూడా నేరస్థులుగా మారుతున్నారనటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ కాదా?" అనడిగాడు.

 

    అంతవరకూ ఎంతో నిర్లిప్తంగా ఉన్న కృష్ణచైతన్య ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగుకు వచ్చింది. ఆవేశాన్నణచుకోలేకపోయాడు.

 

    "వాట్ మిస్టర్! డాక్టర్ వృత్తి గురించీ, డాక్టర్ల ఔన్నత్యాన్ని గురించీ నీకేం తెలుసు? డాక్టర్ వృత్తి అంటే ఇష్టమొచ్చినట్లు నాలుగు ప్రశ్నలడిగి, ఏవేవో హెడ్డింగుళు పెట్టి బరబర రాయటంకాదు. ప్రపంచమంతా నిద్రపోతూన్న వేళ తన డ్యూటీ టైము కాకపోయినా ఒక ప్రాణిని కాపాడటంకోసం మేలుకుని ఉండేది డాక్టరనీ, టైము గురించి ఆలోచించకుండా, ఆకలి మొదలైన శరీరావసరాలను కూడా లెక్కచెయ్యకుండా, రోగులతో, రోగాల మధ్య చిరునవ్వుతో మసిలే వ్యక్తి డాక్టరనీ, ప్రపంచమంతా సరదాగా గడిపే సాయంత్రాలు హాస్పటల్లో ఇరుక్కుపోయి, అటు ఎంతో ముఖ్యమైన పబ్లిక్ ఫంక్షన్స్ కూ వెళ్ళలేక, ఇటు ఇంట్లోని భార్యాపిల్లలకూ కంపెనీ ఇవ్వలేక అసంతృప్తి కలిగిస్తూ కాలంతోబాటు పోటీపడి పరిగెత్తే వ్యక్తి డాక్టరనీ గ్రహించక, గుర్తించక, అతను చేసే అమూల్య సేవల్ని అర్థం చేసుకోలేక వెకిలి విమర్శలు చేసే ప్రజలూ, వాళ్ళమీద దండయాత్ర చేసే ప్రభుత్వమూ... ఐ హేటిట్. మీకు ప్రతిక్షణమూ డాక్టరు కావాలి. కాని అతన్ని క్రిటిసైజ్ చెయ్యటానికి అవకాశం ఎప్పుడొస్తోందా అని కాచుకొని ఉంటారు. డాక్టర్ కి రెస్ట్ ఉండకూడదు. డాక్టర్ కి పర్సనల్ లైఫ్ ఉండకూడదు. డాక్టర్ ఫీజు తీసుకుంటే అదో నేరం. టాలెంట్ వున్న డాక్టర్ ఎక్కువగా డబ్బు సంపాదిస్తే మహానేరం. డాక్టర్ కి కోపం ఉండకూడదు అతనికి అలసట ఉండకూడదు. అతనికి ఫెయిల్యూర్స్ ఉండకూడదు..."

 

    "ఆగండాగండి. డాక్టర్లలో చెడ్డవాళ్ళు లేరనా మీ ఉద్దేశ్యం?"

 

    "ఐ సే! యూ గెటవుట్" కృష్ణచైతన్య ఉద్రేకం ఆపుకోలేక గట్టిగా అరిచాడు.


                                    *  *  *


    హేమసుధ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చెయ్యబడి ఇంట్లోనే వుంటోంది. ఆమెను కలుసుకుందామని ప్రొడ్యూసర్లూ, పత్రికావిలేఖర్లూ ఇతర ప్రముఖులూ, పరిచయస్థులూ ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఐనా ఇంటర్వ్యూ దొరకటంలేదు.

 

    ఎస్.పి.జయసింహ, డి.ఐ.జి.ని కలుసుకుని ఆమెను కలుసుకునే అధికారం ఒక్క రంజితకే ఇచ్చాడు. ఎందుకంటే హేమసుధ ఒక ప్రఖ్యాత నటీమణి. ఆమె మాట్లాడే ప్రతిమాటకూ ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అసలే ఆమె వర్ణించనలవికాని బాధలోవుంది. పోలీస్ డిపార్టుమెంట్ వాళ్ళు వెళ్ళి ఆమెనింకా హింసించటం అతనికిష్టం లేదు.

 

    రంజిత తోటి ఆడది. చాలా సౌమ్యంగా మాట్లాడగలిగిన హృదయమున్న మనిషి. అందుకని ఆమె ఒక్కదానికే పర్మిషన్  ఇవ్వబడింది.

 

    రంజిత హేమసుధ భవనం ముందు కారాపి, డోర్ తెరుచుకొని దిగింది. అదే సమయానికి ఆ ఇంటిగేటు తెరుచుకుని ఓ యువకుడు బయటకి వస్తున్నాడు.

 

    రంజిత గేటువైపు నడుస్తూ యధాలాపంగా అతనివైపు చూసి, ఉలిక్కిపడింది.

 

    ఇంచుమించు ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరం, మొహంలో ఏదో తేజస్సు...

 

    అతనూ ఆమెవైపు చూశాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.

 

    అతన్ని చూస్తూనే రంజిత వులికిపడింది.

 

    ఇరవైఏడూ, ఇరవై ఎనిమిదేళ్ళ వయసు, ఇంచుమించు ఆరడుగుల పొడవు, దృఢమైన శరీరం... మనసులో ఎదో వర్ణనలు మెదుల్తున్నాయి.

 

    ఇద్దరి కళ్ళూ క్షణంసేపు అలా నిలబడి వున్నాయి. తర్వాత అతను తల త్రిప్పుకుని, గిరుక్కున ప్రక్కకి తిరిగి వెళ్ళిపోయాడు. రంజిత అతన్ని గమనిస్తూ నిలబడింది. వేగంగా నడుస్తూ వెళ్ళి రోడ్డుప్రక్క పార్క్ చేసివున్న ఫియట్ కారులో ఎక్కాడు, రంజిత ఆ కారు నంబరు గుర్తుపెట్టుకుంది. మరుక్షణం ఫియట్ కారు రివ్వున దూసుకుంటూ ముందుకెళ్ళి పోయింది.   

 

    వాచ్ మెన్ గేటు దగ్గర నిలబడి వుండి రంజిత లోపలకు వస్తోంటే సెల్యూట్ చేశాడు. ఆమె పోలీస్ డిపార్ట్ మెంట్ మనిషని. హేమసుధతో మాట్లాడటానికి వస్తోందనీ అతనికి ముందుగానే తెలుసు. రంజిత వాచ్ మెన్ దగ్గరకు వెళ్ళింది.

 

    "ఇప్పుడు బయటకు వెళ్ళిన మనిషి ఎవరు" అని అడిగింది.

 

    "అమ్మగారి అన్నగారినని చెప్పాడు."

 

    "చెప్పాడా? అంటే నీకు తెలీదా?"

 

    "నేనెప్పుడూ ఇదివరకు చూడలేదు."

 

    "చూడకుండా లోపలికి ఎలా పంపించావు?"

 

    "ఎవరన్నా ముఖ్యమైన బంధువొస్తే ఆపవద్దని పెద్దమ్మగారు చెప్పారు. సుధమ్మగారు మాట్లాడకపోవచ్చుగాని, చాలామంది చుట్టాలూ, స్నేహితులూ, సినిమావాళ్ళు వచ్చి పెద్దమ్మగారితో మాట్లాడి వెడుతూనే వున్నారు.

 

    "ఇంట్లో ఇప్పుడెవరున్నారు?"

 

    "సుధమ్మగారూ, పెద్దమ్మగారూ, తోడుకోసం వుంచుకున్న అయిదారుగురు దగ్గర బంధువులూ వున్నారు."

 

    "ఇప్పుడు వెళ్ళినతను లోపల ఎంతసేపున్నాడు?"

 

    "ఐదారు నిమిషాలు."

 

    "హేమసుధగారితో అతను మాట్లాడాడా?"

 

    "తెలీదు."

 

    రంజిత అతన్ని విడిచిపెట్టి లోపలకు వెళ్ళింది. తలుపులు మూసివున్న హాలు ద్వారం దగ్గర నిలబడి బజర్ నొక్కింది. ఓ నిమిషం గడిచాక లోపల్నుంచెవరో తలుపు తీశారు.

 

    నడివయసు స్త్రీ, కట్టూబొట్టూ ఫ్యాషన్ గా ఉండి, అందంగా కూడా వుంది. ముఖంలో కళ వుట్టిపడుతోంది. హేమసుధ పోలికలు కనబడుతున్నాయి. ఆమె తల్లిగావును అనుకుంది.

 

    "నా పేరు రంజిత. హేమసుధగారితో మాట్లాడటానికి ఎపాయింట్ మెంట్ తీసుకున్నాను."

 Previous Page Next Page