"యూ" అంటూ ఆవేశంగా పైకిలేచి కంపార్టుమెంటు చైన్ లాగేయాలని ఓ క్షణం ఆవేశపడి ఆనక "ఇక్కడకాదు... నెక్ట్స్ స్టేషన్ లో నీ సంగతి చూస్తాను" అంటూ ఉద్రేకాన్ని అభనయిం చేస్తోంది.
ఏమైందో అర్థంకాని టి.టి.ఇ. హరిత పూనకమొచ్చినట్లు ఎందుకు వూగిపోతుందో తెలీక "అసలేమైంది?" అన్నాడు కంగారుపడుతూ.
"నా చెయ్యి పట్టుకుంటావా?"
అదిరిపడ్డాడు.
"ఇట్స్ ఏనిన్సల్ట్! హోల్డింగ్ ది హేండాఫ్ ఏ లేడీ డెలిబరేట్లీ టు ఇన్సల్ట్ హెర్ యూజే నథింగ్ బట్ ఏనిన్సల్ట్ వజ్ పర్ ఐ.పి.సి. సెక్షన్ నెంబర్ 353 అండ్..." ఆగింది. ఒకవేళ ఇంగ్లీషు క్షుణ్ణంగా అర్థంకాకపోతే తన ఊపుకో అర్థం లేకుండా పోతుందని" అసలు కనీసం నీకు రెండేళ్ళు శిక్ష పడుతుందని తెలిస్తే ఇలా ఆడవాళ్ళ కూపేలో వయసులో వున్న ఓ యంగ్ లేడీ చేయి పట్టుకునేవాడివి కాదని కోర్టుద్వారా..."
"అమ్మా... అమ్మా... నేను కావాలని తాకలేదు తల్లీ... పొరపాటున చేయి తగిలింది" అక్కడ మరెవరూ లేకపోతే కాళ్ళమీద పడిపోదామన్నంత కంగారుపడిపోయాడు "వద్దమ్మా! పిల్లలు గాలోడ్ని."
"నేనూరుకోను."
"ఊరుకోండి లాయరుగారూ" ఆశ హరితని అదుపు చేయబోతున్నట్లుగా మరో అస్త్రం సంధించింది. "ఏదో అందరి ఆడవాళ్ల మాదిరిగా వయస్సులో వున్నాడు కాబట్టి తాకాడే అనుకోండి."
"మీ పేరేంటోగాని తల్లీ మీరు అలా అనడం బాగోలేదు" లాయరని తెలీడంతో మరింత గగ్గోలు పెట్టేస్తున్నాడు. "పొరపాటైపోయింది లెంపలేసుకుంటాను."
"లేదు. ఇలాంటి అత్యాచారాల్ని మొగ్గలోనే తుంచేయకపోతే ఇది తరతరాల స్త్రీజాతికి తీరని కళంకం. ఒక ప్రముఖ క్రిమినల్ లాయరుగా వృత్తికే తీరనిద్రోహం. ఆశా... ఎప్పుడు నెక్ట్స్ స్టేషన్..."
"మీ కాళ్ళు పట్టుకుంటాను మేడమ్! నన్ను క్షమించేయండి" చేతులు జోడించటంతో కొంచెం శాంతపడింది.
"క్షమించేస్తానుగాని మరి మా అబ్బాయి ఈ సంఘటన్ని వాళ్ళ నాన్నకి చెబితే... అదే నువ్వు చేయి తాకటం?"
"చెప్పడండి. చిన్న వయసుకదా!"
"ఎంత చిన్న వయసు?"
"ఎక్కడండీ? మూడేళ్ళపిల్లాడు. అంతే కదా!"
"కాదు. వాడివయసు ఎనిమిది" స్థిరంగా అంది హరిత.
"కాదు మేడమ్! స్పష్టంగా తెలిసిపోతుంటేనూ ?" నానీని ఆప్యాయంగా తలనిమిరి "ఇంకా మూడుకూడా నిండివుండడన్నది నా నమ్మకం. అబ్బే రెండున్నరేళ్ళు వుంటాయేమో కూడా" హైరానా పడిపోతున్నాడు.
"సరే... క్షమించేశాను."
బ్రతుకుజీవుడా అని బయటికి వెళుతూ "బాబుకి కాఫీ గట్రా పంపమంటారా?" అడిగాడు మరింత ఇంప్రెస్ చేద్దామని.
"లేదు టి.టి.ఇ.గారూ... వాడు మూడేళ్ళ పిల్లాడుగదా! కాఫీ అదీ తాగడు. మిగతా కూపేల్లో మీ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించండి" టి.టి.ఇ వెళ్ళిపోగానే ఆశ ఓ అయిదునిముషాలపాటు నవ్వాపుకోలేకపోయింది. "నీతో ప్రయాణమంటే మహా ప్రమాదకరమే" అంది చివరగా.
"ఎందుకు?"
"ఎప్పుడూ ఇలాంటి పేచీ ఏదో తీసుకొస్తుంటావుగా."
"నీకు తెలీదు ఆశా... ఈ దేశంలో తననుతాను రక్షించుకోవాలని అణకువగా ఆరాటపడే ఆడదెప్పుడూ అణగదొక్కబడుతూనే వుంటుంది. అది చరిత్ర. కాబట్టి డిఫెన్స్ సైడ్ నిలబడి సరదాగా ఆటపట్టి స్తూంటాను."
ఇప్పుడిప్పుడే బయటప్రపంచంలో అడుగుపెట్టిన నానీ మనసులో ఆ సన్నివేశం మాత్రమేగాక చివరగా హరిత అన్నమాటలు ఎంతబలంగా ముద్ర వేశాయీ అంటే అమ్మ గుర్తొచ్చింది హఠాత్తుగా.
కొన్ని గంటలక్రితం పరిచయమైన హరిత అమ్మలాగే ప్రేమగా మాట్లాడుతుంది. కాని అమ్మలా అణకువగా వుండటంలేదు. అక్కడే ఒక కొత్త అంకురం పడిపోయింది నానీ మనసులో అస్పష్టంగానైనా.
"నిజానికి ఓ పసికందుకి టిక్కెట్టుకి డబ్బులు చెల్టించడమన్నది మనకి సమస్యకాదు ఆశా... కాని వీళ్ళు ముందు ప్లాన్ చేసేది మామూలుకోసం. అదే సవ్యమైన అప్రోచ్ లో అయితే ఫర్వాలేదు. ముందు దబాయించాలని చూస్తారు. అదే నేను యిష్టపడనిది" ఓ క్షణం జరిగింది గుర్తుచేసుకుంది. "పాపం మహా హడావుడిపడిపోయాడు మానవుడు. తర్వాత స్టేషన్ లో పిలిచి పెనాల్టీ చెల్లించేద్దాం" అంది హరిత మనస్పూర్తిగా.
రాజమండ్రిలో టి.టి.ఇ. కోసం చూసింది కాని ఎడ్రస్ లేకపోవడంతో భోజనం తెప్పించుకున్నారు వేరే కండక్టరుకి చెప్పి.
నాని మంకుపట్టు పట్టాడు తిననని.
కాని చివరికి హరితే గెలిచింది.
ఆమె లాలిత్యంలో కమ్మదనానికో లేక ముద్దలుకలిపే ఆమెలో అమ్మే కనిపించిందో కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి.
"అదిగో... ఏంటాకన్నీళ్ళు..." ఆందోళనగా అడిగింది హరిత "ఏదన్నా మారాంచేసి సాధించుకోవాలిగాని ఏడ్చేపిల్లలంటే నాకు మహాకోపం"
తలూపాడు కళ్ళు తుడుచుకుంటూ...
నిజానికి అమ్మపోయి ఎన్నో రోజులుకూడా కాలేదు.
కాని ఎన్నో సంవత్సరాలు గడిచినట్టుంది.
ఎవరున్నారని తనకి ఇంత ఆప్యాయంగా అన్నం తినిపించడానికి?
భోజనం పూర్తయ్యాక హరిత నవ్వించాలని చాలా ప్రయత్నించింది. కానీ నానీ ఇక మామూలుస్థితికి రాలేకపోయాడు.
అనంతందాకా వ్యాపించిన చీకటిలోకి దూసుకుపోతున్న నానీ ఆ క్షణం వూహించివుండడు తన ప్రయాణం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో...
కిటికీలోనుంచి బయటకుచూస్తూ గుర్తుచేసుకుంటున్నాడు.
అమ్మ ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకునే అర్థరాత్రివేళ నిన్న ఎవరో తట్టినట్టు ఉలిక్కిపడి నిద్రలేచిన నానీకి బయట మాటలు వినిపించాయి గుసగుసల్లా...
"వాడు బ్రతికి ఎల్లుండి కోర్టుకువస్తే మొత్తం కథ బయటపడుతుంది. అందరి కథలూ ముగిసిపోతాయి. ఈ కాసులపేరు తీసుకో. పదికాసులు. రేపు సాయంకాలం నానీ స్కూలునించి వచ్చాక నువ్వు చేస్తావో, మరెవరికన్నా బాధ్యత అప్పచెబుతావో. ఎలాగూ వాడికి ఏటిఒడ్డున రావడం యిష్టం కాబట్టి యుక్తిగా తీసుకెళ్ళి నదిలోకి తోసేయ్."