కిటికీ వారనుండే చూశాడు.
సరళత్తయ్య రాజారావుకి చెబుతూంది.
రాత్రంతా భయంతో వెక్కిపడుతూనే వున్నాడు.
సాయంకాలందాకా స్కూల్లో వుండలేక మధ్యాహ్నమే ఇంటికొచ్చేసి దిగులుగా అంతా చెప్పేశాడు తాతయ్యకి.
తాతయ్య వణికిపోయాడు ముందు. ఆ తర్వాత ఆయాసంతో దగ్గుతూ "నాకు జబ్బెక్కువైందిరా వెంటనే మందు తీసుకురాగలవా?" అని అదెక్కడ దొరుకుతుందీ అంటే అనకాపల్లిలో ఆగివున్న ట్రైనెక్కి ఏడవస్టేషనుదాకా ప్రయాణంచేసి అక్కడ దిగమన్నాడు. అక్కడ నిలబడ్డ ఓ గెడ్డం డాక్టరు దగ్గరకెళ్ళి మందు అడిగితే ఇస్తాడన్నాడు.
ఆ మందుపేరు "బ్రతికించే మందు" అనికూడా స్పష్టంగా చెప్పాడు.
తాతయ్య ఏం ఆశించి ఇదంతా చేసిందీ ఆలోచించే జ్ఞానంలేని నానీ "రాజారావు కంటమాత్రం అస్సలు పడగూడదొరేయ్" అంటూ తాతయ్య రహస్యంగా అన్న విషయాలన్నీ బాగానే గుర్తుంచుకున్నాడు.
అర్థరాత్రి సమీపిస్తూంది.
మాగన్నుగా కూర్చునే నిద్రపోతూ ట్రైనుకుదుపుతో కళ్ళు తెరిచింది ఆశ. హరిత పక్కకుచూస్తే నానీలేడు.
కంగారుగా బయటకొచ్చి వెతికారు.
ట్రైను కదిలేదాకా ఆత్రంగా ఎదురుచూశారు. నానీ రాలేదు.
కాని హరిత పక్కనున్న వెడ్డింగ్ కార్డు పై ఏవో అక్షరాలు కనిపించాయి. సమీపంలో వాలెట్ లోని పెన్నూ వుంది.
"త్వ మేవ మాతా ఛ పితాత్వ మేవ త్వమేవ బంథూశ్చ సభాత్వ మేవ... అమ్మలాంటి మంచి అంటీ నీకు నా దణ్నం... నానీ."
అప్రతిభురాలై చూస్తూవుండిపోయింది ఆ వాక్యాలవైపు.
సరిగ్గా ఇదే సమయానికి...
ఏడోస్టేషనులో లెక్కప్రకారం దిగిన నానీ భయంతో ఓ స్థంభంచాటునే నిలబడి "బ్రతికించే మందు" ఇవ్వాల్సిన గెడ్డం డాక్టరుకోసం దిక్కులు చూస్తున్నాడు
కనిపించలేదు.
నిర్మానుష్యంగా వున్న ప్లాట్ ఫాం వెలుగులో దూరంగా చీకటిలో నిలబడ్డ ఓ ఆకారాన్ని చూసి అటు కదిలాడు.
చాలా దగ్గరగా వచ్చాకకాని గుర్తుపట్టలేకపోయాడు.
అక్కడ నిలబడింది డాక్టరు కాదు. కర్కశంగా నవ్వుతున్న రాజారావు. అంతే...
గొంతుదాటని పెనుకేక గుండెల్లో అలజడిరేపగా ప్రాణభీతితో పరుగెత్తాడు.
ఆ అపరాత్రివేళ తననుతాను రక్షించుకోవాలని నానీ ఎంత వేగంగా దూసుకుపోయాడూ అంటే కేవలం రెండునిముషాల వ్యవధిలో ప్లాట్ ఫాం రెండో అంచున చేరడంతోపాటు ఆ చీకటిలో నిద్రపోతున్న ముష్టివాళ్ళమధ్య పడుకుండిపోయాడు.
ఒకవేళ రాజారావు సరాసరి నానీనే వెంటాడి వుంటే ఆ రాత్రి నానీకి చివరి రాత్రయ్యేదే.
కాని ఏ శక్తో అడ్డంపడినట్లు చీకటిలో ప్లాట్ ఫాంపై వున్న ఓ ట్రాలీని తన్నుకొని ముందుకు తూలిపడ్డాడు రాజారావు.
పెదవి చిట్లి మొహం నేలని తాకడంతో...
మరింత ఉక్రోషంగా పైకిలేచి కుంటుకుంటూ నడిచాడు.
అప్పటికే ఓ చిరిగిన దుప్పటిని లాక్కున్న నాని తలనిండా కప్పుకున్నాడు. కొద్దిగా కదిలాడు తనవైపున్న దుప్పటినెవరో లాగేసినట్టని పించిన భిక్షగాడు.
నాని కంపించిపోతున్నాడు.
చలికి వణికిపోతున్న భిక్షగాడు ఏమాత్రం నిలదీసి ప్రశ్నించినా అక్కడ సమీపంలో నిలబడేవున్న రాజారావుకది వినిపిస్తుంది.
అదిచాలు తననురాజారావు గుర్తించడానికి.
పైకి లేచిన భిక్షగాడు క్షణంపాటు తనని తాకుతూ పడుకున్న పసికందును చూసి దుప్పటి లాక్కోవడానికి బదులు నానీ కాళ్ళపై కప్పాడు నిశ్శబ్దంగా.
మసక వెలుతురులో చూశాడు నానీ. కోపం తెచ్చుకోకుండా ఆ మాత్రం జాలిచూపించిన ఆ వ్యక్తి తాతయ్యలా వున్నాడు తల పండిపోయి.
నీరవ నిశీధిలో ఏదో గొణుక్కుంటూ మరలా నానీ పక్కనే పడుకుని ఆప్యాయంగా పైన చేయికూడా వేశాడు.
నానీకి నిద్ర రావడంలేదు.
నెమ్మదిగా తలతిప్పి చూస్తే రాజారావు ఇప్పుడు సిమెంటు బెంచీమీద కూర్చుని వున్నాడు ఓ నియాన్ లైటుక్రింద.
ఏడుపొచ్చేసింది.
ఇప్పుడేమౌతుందో తెలీదు. ఎంతకాలం వెంటాడబడతాడో తెలీదు.
అసలు గెడ్డం డాక్టరు కనిపిస్తాడో లేదో అంతకన్నా తెలీదు.
సరిగ్గా అప్పుడు ఇలాంటివేళ కావలించి పడుకునే అమ్మ గుర్తుకు వచ్చింది.
తను ఏడుస్తూకూడా చెప్పే నవ్వుపాట జ్ఞప్తికొచ్చింది.
"ఏడిస్తే నా కళ్లకారే నీలాలంటే నా కసహ్యం
కాని నాలా ముద్దుగా నవ్వే పువ్వులంటే ఎంతో ఇష్టం
ఆకాశం ఏడ్చినప్పుడు రాల్చే వర్షమంటే అయిష్టం
కానీ నీలాకాశంలో నవ్వే హరివిల్లంటే మరీ ఇష్టం
టీచర్ కొడితే వచ్చే కన్నీళ్ళంటే అసహ్యం
కాని అల్లరి చేయొచ్చా అని అమ్మ నవ్వుతూ పాడే లాలిపాటంటే మరీ మరీ ఇష్టం"
గొణుగుతున్నట్టుగా అనుకుంటుంటే "ఏమిటమ్మా పాడుతున్నావు" అన్నాడు కావలించి పడుకున్న వృద్ధుడు.
బెదురుగా పక్కకి చూశాడు రాజారావుకి వినిపించిందేమో అని.
రాజారావు లేడక్కడ.
కొద్దిపాటి ధైర్యాన్ని తెచ్చుకుని "మరేమో! ఏడవొద్దని అమ్మ నేర్పిన నవ్వుపాట" అన్నాడు.
"పిచ్చినాన్నా... పెద్దింటి బిడ్డలా వున్నావు" వృద్ధుడు లేచి నానీ అందమైన మొహంలోకి చూశాడు.
"అమ్మ చెబితే మాత్రం వచ్చే ఏడుపు ఆగుతుందట్రా."
"ఓ. ఇప్పుడాగిపోయిందిగా."
"బువ్వ తింటావా" నెమ్మదిగా మూటలోంచి సత్తుగిన్నె తీశాడు తినగా మిగిలింది పసికందుకు తినిపించాలని.
"తినేశాను... అక్కర్లేదు."
ఆ వృద్ధుడి కళ్ళలో ఎంతో ప్రపంచాన్ని చూసిన అనుభవం "పిచ్చితండ్రీ... కావాలన్నప్పుడు దొరకదమ్మా... దొరికినప్పుడే తినాలి."