సహజంగా ఆకతాయితనంగల ముగ్ధయిన హరిత ఒక్కక్షణంపాటు లోతుగా వివరాల్ని సేకరించి వుంటే చాలా విషయాల్ని తెలుసుకుని వుండేది.
అంతకుమించి అతని కళ్ళలో అస్పష్టంగా చోటుచేసుకున్న బాధావీచికలకి అమ్మ మరణమే కారణమైతే వాటిస్థానంలో ఉత్సాహాన్ని నింపాలని మాత్రం ఆలోచించింది.
"కాఫీ తాగుతావా" ఫ్లాస్కు అందుకోబోతుంటే వద్దన్నట్టుగా తలూపాడు. "మీ తాతయ్య తాగొద్దన్నాడా?"
"ఉహు ... నాకలవాటు లేదు" హరిత చనువుగా మాట్లాడుతుంటే క్రమంగా తేరుకుంటున్నాడు.
"అలవాటు కావాలంటే తాగాలిగా."
"మరి తాగితే అలవాటైపోతుందిగా."
"చెట్టు ముందా విత్తు ముందా? అన్నట్టుంది" అనేసింది హరిత నవ్వుతూ.
"చెట్టే ముందు" కిటికీలోనుంచి బయటకు చూస్తూనే అన్నాడు నానీ.
ఈ జవాబుకి హరితతోపాటు ఆశా ఉలిక్కిపడింది.
జవాబులేని మరో పజిల్ లాంటి ఈ స్టేట్ మెంటు కి నానీ అంత తాఫీగా జవాబివ్వడం హరితలో ఎంత నిశ్చేష్టతన్నింపిందీ అంటే "చూడు అబ్బాయ్...అసలు దానికి ఆన్సరే లేదు" అంది కరెక్టు చేద్దామని .
"ఎవరన్నారు" చెట్టే ముందు. ఒట్టు" మరింత కాన్ఫిడెన్స్ తో చెప్పేసరికి "ఎలా" అంది నానీని తనవేపు తిప్పుకుంటూ.
"మల్లెచెట్టు చూశారా అంటీ..." అడిగాడు. ఆమె విస్మయంనుంచి తేరుకోక ముందే "ఆ చెట్లు లేకుండా విత్తనాల్లేవు" గబగబా చెప్పేశాడు.
చాలా సాధారణమైన కొటేషన్లా వాడే ఈ వాక్యానికి అద్భుతమైన విశ్లేషణ యిచ్చేసరికి చాలాసేపటిదాకా తేరుకోలేకపోయింది.
"అవునూ ఇదంతా నీకెవరు చెప్పారు."
"జబ్బు పడ్డాడన్నానే మా తాతయ్య."
"ఆయనకి నా జోహార్లు. ఎందుకంటే ఆలస్యంగానైనా ఈ ప్రపంచానికి ఇలాంటి మేధావినైన మనవడ్ని తయారుచేసి పంపుతున్నందుకు.అవునూ నీకు లెక్కలు బాగా వచ్చన్నావుగా."
"ఓ..."
హరిత ఏదో అడగబోయింది.
కాని ఇంతలోనే లోపలికి వచ్చేశాడు టి.టి.ఇ.
వస్తూ నానివేపు చూసిన చూపులోనే గుర్తుపట్టేసింది ఆకతాయితనంగా ఆటపట్టించడం హాబీగా తీసుకునే హరిత టి.టి.ఇ. కడుపు నిండేకకూడా కళ్ళునిండని భోజనప్రియుడిలా నానినే చూస్తున్నాడు. అప్పటికప్పుడే ఏదన్నా గుంజేద్దామన్న అతడి తాపత్రయాన్ని అర్థంచేసుకుని తమ టిక్కెట్లూ అందించింది.
చార్టు, టిక్కెట్లు చెక్ చేసుకుని వెనక్కి ఇచ్చేస్తూ "ఈ అబ్బాయి ఎవరు?" అన్నాడు కార్యక్రమానికి ఉపక్రమిస్తూ.
"మా అబ్బాయే..."
కాదనబోయిన నానికేసి కళ్ళెర్రచేసి చూసింది అంతే... నాని నోరు మూసేసుకున్నాడు.
"మీ అబ్బాయా..."
"బోడి మీ నమ్మకం ఎవరికి కావాలిగాని వాడు అచ్చు మా అబ్బాయేనండి."
"నమ్మలేకపోతున్నాను" అంత చిన్న వయసులోవున్న హరితకి అంత పెద్ద కొడుకుండటం టి.టి.ఇ.కి ఆశ్చర్యం కలిగిస్తే "అవును, వెధవ మూడో ఏడు దాటకపోయినా మనిషిమాత్రం ఎనిమిదేళ్ళ పిల్లాడిలా ఎదిగిపోయాడు" అంది టి.టి.ఇ. విస్మయాన్ని అవకాశంగా తీసుకుని.
"మీ అబ్బాయికి మూడోఏడా" ఒత్తి పలికాడు నిశ్చేష్టుడైపోయి నానీని చూస్తూ.
"లేదు... ఎనిమిది" టక్కున అనేశాడు నాని.
పాయింటు పట్టేసినందుకు గర్వంగా టి.టి.ఇ. క్రీగంట చూడగానే కొంచెం సర్దుకుంది హరిత. "అదేంటో వాడికి చిన్నతనంనుంచీ అయిదు నెంబరన్నా, పంచభూతాలన్నా, పంచమ వేదమన్నా మహాఇష్టం సుమండీ... మా ఇంటి చుట్టుపక్కల అయిదుగురు స్నేహితులున్నారుకూడా. అయిదుగురితో కలిసి బ్రతకరా అంటే వాడి వయసులో కూడా అయిదు కలిపేసి అందరికీ చెప్పేస్తుంటాడు. చిన్నివెధవ" నానీని దగ్గరకు తీసుకుని ముద్దు పెద్దుకుంది.
"నమ్మలేకపోతున్నానండీ."
"మీ ఎత్తెంతండీ?"
"ఓ పదిరూపాయలు చాలండీ" టక్కున జవాబిచ్చాడు.
"మాస్టారూ! మీరెంత కొట్టేద్దామని ఎత్తు వేసున్నారూ అని అడగడం లేదు నేను. మీ హైటెంత అంటున్నాను."
"ఒస్సదా" తొట్రుపడిపోయాడు. "నాలుగున్నరండి."
"వాడ్ని మీ హైటెంతని అడగండి... అయిదు కలిపి తొమ్మిదిన్నరంటాడు. అయిదంటే వాడికంత ఇష్టం."
ఇహ లాభం లేదనుకున్నాడు టి.టి.ఇ. మంచిగా చెబితే డబ్బులు కక్కేట్టు లేరని అఫీషియల్ గా హేండిల్ చేసేద్దామని "చూడుమేడమ్... అబ్బాయి నా భుజాల హైటున్నాడు. మూడు సంవత్సరాలనడం నాకేం నచ్చడంలేదు" సీరియస్ గా అన్నాడు.
"మీ ఏజెంతండి?" అడిగింది అణుకువగా.
"నలభయ్యండి."
"అమితాబచ్చన్ వయసూ నలభయ్యే" తనని అమితాబ్ తో పోల్చేసరికి చాలా సంతృప్తి ఫీలయ్యాడు టి.టి.ఇ. "కాని అతని హైటు ఆరు నాలుగు మీ హైటు నాలుగు ఆరు!"
"అయితే?"
"మీరా హైటు లేరు కాబట్టి మీ వయస్సు నలభై కాకుండా పోదు కాబట్టి మా చిన్నికొండ పొడవెక్కువున్నాడు కాబట్టి ఆడి వయసు మూడేళ్ళు కాకుండా పోదు."
"ఇలాంటి కంపేరిజన్లతో మీరు రైల్వేని మోసం చేయలేరు" ఇక 'మామూలు' కోసంగాక మామూలు డ్యూటీ నిర్వహిద్దామని రిసీట్ బుక్ తీశాడు.
"ఏంటదీ" గభాలున లాక్కుంది రిసీట్ పుస్తకాన్ని.
అక్కడ టి.టి.ఇ. చేసిన పొరపాటు ఆమె చూసి వెనక్కి యిచ్చేదాకా ఆగకుండా ఉక్రోషంగా ఆమెచేతిలోని పుస్తకాన్ని లాగేసుకుంటూ తనచేతిని ఆమెచేతికి అనుకోకుండా అయినా తాకించటం.