Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 24


    లోపలినుంచి శంకర్ బయటకు వచ్చాడు ఆమె కేకలు విని. పరిస్ధితి చూసి "అరెరె" అంటూ ఆడుర్దాపడుతూ ముందుకు వచ్చి తాను శేఖర్ ను క్రిందకు దింపటంలో సాయంచేశాడు. ఒకవైపు మాలతి అతని భుజాలక్రిందగా చేతులువేసి లోపలికి తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టారు. మాలతి పగర్చుతూ వెళ్ళి దాక్టరుగారికి ఫోన్ చేసింది.

    డాక్టర్ కృష్ణారావుగారు వచ్చి, పరీక్షచేసి ప్రస్తుతానికి ప్రమాదం తప్పిందనీ, ఆపరేషన్ పచ్చి ఆరకుండా శక్తికి మించి అలసట చెందటం ఈసారి జరిగితే ప్రమాదమనీ మరి కొన్నాళ్ళపాటు చాలా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం ఉందనీ హెచ్చరించి వెళ్ళిపోయాడు.

    ఓ గంతసేపుపోయాక శేఖర్ మెల్లగా కళ్ళువిప్పి "మాలతీ!" అని పిలిచాడు.

    ఆమె అతని తల దగ్గర కూర్చుని వుంది. అతను చూడకుండా కళ్ళు తుడుచుకుని చెప్పండి అన్నది.

    "నీకు కోపం వచ్చింది కదూ?"

    "లేదు. ఆనందంగా వున్నది."

    "అలా అనకు మాలతీ! నేను మామూలుమనిషినై పోయననుకున్నాను. ఇంత అల్పజీవిననుకోలేదు."

    "ఆరోగ్యం బాగుండకపోతే అల్పజీవి అవుతారా?"

    "ఊరుకోండి."

    "అన్నట్లు శంకర్ అన్నం తిన్నాడా?"

    "నాకు తెలీదు."

    "నువ్వు పెట్టకపోతే ఎలా తింటాడు మాలతీ! అతను మన అతిథి."

    "ఇదెక్కడి పీడా మనకు? ఇక్కడ్నుంచి పోకూడదు?" అనేసింది ఇహ కోపం అణచుకోలేక.

    "తప్పు మాలతీ! అతను గతిలేక మన ఇంట్లో వుండటంలేదు. నా కోరిక మన్నించి వుంటున్నాడు."

    అతన్తో ఎలా వాదించాలో తెలియక ఊరుకుంది.

    "వెళ్ళి అతనికి అన్నం పెట్టు మాలతీ!"

    "ఛీ ఛీ!" అనుకుంటూ లేచి నిలబడింది. లోపలకు వెళ్ళి డైనింగ్ టేబిల్ మీద గిన్నెలు కసిగాపెట్టి విసురుగా శంకర్ వున్న గదిలోకి వేల్లబోయేసరికి అదే సమయానికి అతనూ ఇవతలకి వచ్చాడు. మాలతి అతనితో ఢీ కొనబోయి తప్పుకుందామని వేగంగా ప్రక్కకి జరిగేసరికి కాలు బెణికి క్రిందపడబోయినట్లయి క్రింద పడబోయింది. "అయ్యో!" అని అతను పట్టుకోబోతే, "వదలండి" అని అతన్ని విదిలించుకుని దూరంగా జరిగింది.

    జరిగినదాన్ని గురించి చర్చించడం ఇష్టంలేనట్లు ఒకరు, ఏవేవో భావాల్తో ఒకరూ, అసహ్యంగా ఒకరూ ఇద్దరూ మౌనంగా వుండిపోయారు.

    ఒక్కక్షణం అలావుండి "అన్నంపెట్టాను, వెళ్ళి తినండి" అని అక్కడ్నుంచి విసురుగా వెళ్ళిపోయింది.

    ఆరోజునుండి శంకర్ తో పరోక్షంగా కూడా మాట్లాడటం మానేసింది. అతను అటునుంచి వస్తే, తాను ఇటునుంచి వెళుతుంది. అతను పలకరించబోతే చేతిలో వున్న పుస్తకమో, ఏదో వస్తువు నేలమీద గిరాటువేసి సర్రున అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అతన్ని అవమానిస్తే అక్కడ్నుంచి వెళ్ళిపోతాడని ఆమె ఉద్దేశం.

    ఒక్కోసారి ఒళ్ళు తెలియని కోపం వస్తుంది. అతన్ని నానామాటలూ అని అక్కడ్నుంచి గెంటెయ్యాలనిపిస్తుంది.  మళ్ళీ అంతలోనే ఏడుపొస్తుంది. పిచ్చిదానిలా గదులన్నీ కలియతిరుగుతుంది.                 

    "నాకు జీవితంలో శత్రువులు లేరనుకున్నాను కానీ నువ్వు నా శత్రువు" అని మూగగా వాపోయింది.

    ఆమెకేం చెయ్యాలో పాలుపోవటంలేదు. ఇటు శేఖర్ తనకు దగ్గర కాలేకపోతున్నాడు,అటు శంకర్ శేఖర్ కి దగ్గరవుతున్నాడు.

                                                 * * *

    ఆరోజు........

    ఎప్పటిలాగే అమాయకంగా తెల్లవారింది. కానీ అలా స్వచ్ఛమైన వెలుగులో విచ్చుకున్న రోజులుకుడా భయంకరమైన చీకటిలో సమాప్తమవుతాయని మాలతికి తెలీదు.

    ఆ రోజు -

    సాయంత్రందాకా ఏ సంఘటనా జరగలేదు. అలవాటయిన స్వాభావికంగా గంటలు గడిచిపోయాయి.

    ఆ రోజు......

    చీకటిపడిన వేళకు తనకు పని వున్నదని, ఏ రాత్రికో ఆలస్యంగా వస్తానని చెప్పి శంకర్ బయటకు వెళ్ళిపోయాడు.

    శుక్రవారం కావటంచేత అలవాటు ప్రకారం సాయంత్రమే తలంటు పోసుకుని మాలతి సమీపంలోని అమ్మవారి గుడికి వెళ్ళివచ్చింది.

    ప్రసాదం తీసుకుని గదిలోకి వస్తున్న మాలతిని చూసి శేఖర్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు.

    ప్రసాదం అందుకుంటూ ఆమె చేతులుకుడా అందుకున్నాడు.

    "వదలండి" అని మాలతి దూరంగా జరగబోయింది.

    "వదలను" అని ఆమెను చేతుల్తో చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు.

    ఆమె మృదువుగా నవ్వి "అదిగో మాట తప్పుతున్నారు" అని దూరంగా జరగబోయింది.

    ఆమెను మరింత గట్టిగా బంధించి అన్నాడు "నేనీవేళ మొండివాడ్ని"

    "బ్రతిమాలుతాను."

    "మా బాబుగా!"

    "బంగారు తల్లివిగా."

    "నా మాట వినండి."

    "అబ్బ! నువ్వు నా మాట విను,"

    "ఏమిటండీ ఇది?"

    "నన్నర్ధం చేసుకోవూ? ఇహ నే భరించలేను"

    "ప్లీజ్!"

    "ప్లీజ్!"

    అతని పెదవులు ఆమె పెదవుల దగ్గరగా వచ్చాయి.

    "గోపయ్య వస్తాడు."

    "నాకు తెలుసు. చెల్లిలికి జ్వరంగా వుందని, రేపటికిగానీ రానని వెళ్ళాడుగా!"                   

 Previous Page Next Page