ఎవరు?
ఎవరు?
ఎవరు?
ప్రవల్లిక కాదు, ఆ సమయంలో ఆమె తన కాళ్ళ దగ్గిర పడి వుంది. మరెవరు? తన వాళ్ళలోనే ఎవరో చేశారనడానికి ఆధారంలేదు. అయినా తనవారిలో అటువంటి వాళ్ళెవరూ లేరు, ఎవరికి లాభం అది? ఆ స్థానం ఎవరికి తెలిసింది?
పోలీసులకి కూడా కాదు. వాళ్ళయితే ఆధారాలతో సహా పట్టుకుని వుండేవారు. కనీసం ఆ ప్రయత్నం చేసి వుండేవారు. పేపర్లలో కూడా అది పోలీసుల పనిలాగా లేదు.
మయసభలో దుర్యోధనుడిలా కల్లోలంగా వుంది. అతడి స్థితి. ప్రవల్లికను కాళ్ళ దగ్గిర పడవేసుకుని తను విజయగర్వంతో నవ్వాడు. ఈ కోటి రూపాయల నష్టం గురించి చదివి ఆవిడకూడా అలాగే నవ్వుకుని వుంటుంది. ఐదో జోక్ లాగా ఆ విహారితో కలిసి ఆనందించి....
విహారి!!!
స్వామి ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి!
అవును- విహారి ఎందుకు కాకూడదు?
ఆలోచించే కొద్దీ అది ధృవపడుతూంది.
...తనే స్వయంగా నిర్ధారించుకోవాలని లేచాడు.
* * *
తాగిన టీ కప్పు బల్లమీద పెట్టి విహారి లేచాడు. ప్రతాపరావు షేక్ హాండిచ్చి "నేనే రేపు అయిదో తారీఖున మీ యింటికి వద్దామనుకుంటున్నాను" అన్నాడు.
"ష్యూర్, తప్పకరండి" అని ప్రవల్లికతో కలిసి బయటకు వచ్చాడు. వచ్చాక తనలో తను రెక్కలు కట్టుకు చూసుకుని "మైగాడ్-ద్వాదశి!!! ఆ రోజు నేను ఇంట్లో వుండనే" అన్నాడు కంగారుగా.
ఆమె నవ్వాపుకుని "ఏం చేస్తారు?" అంది.
అతడి ఇబ్బందిగా "అంతా అయ్యాక చెప్తాను. చాలా కష్టమైన పని" అన్నాడు.
"ఫర్వాలేదులెండి. మా నాన్నగారు వచ్చేది మీ అమ్మగార్ని కలుసుకోవడానికి" అంది.
అతడు మరింత ఆశ్చర్యంతో "...దేనికి" అన్నాడు.
ఆమె తడబడి "మీ తాతగారు, అమ్మగారు ఆయనకి తెలుసట" అంది.
"ఓహ్... అలాగా" అన్నాడు కారు దగ్గిరకి నడుస్తూ.
"గుడ్ నైట్."
"గుడ్ నైట్."
అతడు కారు స్టార్టు చేసి ముందుకు పోనిచ్చాడు. పదిగజాలు వెళ్ళాక వెనుకనుంచి వినపడింది. సన్నటి స్పష్టమైన స్వరం "కంగ్రాచ్యులేషన్స్" అని.
అతడు ఆదరిపడి వెనుదిరిగి చూపాడు.
"నా పేరు అనంతానంతస్వామి."
"మీరెవరు?"
"నేనెవరో తెలీదా?"
"బహుశా యిలా కార్ల దొంగతనాలు వగైరా చేస్తూ వుంటారనుకుంటాను."
"పిచ్చివాడా కావాలనుకుంటే యిలాటి కార్ల ఫ్యాక్టరీలు పది పెట్టగలను."
"మరి నా కార్లో వచ్చి కూర్చున్నారేమిటి?"
"హెచ్చరించి పోదామని వచ్చాను. అలాగే కంగ్రాట్స్ కూడా."
"దేనికి?"
"మిలటరీ వాన్ ని బ్లాస్ట్ చేసినందుకు."
"అదీ మీదేనన్నమాట."
"అయితే నువ్వేనన్నమాట."
"ఏమిటి, 'నేనే'-?"
"నువ్వేనన్నమాట ఆ ఎక్స్ ప్లోజివ్స్ ని బ్లాస్ట్ చేసింది, చీకట్లో బాణం వేశాను. సరీగ్గా తగిలింది."
"దీనికి చీకట్లో బాణం ఎందుకు? నన్నుడుగుతే నేనే చెప్పేవాణ్నిగా. నేనే చేసింది."
పక్కనుంచి మరో ఖరీదైన పొడవాటి కారొచ్చి ఆగింది.
"నీకు మావాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే అసలా సూర్యారావు సభలోనే నిన్ను చంపెయ్యాల్సింది. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి నిన్ను మరోసారి చంపొచ్చు. కానీ ఎందుకు చంపడంలేదో తెలుసా? ప్రతిపక్షం లేకపోతే పార్లమెంటు లేనట్టే- శత్రువులు లేకపోతే "గేమ్" లేదు. అందరూ నా భక్తులే అనుకో- నాకేం థ్రిల్ వుంటుంది? అందులోనూ నీలాంటి అల్పప్రాణులు శత్రువులైతే మరింత రంజుగా వుంటుంది. విజయం నిశ్చయమని తెలిసినప్పుడు ఆడే ఆటలా వుంటుంది". అంటూ క్రమంగా అతడి గొంతు సినికల్ గా మారింది. "ఈ దేశంలో రాజకీయ నాయకులు అందరూ నా భక్తులు. ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగమంతా నా మోచేతిక్రింద నీళ్ళు తాగుతూంది. చూశావా కోటి రూపాయలు నష్టం వచ్చినా నేనెంత మామూలుగా వున్నానో- అంత డబ్బుంది నా దగ్గిర! అంత బలం వుంది నా దగ్గిర! కావాలంటే నేను నిన్ను ఇప్పుడే చంపగలను. అయినా చంపాను. జీవహింస పాపం. అందుకే నేను ప్రజలు కొలిచే దేవుణ్ని అయ్యాను. క్షమించగల్గటం దైవత్వం. నేనే దేవుణ్ని!!! నేనే దేవుణ్ని!!!" అనుకుంటూ తన కారువైపు వెళుతున్న ఆ హిట్లర్ లాటి సినిక్ ణి కన్నార్పకుండా చూసాడు విహారి. ఆయన కారు కదలబోతూంటే ఏదో స్పురించినట్లు పరుగెత్తుకు వెళ్ళి "మీతో మరో రెండు నిముషాలు ఏకాంతంగా మాట్లాడవచ్చా స్వామీ" అన్నాడు నమ్రతగా. స్వామి సైగనందుకుని డ్రైవరు దిగాడు. విహారి కారు నడపడం ప్రారంభించాడు. విహారి కారుని వెనుకే తీసుకు వస్తున్నాడు డ్రైవరు. కానీ ఆ స్పీడు అందుకోలేక వదిలేసాడు.
"ఏమిటి చెప్పు-"
"మీరంతా గొప్పవాళ్ళు ఎలా అయ్యారు?"
"రాజకీయం, బలం, తెలివి- అంతా నా సొత్తే" నవ్వేడు.
"కానీ న్యాయం, చట్టం వగైరా ఉంటాయిగా స్వామీ!"
"ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు?"
"నేను మీలో చేరితే, ఏ విధంగా రక్షణ లభిస్తుందా అని".
"పిచ్చివాడా! అప్పుడు రక్షణ ప్రసక్తే లేదు."
"కానీ చట్టం?"
"సాక్ష్యం లేకుండా చట్టంలేదు."
విహారి చేతిలో కారు మరింతవేగం హెచ్చింది. నూరు కిలోమీటర్లు దాటింది. "ఏమిటిది?" అన్నాడు.
"మీలో చేరితే రక్షణ అవసరమే వుండదన్నారు. మరి ఇప్పుడు మీకే రక్షణ లేదే"
"ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?"
"మీరన్నది నిజమే. ప్రభుత్వం మీ క్రింద వుంది, రాజకీయ నాయకులు మీ భక్తులు. కానీ ప్రభుత్వాధికారులకు పదవి భద్రత ముఖ్యం. వాళ్ళు కొన్ని చట్రాల్లో, కొన్ని నిబంధనలకు లోబడి పనిచెయ్యాలి. ఉదాహరణకి కొన్నాళ్ళ క్రితం మీరో అమ్మాయి కార్లో ఎక్కారు. ఆమె మిమ్మల్ని ఏమీ చెయ్యలేక పోయింది. కారణం? ఆమె ప్రభుత్వాధికారి కనుక! నేనలా కాదు, నేను ప్రైవేటు మనిషిని- కేరిపిన్ లాటివాడిని. ఈ దేశపు సగటు మనిషిని. నన్ను మీరేం చేయలేరు. నేనే ఏమైనా చేయగలను."
"అంటే ... ఏం చేస్తావ్?" అనుమానంగా అడిగాడు.
"ప్రేమ- జాలి, దయా- దాక్షిణ్యం - ఇలాటివేమీ నాకు లేవు. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పిన పాఠం ప్రకారం, సాక్ష్యం లేకపోతే కేసులుకూడా లేవు. అదే మీ మీద ప్రయోగిద్దామనుకుంటున్నాను."
"నన్ను చంపుతావా?"
"చంపాను. మీలాటి అల్పప్రాణులు శత్రువులైతే పోరాటం భలే రంజుగా వుంటుంది, నాకు సరదా చెలగాటం. మీకేమో బ్రతుక్కీ చావుకీ మధ్య అంతిమ పోరాటం."
"నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"
"ఈ దేశపు అత్యంత క్రూరమయిన వ్యక్తితో. ఈ దేశానికి త్వరలో సార్వభౌముడు అవ్వాలనుకుంటున్న మహిమాన్వితుడితో. ప్రస్తుతం నాతోపాటూ- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న వ్యక్తితో. అనంతానంతస్వామీ! అనవసరంగా నాతో పెట్టుకున్నారు మీరు. ఫలితం అనుభవించక తప్పదు" అంటూ కారు ఆపాడు. పక్కకి తిరిగి, తనవేపే చూస్తున్న స్వామి నెత్తిమీద బలంగా ఒక్క జెల్ల ఇచ్చి "సభలో నాకు అవమానం చేయించినందుకు, దీనికి సాక్ష్యం లేదు" అన్నాడు. చిన్న శిఖరం మీద వుంది కారు. క్రింద నగరంలో దీపాలు కనపడుతున్నాయి.
స్వామి మొహం ఎర్రబడింది. అట్నుంచి దిగబోయాడు. ఈసారి అటొచ్చి చెంప అదిరేలా కొట్టాడు, "ఇది పిల్లవాడ్ని చంపినందుకు... దీనికి సాక్ష్యం లేదు!"
స్వామి సీట్లో వెల్లకిలా పడ్డాడు. విహారి కారు డోర్ వేసేశాడు, "మీ నాలుగో స్తంభం ఎవరు? సామాన్యుడా? ఈ దేశపు సామాన్యుడు అంత తెలివి తక్కువ వాడు కాడు స్వామీ! అంత పిరికివాడు కూడా కాడు. అదేమిటో మీ ముందే నిరూపించానిప్పుడు! ఈ దేశపు పౌరులు 'మనిషి'గా బ్రతకడం కోసం మీలాంటి దుర్మార్గుల్ని సహనంతో భరిస్తారు. పాపం బ్రద్ధలవుతే... ఇదిగో ఇలా తయారు అవుతుంది మీ పరిస్థితి." అంటూ కారుని కాస్త ముందుకి తోసాడు.
కారు లోయలోకి జారడం ప్రారంభించింది, స్వామి లోపల్నుంచి అరుస్తున్నాడు.
కారు రాళ్ళకి కొట్టుకుని పక్కకి తిరిగి, మళ్ళీ జారడం ప్రారంభించింది. విహారి ఎలుగెత్తి అన్నాడు. "పది కార్ల ఫ్యాక్టరీలు పెట్టగలరు కదా స్వామి మీరు. బ్రతికుంటే కొత్తకారు కొనుక్కోండి, బెస్టాఫ్ లక్."
కారు మరింత క్రిందకు జారింది. క్రిందంతా బురద ఊబిలా వుంది,
విహారి కొండమీద అలాగే నిలబడి, జారే కారుని చూస్తూ జేబులోంచి సిగరెట తీసుకుని కామ్ గా వెలిగించుకున్నాడు. అగ్గిపుల్ల క్రిందకి విసిరేసి, చేతులు రెండూ పాంటు జేబుల్లో పెట్టుకుని అక్కడనుంచి వెనుదిరిగి, తాపీగా నగరం వేపు నడవడం ప్రారంభించాడు.
బురదలోంచి ముందు బుడగలు బయటకొచ్చాయి. అరనిమిషం తరువాత అతికష్టంమీద స్వామి అందులోంచి బయటకు వచ్చాడు. ముందు అతడి తల వచ్చింది. దానిమీద నుంచి క్రిందకు బురద కారుతోంది. ఇనుప అచ్చులోంచి బయటకు వచ్చిన ఆకారంలా వుంది.
ఆ తరువాత అతడి మొహం బయటకు వచ్చింది. ప్రతిపక్ష రణరక్ష వక్ష విచ్చేదనా దక్షతవల్ల వచ్చిన అరుణిమతో అది ఉగ్రరూపం దాల్చి వుంది. ఆ నిశ్శబ్దపు లోయలో అతడి గొంతు ప్రతిధ్వనించింది.
"విహారీ! ఇంతవరకూ ఈ అనంతానంతస్వామితో ఎవరూ ఈ రకంగా చేయి కలుపలేదు. నేనేం చేస్తానో... ఏం చేయగలనో నీకు చేసి చూపిస్తాను. నరకం అంటే ఎలా వుంటుందో భూమ్మీదే రుచి చూపిస్తాను."
స్వామి మీద విహారి దెబ్బ తీసిన రాత్రినుంచి, స్వామి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పెట్టిన ముహూర్తం రోజు సరీగ్గా పదిహేను దినాల దూరంలో వుంది.
ఆ అరాచకాలకి స్వామి దాదాపు పది చోట్లు ఎన్నుకున్నాడు. కాశీ, హరిద్వార్, రామేశ్వరం, తిరుపతి లాటి ప్రదేశాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ తో ఆ రోజు ఈ ఘాతుక చర్యలకి ప్రారంభోత్సవం జరుగుతుంది.
ముందు కాశీలో చిన్న గొడవ జరిగి, ఒక మతం ప్రజలు ఊచకోత కోయబడతారు. ఆ వార్త పేపర్లో మరుసటిరోజు వస్తుంది. అది వచ్చిన కొన్ని గంటల్లోగా మిగతా తొమ్మిది పట్టణాల్లో కూడా గొడవలు జరుగుతాయి. చిత్రంగా, ఆ గొడవల్లో కూడా అదే మతస్థులు దెబ్బతింటారు.