"విహారికి తండ్రి లేడట నాన్నా, చిన్నప్పుడే పోయారట. తల్లిగారున్నారు. అతని తాతగారు రాజా నరేంద్రవర్మ అని చెప్పాడు."
"ఓహ్- ఆయన మనవడా! అయితే నాకు బాగా తెలుసు."
ప్రవల్లిక తండ్రివైపు చూసింది.
"ఆ రోజుల్లోనే కోటీశ్వరుడాయన. ఎన్నో గుప్త దానాలు చేసేవాడు. నా చదువు ఆయన చలవే. నన్ను సైన్యంలో చేరమని ప్రోత్సహించింది కూడా ఆయనే" అన్నాడు ప్రతాపరావు. "...అయితే ఆయన దురదృష్టవంతుడు. ఉన్న ఒక్కగానొక్కకూతురు ఎవరో లాయర్ని చేసుకుంది. ఇద్దర్నీ ఇంట్లోంచి తరిమేశాడు. ఆ చెట్టుక్రింద లాయరు కేవలం డబ్బుకోసమే తన కూతుర్ని వలవేసి పట్టుకున్నాడని ఆయన ధృడమైన అభిప్రాయం. ఇద్దరూ విడిగా కాపురం పెట్టారు. వర్ధనమ్మ భర్తని నేను చూశాను. చాలా తెలివితేటలున్న మనిషిలా కనిపించాడు కానీ ఆ ముసలాయన అభిప్రాయం కరెక్టేమో అనిపించేటంత "క్రుకెడ్ నెస్' కూడా కనపడింది. ఏది ఏమయినా ఈ ముసలాయన పట్టువదల్లేదు. రెండు సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డారు. ఎక్కడున్నారో తెలీదు. ఎలా బ్రతికారో తెలీదు. ఆ లాయర్ చనిపోయినట్టు ఒకరోజు టెలిగ్రాం వచ్చింది, ఈయన వెళ్ళి కూతుర్ని తెచ్చుకున్నాడు. ఆమె కొడుకన్నమాట విహారి."
ప్రవల్లిక వింటోంది. తన వూహ కరెక్టయినందుకు ఆమె మనసులో సంతోషించింది. పైకి ఎంత మామూలుగా కనిపించినా విహారిలో కొన్ని అద్భుతమయిన గుణాలున్నాయని ఆమె మొదట్లోనే గ్రహించింది. అందుకే అంత పెద్ద పొజిషన్ లో వుండికూడా రెండు మూడు పరిచయాల్లోనే అతడిని అభిమానించటం మొదలు పెట్టింది. అతడికి నిశ్చయంగా తండ్రి తెలివితేటలు వచ్చి వుంటాయని అనుకుంది. అతడి తండ్రి 'క్రూక్' అని తండ్రి అనటం ఆమెకు నచ్చలేదు. ఒక్క చూపులోనే ఎవరు క్రూకో తెలుసుకోగలిగితే, ఇంత పెద్ద సి.బి.ఐ. డిపార్ట్ మెంట్ దేనికి? తను ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయినందుకు అలా అనుకుని వుంటారు. అయినా మరణించినవాడి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఆలోచించకూడదు.
"ఆ అబ్బాయితో మాట్లాడతాను" అన్న తండ్రి మాటలకి తెప్పరిల్లి తటపటాయిస్తూ "విహారి తల్లితో మాట్లాడితే బావుంటుందేమో నాన్నా!" అంది.
"అంటే... అబ్బాయితో నువ్వు చెప్పేశావా?"
ఆమె మరింత ఇరుకున పడి, "చెప్పలేదనుకో, ఈ రోజే చెపుతాను. కానీ పెద్దవాళ్ల ద్వారా సంప్రదిస్తే ఆవిడకీ గౌరవం ఇచ్చినట్టుంటుంది కదా!" అంది.
"అవునవును. అదే మంచిది. నాల్గయిదు రోజుల్లో వెళతాను మంచి రోజు చూసుకుని" అంటూ కాలెండర్ వైపు వెళ్ళాడు.
"నువ్వు వెళతావా" అంది సందేహంగా.
ఆయన నవ్వేడు. "ఆడపిల్ల తండ్రిలా నేను వెళితేనే మంచిదమ్మా! కాళ్ళు కడగటం ధర్మం కదా."
ఆమెకీ టాపిక్ నచ్చక మాటమారుస్తూ, "సైన్యంలో పనిచేసే వాళ్ళకి మంచి ముహూర్తం ఏమిటి నాన్నా" అంది.
"అదేమిటమ్మా! మాలో కొందరు శత్రు స్థావరం మీద అటాక్ చెయ్యటానికి కూడా మంచి ముహూర్తం ఏదా అని చాటుగా పంచాంగం చూసుకునేవాళ్ళు తెలుసా" అని, కాలెండర్ చూస్తూ, "ఆఁ ఇదిగో ఈ ద్వాదశి మంచిది. ఆ రోజు వెళతాను" అన్నాడు.
ఆమె నవ్వేసి అక్కడనుంచి వెళ్ళిపోబోయింది.
"ఆ అబ్బాయికి ఇంతవరకూ చెప్పకపోతే, ముందొకసారి చెప్పటం మంచిదమ్మా. తీరా తల్లిని అడిగిన తరువాత కొడుకు అభ్యంతరం చెపితే కష్టం" అన్నాడు.
"ఆ విషయం నేను చూసుకుంటాన్లే" అని ఆమె కాసింత సిగ్గుతో వడివడిగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళిన వైపే ఆయన చూస్తూ వుండిపోయాడు. ఆడవాళ్ళకి తెలివితేటలు, ధైర్య సాహసాలు ఆభరణాలు అయితే అయివుండవచ్చు. కానీ, 'స్త్రీత్వం' అన్నిటికన్నా పెద్ద అలంకారం.
అక్కణ్ణుంచి లోపలికి వెళ్ళిన ప్రవల్లిక ముందు గదిలోకి తొంగిచూసింది. తండ్రి దూరంగా ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఫోన్ ఎత్తి విహారికి డయల్ చేసింది. ఆమె పెదాలమీద నవ్వు కదుల్తోంది.
అట్నుంచి విహారి కంఠం వినపడగానే "... ఐ లవ్ యూ" అంది గుసగుసగా.
"ఫోన్ లో కాదు. ఎదురుగా నిలబడి నీతో ఆ మాట అనిపిస్తాననీ - అదీ నేను సవాల్ చేసింది" అన్నాడు.
"సవాలా... సవాలేమిటి?"
"ఏమీ తెలియనట్టు నటించకు. ఎదురుగా నిలబడి 'నాకు భయం పోయింది విహారి. ఐ లవ్యూ విహారి' - అంటేనే వప్పుకునేది."
"మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయెవరూ ఎంతో పరిచయం పెరిగితేకానీ ఆ మాట అనదు. కావాలంటే మొదటిరోజు పాలగ్లాసు అందిస్తూ అంటాలే!"
విహారి కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి నిలబడి ... "ఏమిటీ- పెళ్ళి వరకూ వచ్చేశావా?" అన్నాడు.
"నేను రావటం లేదు. ఆడపెళ్ళివారం కదా పెద్దలు వస్తారు" అని ఫోన్ పెట్టేసింది.
* * *
గుళ్ళో విగ్రహం ముందు ప్రమిదలో ద్వీపం ఉజ్జలంగా వెలుగుతోంది. పూజారి కంఠం నెమ్మదిగా మంత్రాలు గొణుగుతోంది. సునాదమాల రెండు చేతులూ జోడించి, దాదాపు రెండు నిమిషాల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్దిస్తూంది.
క్రితం రాత్రి అద్దంలో చూసుకుంటే ఆమె బుగ్గమీద చిన్న మొటిమ కనిపించింది. ఆమెకు తన కల గుర్తుకొచ్చింది. భూమిలోంచి చెట్టు మొలిచేటప్పుడు ముందు అలాగే ఉబ్బుతుంది.
భయంతో రాత్రంతా నిద్రపట్టలేదు.
ప్రొద్దున్నే గుడికొచ్చింది. ఇక ఏడుపొక్కటే తరువాయి. తెల్లవారు ఝామునుంచీ హనుమాన్ చాలీసా చదువుతూనే వుంది.
"ప్రసాదం తీసుకో అమ్మా?"
పూజారి అందించిన ప్రసాదం తీసుకుని చివరిసారిగా భగవంతుని ప్రార్ధించింది. "భగవంతుడా నా బుగ్గని మళ్ళీ మామూలుగా చెయ్యి."
ఆమె బయటికి వచ్చి గుడి మెట్లమీద కూర్చుంది. అప్పుడు వినిపించింది వెనుకనుంచి. "పందెం కట్టగానే బెదిరిపోయి- ఫోన్ లో చెప్పేసేవేమిటి?"
ఆమె చేతిలో కొబ్బరిచిప్ప చెదిరి మెట్లమీద పెద్ద శబ్దంతో దొర్లుకుంటూ పడిపోయింది. ఆమె బిర్రున బిగుసుకు పోయింది. విహారి చొరవగా వచ్చి పక్కన కూర్చున్నాడు.
"నేనన్నది...నీతో స్వయంగా 'ఐ లవ్యూ' అనిపిస్తానని. అంతేగాని ఫోన్ లో కాదు."
ఆమె ధైర్యం తెచ్చుకుంది. గుళ్ళో హనుమంతుడు ఆమెకి ధైర్యం చెపుతున్నట్టు కనిపించాడు. "నేను ఆ మాట అనలేదు. అనను కూడా" అంది.
విహారికి ఇరిటేషన్ కలిగింది. కోపాన్ని అతికష్టంమీద అణచుకున్నాడు. ఈ అమ్మాయి ముందు తను ప్రతిసారీ ఓడిపోతున్నాడు. తన ట్రూప్ లో ఇలాంటి అమ్మాయుంటే- లేదా చిత్రరంగంలో వుంటే ఈ పాటికి ఇండియా నెంబర్ వన్ అయ్యేది.
అతడికి ఆశ్చర్యం కూడా కలిగింది. "నీతో ఐ లవ్యూ అనిపిస్తాను" అని తను ఛాలెంజ్ చేశాడు. కవ్వించినట్టు అదే మాట ఫోన్ లో అంది, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. ఆ కంఠంలోగానీ, ఆ కళ్ళలోగానీ ఎక్కడా లీలా మాత్రమైన చిరునవ్వేగానీ, 'సర్లే, నన్ను కనుక్కున్నావ్ కదా! ఇకనుంచి మనిద్దరం ఒక జట్టు' అన్న భావంగానీ లేదు.
అతడికీ మతిపోతూంది. అంతేకాదు, దాంతోపాటు పంతం కూడా హెచ్చుతూంది. ఆ అమ్మాయిని నాలుగు తన్ని అయినా సరే 'బాబోయ్ నిజం చెపుతాను' అనిపించాలనిపిస్తూంది. కాని అంతకన్నా నిజమయిన ఓటమి మరొకటి వుండదు. ఇంతలా తనని ఏడిపిస్తున్న అమ్మాయిని అంతే తెలివితేటలతో గెలవాలి.
"ఓ.కే. మాలా! నీతోనే పాలగ్లాసు అందుకుంటాను. అప్పుడే ఆ మాట అంటాను."
తలతిప్పి గుడి లోపలికి చూసింది సునాదమాల.
ఆంజనేయస్వామి ధైర్యం చెపుతున్నట్టు కనిపించాడు. "పాలగ్లాసు కాదు గదా- మంచినీళ్ళ గ్లాసు కూడా ఇవ్వను" అంది. ఆమె జీవితంలో అలాటి మాట మాట్లాడటం అదే మొదటిసారి.
"రేపు సంబంధం మాట్లాడటానికి మీ బామ్మ వచ్చినప్పుడు అదే చెపుతాను. ఆడపెళ్ళి వాళ్ళ తరపున పెళ్ళికూతురు నీళ్ళగ్లాసు అందించడం మా ఆచారమని! అప్పుడేం చేస్తావు?"
ఆమె లేచి నిలబడి "అదే నీళ్లగ్లాసులో కాస్త విషం పోసుకుని తాగుతాను" అంది.
అతడూ లేచి నిలబడి "నేను చాలా తెలివితక్కువ వాడిననీ, కనీసం ఒకసారయినా రెడ్ హాండెడ్ గా పట్టుకోలేకపోయాననీ నీ నమ్మకం కదూ నిజమే! తెలివితేటలు నిరూపించుకోవలసిన బాధ్యత నా మీద కూడా వుంది! నీతో సమానమైన తెలివితేటలు నాకూ వున్నాయనీ, నీకు నేను తగిన జోడీనని నిరూపిస్తాను. సరిగ్గా రోజు కూడా చెపుతాను విను. వచ్చే ద్వాదశినాడు నీ పాణిగ్రహణం చేస్తాను. నా చేతిలో చెయ్యివేసి ఆ విషయం వప్పుకునేలా చేస్తాను. అలా చెయ్యలేకపోతే ఇక నీ మొహం చూడను. నేను నీ అంత తెలివితేటలు లేనివాడినని, నీకు మొగుడిగా తగనని అనుకుని తప్పుకుంటాను సరేనా..." అన్నాడు కళ్ళు మూసుకుని.
"వచ్చే ద్వాదశినాడా..."
"అవును" కళ్ళు మూసుకునే సమాధాన మిచ్చాడు.
"చాలా ఆలస్యమేమో, కాస్త ముందు కొచ్చెయ్యకూడదు?"
విహారి అదిరిపడి కళ్ళు తెరిచాడు. సునాదమాల ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు, విష్ణు వున్నాడు అక్కడ.
"నిజం బాబాయ్. ద్వాదశివరకూ ఎందుకూ? ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు."
"అయితే మొత్తం విషయం అంతా నీకు తెలిసిపోయిందా?
"కిడ్నాపర్స్ దగ్గిర అంటీతో మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోయింది."
"లాభంలేదు. మీ ఆంటీ కొయ్యగుర్రం, లక్కపిడత, ఇనుప పెనం."
"కొత్తరకం తిట్లు బాగానే వున్నాయ్ గానీ, అసలు విషయం సాధించడం ఎలాగో అది ఆలోచించారా అబ్బీ."
మళ్ళీ అదిరిపడ్డాడు విహారి. అయితే ఆ మాటలన్నది బామ్మ. గన్నేరు చెట్టు మాటునుంచి బామ్మ వచ్చింది. "వచ్చే ద్వాదశి గడువు పెట్టావ్ బాగానే వుంది. కానీ నా మనవరాల్ని పది శతాబ్దాలు దాటినా మార్చడం కష్టమని నా ఉద్దేశ్యం. ఆ అమ్మాయిని గెలవాలంటే సెంటిమెంటు మీద ప్లే చెయ్యాలి."
"అంటే ఏం చెయ్యాలి?"
"నేను చెపుతాను. రేపు రా ఇంటికి."
విహారి సందిగ్ధంగా, "ఆ ప్లాను తప్పక ఫలిస్తుందా బామ్మగారూ!"
"తిరుగులేదు."
"ఏమిటంత ధీమా? ఎలా చెప్పగలుగుతున్నారు?"
"సునాదమాల తాతగారి మీద నేనదే ప్లే చేశాను కాబట్టి."
* * *
అనంతానంతస్వామి మొహం పశ్చిమ కొండల్లోకి జారుతున్న సూర్యుడి ఎరుపుదనాన్ని సంతరించుకుంది. అతడు అంత ఆవేశం ఎప్పుడూ పొందలేదు. కోటి రూపాయల విలువగల ఆయుధాలు, వాటితో పాటు పోయిన కష్టమరు-
ఇవి కావు అతడికి కోపం తెప్పించినవి!
ఎవరో సాబొటేజ్ చేసి, ఈ నష్టం కలిగించారు. తనని తేలుకుట్టిన దొంగని చేశారు.