Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 26


    అదే రోజు సాయంత్రం స్వామి ప్రాయోపదేశ దీక్షా ప్రవేశం చేస్తాడు.

    మన దేశంలో మనకే భద్రతలేదు. పరిస్థితి ఇప్పుడే ఇలావుంటే కుటుంబ నియంత్రణ వల్ల మనం మరింత తగ్గిపోతే, భవిష్యత్తులో మన పరిస్థితి ఏమిటి? మన జాతిని రక్షించుకోవటం కోసం నేను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నాను.

    దాదాపు కోటి రూపాయల విలువగల స్వామి షేర్లు దేశంలోని వివిధ అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికల్లో వున్నాయి. కేవలం ముందుచూపుతో చేసిన ఇన్వెస్టుమెంట్ ఇది! ఆ పత్రికలు చాలా జాగ్రత్తగా సంపాదకీయాలు వ్రాస్తాయి.

    "మన దేశం ఒక చెత్తకుండీ లాంటిది! క్రికెట్ లో పాకిస్తాన్ ఓడిపోతే మన దేశంలో గొడవలు జరిగాయి. ఇండియా ఓడిపోతే బాణాసంచా పేల్చారు. ఈ దేశంలో ఈ దేశస్థుడిగా పుట్టటం కంటే మరో దేశంలో కొజ్జావాడిలా పుట్టటం మంచిది."

    ఈ సంపాదకీయం వ్రాసిన ఎడిటర్ ని పోలీసులు అరెస్టు చేస్తారు. (చేయకపోతే స్వామే చేయిస్తాడు) అంతే. ఈ వార్త దావానలంలా పాకుతుంది, మరింత అరాచకం సృష్టించబడుతుంది.

    ఇక్కడొక్కవిషయం గమనించాలి, పైన చెప్పినవన్నీ వాస్తవాలే! ప్రతి మనిషి గుండెల్లోనూ కాస్తో కూస్తో మండుతున్నవే. స్వామి వాటిల్లో మరికాస్త ఆజ్యం పోస్తాడంతే. తరువాత కాష్టం దానంతట అదే తగలబడుతుంది, మిగతా సమస్యల్లా కాకుండా ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినది కాబట్టి వేగం పుంజుకోవడానికి రోజులు చాలు.

    జాతి కోసం, మతం కోసం త్యాగం చేస్తున్న స్వామి అంటే సానుభూతి పెరగక ఛస్తుందా? అక్కణ్నుంచి అంచెలంచెలుగా జరిగే విషయాలన్నిటినీ స్వామి కుడి భుజమైన లాయర్ పరమేశ్వరం నిర్వహిస్తాడు. అరాచకం సంగతి రామ్ లాల్ చూసుకుంటాడు.

    పోతే ఈ కార్యక్రమంలో సూర్యారావు ప్రధాన పాత్ర నిర్వహిస్తాడు. వైకుంఠపాళిలో పావుని కదిపినట్టు స్వామి అతడిని ఆపాటికే రాజకీయ భవంతిలో పై మెట్టు మీదకు చేర్చాడు.

    సెంట్రల్ మినిష్టర్ గా అతడు రాబోయే వారం పదిరోజుల్లో జపాన్ తో ఒక అగ్రిమెంటు సంతకం చేయబోతున్నాడు. భారతదేశపు బాలల కోసం జపాన్ పదికోట్ల విలువగల బొమ్మలు, ఆట వస్తువులు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సామానులు పంపుతోంది, స్వామి తాలూకు అంగవైకల్య ట్రస్టు, బాలానంద పరిషత్ లకు వీటిని ఉచిత బహుమతిగా జపాన్ పంపుతోంది, అంతవరకూ సజావుగా పేపరు మీద వుంటుంది. వెనుక భాగోతం మరింత గొప్ప ఆర్గనైజ్డ్ క్రైమ్.

    జపాన్ కి సంబంధించిన 'క్రి-టట్టూ' అనే ప్రసిద్ధమైన మాఫియా, ఈ 'రవాణా'ని కంట్రోలు చేస్తుంది, (జపాన్ లో మాఫియా ఎంత బలమైనదో 'మరణమృదంగం'లో వివరించబడింది.) షిప్ కెప్టెన్ ఈ మాఫియా ఆజ్ఞలకి లోబడి పనిచేస్తాడు. జపాన్ నుంచి వచ్చే మార్గమధ్యంలో గోల్డెన్ ఐలెండ్స్ దగ్గిర వస్తు మార్పిడి జరుగుతుంది. ఆ దీవిలో తయారయిన మారణాయుధాలు ఈ ఓడలోకి ఎక్కించబడతాయి. ఒక్కసారి భారత సముద్ర జలాల్లోకి షిప్ ప్రవేశించాక మిగతా విషయాలు రామ్ లాల్ చూసుకుంటాడు.

    స్వామి పెట్టిన ముహూర్తానికి నాలుగు రోజుల ముందు ఇది జరుగుతుంది. తూర్పుకొస్తా ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ఆయుధాల్ని స్వామి తాలూకు "అంగవైకల్యం అంబులెన్స్" తీసుకు వెళ్తాయి. పిల్లల ఆటవస్తువులు- గిఫ్ట్ ఫ్రమ్ జపాన్ కాబట్టి - పైగా మంత్రి సంతకమున్న పేపర్లు కాబట్టి వీటిమీద నిఘా వుండదు.

    అరాచకాలు ప్రారంభమైన అయిదారు రోజుల్లో శరణార్ధుల వలస మొదలవుతుంది. పక్కదేశానికి ఇది సమస్య అవటంతో ఐ.రా.స. దీనిలో తలదూర్చక తప్పదు. జాతీయ సమస్య అంతర్జాతీయ సమస్య అవుతుంది. ప్రభుత్వం మీద వత్తిడి వస్తుంది. సరీగ్గా ఇదే సమయానికి యుద్ధం ప్రారంభమయ్యే స్థితి ఏర్పడుతుంది. ఒక దేశపు అంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం కల్గించుకోవడం అన్నది కేవలం 'శరణార్ధుల' వల్లే కాబట్టి - ప్రపంచ సానుభూతి భారతదేశం మీద వుండదు. ప్రభుత్వానికి దేశం బయటనుంచీ, లోపలనుంచీ ఈ విధమైన వత్తిడి ఎక్కువ అవుతుంది. సరీగ్గా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఒక అగ్రరాజ్యం దీన్ని గుర్తించటంతో నలభై సంవత్సరాల భారతదేశపు సెక్యూలరిజం కూలిపోతుంది.

    గ్రేటెస్ట్ క్రిమినల్ లాయర్ ఆఫ్ ఇండియా పరమేశ్వరం అద్భుతమైన ఆలోచనతో స్వామి వేసిన ఈ ప్లాన్ ఇక్కడివరకూ సజావుగానే జరుగుతూ వచ్చింది. ఇంకా పదిహేను రోజుల్లో పూర్తవుతుంది కూడా! దీనికి అడ్డుపడేది ప్రవల్లిక- విహారి లాటివాళ్ళు అయితే వాళ్ళందరూ బియ్యంలో రాళ్ళలాంటివారు. స్వామి తల్చుకుంటే నిమిషంలో ఏరిపారేయగలడు. ప్రవల్లిక గురించి అతడెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు, ఇదిగో ఇప్పుడు - విహారి గురించే అతడు ఇరిటేటెడ్ గా వున్నాడు. ఆ చిన్న కుర్రవాడు తనమీద సాధించిన విజయం అతడి కాలు నిలువనీయడం లేదు.

    మనిషి 'ఈగో' అన్నది అన్నిటికన్నా పెద్ద సమస్య. దుర్యోధనుడు నుంచి క్లియోపాత్ర వరకు ఎంత గొప్ప రాజనీతిజ్ఞులయినా, తమ అహాన్ని దెబ్బతీసే విషయాల్లో సహనాన్ని ప్రదర్శించని చోటే దెబ్బతిన్నారు. అహం దెబ్బతిన్నప్పుడు కూడా మామూలుగా వుండగలగడం గొప్ప రాజనీతిజ్ఞతకు చిహ్నం. ఆ లౌక్యం (క్షమించాలి. దీన్ని లౌక్యం అనకూడదు) దాదాపు ఎవరికీ వుండదు. ఉన్నా దానికి ప్రజలు 'ఓటమి' అని పేరు పెడతారని కాబోలు ఈ రాజనీతిజ్ఞులు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు.

    విహారి విషయం స్వామి పట్టించుకోకపోయివుంటే ఈ కథ ఇక్కడితో ఆగిపోయి వుండేదేమో, కానీ విహారి- అనంతానంతస్వామి మనసు పొరల్లో అతి సున్నితమైన చోట దెబ్బకొట్టాడు. ఇటువంటి విషయాల్లో తీసుకొనే చర్యలకి లాజిక్ లుండవు.

    మరో నెల- రెండు నెలల్లో భారతదేశపు సార్వభౌమత్వానికి వ్యూహం పన్నుతున్న స్వామి గుండెల్లో ఆ ఆలోచనలకన్నా ప్రస్తుతం విహారే ఎక్కువ చోటు చేసుకున్నాడంటే, ఈ ఒక్క సంఘటన చాలు- పై విషయాన్ని నిరూపించటానికి.


                       *    *    *


    జరిగినదంతా చెప్పగానే ప్రవల్లిక షాక్ అయింది. కొంచెంసేపు నోటమాట రాక, విహారినే స్తబ్దంగా చూస్తూ వుండిపోయింది. మెదడు ఆలోచించటం మానేసింది.

    ఈ యువకుడు స్వామిని బురదలో ముంచేశాడు. స్వామిని బురదలో ముం...చే....శా....డు!!! ఆమె కళ్ళప్పగించి అలానే చూస్తూ వుండిపోయింది. వెన్నులో సన్నటి జలదరింపు. మరోవైపు పెల్లుబికే ఆనందం. తన ముందు నిలబడ్డ విహారి ఎంతో ఎదిగిపోయినట్టు కనిపించాడు. ఎవరూ సాధించలేనిది ఈ సామాన్యుడు సాధించాడు, కానీ.... కానీ....

    ఎంతటి మహావృక్షమైనా పెను తుఫానుకి కూలిపోతుంది. ఈ విజయం కేవలం తాత్కాలికమేనని మనసు చెపుతోంది.

    "ఏమిటి? వినగానే అలా అయిపోయావు?" నవ్వుతూ అడిగాడు విహారి.

    ఆమె తెప్పరిల్లి "నేను నమ్మలేకపోతున్నాను" అంది.

    "నమ్మినా నమ్మకపోయినా జరిగిందది..."

    "నీకు అర్ధంకావటంలేదు విహారీ! స్వామి వూరుకోడు-"

    "ఏడిసేడు. ఏం చేస్తాడు? వాడిదీ ప్రాణమే. నాదీ ప్రాణమే. విషయం అంతవరకూ వస్తే అప్పుడు చూసుకుందాం-" నిర్లక్ష్యంగా అన్నాడు. "చూడు ప్రవల్లికా! మీ యంత్రాంగంలో వచ్చిన చిక్కే ఇది. ప్రతిదానికీ సాక్ష్యాలంటారు. ఆధారాలంటారు. నాకు అలాంటివి అవసరం లేదు కదా! వాడూ మనిషే. వాడికీ ప్రాణ భయం వుంటుంది. కాస్త భయపెట్టానంతే... 'నా జోలికి రాకు' అని చిన్న వార్నింగు. అంతే" అంటూ మళ్ళీ నవ్వేడు.

    "కానీ అతడి సంగతి నీకు తెలియటంలేదు విహారీ! ఇంత బలగంతో నేనే ఏమీ చేయలేకపోయాను. అతడెంత నరరూప రాక్షసుడో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను. కాబట్టి చెపుతున్నాను. తనకు కావలసిన దాన్ని ఎలాగయినా సాధించగలడు. అతడు ఎన్ని హత్యలు చేసయినా సరే, ఎంత రక్తం పారించయినా సరే... ఆ రోజు నేనింకా మర్చిపోలేను...!"

    "ఏమిటి నువ్వు చూసింది?"

    "దేశానికి నియంత కావాలన్న ఆ మత ప్రవక్త ఆలోచన ఇప్పటిది కాదు. దాదాపు పది సంవత్సరాలనుంచీ దీని గురించి బీజం నాటి నీరు పోస్తూనే వున్నాడు. అతడు ఈ మత ప్రచారకుడు కాకముందు కొంతకాలం సైన్యంలో కూడా పనిచేశాడనుకుంటాను. అందుకే అతడికి మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలుసు. యుద్ధం పూర్తయి నాన్న ఇంటికి వచ్చేశారు. నేనప్పటికి చిన్నపిల్లని. గ్రాడ్యుయేషన్ పూర్తయిందంతే.

    ఆ సెలవుల్లో అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయింది.

    మరుసటిరోజు పెళ్ళనగా అన్నయ్య, నాన్న రహస్యంగా మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏదో మిలటరీ కుంభకోణాన్ని నాన్న ఆధారాలతో సహా పట్టుకున్నాడు. దానికి సాక్ష్యాలున్నాయి. అవి బయటికి వస్తే కొందరు రాజకీయ నాయకుల జీవితాలు తలక్రిందులై పోతాయి. యాభై కోట్ల రూపాయల డీల్ పదికోట్ల లంచంతో చేతులు మారింది.

    సరిగ్గా ఆ సమయంలో అనంతానంతస్వామి ఆ గదిలో ప్రవేశించాడు. నేను అంత డబ్బు చూడటం అదే మొదటిసారి. కోటి రూపాయలు... కట్టలు నాన్న ముందు పోసి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ రుజువులూ, డాక్యుమెంట్లూ ఇచ్చెయ్యమన్నాడు. నాన్న కాలితో కొట్టాడు! ఛీ పొమ్మన్నాడు. స్వామికి కోపం రాలేదు. "కోటి రూపాయలు ఇస్తానంటే వద్దన్నావు. అందులో పదోవంతు ఖర్చుపెట్టి నీ దగ్గర్నుంచి ఆ డాక్యుమెంట్లు ఎలా సంపాదిస్తానో చూడు" అని వెళ్ళిపోయాడు.

    మరుసటిరోజు సాయంత్రం జరిగింది ఆ సంఘటన! పెళ్ళి రిసెప్షన్ జరుగుతూ వుండగా ప్రవేశించాడు రామ్ లాల్. చేతిలో మిషన్ గన్ వుంది. పెళ్ళి హడావుడిలో అతన్నెవరూ పట్టించుకోలేదు. అన్నయ్య వదినలు టేబిల్ దగ్గిర నిలబడి ప్రజెంటేషన్ లు అందుకుంటున్నారు. వెనుకనుంచి పై గదుల్లోకి ప్రవేశించారు కొందరు. అంగుళం కూడా వదలకుండా పరిశోధించారు. వాళ్ళని ముందు చూసింది అమ్మ. వాళ్ళలో ఒకడు నిర్ధాక్షిణ్యంగా ఆమెని పొడిచేసేడు. పై అంతస్థు నుండి క్రిందపడి ఆమె మరణించటంతో మాకు జరుగుతున్నదేమిటో తెలిసింది. నాన్న రివాల్వర్ కోసం పరుగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రామ్ లాల్ చేతిలో మిషన్ గన్ నిప్పులు కక్కింది. మొదట మరణించింది అన్నా వదినలు. పసుపు తడి ఆరకుండానే రక్తంలో కూలిపోయారు. ఐస్ క్రీం తింటున్న పసిపిల్లలు అలాగే ముందుకు కుప్పకూలిపోయారు. అతిధులు.. ఆడవాళ్ళు... మొత్తం మా బంధువర్గాన్నీ, స్నేహితుల్నీ మిగలకుండా చేయటానికే కంకణం కట్టుకున్నట్టు రామ్ లాల్ చేతిలో మిషన్ గన్ నిప్పులు కక్కింది. లోపలకు పరుగెత్తటానికి కూడా వ్యవధి లేనంత తొందరగా జరిగిపోయింది ఆ సంఘటన. వాళ్ళు నాన్నని చంపలేదు. ఐస్ కొట్టే కత్తితో కాళ్ళు నరికేశారు. అది బహుశా స్వామి ఇన్ స్ట్రక్షన్ కాబోలు. నాన్న రక్తపు మడుగులో కూలిపోయాడు. ఆ దృశ్యం నా కళ్ళముందు ఒక సజీవ శిల్పంలా ఇప్పటికే కదులుతోంది. కరిగిన ఐస్ క్రీమ్, పగిలిన కూల్ డ్రింక్ సీసాలమధ్య ప్రవహించే రక్తపు కాల్వలు కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ కనబడుతున్నాయి.

    డాక్యుమెంట్ లు తీసుకుని రామ్ లాల్ విజయగర్వంతో అక్కడి నుండి కదిలాడు. మిషన్ గన్ వదిలేశాడు. రెండు రోజుల తరువాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

    అన్నిటికన్నా చిత్రమైన, అనూహ్యమైన సంఘటన అప్పుడే జరిగింది.

    రామ్ లాల్ కి ఉరిశిక్ష పడుతుందనుకున్నాం!!!

    భారతదేశపు ప్రఖ్యాత క్రిమినల్ లాయర్- లాయర్ పరమేశ్వరం ఆ కేసును టేకప్ చేశాడు.

 Previous Page Next Page