"ఒంటి స్థంభం మేడ దేనికో."
"అదీ ప్రజారక్షణకే."
"ప్రజల్ని అందులో దాచి పాముల నుంచి రక్షణ ఇస్తారా..."
"కాదు" ఓ క్షణం ఆగేరు ముఖ్యమంత్రి సాలోచనగా. అందులో మేం నివశిస్తాం. ఆ విధంగా ముందు మా ప్రాణాల్ని కాపాడుకుంటూ ప్రజలు అనాధలు కాకుండా తగు రక్షణ కల్పిస్తాం."
కెవ్వుమన్న ఓ గావుకేక వినిపించింది హఠాత్ గా. అలా అరిచింది ఓ విలేఖరి...
ముఖ్యమంత్రిగారు ఒక్కసారిగా వెనక్కి దూకి ఓ మూల నక్కేస్తూ "వెళ్ళండి శివానంద్ గారూ. పరికించిచూడగా ఈ హాల్లోకి కూడా ఓ పాము ప్రవేశించినట్టుంది." పరుగెడుతున్న విలేఖర్లనిచూస్తూ ఆందోళనగా అన్నాడు.
డి.జి.పి. ఓమూల స్పృహతప్పిన విలేఖర్ని చేరుకున్నాడు.
నేలపై పాము కనిపించలేదు. కాని ఓ బొద్దింక అతడి పాదంపై నెమ్మదిగా ప్రాకుతూంది" చెప్పాడు డి.జి.పి. వెనకదాగున్న ముఖ్యమంత్రితో.
"రజ్జు సర్పభ్రాంతి" నవ్వేరు ధైర్యాన్ని కూడగట్టుకున్న ముఖ్యమంత్రి... "స్పృహ కోల్పోయిన విలేఖరి అర్ధనూటపదహార్లు పరిహారాన్ని చెల్లించబోతున్నాడని ఇప్పుడు సభాముఖంగా తెలియచేస్తున్నాను."
కరతాళధ్వనులతో ఆ హాలు ప్రతిధ్వనించిపోయింది కాని ఓ వ్యక్తిమాత్రం కూర్చున్నచోటునుంచే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక గొప్ప అవకాశాన్ని ఆలోచన్ని కలిగిస్తున్న పాముల్ని మనసులోనే అభినందిస్తున్న ఆ వ్యక్తి ఆర్ధికశాఖామంత్రి నాగరాజు.
* * * *
అర్ధరాత్రి దాటుతూంది...
చీకటిలో భాగ్యనగరం పడగవిప్పిన పాములు సంచరించే మొగలివనంలా వుంది. నిర్మానుష్యంగావున్న రోడ్లు సర్పాల కదలికతో భ్రీతిచెందిన ప్రజల్లా స్థబ్దంగా వున్నాయి.
ఒక్క పురుగూ కనిపించని ఆ రోడ్డుపై వేగంగా ప్రయాణం చేసిన ఓ పోలీస్ వేన్ డి.జి.పి. ఆఫీసు ముందు ఆగింది.
అందులోనుంచి దిగిన పోలీస్ కమీషనరూ డి.సి.పి. ప్రసన్న, డి.జి.పి. గదిలోకి అడుగుపెట్టారు.
"ఇట్సే సర్ప్రైజేసర్" కమీషనర్ ఆందోళనగా అన్నాడు. "ఏక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో క్రష్ అయిన అంబాసిడర్ తప్ప ఒక్క శవమూ కనిపించలేదు. అప్పుడే అన్నింటినీ ఎలా మాయంచేసారో అర్ధంకావడంలేదు.
డి.జి.పి. నొసలు చిట్లించాడు.
ఒక పోలీస్ టీం అక్కడే కాపలా కాస్తుండగా ప్రత్యర్ధులకు అదెలా సాధ్యమైంది.
పైగా శవాల్ని మాయంచేయాల్సిన ఆగత్యమేముంది. చనిపోయిన ముఠాలో ఎవరన్నా గుర్తించదగ్గ వ్యక్తులున్నారా.
ఒక ముఠాలో పోలీసులకి పరిచయంవున్న ఒక వ్యక్తి కనిపించినా ఆ ఒక్క తీగతో మొత్తం డొంకంతా కదిలించడం అసాధ్యం కాదు. కాని అతి ముఖ్యుడైన ప్రదీప్ సక్సేనాని విడిచిపెట్టడానికి తమ అంగీకారం తెలియపరిచాక ఇంకా మామూలు నేరస్థుల విషయంలో ప్రత్యర్ధి అలా జాగ్రత్తపడటంలో సరైన లాజిక్ ఆయనకీ తోచడం లేదు.
ప్రసన్నవేపు సూటిగా చూడలేకపోయాడు.
"ప్రదీప్ సక్సేనా" ఫైలు అందుకుని నెమ్మదిగా ఒక్కోపేజీ తిరగేస్తూ ఆలోచిస్తున్నాడు.
బాల్యంలో సింగపూర్ లో చదువుకున్న సక్సేనా పన్నెండేళ్ళ వయసులో ఇండియాకి వచ్చాడు అతడి బాబాయ్ తో...అలా వచ్చింది తల్లి దండ్రులిద్దరూ ఓ కారేక్సిడెంట్ లో మరణించాకనే...
తండ్రి భారతీయుడు, తల్లి కొరియన్...అల్హాబాద్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రదీప్ సక్సేనా ఓ యువతిని రేప్ చేసి చంపాడన్న ఆరోపణపై తొలిసారి అరెస్ట్ చేయబడ్డాడు కాని మతిస్థిమితంలేని కారణమూ పైగా నేరం పూర్తిగా నిరూపించబడకపోవడంతో విడిచిపెట్టారు...
తర్వాత కొన్నాళ్లు అదృశ్యమైపోయాడు...అతడి బాబాయ్ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యచేయబడినప్పుడు ప్రదీప్ సక్సేనా అనుమానితుడిగా ఆ తర్వాత పోలీస్ కస్టడీలోకి తిరిగివచ్చినా దేశంలో ప్రముఖ క్రిమినల్ లాయర్ సహాయంతో నిర్దోషిగా నిరూపించుకోగలిగాడు. చాలా విచ్చలవిడిగా ఖర్చుచేయడం అమ్మాయిలతో జులాయిగా తిరగడం అతడికున్న ముఖ్యమైన అలవాట్లు. చాలామంది హిందీ సినీతారల్తో కూడా అక్రమ సంబంధాలున్నాయని వినికిడి.
అసలు అంతలా డబ్బు ఖర్చు చేయడానికి అతడికున్న సోర్స్ పోలీసులకి అంతుబట్టలేదు. ఇంతవున్నా అతడికుండటానికి ఓ ఇల్లు కూడా లేదు.
చివరగా అతడు అరెస్ట్ చేయబడింది హైదరాబాద్ లోనే. అతడి దగ్గరున్న కొన్ని పేపర్ల మూలంగా బోధపడింది ప్రదీప్ సక్సేనాకి చాలా ప్రముఖులైన స్మగ్లర్లతో సంబంధంవున్న విషయం. ఓ పక్క ఇన్వెస్టిగేషన్ నడుస్తూందింకా."
భారంగా ఫైల్లోంచి తల పైకెత్తాడు డి.జి.పి.
ఈ వివరాలు ఏ విధంగానూ అసలు నేరస్థుడ్ని పట్టుకోడానికి సహకరించవు.
అంతర్జాతీయంగా సక్సేనాకి ఒకవేళ సంబంధాలు వుండి వుంటే అది ఏ స్మగ్లర్ కైనా బిజినెస్ డీలింగ్స్ కి వుపయోగపడుతుంటాయి తప్ప ఈ రాష్ట్రంలోని నేరస్థుల ఉనికిని తెలియపరచలేవు.
పైగా ఇప్పుడు తాముగాని తమనిగాని టెర్రరిస్టు రూపంలో నెగోషియేట్ చేస్తున్నది ఇప్పుడు నేరాలగోదాలో కొత్తగా అడుగుపెట్టిన బ్లాక్ మాంబాతో...
ఫోన్ రింగయింది సరిగ్గా అప్పుడే.
ఇంత రాత్రివేళ ఆఫీసులో వుంటానని వూహించేది ఒక్క డిపార్ట్ మెంటు వ్యక్తులు మాత్రమే "డి.జి.పి. హియర్."
బుస్...స్...స్...స్...హిస్సింగ్ లా వినిపించింది.
"హు ఆర్యూ."
"బ్లాక్ మాంబా" ఎగతాళిగా నవ్వు వినిపించింది. "ముఖ్యమంత్రి బ్రతికిపోయాడు వాడెవడూ శివానంద్ కదూ... మొత్తం ప్లాన్ అప్ సెట్ చేసాడు...వెల్...వాడ్ని విడిచిపెట్టం సర్...అక్కడి శవాలు ఎలా మాయమయ్యాయని ఆందోళన పడుతున్నారనుకుంటాను కదూ."
డి.జి.పి. ఎలర్ట్ గా వింటూనే ఆలోచిస్తున్నాడు...ఇంతవేగంగా విషయాల్ని సేకరించగల నెట్ వర్క్ అంతకుమించి పరిస్థితుల కనుగుణంగా విశ్లేషించి ఆలోచించగల నేర్పూగల నేరస్థుడ్ని ఇంతవరకూ అతడు చూసి ఎరగడు.
"వెల్...ఓ గుడ్ న్యూస్ చెబుతాను. డి.సి.పి. ప్రసన్న అక్కడ వుంటే ఫోన్ అతడికోసారి ఇవ్వు."
ఆలస్యం చేయలేదు డి.జి.పి.
ప్రసన్న రిసీవర్ని అందుకోగానే వినిపించింది. "డాడీ..." మృత్యువు అంతదాకా కప్పిన చల్లని మంచు కరిగి జడీభూత 'మనస్సుమం' విచ్చుకున్నట్టుగా వుంది "నేను డాడీ...లల్లీని" వెక్కిపడుతూంది.
"అమ్మా లల్లీ!" ప్రసన్న కళ్ళనుంచి ఆనందభాష్పాలు రాలిపోతున్నాయి.
బాధ్యతకీ మనస్సుకీ మధ్య జరిగే పోరాటంలో ఇక్కడ మనసు దృశ్యాదృశ్య విభ్రమంతో ఆరాటపడుతూంది. "నువ్వు...నువ్వు...బాగానే వున్నావుగా."
"ఉన్నా డాడీ...మరేమో చుట్టూ అద్దాల్లో బోలెడు పాములున్నాయి. చూస్తుంటే భయమేస్తుంది. కొంచెం వెలుగుంది. అన్ని పాములూ నాకేసి చూస్తున్నాయి.... నన్ను తీసుకెళ్ళిపో డాడీ... అమ్మని..."
ప్రసన్న గొంతు రుద్దమైపోతూంది. "అదికాదమ్మా...నిన్ను తప్పకుండా తీసుకెళతాను...అమ్మేమో ఇప్పుడు బాగానే వుంది. నిద్రపోతుందన్నమాట. నువ్వు భయపడకూడదు. అంకుల్ వున్నాడుగా."
"ఉన్నాడు...పాములకథలు చెబుతున్నాడు...పాములేమి చేయవని. అన్నీ అబద్ధాలు..."
"అబద్ధాలు కాదమ్మా...అంకుల్ కి పాములు ఫ్రెండ్సన్నమాట. ఇప్పుడు నీకూ ఫ్రెండ్సయిపోతాయి. అందుకని నువ్వు ధైర్యంగా వుండు."
కొన్ని గంటల అంతర్మధనం చెరిగిన అతడి మానసికస్థితిని అలాంటి విషమ పరిస్థితుల్నెదురుకున్న ఒక తండ్రి మాత్రమే తెలుసుకోగలిగేది.
మంత్ర ముగ్దుడిలా ఫోన్ డి.జి.పి.కి అందించాడు.
"మిస్టర్ డి.జి.పి. అంత ప్రమాదం జరిగాక కూడా ఎలా బ్రతికారని ఆశ్చర్యపోతున్నావు కదూ... ఇక్కడ నేను చేసింది నేరస్థుడు చట్టంకన్నా ఎంత తెలివిగా ప్రవర్తిస్తాడో తెలియచెప్పడం మాత్రమే. నీ సిబ్బంది మా వాళ్ళ కారువెంటపడ్డారు. మీది డ్యూటీ. మాది సాహసం. మా వాళ్ళు కారువేగాన్ని పెంచారు. మీ వాళ్ళదృష్టి నుంచి తప్పుకున్నారు...మీ సిబ్బందికి గుర్తుందోలేదో...మా వాళ్ళని వెంటాడుతున్న మీ కారుకి రెండు లారీలు అభిముఖంగా ఎదురయ్యాయి. అందులో ఒక లారీ మాది. అంబాసిడర్ ని అగాధంలోకి తోసిన నా అనుచరులు ఆ లారీలోనే కూర్చుని సిటీవేపు వచ్చేసారు. ఇదంతా స్పృహలోలేని పాపకి జయేంద్రకీ తెలీదనుకో...హోవ్ యీజ్ మై ప్లాన్."