సీరియస్ గా చూసింది త్రివేణి భరత్ వైపు.
"అంత త్వరగా వెళ్ళాలనుకున్నవారు ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సింది" అంటూ ఇంజెక్షన్ లోడ్ చేయటంలో నిమగ్నమయింది.
భరత్ పక్కనే వున్న అశ్వని వేపు చూచాడు నవ్వుతూ.
"ప్రమాదం ఏంలేదుగా డాక్టర్__?" అడిగింది అశ్వని.
అశ్వని వేపు ప్రశ్నార్ధకంగా చూస్తూ ఇంజెక్షన్ కుడిచేతిలోకి తీసుకొని భరత్ ఎడం చెయ్యి పట్టుకుంది త్రివేణి, కెవ్వున అరిచాడు భరత్.
(త్రివేణి ఉలిక్కిపడి భరత్ వేపు ఆందోళనగా చూస్తూ "ఎనీ సీరియస్ పెయిన్స్....?" అడిగింది త్రివేణి.
కాదన్నట్లుగా తలూపాడు.
"మరి__?? ఎనీ అనీజీ__?"
"వూహు__"
"మరేంటి భయమా__?"
భయమంటే మృత్యువుతో ఆటలాడుకోనుగదా__"
"మరేంటి చికాగ్గా అడిగింది త్రివేణి.
"చక్కలిగిలి.... అన్నాడు తాపీగా భరత్. భరత్ వేపు మింగేసేంత కోపంగా చూచింది త్రివేణి.
రాబోయిన నవ్వును పెదాలచాటున దాచుకున్నాడు భరత్.
ఈసారి భరత్ వేపు చూడకుండా సీరియస్ గా ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది త్రివేణి విసవిసా.
ఎందుకలా చేశారు....?" అడిగింది అశ్వని.
"సరదా_ నాకు సీరియస్ గా వుండేవాళ్ళను చూస్తే ఏడిపించాలని సరదా పుడుతుంది. ఆమె ఎందుకలా సీరియస్ గా వుంటుంది_? డాక్టర్స్ ఎప్పుడూ నవ్వుతూ పేషెంట్స్ కి రిలీఫ్ ఇవ్వాలి. అవునా_?"
ముందు మెత్తటి అడుగుల చప్పుడు వినిపించింది ఇద్దరికి. "ఇలాంటి పనులంటే నాకు చికాకు_" ఈ మాటలు వినిపించాయి తరువాత. వులిక్కిపడ్డారు అశ్వని, భరత్_తలలు తిప్పి చూశారు.
త్రివేణి అక్కడే నిలబడి వుంది.
"నాకుమాత్రం లేదు_ఎందుకంటే ప్రపంచం మునిగిపోయేంత సీరియస్ నెస్ ఎందుకు. మెడిసన్ చదివేటప్పుడు పేషెంట్స్ తో ప్లెజంట్ గా వుండాలని కూడా చెబుతారని ఎవరో చెప్పగా విన్నాను....ఒకవేళ అది లేకపోతే ఇప్పుడయినా కోర్స్ లో అది చేర్చటం మంచిది_" అన్నాడు.
మొట్టమొదటిసారి త్రివేణి జీవితంలో ఓ యువకుడ్ని పరీక్షగా చూట్టం ఇదే తొలిసారి.
ఇదేం భరత్ గమనించలేదు.
శుక్రాచార్య ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తున్నాడు భరత్. ఇప్పటిదాకా ఇక్కడే వున్న తను ఇంతలో ఎలా మాయమయ్యాడు?
త్రివేణి బయటకు నడిచింది.
నడుస్తూనే ఆలోచిస్తోంది_ తనను ఎవరు చూసినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. ప్రాక్టికల్ జోక్స్ వెయ్యరు. అలాంటిది ఈ యువకుడు తొలిసారి తనమీద ప్రాక్టికల్ జోక్ వెయ్యటం త్రివేణికి చిత్రంగా అనిపించింది.
తండ్రి తరువాత మరో మగాడి గురించి ఆలోచించటం కూడా త్రివేణికి ఇదే తొలిసారి.
అరగంట గడిచాక వచ్చాడు శుక్రాచార్య. తన కూతురు మెడిసిన్ చదువుతోందని తెలుసు. హౌస్ సర్జన్ కి వచ్చినట్లు, గాంధీ హాస్పిటల్ లో చేస్తున్నట్లు తెలియదు ,ఎంత చిత్రమైన పరిస్థితి! తనెందుకు కూతుర్ని చూడగానే కంగారుగా తప్పుకోవలసి వచ్చింది_?" ఏ తండ్రికయినా తన కూతురు పైకి రావటం బాగా చదువుకోవటం సంతోషం కల్గించే విషయం.
నలుగురికి సేవచేసే వృత్తిలో ప్రవేశించటం మరీ ఆనందం కల్గించే విషయం.
కాని తనకే ఫీలింగ్ లేదు_
భర్తగా తన భార్యకు, తండ్రిగా తన కూతురుకు చనిపోయేలోపు ఏదో ఒక కోరికన్నా తీర్చకపోతే మనిషిగా తన జీవితానికి అర్ధం వుండదేమో....
అశ్వని ఏదో మేగ్ జైన్ చదువుతూ కూర్చుంది.
అశ్వని అక్కడుంటం చూసి ముఖం ఎలర్జిటిక్ గా పెట్టాడు శుక్రాచార్య.
ఆ సమయానికి అశ్వని శుక్రాచార్య వైపు చూసి లేచి నిలబడింది కంగారుగా.
"నీవిక వెళ్ళవచ్చు, నేను దగ్గరుండి చూసుకుంటాను...."
అశ్వని సందేహిస్తూ నిలబడిపోయింది, శుక్రాచార్యను చూస్తే అశ్వనికి ఎందుకో భయం. అది ఆయన లోతయిన కళ్ళను చూసి కావచ్చు, గంభీరతను చూసి కావచ్చు.
కదలకుండా అలాగే స్థాణువుల్లా నిలబడి ఉన్న అశ్వనివేపు మరోసారి చూసి అన్నాడు. "ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పాల్సి రావటం అంటే చిరాకు. ఆ సందర్భంలో అవతలి మనిషిని తక్కువగా అంచనా వేస్తాను...."
మరుక్షణం అశ్వని అక్కడ లేదు.
అప్పుడు కళ్ళు తెరిచాడు భరత్.
"అంతలోనే ఎక్కడికి వెళ్ళారు....?" అడిగాడు భరత్.
అబద్ధం చెప్పడం ఇష్టంలేని శుక్రాచార్య మౌనంగా ఉండిపోయాడు.
"ఎలా జరిగింది?"
"మన గుర్రాలు గెలవటం ఇష్టంలేని జాకీ హఠాత్తుగా వెనుక నుంచి ఎటాక్ ఇచ్చాడు."
"ఎవరతను?"
"థర్డు ప్లేసులో ఉన్న జాకీ"
"జాకీగా ఇక ముందు అతను పనికి రాకుండా చేస్తే బావుంటుందని నా ఆలోచన...."
"మీ ఆలోచన దారుణమయింది. మోసం చేసింది మనం. అతన్ని ఒదిలేయటం సమంజసం."
"నా శత్రువు చిన్నవాడైనా వదిలిపెట్టడం నాకిష్టముండదు.
"నాకు నచ్చని విషయం గురించి నచ్చదని ఒకేసరి చెప్పటం మీ దగ్గరే నేర్చుకున్నాను."
శుక్రాచార్య ఉలిక్కిపడ్డాడు.
తను అశ్వనితో మాట్లాడుతున్నప్పుడు భరత్ నిద్రపోతున్నాడనుకున్నాడు.
"మన నెక్ట్స్ స్టెప్....?" అడిగాడు భరత్.
"శశాంకను మోసం చేయటానికి ఈసారి యజ్ఞభూపతి ప్రయత్నించవచ్చు. దాన్ని మనం ఎదుర్కోవద్దు...."
"ఓకే అంకుల్."
శుక్రాచార్య వరండాలోకి వస్తుండగా ఆషా, అనురాగ్ ఎదురయ్యాడు.
జరుగుతున్న అశ్వభారత నాటకంలో ఓ పాత్ర మరో పాత్రకు తెలియకుండా కలుస్తూ విడిపోతున్నాయని ఆ నాటకాన్ని నడిపిస్తున్న శుక్రాచార్యకు కూడా తెలియని విషయం.
* * *
రాత్రి పది కావస్తోంది. త్రివేణి, తల్లి వంటగది ముందు కూర్చుని భోం చేస్తున్నారు.
మెత్తటి అడుగుల శబ్దం విని తలెత్తారు ఇద్దరూ.
ఎదురుగా శుక్రాచార్య!
"అమ్మా....త్రివేణి....నీ మెడిసిన్ ఎప్పుడు పూర్తయింది?"
ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
అంత తాపీగా, ఆప్యాయంగా తన తండ్రి తనను పలకరించటం బహుశా జీవితంలోనే తొలిసారేమో.
"ఈ మధ్యనే పూర్తయింది నాన్నగారు. హౌస్ సర్జన్ లో జాయిన్ అయ్యాను."
"ఎక్కడా....?" ద్వార బంధానికి నిలబడే మాట్లాడుతున్నాడు శుక్రాచార్య.
ఇద్దరు లేచి నిలబడ్డారు.
"గాంధీ హాస్పిటల్ లో."
"ఆ....హా....అన్నట్లుగా తలూపుతూ వెనుదిరిగాడు.
అంతలోనే మరలా అన్నాడు "చాలా మంచి వృత్తిలో జాయిన్ అయ్యావు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమ్మా...." అంటూ వెళ్ళిపోయాడు.
మెడిసిన్ ఈ మధ్యనే పూర్తయింది నాన్నగారు అని తను అన్నప్పుడు తన తండ్రి కళ్ళలో క్షణంపాటు వెల్గిన కాంతి దృష్టి తప్పించుకుపోలేదు.
భోజనం మధ్యలోనే ముగించి "అమ్మా ఇప్పుడే వస్తానే. నాన్నగారితో ఓసారి మాట్లాడాలి" అంది త్రివేణి.
ఆమె చేయకూడని పని చేస్తున్నంత ఆశ్చర్యంగా.
"నాన్నగారు...."
అప్పుడే పడుకోబోతున్న శుక్రాచార్య లేచి కూర్చున్నాడు.
ఏమిటన్నట్లుగా చూసాడు.
"మీరీమధ్య బాగా చిక్కిపోయారు. వీక్ గా కనిపిస్తున్నారు."
మౌనంగానే చూసాడు.
"మీరెప్పుడూ ఏదోలా ఉంటారు. ఏదో లక్ష్యం కోసం బతుకుతున్నట్లుగా కనిపిస్తారు కారణం తెలుసుకోవచ్చా?"
శుక్రాచార్యకు అప్పటికప్పుడు కూతుర్ని గుండెలకు హత్తుకోవాలన్నంత వాత్సల్యం....అర్హత లేదేమోనన్న ఫీలింగ్....
అది త్రివేణి గమనించింది.
"నాన్నగారు నా జీవితంలో నేను మిమ్మల్ని ఒకే ఒక కోర్కె కోరతాను_తీరుస్తారా....?"
చిత్రంగా చూసాడు శుక్రాచార్య క్షణం మౌనం తర్వాత అన్నాడు.
"తప్పకుండా క్రుంగిపోతున్న ఈ పొద్దు నీకు ఒకే ఒక్కసారి వెలుగు ఇవ్వగలదు."
"మాట తప్పరుగా"
"లేదు."
* * *
భరత్ ఇండియన్ పీనల్ కోడ్ చదువుతున్నాడు సీరియస్ గా. విశ్వదత్తను విడిపించాల్సిన టైం దగ్గరకు వస్తోంది.
త్రివేణి వచ్చింది గదిలోకి.
భరత్ పుస్తకం చదువుతూ కనిపించాడు. బెడ్ పక్కనే క్రింద ఓ వృద్ధుడు నిద్రపోతూ కనిపించాడు.