Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 23


    నాడు దేశ స్వాతంత్ర్యం కోసం వారు ఇచ్చిన పిలుపు వప్లవ సంకేతంగా అనతి కాలంలోనే దేశంలోని సర్వశక్తులను ఏకం చేసింది.

    1947 ఆగష్టు 15. భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందింది.

    భగత్ సింగ్ వంటి దేశభక్తుల మీద అచంచలమైన విశ్వాసంతో నేటి యువత యూనివర్శిటీ హాస్టల్ బ్లాక్ కు ఆయన పేర నామకరణం చేశారు.

    భగత్ సింగ్ బోర్డు మీదే నవీన్ చూపులు నిలిచాయి. అవి డేగ చూపులు.

    యూనివర్శిటీ హాస్టల్ లో ఎవరైనా టెర్రరిస్టులుకాని, వారి సానుభూతిపరులుకాని వున్నారేమో తెలుసుకోవలెననే అన్వేషణలో వున్నాడు నవీన్.

    అది అంత తేలికైన విషయం కాదు!

    యూనివర్శిటీ హాస్టల్స్ లోకి పోలీసులు అడుగుపెట్టవలెనన్నా, అనుమానంమీద ఎవరైనా విద్యార్ధులను నిర్భంధంలోకి తీసుకోవలెనన్నా ముందుగా యూనివర్శిటీ అథారిటీస్ అనుమతి తీసుకోవాలి చాలా తతంగం వుంది.

    అటువంటి మర్యాదలను లాంచనాలను అనుసరిస్తే తను అందరి దృష్టినా పడడం భయం. అప్పుడు సమాచారాన్ని రాబట్టడం కష్టం. తనకు కావలసింది సమాచారం!

    అందుకనే, యూనివర్శిటీ ఏదో పనిపడి వచ్చిన వ్యక్తిలా అక్కడ పిచ్చాపాటీ మాట్టాడి, కొంతలో కొంతయినా వివరాలను తెలుసుకోవచ్చుననే భావనతో సరాసరి హాస్టల్స్ కు వచ్చేశాడు నవీన్. తారట్లాడుతూ వచ్చాడు.

    నవీన్ భగత్ సింగ్ బ్లాక్ దగ్గరకు వచ్చేటప్పటికే అక్కడ నలుగురు విద్యార్ధులు తచ్చాడుతూ కనిపించారు. నలుగురూ దృఢకాయులే. కోపంగా చూశారు.

    "ఎవరు నువ్వు? సరాసరి హాస్టల్ లోకి వచ్చేయడమేనా?" వాళ్ళలో ఒకతను నవీన్ ను నిలదీసి అడగనే అడిగేశాడు. కొరకొరా చూశాడు.

    "హాస్టల్ లో మా బ్రదర్ వున్నాడు. మాట్టాడదామని వచ్చాను." వాళ్ళకు ఏమాత్రం అనుమానం రాకుండా వుండే విధంగా మాట్టాడడానికి ప్రయత్నించాడు నవీన్.

    "నాన్ సెన్స్! ఇతరు లెవ్వరూ ఈ బ్లాక్ లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు!" అంటూనే నలుగురు యువకులూ జేబులలోంచి బటన్ నైఫ్స్ తీసి నవీన్ కు నలువైపులా మూగారు. వాళ్ళ ముఖాలు వికృతంగా మారాయి.

    ఊహించని ఈ అవాంతర స్థితికి క్షణకాలం విస్తుపోయాడు నవీన్. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే తేరుకుని జిప్ బ్యాగ్ తెరిచాడు. అంతే! విద్యార్ధులు తెల్లమొహాలు వేశారు.

    నవీన్ చేతిలో మెరుస్తున్న రివాల్వారును చూస్తూనే బెంబేలెత్తి పోయిన వాళ్ళు కాళ్ళకు బుద్ధిచెప్పారు. ఒక్కరూ వెనక్కు తిరిగి చూడలేదు!

    ఆ బ్లాకులో రూం నెంబరు 47 తలుపులు తాళం వేసి వున్నాయి.

    పారిపోయిన ఆ నలుగురూ యూనివర్శిటీ విద్యార్థులేనని, ఆ రూమ్ లోనే వుంటున్నారని నిర్ధారించుకున్నాడు నవీన్. వచ్చిన పని వెంటనే అయిపోయింది!

    ఆ రోడ్డుకు అర ఫర్లాంగు దూరంలోనే యూనివర్శిటీ వుమెన్స్ హాస్టలు వుంది. అటు కదిలాడు నవీన్. ఈసారి అప్రమత్తుడై అడుగువేశాడు.

    హాస్టల్ క్రింద భాగం ఎంట్రన్స్ లోనే విజిటర్స్ రూమ్ వుంది.
 
    అక్కడ టెలిఫోన్ దగ్గర కొందరు ఆడపిల్లలు తమవంతు కోసం గుమిగూడి వున్నారు.

    మరికొందరు టేబుల్స్ మీద వున్న న్యూస్ పేపర్లను, మాగజైన్ లను వివిధ భంగిమలలో కూర్చుని సీరియస్ గా చూస్తున్నారు.

    నవీన్ ను చూడగానే వాళ్ళలో వాళ్ళకు గుసగుసలు ప్రారంభమయాయి.

    "ప్రియురాలి కోసం వచ్చినట్టున్నాడే _ పాపం పసివాడు!"

    "పాపం! ఎవతే ఆ అదృష్టవంతురాలు?"   

    "పాపం! నువ్వు మాత్రం కాదులే!" ఇకఇకలు, పకపకలు.

    "ఎవరు కావాలి?"

    విద్యార్ధిని ప్రియాంక ముందుకు వచ్చి నవీన్ ను నఖశిఖ పర్యంతం చూస్తూ అడిగింది.

    "ఆషా కోసం వచ్చాను." ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు నవీన్.

    ఆషా పేరు వినగానే షాక్ తిన్నట్టు ప్రియాంక ముఖం పాలిపోయింది, మారిపోయింది.

    విద్యార్ధినుల అల్లరి హఠాత్తుగా ఆగిపోయింది. కలవరం బయలుదేరింది.

    "మీరెవరు?" తననుతను సర్దుకుంటు నిదానంగా అడిగింది ప్రియాంక. బింకంగా చూసింది.

    "ఆమె భర్తను!"

    "ఆఁ...?" ప్రియాంక మరొకసారి షాకింగ్ న్యూస్ విన్నట్టు ఉలిక్కిపడింది.

    "అవును" నవీన్ నొక్కిపలికాడు.

    "అబద్ధం. శుద్ద అబద్ధం! ఆషాకు పెళ్ళే కాలేదు!" ఆవేశంగా అంది ప్రియాంక.
 

 Previous Page Next Page