"ఏం జరిగింది? నాతో చెప్పకూడదా? అక్కయ్యతోగాని పోట్లాడారా? ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ కబుర్లు చెప్పేవాళ్ళు అలా ముంగిలా కూర్చుంటే బాగుండదు!"
గిరి మాట్లాడలేదు. పేపర్లోంచి తల ఎత్తలేదు. హిమజకు ఆశ్చర్యం వేసింది.
"ఏమిటంత సీరియస్ వార్త?" అని వెనగ్గా వంగి పేపరులోకి చూస్తూ అంది - "నైజీరియాలో 'కూ' అయితే మీ మీద కుట్ర జరిగినంత బాధ పడుతున్నారేం ?"
"దానిప్రభావం నా వ్యాపారంమీద పడింది కాబట్టి. కొత్త ప్రభుత్వం ఫండ్స్ అన్నీ ఫ్ర్విజ్ చేసింది. నా పెట్టుబడి ఎక్కువగా అక్కడే ఎప్పటికి రిలీజవుతుందో" దిగాలుగా అన్నాడు గిరి.
"ఓ, అయామ్ సారీ! నాకిదంతా తెలీదు. అక్కయ్యకు తెలుసా ?"
"ఇంకా లేదు"
"అమ్మా ! ఫోన్ వచ్చింది. సాగర్ బాబు" వచ్చి చెప్పాడు రామయ్య.
హిమజ లోపలకు వెళ్ళిపోయింది.
"బాబూ, టీ తీసుకోండి" కప్పు అందిస్తూ అన్నాడు రామయ్య.
"మీరు మధ్యాహ్నంకూడా ఏం భోజనం చెయ్యలేదు. ఏమైనా తీసుకుంటారా బాబూ!" అడిగాడు.
"వద్దు రామయ్యా ! నాకు ఆకలిగాలేదు" అన్నాడు గిరి.
రామయ్య శివయ్య దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తోటపని చేస్తున్నారు.
"శివయ్యా" - ఉన్నట్టుండి దగ్గరగా వినిపించేటప్పటికి శివయ్య ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా గిరి. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి ముఖం భయంకరంగా ఉంది.
"ఏంటిబాబు పిలిచారు ?"
"శివయ్యా! నేను శేఖరాన్ని. నిన్ను చూస్తుంటే అమ్మ గురించే ఆలోచన వస్తోంది. అమ్మకు నువ్వెంతో సహాయం చేస్తుండేవాడివి. ఇప్పుడు ఒంటరిదై పోయింది" బాధగా అన్నాడు గిరి.
"ఏమిటి బాబూ, అచ్చం శేఖరం బాబులా మాట్లాడుతున్నారు" ఆశ్చర్యంగా అన్నాడు శివయ్య.
"నేను శేఖరాన్నే శివయ్యా! శేఖరం ఆత్మను....నీకు తెలుసుగా, పద్మజంటే నాకెంత అభిమానమో. ఆమె కోసమే యిలా తిరుగుతున్నాను. నువ్వు ఎన్నోసార్లు అమ్మదగ్గరా, నా దగ్గరా అంటుండేవాడివి పద్మజను పెళ్ళి గురించి అడగమని. ధైర్యం చెయ్యలేకపోయాను. ఇప్పుడామె సాన్నిహిత్యం కోసం తపిస్తూ యిలా తిరుగుతున్నాను."
"బాబోయ్....దయ్యం....దయ్యం...." పెద్దగా అరుస్తూ లోపలకు పరుగెత్తాడు శివయ్య.
ఫోన్ లో మాట్లాడుతున్న హిమజ ఫోన్ పక్కన పడేసి పరుగెత్తుకొచ్చింది.
శివయ్య వగరుస్తున్నాడు భయంతో. శరీరం వణుకుతోంది.
"ఏమిటి శివయ్యా ? ఎందుకలా అరుస్తున్నావ్ ?" అడిగింది గాభరాగా.
"దెయ్యం....అమ్మా ! శేఖరం బాబు దయ్యమై గిరిబాబుని పట్టుకున్నాడు."
"నీకేమయినా పిచ్చి పట్టిందా? శేఖరంబాబు దయ్యమై రావడం ఏమిటి ?"
"నిజం చిన్నమ్మా! ఎపుడో శేఖరంబాబుతో నేను మాట్లాడిన మాటలన్నీ చెప్పారు. మాట, గొంతు అంతా శేఖరంబాబులా ఉంది మీరూ వినండి. తప్పకుండా నమ్ముతారు."
"ఏదీ, ఎక్కడున్నారు?" హిమజ తోటలోకివెళ్ళి చూసింది. గిరి కుర్చీలో కూచుని రెండు చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. రామయ్య భయంగా అతన్నే చూస్తున్నాడు.
* * *
డాక్టర్ రామకృష్ణ క్లినిక్ లో కూర్చుంది పద్మజ. నెల రోజుల్లో ఆమె చాలా డీలా పడిపోయింది. వార్ధక్యం ముంచుకొచ్చినట్లు తయారయింది.
"గిరిని అన్ని రకాలుగా పరీక్షించాను. శారీరకంగాగానీ, మానసికంగా గానీ ఏ అనారోగ్యమూ కనిపించడంలేదు. టెన్షన్ వల్ల అప్పుడప్పుడూ తలనొప్పి వస్తోందంతే! అసలు ఇన్నిసార్లు పరీక్షించడం అనవసరం. జరుగుతున్నదేమిటో మనకు తెలుసు. కాకపోతే మీ తృప్తికోసం చేస్తున్నానంతే."
శివయ్య తనకు తెలిసిన భూతవైద్యుడున్నాడనీ, తీసుకొస్తాననీ గొడవ పెడుతున్నాడు. పెళ్ళయి కొద్ది నెలలయినా కాకుండానే అతనికి నచ్చని పనులుచేసి నువ్వు గొడవ పడడం మంచిదికాదు."
"ఏం చెయ్యాలో తోచడంలేదు. ఈ మధ్య ఇలా తరుచుగా జరుగుతోంది. ఆ సమయంలో తను చెప్పినవన్నీ జరుగుతున్నాయి కూడా."
"అతని ప్రవర్తన ఎలాగుంది? ఐ మీన్ శేఖరం ఆత్మది ?"
"విపరీతంగా ఏమీ ప్రవర్తించడంలేదు. మునుపు నాతో ఎలా మాట్లాడేవాడో అలాగే మాట్లాడుతున్నాడు. అనవసరమైన చనువు తీసుకోడు. మీద చెయ్యయినా వెయ్యడు. శాంతంగా నేను సమాధానం చెపుతుంటే మాత్రం త్వరగా అదృశ్యమవుతాడు."
"సాధారణంగా బలవంతపు చావు వచ్చినవాళ్ళు, కోరికలు తీరనివాళ్ళు అలా అవుతుంటారని వింటూంటాం. శేఖరం విషయంలో ఇవి రెండూ జరిగాయి. నువ్వు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుండు. అన్నట్లు శేఖరం ఆఫీసులో విషయాలు కూడా సీరియస్ గా తీసుకునేవాడా ?"
"ఆ, చాలా సీరియస్ గా తీసుకునేవాడు. చాలా సిన్సియర్ వర్కర్"
"అయితే అతన్ని ఆఫీస్ విషయాలలో ఎక్కువ ఎంగేజ్ చేస్తూ వుండు. కొన్నాళ్ళ తర్వాత మార్పేమైనా వుంటుందేమో చూద్దాం"
"ఏమిటో ? ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది. నౌకర్లు ఇంట్లో వుండటానికే భయపడుతున్నారు."