Previous Page Next Page 
నిషా పేజి 23

    ధర్మలింగం చేత నియమింపబడిన బాడీగార్డ్ రాంసింగ్ అతడిని నీడలా అనుసరిస్తూనే వున్నాడు.

                                           *    *    *

    "భోజనానికి లేవండి చినబాబుగారూ. మళ్లీ వండిన వంట కూడా చల్లారిపోయేలా వుంది?" మధ్యాహ్నం మూడోసారి వికీని భోజనానికి పిలవడానికి వచ్చింది తుంగభద్ర.

    "నా మనసు బాగాలేదు. నన్ను విసిగించకు" చేతిని చెక్కిట చేర్చి క్రింద తోటలోకి చూస్తూ కూర్చున్నాడు వికీ. అతడి ముఖం బాగా వడలిపోయి వుంది. కళ్లల్లో దిగులు గూడు కట్టుకుంది. అసలు మొన్నటివరకూ అతడిలో తల్లిపోయిన దిగులే కనిపించేదికాదు, బొమ్మలు గీస్తోనో, తోటలో కూనిరాగాలు తీస్తూనో కులాసాగా కాలక్షేపం చేసేవాడు.

    "మొత్తానికి ఈయన్ని భ్రమరాంబిక బాగానే కదిలించినట్టుంది" అనుకుంది తుంగభద్ర. వెళ్లి ధర్మలింగంతో ఫిర్యాదు చేసింది.

    "రాత్రి నుండి చినబాబుగారు భోజనం చేయలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచినా విసుక్కుంటున్నారు. ముఖం చిన్నబుచ్చుకుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్నారు."

    "ఒకేసారి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాడు. ఆ బెంగ బాధించదా?"

    "అదికాదు. ఇంకేదో వున్నట్టుంది. మీరొచ్చి కనుక్కోండి."

    ధర్మలింగం అయోమయంగా చూసాడు.

    "మీరు రండి బాబుగారూ! మీరొచ్చి మాట్లాడితే ఏమున్నదీ బయటపడుతుంది"

    ధర్మలింగం రిజిస్టర్ మూసి డ్రాయరు సొరుగు తాళం వేసి గుమాస్తాకు ఏదో చెప్పి బయలుదేరాడు.

    ధర్మలింగం వచ్చేసరికి కూడా వికీ అలాగే దిగులుగా తోటలోకి చూస్తూ కూర్చున్నాడు.

    "రాత్రి నుండి మీరు సరిగా లేరని విన్నాను. మీ మనసుకు నచ్చనిది ఏమైనా జరిగిందా? లేక అమ్మగారి జ్ఞాపకాలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా?"

    "మనస్సు బాగాలేదు. నేను రేపు వెళ్లిపోతున్నాను. ఇక్కడి నుండి. లండన్ వెళ్లిపోతాను"

    "మీరు వెళ్లిపోతే ఇక్కడి ఎస్టేట్ వ్యవహారాలు ఎవరు చూస్తారు? రోజు రోజుకు మీరు కన్నవాళ్ల స్మృతులకు దూరమవుతారని. ఈ ఎస్టేట్ వ్యవహారాలను మీరు సమర్ధవంతంగా చూసుకోగలరనీ అనుకుంటున్నాము" 

    చదువు సంధ్యలు మధ్యలో కట్టిపెట్టి ఇక్కడే వుండిపోయి ఈ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోగలననుకున్నారా?" చిరాకుగా అన్నాడు వికీ. "బొమ్మలు గీచుకుంటూ పాటలు పాడుకుంటూ జాలీగా తిరిగే మనిషిని నేను. ఎస్టేట్ వ్యవహారాలు చూచుకోవడంలాంటి పిచ్చి పనులెప్పుడూ చేయను. నాకసలు ఇలాంటి విషయాలపట్ల ఆసక్తిలేదు. ఈ రొంపిలో మామయ్యలు బలవంతంగా దింపిపోయారు నన్ను"

    "బలవంతం వాళ్లది కాదు బాబూ, నాది. ఈ వంశంమీద, ఈ వంశాకురంమీద నాకున్న అభిమానం నాచేత ఈ పన ిచేయించింది. ఈ ఎస్టేట్ దాయాదులపాలు కాకూడదన్న తాపత్రయం .శ్రాద్దకర్మ రోజు ఉదయకాంతారావు పన్నిన ఎత్తుగడ చూసారుగదా? ఈ ఎస్టేట్ ని ఎలాగైనా కబళించాలని పొంచి వున్న పులి అతడు. మీరు వెళ్లిపోతే ఇక్కడేం కావాలి?"

    "మీరంతా వున్నారుకదా"
 
    "నౌకర్లమీద చాకర్లమీదా వదిలివేసే ఎస్టేట్ కాదిది. చాలాపెద్ద ఎస్టేట్ ఎన్నో లావాదేవీలు, ఎన్నో సమస్యలు. ఎన్నో కోర్టు వ్యవహారాలు. అస్సలు వాళ్లు ఎక్కడో వుంటే నౌకర్లు చూసే పనులు కావివి. మీరే లేకపోతే ఈ బంగళా పాడుబడుతుంది. ఈ వైభవం అంతరించిపోతుంది."

    "మోహనవంశీగారికి నాకంటే ముందు పుట్టిన ఒక కొడుకు వున్నాడనే విషయం మీరు మరచిపోయినట్టున్నారు."

    "వికాస్ బాబు" ధర్మలింగం నిశ్చేష్టుడైనట్లుగా చూసాడు.

    "ఏం? ఆయన ఈ ఎస్టేట్ కు వారసుడు కాదా?"

    "కాదని కాదుకానీ"

    "ఇఖ మీరేమీ సంశయించవద్దు. రేపే వెళ్లి ఆయన్ని తీసుకురండి."

    "ఆయన వ్యాపారరీత్యా ఎక్కువగా విదేశాల్లో వుంటున్నట్లు విన్నాను"

    "మీరైతే వెళ్లి కనుక్కోండి. నన్ను ఇక్కడ వుంచేయాలని తాపత్రయపడేకంటే ఆయన్ని రప్పించే ప్రయత్నం చేయడం మంచిది"

    ఎప్పుడో ఇరవయ్యేళ్లక్రితం ఇక్కడ సంబంధాలన్నీ త్రెంపుకుని వెళ్లిపోయిన పెద్ద రాణి తన కొడుకును ఇక్కడ ఎస్టేట్ వ్యవహారాలు చూడడానికి పంపిస్తుందా? అతడిని మాతామహులు దత్తత తీసుకున్నారని విన్నాడు. అక్కడ స్థిరచరాస్థులకేమీ కొరతలేదు. ఒక మాజీ సంస్థానాధీశుడు వాళ్ల తాతగారు.......

    "ఆయన వచ్చి మన ఎస్టేట్ వ్యవహారాలు చూస్తారని నాకు నమ్మకంలేదు చినబాబు. మీరు వెళ్లిపోతే ఇక్కడంతా పాడుబడిపోతుంది . మీ తండ్రిగారు ఎంతో ఇష్టంగా, ఎన్నో వ్యయప్రయాసలకు కోర్చి కట్టించుకున్న ఈ బంగళా గంధర్వ, ఎవరూ వుండకపోతే భూత్  బంగళాగా మారిపోతుంది. మీ దాయాదులు ఎప్పటినుండో ఈ ఎస్టేట్ మీద కన్నేసి వుంచారు. మీకసలు వారసత్వమే లేకుండా చేయాలనే ప్రయత్నంలో వున్నారు వాళ్లు. మీరిక్కడే వుంటే మీ వెనుకుండి పోరాడతాం. మీరే లేకుండా పోయాక ఇంకేం చూసుకుని పోరాడమంటారు?"

    "ఈ ఎస్టేట్ వద్దు, ఈ వారసత్వం వద్దు. వీళ్లు స్త్రీలపట్ల చేసిన అకృత్యాల ఘనకీర్తి వద్దు. నాకు తక్షణం ఇక్కడినుండి పారిపోతే తప్ప బ్రతికిపోననిపిస్తుంది" వికీ కణతలు నొక్కుకోసాగాడు.

    "మీ మనసును ఏదో సంఘటన గాయపరచినట్లుంది. నాతో చెప్పండి చినబాబుగారు. సమస్య ఏదైనా ఏర్పడితే నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను"

    "మీరేకాదు. ఎవరూ పరిష్కరించలేని సమస్య ఇది."

 Previous Page Next Page