వీళ్లూ ఇంటికి బయలుదేరారు.
"ఇక్కడికి వినోదిని వాళ్లు ఎందుకు వచ్చారు డాడీ? ఆ అమ్మాయి నా మెడలో పూలదండ వేయడం....అదీ నాకేమీ అర్దంకావడంలేదు" దారిలో అన్నాడు శ్రీచక్ర.
"ఒక పెళ్లికాని అబ్బాయి మెడలో ఒక పెళ్లికాని అమ్మాయి పూలదండ ఎందుకు వేస్తుంది? పెళ్లి కుదిరితే, పెళ్లి అయితే....."
శ్రీచక్ర ముఖం వెలవెలబోయింది. "అమ్మా! నువ్వయినా చెప్పు నాకేమీ అర్దంకావడంలేదు."
"ఇప్పుడివన్నీ ఎందుకులే బాబూ! ఇంటికి వెళ్లాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు."
"డాడీ! మీరైనా చెప్పండి విషయమేమిటో?"
"మీ అమ్మ మాటే నా మాట!"
"ఆ... పెళ్లాం మాటంటే ఎంతో ఇదో?" ఆవిడ మూతి త్రిప్పడంతోపాటు కోపంగా ముఖమూ త్రిప్పేసుకుంది.
వినోదిని చూపులూ, తన మెడలో పూలదండ వేయడం, తరచి చూస్తే అతడి మనస్సెందుకో ప్రమాద సంకేతాన్ని ఇవ్వసాగింది.
ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తరువాత క్రిందికి వచ్చి తల్లితో కబుర్లాడుదాం అనుకునేంతలో ఆమే వచ్చింది. టీ కప్పుతో.
సింగపూర్ విశేషాలు అతడు చెప్పడం, ఆమె వినడం జరుగుతున్నా, అతడి మనస్సు మాత్రం వినోదిని గురించే ఆలోచిస్తోంది. చివరికి పట్టలేనట్లుగా "డాడీ అన్నమాటకు ఇప్పుడైనా అర్దం చెప్పమ్మా.....?" అన్నాడు.
"నేను చెప్పను మీ నాన్నే చెబుతారు విను."
"నువ్వెందుకు చెప్పవు?"
"అదంతా నాకు తెలియదు. ఆయన్నే అడుగు" ఆవిడ ఏదో పని వున్నట్లుగా లేచి క్రిందికి వెళ్లిపోయింది. అది కొడుకు మనస్సుకి బాధ కలిగిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే చెప్పలేదు. తండ్రితో మాట్లాడడానికి రాత్రికిగానీ వీలులేదు.
"అనుకోకుండా అలా జరిగిపోయిందిరా! అంతటివాడు ఇంటికి వచ్చి అడిగితే కాదనలేకపోయాను. నీకీ విషయం చెప్పి నీ అంగీకారం తీసుకుందామంటే టైం లేకపోయింది."
శ్రీచక్ర ముఖం రక్తం ఇంకిపోయినట్లుగా అయింది.
"నాతో ఒక్కమాట చెబితే బాగుండేది డాడీ?"
"చెబితే వద్దనేవాడివా?" తీక్షణంగా మారింది ఆయన ముఖం.
"ఆ..... .వద్దనేవాడిని."
"ఎందుకని? ఆ పిల్లకు ఏం తక్కువని?"
"ఆమెకు ఏం తక్కువా, ఏం ఎక్కువా అని కాదు. ఆమెను నా భార్యగా వూహించుకోలేకపోతున్నాను అంతే!"
"ఆ పిల్ల పూతనా, లంఖిణా భార్యగా వూహించుకోలేకపోవడానికి. కోట్ల ఆస్తులున్న పిల్ల. ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగుపెడితే మనిల్లు బంగారమే అయిపోతుంది."
"ఇష్టంలని పిల్ల రాక్షసితో సమానంకాక ఇంకేమిటి?"
"అయితే ఇప్పుడేమంటావు? నిన్నడగకుండా మాటివ్వడం నాది బుద్దితక్కువే. దానికి శిక్షగా నా మాట పోగొట్టుకోమంటావా మాట తప్పినవాడిగా నన్ను ప్రపంచం ముందు నిలబెట్టి, కొడుకుగా నీ రుణం తీర్చుకోరా!"
ఆరేడు నెలలపాటు పరాయి దేశంలో గడిపి వచ్చాడు. మనసారా కబుర్లు చెప్పుకోవలసినవి ఎన్నో వుండగా యిలా నిష్టూరం అయ్యే సందర్బం రావడం అతడికి బాధ కలిగించింది.
"మీరేమైనా శ్రీరామచంద్రులా మాట తప్పకుండా వుండటానికి?"అబ్బాయి ఇష్టపడడంలేదని చెప్పండి. ఈ సంబంధం తప్పిపోవాలని నేను కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను" అంది పద్మావతి.
"వాడికి నచ్చచెప్పడానికి బదులు నువ్వే నేర్పి కూర్చునేలా ఉన్నావు" ఖయ్ మని లేచాడు మారుతీరావు.
"నేర్పడానికి వాడేం చిన్నపిల్లాడా?తనకెలాంటి భార్య కావాలో నిర్ణయించుకునే వయసు వాడికి రాలేదనుకుంటే అంతకంటే పొరపాటు లేదు.
ఈ చదువు చదవరా! ఈ డ్రెస్సు వేసుకోరా అని చెప్పినట్లే ఈ పిల్లను చేసుకోరా అని చెప్పడానికి ఎలా కుదురుతుందనుకున్నారు? వాడికి కొన్ని ఇష్టాఇష్టాలుంటాయి. "
"పెళ్లయి ఆలుమగలు ఒకటైతే అన్ని ఇష్టాలు వాటంతట అవే ఏర్పడతాయి. మాటిచ్చాను. అయిపోయింది. బుద్దిగా నీ కొడుకుని పెళ్లి కొడుకును చేయి. పెద్దెనిమిదిన ఆ పిల్ల పుట్టినరోజు ఉంక్షన్ లో ఇద్దరూ రింగులు మార్చుకునే కార్యక్రమం వుంటుంది" సీరియస్ గా అన్నాడు మారుతీరావు.
కళ్లెదురుగా తన సర్వస్వం తగలబడిపోతుంటే ఆ మనిషి ఎలా వుంటాడో, అలా వున్నాడు శ్రీచక్ర దిగులుగా, విషాదంగా.
సింగపూర్ నుండి వచ్చాక కౌస్తుభను అమ్మా నాన్నలకి పరిచయం చేయాలనీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని ఎన్నెన్నో అనుకున్నాడు. ఏం జరిగింది?
కొడుకు ముఖం చూస్తుంటే పద్మావతి గుండె తరుక్కుపోయింది.
అంత వ్యధాభరితంగా ఎన్నడూ కనిపించలేదు.
"ఆరునెలల తర్వాత వచ్చిన కొడుక్కి చాలా చక్కటి స్వాగతం చెప్పారులెండి. ఈ పెళ్ళి ఇష్టంలేదని వాడి ముఖం చూస్తేనే తెలియడంలేదు. బలవంతంగా ఇష్టంలేని పిల్లను కట్టబెట్టి వాడి జీవితం నరకం చేయకండి ఆ పిల్లను చేసుకోవడం లేదని మీ ఫ్రెండ్ కి ఖచ్చితంగా చెప్పేయండి.
విమానాశ్రయంలో ఆ పిలల స్వయంవరానికి నిలబడ్డట్టుగా పూలదండ పట్టుకుని నిలబడితే నాకెంత చిరచిరలాడిపోయిందో? దండ పీకి అవతల పారేద్దామనిపించింది."
"దండ పీకి అవతల పారేసి చూడాల్సింది ఏం జరిగేదో?"
"ఏం జరిగేది? నన్ను కొట్టేవారా? చంపేవారా?"
"నేను కాదు చంపేదీ, కొట్టేది. వాడు... .ఆ దిగంబరంగాడు చేసేవాడు. నిన్ను కాదు నన్ను. చంపి నీ మెళ్ళో పుస్తెల దండ పుటుక్కున తెంపేవాడు."
"రామ రామ ఏం మాటలండీ ఇవీ?" పద్మావతి వినలేనట్లుగా చెవులు మూసుకుంది.
"మరి ఏమిటనుకున్నావు ఆ దిగంబరంగాడంటే? ఇప్పటికే మూడు హత్యానేరాలు వాడిమీదున్నాయి. కోపంవస్తే పచ్చినెత్తురు తాగే మనిషి."
"అలాంటి మనిషితో మీరెలా వియ్యమందాలను కున్నారు? అంతా తెలిసీ ఒక హంతకుడి కూతురు నాకు కోడలా?" భయంతో కళ్లు పెద్దవి చేసింది.
"హంతకుడని వాడి ముఖాన బోర్డుందా? వాడి చేతులకి నెత్తురుందా? ఏం నాజూకులు పడతావే పద్మావతీ! ఈ సంబంధం చెడగొట్టాలని నువ్వేం తోక ఆడించినా ఈ ఇంట్లో ముగ్గిరిలో ఒకరు లేస్తారు. గుర్తుపెట్టుకో."
"ముగ్గురికి ఒకరెందుకు?ముగ్గురం ఇంత విషంతిని చద్దాం. పీడాపోతుంది."
"మీరంతా ఎందుకు చస్తారు? మాటిచ్చిన తప్పుకు నేనే చస్తాను. మీరు నిండు నూరేళ్లు జీవించండి"
"ఏం అశుభం మాటలండీ అవి? ఇవాళ శుక్రవారం కూడాను."
"చూడు. ఇంత జరుగుతున్నా వాడు రాయిలా ఎలా కూర్చున్నాడో? నోరు తెరిచి ఒక్కమాట! 'మీరింత బాధ ఎందుకు పడతారు డాడీ! నేనా పిల్లను పెళ్లిచేసుకుంటానని ఒక్కమాట చెబితే ఈ గుండెలమీద బరువును తీసేసినట్లు అయి నేనెంత సంతోషపడతాను?'
"నేను రాయినైనా బాగుండేది? ఈ మనస్సుకింత బాధ వుండక పోను" గొణిగినట్లుగా అని లేచాడు శ్రీచక్ర.
"నేనలా బయటికి వెళ్లొస్తాను."
కౌస్తుభను కలవడానికి వాళ్లమేనమామ పెట్టిన గడువు పూర్తి అయింది.
పెళ్లి కలవొచ్చు.
కానీ తండ్రి మరొకరితో వియ్యమందాలని చూస్తుంటే తను మరొకరితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం లేనిపోని సమస్యలను సృష్టిస్తుందనిపించింది.
* * * * *
దిగంబరం చెప్పిన పద్దెనిమిదో తేదీ సమీపిస్తుంటే శ్రీచక్రకి దిగులెక్కువై పోయింది.
ఇష్టంలేని పెళ్లినుండి ఎలా తప్పించుకోవాలో ఎంత ఆలోచించినా పాలుపోవడంలేదు.
"ఇష్టంలేని పిల్లనుచేసి వాడి జీవితం నాశనం చేయకండి" అంటూ పద్మావతి ఈ సంబంధం తప్పించడానికి ప్రయత్నిస్తూనే వుంది ఓ వైపు.
"మాటిచ్చేశాను. ఇప్పుడు నేనేమీ చేయలేని నిస్సహాయుడిని. అంతా దిగంబరం చేతిలో వుంది. మనవాడు ఇష్టపడడంలేదని తెలిస్తే చాలు ప్రతీకారంతో వూగిపోయే మనిషి వాడు.
కావాలంటే నీకొడుకునే వెళ్లి చెప్పమను ఆ పిల్లను చేసుకోవడం తనకిష్టంలేదని."
"వెళ్లిచెబుతాడు. వాడికేమైనా భయము?"
"భయపడాల్సింది ఏమీలేదు. కానీ నా శ్రాద్దానికి అన్నీ రెడీగా పెట్టుకుని వెళ్లమను."
"మీది మరీ చోద్యం కాకపోతే ఇష్టముంటే చేసుకుంటాం. లేకుంటే లేదు. ఇష్టంలేదని చెపితే చంపడం ఏమిటండీ? ఎందుకు చంపుతాడు? ప్రాణాలతో చెలగాటమంటే అంత తేలికా అతడికి?"
"దిగంబరం సంగతి నీకు తెలియదులే. తెలిస్తే ఇలా మాట్లాడవు. వాడికి కూతురంటే పంచప్రాణాలు. ఆ పిల్లకి ఎవరయినా బాధ కలిగిస్తే వాడు ఏమాత్రం సహించడు."
"మనం కావాలని బాధ కలిగించిందేముంది? వాడికి యిష్టంలేదు అంతే!"
"అంతే అని అంత తేలిగ్గా వదిలేసే పరిస్థితి కాదిది."
మారుతీరావలు ధోరణేమో అలా వుంది.
"నువ్వా బర్త్ డే ఫంక్షన్ కి వెళ్లకుంటే సరి. జ్వరం వచ్చిందని పడుకో. డాక్టర్ని పిలిచి ఆ హడావుడి అంతా నేనుచేస్తాను.