"నేను వచ్చి సాయంత్రం మాట్లాడుతానంటే నీకెందుకు అంత తొందర. దాన్నేదో అని వుంటావు. అది నోటి కొచ్చినట్టు వాగి వుంటుంది. "కేశవరావు విసుగ్గా అన్నాడు పెళ్ళాం కంప్లయింట్ విని.
"తొందరేమిటండి --- మోపెడ్ మీద నడుం చుట్టూ చేతులు వేసుకు కూర్చుని వస్తే చూస్తూ వూరుకోమంటారా"
"నీ వూరికే గొడవ చెయ్యకు నేను దానితో మాట్లాడుతానులే.'
"నా గొడవ కాదు. చేతులు కాలాక ఆకులూ పట్టుకుని లాభం వుండదని గ్రహించి మేల్కోండి."
"ప్రీతి" అసహనంగా పిల్చాడు కేశవరావు భార్య యిచ్చిన "కీ" తో కిర్రెక్కింది అతనికి.
టీవీ చూస్తున్న ప్రీతి తండ్రి రెండుసార్లు పిలిచాక లేచి వెళ్ళింది. తల్లి దండ్రుల మొహాలు గంబీరంగా వుండడం చూసి తల్లి తండ్రితో కంప్లైంట్ చేసిందని అర్ధం చేసుకుంది. కాస్త మనస్సు చెదిరింది.
తండ్రి మొహం అలా ఎప్పుడూ చూడలేదు.
"ప్రీతి అలా కూర్చో --- నీతో కొంచెం మాట్లాడాలి" గంబీరంగా అన్నాడు కేశవరావు. 'చూడు ప్రీతీ నీకు చిన్నప్పటినించి అన్ని విషయాలలోనూ ఫ్రీడం ఇచ్చాం అవునంటావా.'
"ఎస్ డాడీ" ప్రీతి ఈ సంభాషణ ఎటు దారితీస్తుందా అనుకుంటూ బుద్దిగా అంది.
'మరి నీమీద మేము నమ్మకం వుంచి యిచ్చిన స్వేచ్చని నీవు దుర్వినియోగం చేయొచ్చా. నీకు ఏది కావాలంటే అది కొన్నాం. ఏం చదువుతానంటే అదే చదవమన్నాం---- ఏ బట్టలు కావాలంటే అవే కొన్నాం. గిటార్ నేర్చుకుంటానంటే సరే అన్నాం. మా కిష్టం లేకపోయినా చక్కని జుట్టు కత్తిరించుకున్నా వూరుకున్నాం. నీ ఫ్రెండ్స్ తో పార్టీలు, షికార్లు, తిరిగినా ఎప్పుడూ వద్దనలేదు. అవునా, కానీ ప్రీతి దానికీ ఒక లిమిట్ ఉంటుంది. నీవిప్పుడు ఆ లిమిట్ దాటిపోయావు అనిపించడం లేదా నీకు" శాంతంగా స్థిరంగా అడిగాడు.
"నేనేం చేశాను డాడీ" అమాయకంగా చూసింది.
"ఈ ఫోటోలేమిటి మరి" ఇలా మగపిల్లలతో ఇంత క్లోజ్ గా మూవ్ అవడం తప్పు కాదనుకుంటూన్నావా! మీ అమ్మ చెప్తుంది. ఇవాళ విక్కీ మోపెడ్ మీద వచ్చావుట.'
"ఫ్రెండ్లీగా ఫోటోలు తీయించుకోవడం తప్పేనా? విక్కీ యిటు వస్తుంటే బస్సు కోసం వెయిట్ చేయడం ఒకరోజన్నా తప్పుతుందని వచ్చాను. అదీ తప్పేనా" కళ్ళనీళ్ళు తిరుగుతుండగా ఉక్రోషంగా అంది.
"ఫ్రెండ్లీగా వుండొచ్చు ప్రీతీ! కానీ ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య స్నేహనికి కొన్ని లిమిట్స్ వున్నాయి. అబ్బాయి, అమ్మాయి ఇలా క్లోజ్ గా తిరిగితే జరిగే అనర్ధం నీకు తీలియనంత చిన్నదానివి కావు కదా. మేం కన్నవాళ్ళం కనక నీవు తప్పడగు వేయకూడదని నీ బాగుకోసమే కొన్ని అంక్షలు పెడతాం. అది గుర్తించకుండా మీ అమ్మతో ఏవేవో ఇష్టం వచ్చినట్లు అన్నావుట."
"మమ్మీ నన్ననవసరంగా ఇరిటేడ్ చేసింది. 'తల్లి వంక చురచుర చూస్తూ అంది.
"ఏమిటే అనవసరంగా ఇరిటేడ్ చేయడం. ఎందుకని అడగడం తప్పా" సుజాత గయ్యమంది.
"అబ్బ నీ వుండు సుజా! నే మాట్లాడురున్నాగా . మమ్మీ ఏం అన్నా నీమంచి కోసమేగదా. చూడు విక్కీ మంచి పిల్లాడే అవొచ్చు కాని మనది వాళ్ళది భాష, కులాలు, మతాలూ అన్నీ వేరు. మనకి వాళ్ళకి కలియదు. ఇంతకీ విక్కీ చదివేది బి.కాం ఏం చదువుతాడో , ఏం ఉద్యోగం చేస్తాడో ."
"డాడీ విక్కీ తో ఫోటో తీయించుకుంటే పెళ్ళి చేసుకుంటాననేనా అర్ధం" సూటిగా చూసింది.
"ఆ అర్ధం లేకపోతే మంచి మాటే. కాని మీ అమ్మతో ఏదో అన్నావట.'
'అవసరమైన ఐడియాలు మమ్మీయే ఫీడ్ చేస్తుంది. నాకు ఇప్పుడసలు - నేనేం పెళ్ళి చేసుకుంటాననలేదు" ప్రీతి కోపంగా అంది.
"సరే నీవు చదువుకున్న పిల్లవి వయసు వచ్చింది నీమంచి చెడ్డా ఆలోచించుకోవాలి ఓ స్టెప్ వేసేముందు నీ మనసులో ఏ చెడ్డ ఆలోచనలు లేకపోయినా ఇంత స్వేచ్చగా మగపిల్లలతో తిరిగితే మన సొసైటీ హర్షించదు. సొసైటీ సంగతి అలా వుంచి ఓ వయస్సులో వున్న అబ్బాయి అమ్మాయి మరీ క్లోజ్ గా తిరిగితే పరిణామాలు ఎలా మారతాయో చెప్పలేం. నీ మంచి కోసమే తల్లిదండ్రులుగా చెప్పడం మా బాధ్యత. సో యూ కీపిట్ అల్ దిస్ ఇన్ యువర్ మైండ్ "ఈ కాలం పిల్లతో ఇంతకంటే చెప్పనవసరం లేదు. కొట్టి తిట్టి చెప్పే రోజులు కావని తెల్సిన కేశవరావు అంతటితో ముగించాడు. తల్లి వంక చురచుర చూసి బయటికి వెళ్ళిపోయింది ప్రీతి.
"మనం ఇంక ప్రీతికి సంబంధాలు చూడ్డం మంచిది. ఈ ఎమ్మే అయ్యేలోగా చూస్తుంటే పరీక్షలవగానే చేసేద్దాం. పరిస్థితి చెయ్యి దాటకముందే మనం మన బాధ్యత తీర్చుకుంటే మంచిది. మీ దగ్గర భయానికి అలా అంది కాని దాని ధోరణి చూస్తె ఏ నిమిషంలో ఏం చేస్తుందో అని భయంగా వుంది నాకు."
'సుజా నీతో వచ్చిన ప్రాబ్లం అనవసరంగా వర్రీ అయిపోవడం, ఏదేదో ఊహించుకుని.....ఇంక ఇరవై ఇకటన్నా నిండలేదు. ఎమ్మే అవనీ ఆలోచిద్దాం పెళ్ళి సంగతి' కాస్త అసహనంగా అన్నాడు.
సుజాత అప్పటికి ఊరుకున్నా కూతురి పెళ్ళి ఈ ఏడాది లోగా చేసెయ్యడం మంచిదన్న ఆలోచన ఆమె మనసుని తొలుస్తూనే వుంది. అక్కకి అన్నకి కూతురికి మంచి సంబంధాలు చూడమని ప్రీతి ఫోటోలు డిటైల్స్ పంపింది.
నెలరోజుల తర్వాత వీళ్ళ వాళ్ళు రాసిన ఆరేడు సంబంధాలలో ఇద్దరు అన్ని విధాల బాగున్నవి సెలక్టు చేసి భర్తకి చూపింది. "ఇప్పుడే మొదలుపెట్టావా దాని చదువవనీ అన్నానా. దాన్ని ఫైనల్ ఇయర్ లో డిస్ట్రబ్ చేయడం నా కిష్టం లేదు."
'అబ్బ మంచి సంబంధాలండి. ఈ అబ్బాయి ఐఏఎస్ ఎంత పొడుగ్గా స్మార్టుగా వున్నాడో చూశారా. ఫాదర్ మదర్ ఇద్దరూ డాక్టర్లు" మంచి ఫామిలీ. ఈ రెండో అబ్బాయి ఏమ్ టెక్ చేసి ఎంబీయే చేసి డిల్లీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు. తండ్రి మంచి హోదాలో వున్నాడు. ఇద్దరూ ఎంత బాగున్నారో , మన ప్రీతికి ఈడూ జోడు బాగా కుదురుతుంది. సంబంధం చూసి నిశ్చయం అయితే, పెళ్లి పరీక్షలయ్యాక చేయొచ్చు. అసలు ముందు మీ అమ్మాయి గారు ఏమంటుందో . ఇంత మంచి సంబంధాలు కావాలన్నప్పుడు దొరుకుతాయా అసలే తిక్కది ఏం అంటుందో అని భయంగా వుంది.
"ఫోటోలు చూపించి అభిప్రాయం అడుగు. అది ఇప్పుడే చేసుకోనంటే మనం బలవంతంగా చెయ్యలేం కదా అడిగి చూడు."
"మీరే అడగకూడదా. నాకు తిక్క సమాధానాలు ఇస్తుంది. వీళ్ళెం నచ్చలేదు నాకు అనేస్తుంది పొగరుగా."
'అబ్బ అన్నింటికి నీకు అనుమానాలే ---- తల్లివి నీవడగాలి కూతుర్ని --- అది అలా అంటే నేచేపుతాలే. అడిగి చూసి తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.
"ప్రీతీ , ఇదిగో ఇలారా. ఈ రెండు ఫోటోలు చూడు మామయ్యా పంపించాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక" డ్రాయింగు రూములో కూర్చుని సౌమ్యంగా పిల్చింది కూతుర్ని సుజాత. "ఏం ఫోటోలు మమ్మీ' ప్రీతి కుతూహలంగా దగ్గరికి వచ్చి కూర్చుని ఫోటో చేతిలోకి తీసుకుంది.
"మమాయ్య నీకోసం ఈ పెళ్ళి కొడుకుల ఫోటోలు పంపాడు. ఇదిగో ఈ అబ్బాయి ప్రీతమ్ ఐఏఎస్ . రెండోది అజయ్ శర్మ ఇంజనీర్" తల్లి వివరాలు చెప్తుంటే ప్రీతి ఇంటరెస్టు గా పొటోలు చూస్తూ వింది.
"ఓ యింటరెస్టింగ్ , బొత్ ఆర్ స్మార్టు గైస్. ఎస్ ఫేషన్ల ఈ ఇంజనీరు బాగున్నాడు కదూ" మమ్మీ వైట్ స్మార్టు."
'నీకు నచ్చాడా , అయితే మామ్మయ్యని వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మనమని చెప్పమంటావా" కూతురు అంత సుముకంగా మాట్లాడుతుందని ఎదురు చూడని సుజాత సంబరంగా అంది.
"ఐ డోంట్ మైండ్ సీయింగ్ హిమ్ ప్రీతి" అంది.
'అమ్మా తల్లీ బతికించావు ఇంకా ఏమంటావో ఒప్పుకోకపోతే ఇంత మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ దొరకవు గదా అనుకుంటున్నాను" పెద్ద బండరాయి దిగినంత తేలిగ్గా నిట్టూర్చి ఆనందంగా అంది.
"ఏం ఎందుకు ఒప్పుకోను నాకు నచ్చితే" ప్రీతి సందేహంగా చూసింది.
"ఏమో నీవు నీ బాయ్ ఫ్రెండ్స్, నీ ధోరణి చూసి అనుమానం వచ్చింది.'
డోంట్ బి స్టుపిడ్ మమ్మీ" తన మామూలు ధోరణిలో అంది ప్రీతి ఎప్పటిలా నవ్వి.
ఈసారి ఆమాటకి కోపం రాలేదు సుజాతకి. తను నిజంగా స్టుపిడే! ఈకాలం పిల్లల తెలివి ముందు తమ తరం వాళ్ళు నిజంగా స్టుపిడ్స్ , ఈ కాలం పిల్లలకి తమ కేం కావాలో తమకి తెలుసు! వీలున్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చెయ్యడ,మూ తెలుసు! లైఫ్ లో సుఖపడడానికి తమకేం కావాలో కూడా తెలుసు. బాయ్ ఫ్రెండ్స్ తిరగాదానికే నని పెళ్ళికి గావాల్సింది జీతం, హోదా , సుఖం అన్న సంగతి ఈకాలం పిల్లలకి ఎంత బాగా తెలుసు . తను స్టుపిడ్ అయినా కూతురు స్టుపిడ్ కానందుకు ఆ తల్లికి ఆనందమే కల్గింది ఆ క్షణంలో.
(ఉదయం వారపత్రిక )***