Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 22


    ప్రీతికి తల్లి దంతా చాదస్తంగా , తల్లి భావాలు సిల్లీగా తల్లి ఆలోచనలు స్టుపిడ్ గా, క్రోడ్ గా అనిపిస్తున్నాయి. తమ కాలంలోలా ఇంట్లో పడి వుండాలి. కాలం మారినా మనుష్యులు మారరేం! డిగ్రీ వున్న అమ్మాయిలా ఆలోచిస్తుందేం. బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే తప్పా! నలుగురు సరదాగా ఏ సిన్మాకో వెళితే అంత రాద్దాంతం ఎందుకు? సినిమాకి అబ్బాయిలతో వెళ్ళితే కొంపలు మునిగిపోతాయా , ఎంజాయ్ చెయ్యకుండా పుస్తకాల పురుగుల్లా ఇంట్లో కూచుని చదవాలా ఇరవై నాల్గు గంటలు! అప్పుడే బుద్ది మంతురాలి కింద లెక్క---ఈ మమ్మీలంతా ఇంతే ఎప్పుడూ - డాడీనే నయం కాస్త! ప్రీతి ఆలోచనలలా వుంటాయి!

                                                                               *    *    *    *

    ఆరోజు టేబిల్ మీద గుట్టలా పడివున్న పుస్తకాలు సర్దుతుంటే ఓ పుస్తకం లోంచి జారిపడ్డ రెండు మూడు ఫోటోలు చూసి చాకితురాలైంది సుజాత. మొన్న పిక్నిక్ వెళ్ళినపుడు తీసుకున్నవి కాబోలు. ఓ ఫోటోలో అందరూ గ్రూప్ గా అమ్మాయిల మధ్య అబ్బాయిలూ , అబ్బాయిల పక్కన అమ్మాయిలూ కూర్చుని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని తీయించుకున్నారు. మిగతా రెండు ఫోటోలు విక్కీ, ప్రీతీ ఇద్దరూ, ఒకదాన్లో ఒకరి నడుం ఒకరు పట్టుకుని , రెండో దాన్లో విక్కీ, ప్రీతి భుజాల చుట్టూ చెయ్యి వేసి చాలా దగ్గరగా , క్లోజ్ గా కనిపిస్తూ తీయిన్చుకున్నవి. సుజాత మొహం ఎర్రబడింది. ఎంత ధైర్యం దీనికి! ఇంత క్లోజ్ గా ఇంత చనువుగా ఇలా ఫోటోలు తీయించుకునే వరకు వెళ్ళిందన్న మాట వీళ్ళ పరిచయం--- పరాయి మగపిల్లలతో భార్య భర్తలు తీయించుకున్నంత చనువుగా ఫోటోలు తీయించుకుంటుందా! విసవిస ఫోటోలు పట్టుకుని ఆఫీసుకి తయారవుతున్న కేశవరావు దగ్గరికి వచ్చింది.
    చూడండి .....ఇవి చూడండి నే చెబితే నా మాట తేలిగ్గా కొట్టి పారేస్తారు --- దీని వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూడండి ఆవేశంగా అంది ఫోటోలు విసురుగా అతని ముందు పడేసి.
    ఏమిటీ ఏమయింది టై బిగించుకుంటూ ఫోటోల కేసి చూశాడు.
    చూశారా ఎంజాయ్ చేయనీ, చిన్నపిల్లలు, ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు సరదాలు అంటూ నానోరు మూయించారు. ఇప్పుడేమంటారు. కోపంగా నిలేసింది. ఫోటోలు చూసి ఒక్క క్షణం కేశవరావు నుదురు చిట్లించాడు. అతనికి కూతురు అలా అబ్బాయిలతో అంత క్లోజ్ గా ఫోటోలు తీయించుకున్నందుకు కాస్త షాక్ లాంటిది కల్గింది. ఏదో ఒక్క ఫేమీలీలా మసులుతున్నారు వాళ్ళ గ్రూప్ అందరూ. సరదాగా తీయించుకుని వుంటారు. అనవసరంగా మరీ టూమచ్ గా అలోచించి వర్రీ అయ్యేందుకు నాకేం కనపడలేదు. మొహంలో భావం ప్రసన్నంగా మార్చి అన్నాడు. తేలిగ్గా తీసుకున్నట్టు. భార్య దగ్గర తన భావం బైటపడితే ఇంకా సాధిస్తుందని అతని భయం.
    ఇంకా కూతుర్ని వెనకేసుకోస్తున్నారా? ఈ ఫోటోల్ని ఎవరన్నా ఏ మొగుడు పెళ్ళాలనో అనుకుంటారు గాని ఫ్రెండ్స్ ని , సరదా అని ఎవరూ అనుకోరు. మీకు కూతురి మీద ప్రేమతో కళ్ళకి పొరలు కమ్మేశాయి. ఇలాగే వూరుకోండి . నాకేం బాధ మధ్య.
    అబ్బ, సరే వేల్దువు. వూరికే గొడవ చేయకు. రాత్రి ప్రీతిని పిలిచి అలా చెయ్యకూడదని చెప్తాను. నీవూరికే దాంతో గొడవపడకు. బూట్స్ లెస్ బిగించి లేచి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
    రాత్రి భర్త ప్రీతితో మాట్లాడేవరకూ ఓపిక పట్టే ఓర్పూ లేకపోయింది సుజాతకి. సాయంత్రం విక్కీ మోపెడ్ మీద నించి దిగి ఉషారుగా ఇంట్లోకి వస్తోన్న ప్రీతిని చూసేసరికి ఆవేశం పట్టలేకపోయింది. చరచరా ప్రీతి వెనకాతల ఫోటోలు పట్టుకుని ఆమె గదిలోకి వెళ్ళింది. ప్రీతి! గట్టిగా పిలిచింది సుజాత కోపంగా.
    ప్రీతి వెనక్కి తిరిగి, తల్లి కోపం అర్ధం కానట్టు చూసింది . అంతలోనే తల్లి మంచం మీదకి విసిరిన ఫోటోలు చూసి కాస్త గతుక్కుమంది.
    "ప్రీతి , ఏమిటీ ఫోటోలు - సిగ్గులేకుండా మగపిల్లలతో ఈ ఫోటో లేమిటి విక్కి మోపెడ్ మీద ఎందుకు వచ్చావు?" కోపంతో మాట తడబడింది సుజాతకి.
    "ఏం వస్తే! లిప్ట్ యిస్తానన్నాడు. తనకిటే ఏదో పనివుండి వస్తున్నానంటే వచ్చాను తప్పా. ఎందుకలా చూస్తావు?" ప్రీతి విసురుగా జవాబిచ్చింది.
    "ఈ ఫోటోలేమిటి?"
    "మొన్న పిక్నిక్ లో సరదాగా తీసుకున్నాం" ప్రీతి నిర్లక్ష్యంగా అంది.
    "మగపిల్లలతో కౌగలించుకుంటూ ఫోటో తీయించుకోడం సరదానా?"
    'అబ్బ ఏమిటి మమ్మీ! ఫ్రెండ్స్ తో తీయించుకుంటే తప్పేం వుంది. విక్కీ ఏం కొత్తవాడా" విసుగ్గా మొహం పెట్టి అంది.
    "నీకు ఏళ్ళు వస్తున్నాయిగాని బుద్ది రావడం లేదు. చెపుతున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. వయసు వచ్చిన పిల్లవి. మగపిల్లలతో ఈ స్నేహలేమిటి? ఈ తిరుగుల్లెమిటి? ఈఫోటోలు ఎవరన్నా చూస్తె ఏమనుకుంటారు?' తీక్షణంగా అంది.
    "ఏం అనుకుంటారు ' రెట్టించింది తల్లి వంక హేళనగా చూసి.
    సుజాత కూతుర్ని మింగేసేట్టు చూసింది. "ఏం అనుకుంటారా నిన్నో మొన్నో పెళ్ళయిన జంటో, రేపో మాపో చేసుకోబోయే జంటో అనుకుంటారు."
    'పోనీ అనుకోనీ నాకేం నష్టం లేదు."
    "నీకెందుకు నష్టం. ఎవరేం అనుకుంటే నీకేం బాధ - నిన్ను కన్నందుకు మాకు బాధ, అవమానం గాని ఇవాళ ఫోటోలు. మోపెడ్ మీద తిరగడం వరకూ వచ్చింది . రేపు ఇంకా ఏం చేస్తావో.'
    "ఏం చేస్తానని నీ ఉద్దేశం!" ప్రీతి తల్లి వంక చురచుర చూసింది. సుజాత కాస్త తడబడింది.
    "ఏమన్నా చేస్తావు. అన్నింటికి తెగించిన దానివి. మన కులం, గోత్రం లేని వాడిని తీసుకొచ్చి పెళ్ళాడుతానంతావు.'
    ప్రీతి నిర్లక్ష్యంగా నవ్వింది. "నే పెళ్ళాడాలంటే కులం గోత్రం చూడను. నే చేసుకోవాలంటే మీ దగ్గర కొచ్చి అడగను లే - చేసుకునే తీసుకువస్తాను. "పొగరుగా అంది" బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంటూ.
    సుజాత పెదాలు అదిరాయి. కూతురలా కుండబద్దలు కొట్టి చెప్తుంటే యింకేం అనాలో తెలీలేదు. విక్కీ పంజాబీ, తల్లి క్రిస్టియను వాడిని పెళ్ళాడుతుందా కొంపదీసి. అందుకే అంత చనువు పెంచుకుంటుందా. ప్రేమిస్తుందా వాడిని. ఈ తిరుగుళ్ళు యింతవరకు వెళతాయని తనకు తెలుసు. అందుకే ముందే జాగ్రత్త పడాలంటే అయన మాట నిర్లక్ష్యం చేసి పారేశారు. కానీ, ఇప్పుడు ఏం జవాబు చెబుతారో.

                                                                              *    *    *    *

 Previous Page Next Page