రేపట్నుంచీ మా ఫ్యాక్టరీ లాకౌట్ ఎత్తేస్తున్నార్రా" చెప్పాడు మాధవరావు.
"నిజంగా ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి.
"అవును ఇప్పుడో సమస్య ఎదురయింది మళ్ళీ!"
"ఏమిటి"
"నేను ఆఫీసు కెళ్తే స్కూలు ఎవరు చూస్తారు. సీత ఒక్కర్తీ చూసుకోవడం కష్టం కదా."
"నిజమే" ఆలోచనలో పడ్డాడు రెడ్డి.
"అదీగాక ఈయేడు మనస్కూలు దగ్గర్లోనే మరో స్కూలు తెరిచారు. అంచేత కొంతమంది పిల్లలు తగ్గిపోవచ్చు కూడా . ఇంతమంది ఉంటేనే నెలకు మూడొందలు మిగలడం కష్టంగా ఉంది. మరి కొంతమంది తగ్గితే అసలు స్కూలు నడపడమే వృధా అవుతుందేమో" తన అనుమానం వెలిబుచ్చాడతను.
"మీ కష్టం మీరే అలొచించి ఏదో ఒకటి నిర్ణయించుకొండి మరి" ఆ విషయం వారికే వదిలేస్తూ అన్నాడు రెడ్డి.
వాళ్ళు వెళ్ళిపోగానే "చూశారా, అవిడెం అంటుందో ?" రోషంగా అంది సీత.
"ఏమంది" ఆశ్చర్యంగా అడిగాడు మాధవరావు.
"మనం ఈ ఖరీదయిన పర్నిచర్ ఈ స్కూలు మీద సంపాదనతోనే కొన్నామట" గట్టిగా నవ్వేశాడు మాధవరావు.
"ఎందుకలా నవ్వుతారు?"
"నిజంగానే స్కూలు మీద వచ్చిన డబ్బుతోనే కొన్నామా మనం?"
"బాగుంది మీకు తెలీదా?"
"కొన్నప్పుడు , మరి ఎవరలా అనుకొంటే మనకెందుకు? వాళ్ళనుకొన్నంత మాత్రాన నీ రచనల మీద వచ్చిన డబ్బు స్కూల్ డబ్బు అయిపోదు కదా? అవేమీ పట్టించుకోకూడదు. మనం ఎవరయినా తప్పుగా అనుకొంటే నవ్వుకొని ఊరుకోవాలి! అంతేగాని వాళ్ళతో యుద్దానికి దిగకూడదు. యుద్ధం చేస్తే వాళ్ళన్నమాటే నిజమేమోనని మరింత అనుమాన పడతారు వాళ్ళు."
"ఇదంతా మన స్కూల్ కి అయన సహాయం చెయ్యబట్టే కదా వచ్చింది రేపే వాళ్ళ రెండు వేలూ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. ఇక నుంచీ ఈ స్కూలు కూడా మూసివేద్దాం. మీకు కంపెనీ తెరుస్తున్నారు. నాకేమో రాసుకోడానికి టైమూ చాలటం లేదు. ఇంకెందుకొచ్చిన గొడవ ఈ పాడు స్కూలు."
"కాని సీతా ఇప్పుడు వాళ్ళ డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం?"
"నేనిస్తాను బ్యాంక్ లో ఇంకా డబ్బుందిగా"
"సరే నీ ఇష్టం" అయిష్టంగానే అన్నాడు మాధవరావు.
మరో విషయం. కొత్తగా మరో స్కూలు పెట్టారు కదా మన వీధిలో . మీరు ఇప్పుడే ఆ స్కూలు ఓనరు దగ్గర కెళ్ళి మన స్కూలు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తామనీ అందుకు ప్రతిఫలంగా ఎంత డబ్బిస్తారో అడిగిరండి"
"మన స్కూల్లో ముప్పై పై చిలుకు పిల్లలున్నారు కదా! అతనికి చాలా లాభం కలుగుతుంది కనుక మనం అడిగినంతా ఇచ్చినా ఇచ్చేస్తాడు........." తిరిగి అందామె.
"ఎంత అడగమంటావ్?"
"మన పెట్టుబడి ఇమ్మనండి! కాదంటే కొంత అటూ ఇటూ ఒప్పేసుకొండి"
అంతా సీత చెప్పినట్లుగానే జరిగింది.
పదిహేనువందలు ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు ఆ మరో స్కూలు యజమాని. నెలరోజుల్లోగా ఆ మొత్తం ఇచ్చేసేట్లు ఒప్పందం కూడా జరిగిపోయింది.
ఇదంతా సీత ఎందుకు చేసిందో తేలిగ్గానే ఊహించుకొన్నాడు మాధవరావు. కేవలం సుభాషిణి అన్న ఒక్కమాటే సీతని రెచ్చగొట్టింది. అందుకే ఆ స్కూలే ఉండకూదని నిర్ణయించు కొందామే. ఆ నిర్ణయం అమలు జరిపింది.
9
సోమవారం మాధవరావు కంపెనీ ప్రారంభించబడింది. ఆరోజు అతను సాయంత్రం ఇంటి కొచ్చేసరికి సీత మంచం మీద పడుకొని వుంది.
"ఏమిటి పడుకున్నావ్?" అడిగాడు మాధవరావు.
"ఇందాక కాఫీ పెడదామని వంటింట్లోకేల్తోంటే కళ్ళు తిరిగాయి. అక్కడే కూర్చుండిపోయాను! చాలాసేపు అదోలా ఉండేసరికి భయం వేసి వచ్చి పడుకున్నాను" కొంచెం బెదురుగా అందామె.
మాధవరావు ఆమె మెడ కింద చెయ్యి ఉంచి చూశాడు వళ్ళు చల్లగానే వుంది.
"ఎందుకయినా మంచిది! డాక్టరుని తీసుకొస్తానుండు" అప్పుడే బయట కెళ్లబోయాడతను.
"ఇప్పుడొద్దులెండి! మరోసారి కళ్ళు తిరిగితే పిలుద్దురు గాని" వారిస్తూ అందామె.
"అలాగయితే ఓసారి లేచి నుంచో"
ఆమె నుంచుంది గాని ఏమీ అనిపించలేదు. మరి కాసేపటి తర్వాత హటాత్తుగా వాంతి అయింది. వెంటనే తెలిసిపోయింది సీతకి, తన ఒంట్లో బాగోపోవడానికి కారణమేమిటో. ఎక్కడ లేని సిగ్గూ ఆవహించిందామెని.
"ఇదిగో! ఈ గొడవంతా ఏమిటనుకొంటున్నారు?" ఆనందంగా అంది మాధవరావుతో.
"ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడతను.
"నెల తప్పిందండీ!" రహస్యంగా అందామె.
"హారి......అదా....." గట్టిగా నవ్వేస్తూ అన్నాడతను. నన్ను భలే గాబరా పెట్టేశావే!"
"నాకు మాత్రమేం తెలుసు! ఇప్పుడు వాంతి అవగానే అనుమానమొచ్చింది" ఆమెని అమాంతం చిన్న పిల్లలా ఎత్తుకుని మంచం మీదకు చేర్చాడతను.