"చిరంజీవి! వాటిజ్ దిస్ నాన్సెన్స్!" అన్నాడు ఒగరుస్తూ.
"మేజర్ శివతాండవం ! అయిదు నిముషాలయిపోయింది! దయచేసి బయటికెళ్తే నేను ఆఫీస్ పని చూసుకోడానికి వీలవుతుంది!" అన్నాడు భవానీశంకర్ టైమ్ చూసుకుంటూ.
"శివతాండవంగారూ ! ఇతను భవానీ శంకర్ అనీ చీఫ్ ఎడిటర్ పోస్ట్ కి మంచి అర్హతలున్న వ్యక్తీ. అంచేత ఈ ఆరునెలల పాటు ఇతనిని మీ స్థానంలో ఎపాయింట్ చేశాను. ఆరునెలల తర్వాత మీరు యధాప్రకారం ఆఫీస్ కి రావచ్చు!" తాపీగా చెప్పాడు చిరంజీవి.
శివతాండవం టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తో చిరంజీవి తల పగలగొట్టాలన్న కోరికను బలవంతంగా అణచుకున్నాడు.
"అయితే ఇదంతా నీ ఇష్టమేనన్నమాట!" అన్నాడు కోరలు తీసేసిన పాములా బుసలు కొడుతూ.
"ఆఫ్ కోర్స్! మీకు తెలుసు కదా- నా పరిస్థితి! మీకు అదివరకే చెప్పాను! నా శక్తి మేరకు నా ఆస్తిని దక్కించుకోడానికి ప్రయత్నిస్తాను.!"
"నన్ను ఇలా తీసేసేందుకు నీకేం అధికారం లేదు?" ఇంకా మండి పడుతూ అన్నాడు శివతాండవం.
భావానీశంకర్ మళ్ళీ టైమ్ చూసుకున్నాడు.
"ఇప్పుడు సమయం - ఐదునిమిషాలు దాటి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు! బైదిబై! మేజర్ శివతాండవం! ఈ ఆరునెలల శెలవులో మీ మానసిక ఆరోగ్యం గురించీ ఉత్తమమయిన మానసిక వైద్యులతో పరీక్షలు జరిపించడం చాలా అవసరం! అది పూర్తిగా పట్టాలు తప్పి ఉన్నదని నా తిరుగులేని అభిప్రాయం! చిరంజీవికి నిన్నిలా బలవంతంగా శెలవులో పంపించే అధికారం లేదని మీరనటం నా అభిప్రాయాన్ని బలపరుస్తుంది. కనుక ఇక తమరు బయటకు వెళ్తే...."
"నేను వెళ్ళను !" భీకరంగా అరచాడు శివతాండవం. "ఇది నా ఆఫీస్! ఈ విషయమేదో కోర్టులో తేలేవరకూ నేనిక్కడ పని చేయాల్సిందే."
"మీ మానసిక ఆరోగ్యపరిస్థితి మరింత దిగజారిపోతోంది మేజర్ శివతాండవం! మీరు బయటకు వెళ్ళేందుకు మన రామభక్త హనుమాన్ మీకు చాలా ఉపయోగపడతాడని నా నమ్మకం!' అంటూ ఇంటర్ కం లో సెక్యురిటీ రూమ్ కి రింగ్ చేశాడతను.
మరుక్షణంలో హనుమాన్ అది వరక్కంటే చురుగ్గా మార్చింగ్ చేస్తూ వచ్చి సెల్యూట్ కొట్టాడు.
"పిలిచారా సార్?"
"యస్ మైడియర్ హనుమాన్! మేజర్ శివతాండవం కాలూ, చెయ్యి బెణకటం వల్ల వెళ్ళలేకపొతున్నారు . నువ్వు కొంచెం సహాయం చేస్తే అయన నీ ఋణం ఉంచు కోరు! అయన సంగతి నీకు తెలీందేముంది? హి ఈజ్ ఏ మాన్ ఆఫ్ కారెక్టర్!"
"యస్సార్ " మళ్ళీ సెల్యూట్ కొట్టి శివతాండవం దగ్గరికి నడిచాడు. హనుమాన్.
"నన్ను ముట్టుకున్నావో చంపేస్తాను జాగ్రత్త!" అరిచాడు శివతాండవం కోపంగా.
'ఆ కేకలు నువ్వు లెక్కచేయక్కర్లేదు రామభక్త హనుమాన్! కాలు బెణికిన బాధలో రోగులు ఏమిటేమిటో అంటారు, అరుస్తారు. కరుస్తారు! అయినా మనం వాటిని ఖాతరు చేయగూడదు!"
"యస్సార్!" అంటూ అమాంతం తను శివతాండవం చంక కింద నుంచి దూరి బలవంతంగా ఆయనను నడిపించుకుంటూ బయటకు వెళ్ళసాగాడు.
"అల్ రైట్! నన్నిలా అవమానపరుస్తున్నారు కదూ! మీ ఇద్దరి అంతూ తేలుస్తాను! శివతాండవం తడాఖా ఏమిటో చూపిస్తాను-" అని అరుస్తూ రామభక్త హనుమాన్ వేగం వల్ల క్షణాల్లో కనుమరుగయిపోయాడు.
భవానీశంకర్ ఉత్సాహంగా చిరంజీవి వేపు చూశాడు.
"ఆపరేషన్ తెలుగు కిరణం' స్టేజి నెంబర్ వన్ పూర్తయింది మిత్రమా! ఇప్పుడు స్టేజి నెంబర్ 'టూ' లో కెళ్ళి పోదాం!"
"ఆ శివతాండవం గారూ పిచ్చెక్కినట్లు చిందులు వేస్తున్నాడు. మనకేమీ తలనొప్పి తేడు కదా?" అనుమానంగా అడిగాడు చిరంజీవి.
"విషయాలన్నీ నాకొదిలెయ్ బ్రదర్! చాలా తేలిగ్గా హండిల్ చేయగలం వాడిని! అతనికీ మన సంస్థకు అగ్రిమెంట్ లాంటిదేమయినా ఉందేమో వెతకమని ఇంతకుముందే ఎస్టాబ్లిష్ మెంట్ క్లర్క్ కి అదేశాలిచ్చేశాను! కనుక అతని విషయం పూర్తిగా మర్చిపో! ఆపరేషన్ తెలుగు కిరణం స్టేజి నెంబర్ టూ ఏమిటంటే తెలుగుకిరణం రివ్యూ-
ఈ హెడ్ లైన్స్ చూశావా? పరమనీరసంగా ఉన్నాయ్! పొద్దున్న లేవగానే మన పేపర్ హెడ్ లైన్స్ చదువుతే చాలు! ఆ నీరసం వాడిని వారం రోజుల్లో హతమారుస్తుంది!
రేపట్నుంచీ హెడ్ లైన్స్ పూర్తిగా మార్చేస్తాను! ఇకపోతే రెండో పేజీ! 'చిన్నారి జిలుగులు' రచయిత్రి శ్రీమతి రాజేశ్వరీ రామనాధన్! అప్పుడే పుట్టిన పిల్లలను ఎలా పెంచాలి?
నాలుగో పేజీలో 'తెలుగు జిలుగులు ' శీర్షిక - రచన స్వయం వరాల శంతన్రావ్! ఈరోజు వ్యక్తీ చక్రాల బండేశ్వర్రావ్.
పావుపేజీ వాయింపు -
అయిదో పేజీలో చంటి చాముండేశ్వరి గారి సీరియల్ నవల!
"జీవితచక్రాల్లో - మలపుల వక్రలేఖలు'
'చైనాలో ప్రజా జీవితం" కనకరాల కాళేశ్వర్రావ్!
వాటీజ్ దిస్ ట్రాష్ బ్రదర్?"
స్పోర్ట్స్ పేజ్!
చెస్ ఆటలో కప్రోవ్ ముందంజ -
ఎంత దారుణమయిన న్యూస్? తెలుగు ప్రజలు చదవటం లేదని నిందిస్తే ఏం బావుంది ఫ్రెండ్? పాపం వాళ్ళూ మనుషులే కదా! వాళ్ళకూ ప్రాణభీతి అనేది ఉంటుంది కదా!
ఈ పేపర్ మొత్తం మారిపోవాల్సిందే! ఎంత మారిపోవాలీ అంటే పేపరు పేరూ , ప్రింటర్స్ అడ్రెస్ తప్ప - మిగతాదంతా కొత్తదనంతో నిమ్డిపోవాలి! రేపు పేపర్లో నేను తయారుచేసిన ఈ ప్రకటన వెలువడుతుందన్న మాట!"
'తెలుగుకిరణం' లో విప్లవాత్మకమయిన మార్పులు.
ఆలసించకండి! ఆలసించిన ఆశాభంగం! 'తెలుగు కిరణం ' చందాదారుల సీట్లు పరిమితం! నేడే మీ బంగారు భవిష్యత్తు కోసం - మీ చిన్నారి బాలల జనరల్ నాలెడ్జి కోసం - నిప్పులు కక్కే వార్తల కోసం - ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ సంపాదకత్వంలో వళ్ళు జలదరించే జర్నలిజంతో కళ్ళు మిరుమిట్లు గొలిపే తరహాలో వెలువడబోతున్న 'తెలుగు కిరణం' దిన పత్రికకు చందాదారులయి మీ కాపీని భద్రపరుచుకోండి! ఈ నెలాఖరులోగా చేరు చందాదారులకు అయిదు శాతం రిబేట్-"
"ఎలా వుంది?" అడిగాడు భవానీ శంకర్.
"సూపర్బ్!" అన్నాడు చిరంజీవి.
"కనుక ఈ స్టేజ్ నెంబర్ 'టూ' లో మన పేపర్ ని చిత్రవధ చేస్తోన్న రచయుతలూ, జర్నలిస్ట్ లూ, వ్యాసకర్తలూ- అందర్నీ ఇవాళ్టి నుంచి బయటకు గెంటేయటం! వారి స్థానంలో టాలెంట్ తో క్రిక్కిరిసి పోయి వున్న కొత్త జర్నలిస్ట్ లను వేసుకోవడం -"
చిరంజీవి ఉలిక్కిపడ్డాడు.
"అంతమందిని ఒకేసారి తీసివేయటమా?"
"యస్ మైడియర్ ఫ్రెండ్! కేవలం పాఠకుల క్షేమం కోసం! మరి ఈ కొత్త టాలెంట్ తో పేపర్ని నింపేలోగా పేజీల్లో ఏమి నింపుతాం అని నీ ప్రశ్న౧ అవునా? అదంతా నా కోడిలేసేయ్! ఈ రాత్రికి ఇక్కడే కూర్చుని అద్భుతమయిన న్యూస్ డిక్టేట్ చేసేస్తాను!"
స్వప్న చెమటలు తుడుచుకుంటూ ఓ చేత్తో టిఫిన్ కారియర్ తీసుకుని గదిలోకి రావటం చూసి మాటలాపేశాడు భవానీశంకర్.
"హల్లో చెల్లెమ్మా! నీ అందాల చేతులు , కాళ్ళు కందెను పాపం- ఎందుకు ఈ బెడద? మేమే ఇంటికొచ్చేవాళ్ళం కదా భోజనానికి?"
ఆమె చిరునవ్వు నవ్వి కారియర్ టేబుల్ మీదుంచింది.
"ఏం ఫర్వాలేదు - నాకు మాత్రం వేరే పనేముంది గనుక - అది సరే గాని పాపం గేటు బయట వాడెవడో శ్రీరాములు అనీ - నా కాళ్ళు పట్టేసుకున్నాడు. వాడి ఉద్యోగం వాదికిచ్చేయగూడదు!" జాలిగా అడిగిందామె.
"ఓ.కే. చెల్లెమ్మా! నీ పూచీ కత్తు మీద ఇవ్వడాని కయితే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటె ఇది నా రోజువారీ పుడ్ కి సంబంధించిన ప్రశ్న! ఇకపోతే '-నాకు మాత్రం వేరే పనేముంది గనుక ' అన్న నీ మాట ఉంది చూశావూ! దాన్ని గురించి ఇప్పటికిప్పుడే సీరియస్ గా అలోచించి ఓ నిర్ణయానికొచ్చాను. రేపట్నుంచి 'తెలుగుకిరణం' సర్క్యులేషన్ మేనేజర్ శ్రీమతి స్వప్న! ఆఫీస్ అవర్స్ పది నుంచి అయిదు. జీతం అమలులో ఉన్న స్కేల్స్ ప్రకారం! ఎలా వుంది?"
స్వప్న కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. నిజానికి తనకసలు ఈ పేపరూ ఇష్టం లేదు- ఈ జీవితమూ నచ్చదు. కానీ అంతకుముందు రోజు భవానీశంకర్ ఇచ్చిన స్వీచ్ విన్నాక తనూ వారిద్దరికీ సాయం చెయ్యాలనిపించింది.
"మౌనం అర్ధాంగీకారం కాబట్టి ప్రపోజల్ ఓకే. అంతేనా చెల్లెమ్మా! మిగతా సగం కూడా ఓకే అనడానికి నీకో చిన్న విషయం చెప్తాను." అంటూ గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడతను. "చూడు! ఈ పోస్ట్ మనం ఎదుర్కొంటున్న చాలెంజ్ కి చాలా కీలకమైనది. కనుక నీలాంటి సూపర్ ఇంటలిజెన్స్ ఉన్న బ్రిలియంట్ గాళ్ - అదీ మన కాండిడేట్ - ఉంటేనే గానీ లాభం లేదు. అంచేత కనీసం మా మీద జాలితో నయినా -"
చిరంజీవి క్కూడా భవానీశంకర్ చెప్పే పాయింట్ అర్ధమయింది.
"మైగాడ్! నేనీ విషయం ఆలోచించనేలేదు. ప్రస్తుతం ఉన్న సర్క్యులేషన్ మేనేజర్ వెంకటేశ్వర్రావ్ చాలా డేంజరస్ ఫెలో - నమ్మటానికి వీల్లేదు! స్వప్నా! భవానీశంకర్ చెప్పింది కరెక్టే - మాకు నీ సహాయం చాలా అవసరం!"
స్వప్న చిరునవ్వు నవ్వింది . సరే! భోజనం చేయండి!"
"అవునవును! చెల్లాయ్ చేతి పాక నైపుణ్యాన్ని - మన ప్రేవులకు సమర్పిస్తే గానీ మళ్ళీ మెదడు గంటకు పడకొండందల కిలోమీటర్ల వేగంతో పనిచేయదు - " అన్నాడు భవానీశంకర్ ఇద్దరూ భోజనం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.
*****
ఇందిరాపార్క్ అలవాటు ప్రకారం సాయంత్రం అయిదున్నరాయే సరికి రంగురంగుల మొబైల్ దుస్తులతో కలకలలాడిపోతోంది.