ఇద్దరూ బయటకు నడుస్తుంటే భవానీశంకర్ లేచి వారి వెనుకే బయటికొచ్చాడు.
"అన్నట్లు - హనుమాన్ - ఓ విషయం చెప్పటం మర్చిపోయాను! ఇవాళ నేను ఇక్కడ చేరిన రోజు కాబట్టి చాలా బిజీగా ఉంటాను - కనుక - ఎవ్వరినీ లోపలకు రానీయవద్దు. ఒకవేళ మరీ అత్యవసరమయితే - పర్సనల్ గా నా అనుమతి తీసుకున్నాకే - లోపలకు పంపించు-"
"యస్సార్" మళ్ళీ మిలటరీ సెల్యూట్ కొట్టాడు హనుమాన్.
"నువ్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తున్నావ్ హనుమాన్! ఇదంతా నా మనసులో ఉంటుంది - ఏం - ఫరవాలేదు-"
హనుమాన్ శ్రీరాముల్ని గట్టిగా తోస్తూ బయటకు నడిచాడు.
సెక్యురిటీ రూమ్ లోకెళ్ళేసరికి శ్రీరాములుకి చెమటలు పట్టేసినాయ్! తన ఉద్యోగం నిజంగా పొతే తన కుటుంబం గతేమిటి? అన్న ఆలోచన సతమతం చేసేస్తోంది.
శివతాండవం ఇంకా రాలేదేమిటి ఇవాళ? ఆయనోస్తే తనకు కొంత ధైర్యంగా ఉంటుంది.
సరిగ్గా అప్పుడే శివతాండవం కారు హారన్ వినిపించింది.
హనుమాన్ స్ప్రింగ్ లా ఎగిరి గేటు కడ్డంగా నిలబడ్డాడు. శివతాండవం ఉలిక్కిపడి సడెన్ బ్రేక్ వేశాడు.
"ఏమిట్రా! ఏం రోగమొచ్చింది? ఎందుకలా ఎగిరి అడ్డం వచ్చావ్?" కిటికీలోంచి తల బయటకు పెట్టి కోపంగా అడిగాడు శివతాండవం.
"లోపలికేవర్నీ రానీయోద్దన్నారండీ చీఫ్ ఎడిటర్ గారు."
శివతాండవం కార్లోనే అదిరిపడటం చేత కారంతా ఎవరో కుదిపినట్లు ఊగింది.
"ఏరా? పొద్దున్నే తాగొచ్చావా!" అన్నాడు ఆవేశంగా.
దాంతో హనుమాన్ కి వళ్లు మండిపోయింది. వళ్ళు మండితే అతను మిలటరీ ఇంగ్లీష్ ఉపయోగిస్తాడు.
"డోంట్ నాన్సెన్స్ స్పీక్ సర్! అయ్ నాట్ లైక్ నాన్సెన్స్! ఎవరైనా సరే, తన అనుమతి లేనిదే లోపలికి రానివ్వగూడదని కొత్త చీఫ్ ఎడిటర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు-"
శివతాండవానికి మతిపోయినట్లయింది. తనకు జరుగుతున్న పరాభవానికి ఆవేశంతో వళ్ళంతా వణుకుతోంది.
దానికి తోడు 'కొత్త చీఫ్ ఎడిటర్' అన్న పదం మరీ ఆందోళన కలిగిస్తోంది. ఏం జరుగుతొందక్కడ? ఇదంతా ఎవరు చేస్తున్నారు? చిరంజీవేనా? చిరంజీవికి అంత ధైర్యం ఎక్కడుంది?
"సార్ నన్ను కూడా డిస్మిస్ చేసి - ఈ హనుమాన్ తో బయటకు గెంటించారండీ కొత్త చీఫ్ ఎడిటర్ గారు ...." కారు దగ్గరకొచ్చి నిలబడి బావురుమన్నాడు శ్రీరాములు.
శివతాండవం మొఖం పాలిపోయింది.
"ఇదేదో పెద్ద ఎత్తునే హడావుడి జరుగుతోంది' అనుకున్నాడతను.
సెక్యురిటీ గెట్ దగ్గర జరుగుతున్న డ్రామా అంతా తన రూమ్ లోనుంచి గమనించాడు చిరంజీవి. అక్కడేదో రసవత్తరమయిన కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది - గానీ ఏం జరుగుతుందో మాత్రం తెలీటం లేదు.
ఇంటర్ కామ్ లో భవానీశంకర్ కి రింగ్ చేశాడతను.
"చీఫ్ ఎడిటర్ భవానీశంకర్ హియర్....." అన్నాడు భవానీ శంకర్.
"భవానీ - సెక్యురిటీ గెట్ దగ్గర ఏం జరుగుతోంది?"
"చూపరుల మనస్సులను ఊర్రుతలూగించే ఓ చారిత్రాత్మక సంఘటన బ్రదర్! ఆఫ్ కోర్స్ - శివతాండవానికీ పద్దతి అంతగా రుచించక పోవచ్చు! గేటు దగ్గర సెక్యురిటీ వాళ్ళతో పేచీ పడటం అతని అభిరుచి కాకపోవచ్చు! కానీ 'రక్తపాతం ' లేకుండా విప్లవం జరిగేప్పుడు ఇలాంటి సంఘటనలు జరగక తప్పదు...."
చిరంజీవి గొంతు తగ్గించి రహస్యంగా అన్నాడు. "చూడు భవానీ! ఓ విషయం నువ్వు తెలుసుకోవడం మంచిది -"
"ఏమిటది?" వెంటనే ప్రవహించు ఫ్రెండ్!"
"గత పాతికేళ్ళుగా శివతాండవమే 'తెలుగు కిరణం' సంస్థకు యజమానిగా గడిపాడు. మావయ్య అతనికే అన్ని అధికారాలూ ఇచ్చాడు. స్టాఫ్ అందరూ కూడా అతని గుప్పిట్లోనే వున్నారు. ఈ పరిస్థితుల్లో మనం శివతాండవం విషయంలో కొంచెం నెమ్మదిగా వ్యవహరించడం మంచిదేమో -"
భవానీశంకర్ తేలిగ్గా నవ్వేశాడు.
"అన్ని విషయాలూ నా బ్రెయిన్లో 'రెడీ రెకనర్' లా ఉన్నాయ్ మైడియర్ చిరంజీవి! అన్ని విషయాలూ - అతి జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుందని హామీ యిస్తున్నాను. కనుక నువ్వీ చిన్న చిన్న విషయాలతో నీ మెదడుకి శ్రమ యివ్వటం అపెసేయ్-"
"ఓ.కే..." అన్నాడు చిరంజీవి సంతృప్తిగా.
చిరంజీవి ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే భవానీశంకర్ ఫోన్ మళ్ళీ మోగింది.
"హలో, చీఫ్ ఎడిటర్ భవానీశంకర్ హియర్!"
"సార్! నేను హనుమాన్ ని మాట్లాడుతున్నాను."
"యస్! మైడియర్ స్మార్తీ! ఎనీ ప్రాబ్లెమ్?"
"నో ప్రాబ్లం సార్! మన కింతవరకూ ప్రాబ్లం అనేది లేదు సార్! పాకిస్తాన్ వార్ లోనే ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది గానీ - ఆ తర్వాత ముందూ నో ప్రాబ్లమ్స్ సార్!"
"ఒండర్ పుల్ రామభక్త హనుమాన్! ప్రతి భారతీయుడు నిన్ను చూసి చాలా నేర్చుకోవాల్సి వుంది! నీలాంటి ప్రాబ్లెమ్స్ లెస్ పౌరుడు - మా సేక్యురీటీ ఇనచార్జీ గా ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది!"
"ఇప్పుడు చీఫ్ ఎడిటర్ శివతాండవం గారు వచ్చారండి-"
"నో నో నో - మైడియర్ హనుమాన్! చీఫ్ ఎడిటర్ అనకూడదు! 'మాజీ' అనాలి! లేదా కేవలం శివతాండవం అను! సరి పోతుంది -"
"సారీ సార్! మాజీ చీఫ్ శివతాండవం గారొచ్చారండీ! లోపలికి రావడానికి అనుమతి అడుగుతున్నారు!"
ఆ మాటలన్నీ వింటోన్న శివతాండవం కోపంతో మండిపడ్డాడు.
"ఏమిటా వెధవ్వాగుడు? అనుమతి అడగాల్సిన ఖర్మ నాకేంటి? నన్ను లోపలకు వెళ్ళనీయాలని డిమాండ్ చేస్తున్నాను - " చిందులు తొక్క ుతూ గట్టిగా అరిచాడతను.
"ష్! అలా అరుస్తే మర్యాదగా వుండదు! ఇది మొదటి వార్నింగ్-" అన్నాడు హనుమాన్ కోపంగా.
"ఓ.కే. హనుమాన్! నిజానికి నేను చాలా బిజీగా వున్నాను. అయినా శివతాండవం మాజీ చీఫ్ ఎడిటర్ గనుక అతనికి కొంత టైం కేటాయించడానికి అంగీకరిస్తున్నాను. లోపలికి పంపించు!" ఫోన్ లో చెప్పాడు భవానీ శంకర్.
రెండు నిమిషాల్లో శివతాండవం పొగలు కక్కుతూ , రొప్పుతూ , ఆవేశంగా వణికిపోతూ భవానీశంకర్ గదిలోకి జొరబడ్డాడు.
"ఎవర్నివ్వు?" అన్నాడు భవానీశంకర్ వంక కోపంగా చూస్తూ.
భవానీశంకర్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు.
"ఇది ఆటవిక ప్రవృత్తి మైడియర్ ఓల్డ్ మాన్! నాగరికత అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనే 'ఏకవచనం' ఉపయోగిస్తారు. అదీగాక నేనెవరో తెలియాలంటే ముందు బయటున్న బోర్డ్ చూడాలని గానీలోపలికోచ్చేసి "ఎవర్నువ్వు" అంటూ తోడేలు గొంతుకతో శబ్దాలు చేయకూడదు. వెరీ బాడ్ కాండక్ట్! బైదిబై మీ కాండక్ట్ సర్టిఫికెట్లో ప్రిన్సిపాల్ ఏమి రాశాడు? వెరీ బాడ్డా , శాటిస్ ఫాక్టరీ అనా? వెరీ బాడ్ అని రాసి ఉంటాడనటంలో సందేహం లేదు నాకు!"
శివతాండవం ఇంక భరించలేకపోయాడు.
"మర్యాదగా ముందిక్కడినుంచి లేస్తావా లేదా?" అన్నాడు పళ్ళు బిగించి బట్టతల మీద ఓచేత్తో గట్టిగా రుద్దుకుంటూ.
"ఓకే ఓల్డ్ మాన్! ఆటవిక పద్దతే నీ కలవాటయితే - నేనూ ఆ పద్దతికి షిస్టయిపోతాను! నో ప్రాబ్లెమ్!"
"నన్ను ఓల్డ్ మాన్ అనొద్దు! " ఇంకా మండిపడిపోతూ అన్నాడు శివతాండవం.
"యంగ్ మాన్!"
"అసలేమీ అనటానికి వీల్లేదు-"
'అల్ రైట్ మేజర్ శివతాండవం! నీకు అయిదు నిమిషాల టైం కేటాయిస్తున్నాను. నిజానికి ఆఫీస్ అవర్స్ లో నేనెవరికీ ఇంటర్వ్యూ లివ్వను! కానీ నువ్వు ఎక్స్ చీఫ్ ఎడిటర్ వి కాబట్టి - స్పెషల్ పర్మిషన్ ఇస్తున్నాను- ఇప్పుడు సమయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నలభై సెకన్లు - అంటే ...."
శివతాండవం అతని మాటలు పూర్తీ కాక మునుపే మళ్ళీ అడ్డు పడ్డాడు.
"ఈ రూమూ, ఈ కుర్చీ వదలిపోతావా పోవా?" అన్నాడు, కర్కశంగా.
"నీ చిన్నపిల్లల మనస్తత్వాన్ని వెంటనే మార్చుకోవాలి మేజర్ శివతాండవం ! ఆ పలకే కావాలీ - ఆ బలపమే కావాలీ - ఆ కుర్చీయే కావాలీ - ఏమిటిది? ఇలాంటివి కొంత వయసు వరకే ముచ్చటగా ఉంటాయ్. ఆ తరువాత ఏమాత్రం ముద్దుగా ఉండదు. పైపెచ్చు వెగటు కూడా కలిగిస్తాయ్! నీలాంటి పెద్ద మనిషి, ఇలాగే ఓ యింటికెళ్ళి బయట ఆడుకుంటున్న చిన్నపిల్లను చూసి "పాపా! మీ నాన్న గాలున్నాలా ఇంతిలో?" అనడిగాడు ముద్దుగా . దానికా పిల్ల ఏమంది?
"అడ్డగాడిదలాగుండి ఏమిటా చిన్నపిల్లల మాటలు?" అంది.
కనుక నువ్వు త్వరగా ఎదగాలి మేజర్ శివతాండవం! అంతేగాదు , మనం ఎదిగేప్పుడు మన మెదడు కూడా ఎదిగేట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి! కెనడాలో రేస్మాండ్ రెయిన్ అనే పెద్దమనిషి సంగతేమయింది౧ నీలాగానే తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల శరీరం ఎదిగింది - మెదడు అలాగే ఉండిపోయింది. అరవై సంవత్సరాల వయసులో ఇప్పుడు రేస్మాండ్ రెయిన్ ఏం చేస్తున్నాడో తెలుసా? నిక్కరు వేసుకుని తూనీగలు పడుతూ జీవితం గడిపేస్తున్నాడు.
భవానీశంకర్ రేస్మాండ్ రెయిన్ గురించి మరింకెన్ని విశేషాలు చెప్పేవాడో గాని , అతని వాక్ ప్రవాహాన్ని 'హలో" అంటూ నిలిపివేశాడు చిరంజీవి.
చిరంజీవి రాకతో శివతాండవం ప్రవర్తనలో మార్పు కలిగింది. తన కోపాన్నంతా కంట్రోల్ చేసుకుంటూ చిరంజీవి వేపూ తిరిగాడు.