రోడ్డుమీద నడిచేటప్పుడు, ముఖ్యంగా రద్దీగావున్న బీసెంట్ రోడ్ మీద, రైల్వేస్టేషన్ లో, యింకా చెప్పాలంటే దేవీ నవరాత్రులప్పుడు కనకదుర్గ గుళ్ళో ఈ మొగప్రవాహాన్ని తప్పించుకుంటూ, వొదిగి వొదిగి నడవాలి.
ఈ సమాజం అతి భయంకరంగా కుళ్ళిపోయింది. మంచి అనేది కంచు కాగడ పెట్టుకుని వెదికినా కనబడటం లేదు. ఎవరో ఒకరిద్దరిలో తప్ప ప్రతివాడిలోనూ వికృత మనస్థత్వం, ఆటవిక ప్రవర్తన, పశుప్రవృత్తి...
నీరజ మనసు మరల్చుకుని, చేతులు మళ్ళీ టైప్ మిషన్ మీదకు కదిల్చింది.
ఆఫీస్ బాయ్ వచ్చాడు. ప్రక్కన నిలబడేసరికి టైప్ చెయ్యటమాపి తలత్రిప్పి చూసింది.
"మిమ్మల్నయ్యగారు రమ్మంటున్నారు"
లేచి నిలబడి అతనివెంట లోపలకి వెళ్ళింది.
అయ్యగారు అంటే ఆ కంపెనీకి ప్రొప్రయిటర్. జనరల్ మేనేజర్ కూడా. మామూలుగా మేనేజర్ అని రాసుకుంటే చాలు. దానికిముందు జనరల్ అని అంటిస్తేగాని అతనికి తృప్తి లేదు_అదో మహా సంస్థ అయినట్లు.
ఈ దశకు చేరుకోటానికి అతను జీవితంలో కుయుక్తులతో కూడిన అనేక వ్యయప్రయాసలను ఢీకొన్నాడు. మొదట ఓ చిన్న పేపర్ కంపెనీలో అటెండర్ గా పనిచేశాడు. ఆ టైములో పెళ్ళి చేసుకుని వచ్చే జీతం రాళ్ళు సరిపోక మెల్లగా నలుగుర్నీ పోగుచేసి చీట్లు కలపటం మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమంలో అనేకమందిని ముంచాడనీ, కొందరి జీవితాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశాడని చెప్పుకుంటారు. బయటకు మంచిగా, శాంతంగా, అమాయకంగా కనిపించినా లోలోపల క్రూరత్వం చాలా దాక్కుని వున్నదని అతని ధనదాహం కోసం ఎంతటి అవినీతికైనా వెనుదియ్యడనీ ప్రతీతి. అలా అంచెలంచెలుగా పైకివస్తూ, చివరకు ఈ ఛిట్ ఫండ్ కంపెనీ, దానికి అనుబంధంగా పనిచేసే ఆటోఫైనాన్సీ కంపెనీల పెట్టుబడికోసం ఇద్దరు ముగ్గురు ధనవంతులకు ఎరవేసి, తన పని సానుకూలం కావటంకోసం భార్యను వాళ్ళ దగ్గరకు పంపించి, వాళ్ళ కోరికలు తీర్చాడని ఒక వదంతి. తర్వాత తర్వాత ఆ ఇద్దరు ముగ్గుర్నీ కూడా గడుసుగా ప్రక్కకి తప్పించేసి రెండు సంస్థలకూ తానే ప్రొప్రయిటరయ్యాడు.
ఆ అయ్యగారి పేరు శ్రీనివాసరావు.
నీరజ స్ప్రింగ్ డోర్ తీసుకుని లోపలికివెళ్ళి ఆయనకెదురుగా నిలబడింది.
శ్రీనివాసరావు తలఎత్తి ఆమెవైపు చూశాడు.
ఆయనకి యాభయి ఏళ్ళుంటాయి. ఎప్పుడూ సఫారీ సూట్ లో వుంటాడు. జుట్టు నెరిసే వుంటుందిగాని, చాలా జాగ్రత్తగా, పట్టుదలగా రంగువేస్తూ వుండడంవల్ల తల నిగనిగలాడుతూ వుంటుంది. ఖరీదైన కళ్ళజోడు. వెనకనుండి కొంచం తేనెరంగులో వున్న కళ్ళు ఎదుటివారిని గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ వుంటాయి.
నీరజ అందంగా వుంటుంది. పొడవూ, ఉండవలసిన పరిమాణంలో నడుమూ వగైరాలూ...ఆమె నిరాడంబరపు సహజమైన శరీర సౌష్టవం చూపరులకు కనువిందుగానే వుంటుంది.
శ్రీనివాసరావు చూపులతో ఆమె సౌందర్యాన్ననుభవించేస్తున్నాడు.
అతని చూపులెక్కడెక్కడ తినేస్తున్నాయో ఆమెకు తెలుసు. ఒకసారి పమిట సర్దుకుని నిస్సహాయంగా నిలబడింది.
"మిమ్మల్నెందుకు పిల్చానంటే..." అన్నాడు.
అతను వాక్యమంతకంటే పూర్తి చెయ్యలేదు. ఆమె మౌనంగా వూరుకుంది.
"ఎందుకంటే..." అన్నాడు మళ్ళీ.
ఆమెకేం చెయ్యాలో తెలీక అతని ముఖంలోకి ఓసారి చూసి తల ప్రక్కకి తిప్పేసుకుంది. ఆ ఒక్క క్షణంలోనే అతని చూపుల్లోని వాడి ఆమెకర్థమయింది.
"మిమ్మల్ని చూడగానే మరిచిపోయాను"