"ఆశలు పెంచుకుంటే భంగపాటు భరించటం కష్టం....."
"ఫరవాలేదు బావా. దురాశలు కానంతవరకూ ఆశలు పెంచుకోవచ్చు..... ఒకవేళ అవి నెరవేరకపోయినా భరించనూవచ్చు."
"చంద్రి, నాకోసం నువ్వు మూడేళ్ళు ఆగగలవా? మీ అమ్మ ఆగనిస్తుందా?"
"మూడేళ్ళు కాదు - నూరేళ్ళు ఆగుతాను..... సాధ్యమయినంత వరకూ అమ్మను లొంగదీసుకోవటానికే ప్రయత్నిస్తాను. కలిసి రాకపోతే, అప్పుడిక ఎదురు తిరుగుతాను - ఏం సరళమ్మకి దారి చూపించినట్లు నాకు దారి చూపించలేవా? మా అన్నని ఆదుకున్నట్లు నన్ను ఆదుకోలేవా?"
"ఛ! అంత మాటనకు చంద్రి. మనకేం తక్కువే? కాలేజీలో నేనెంత బాగా చదువుతానో తెలుసా? మూడు నాలుగేళ్ళలో పెద్ద ఉద్యోగస్తుణ్నయిపోతాను! అప్పుడు మీ అమ్మ నన్ను బ్రతిమాలి మరీ నిన్నిస్తుంది."
"చాటుగా తనే పెద్దకి తప్పుకట్టేస్తుంది!"
ఇద్దరూ భావి బంగారు కలలో తేలిపోతూ కులాసాగా నవ్వుకున్నారు.
రత్నమ్మకు మళ్ళా పెళ్ళి సంబంధం చూశాడు. దాని కర్మ ఏమిటో కాని ఈసారి కూడా సరిగ్గా పెళ్ళికి ముందు మొగపెళ్ళి వారిలో ఎవరో చచ్చిపోయి పెళ్ళి ఆగిపోయింది!
ఇలా రెండు మూడుసార్లు జరగటంతో రత్నమ్మది అరిష్ట జాతకమనీ, దానికి పెళ్ళి అనుకునే సరికల్లా మొగపెళ్ళి వారిలో ఎవరో ఒకరు చచ్పిపోతారనీ, వార్త వ్యాపించిపోయింది. అక్కడితో దానికి సంబంధాలు రావటం ఆగిపోయాయి!
అన్మమ్మ బెంగపడిపోయింది.
సుందరీబాయికి కూడా వయసొచ్చింది. అక్కకు పెళ్ళయితేకాని తనకి పెళ్ళికాదు, అక్కది ముదనష్టనపు జాతకం. దానికి పెళ్ళిలేదు - ఇంక తన గతేమిటి? తలుచుకుంటేనే గుండె గుభిల్లుమన్నది సుందరీబాయికి.
"అక్కకి పెళ్ళియితేకాని, నాకు చెయ్యరా?" అని అడిగేసింది తెగించి ఇంట్లో -
జైహింద్ బాబు నిర్ఘాంతపోయాడు, తన అక్కకి వచ్చిన సంబంధాన్నీ తప్పిపోతున్నాయని బాధపడటానికి మారుగా ఇలా అక్కసుతో సుందరీబాయి మాట్లాడుతోంటే ఏం సమాధానం చెప్పాలో అతనికి తోచలేదు.
అన్నమ్మ చికాకుపడి "నోరుముయ్యే! పెద్దదానికి కాకుండా పిన్నదానికి పెళ్లి సేస్తారంటే? అట్టయితే పెద్దదానికసలు పెళ్ళవుద్దా?" అని కసిరింది.
"నాకర్మ!" అని తలబాదుకుంది సుందరీబాయి రత్నమ్మ ముఖం ముడుచుకుంది.
ఒకరోజు పనిలోనుండి వచ్చిన అన్నమ్మ గుండె పట్టుకుని "ఓర్నాయనో" అంటూ కూలపడిపోయింది. ఒళ్ళంతా చెమటలు కక్కుతుండగా.
అదృష్టవశాత్తు ఆ సమయానికి జైహింద్ బాబు ఇంట్లో ఉండడంవల్ల వెంటనే తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు. హార్ట్ ఎటాక్ అన్నారు. పై ప్రాణాలు పైనపోయాయి జైహింద్ బాబుకి.
తన తల్లిని మృత్యు ముఖంనుండి తప్పించటానికి సర్వ శక్తులూ ధారపోశాడు. ఎలాగో అన్నమ్మ బ్రతికి బయటపడింది. ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పైఖర్చులకే బోలెడయింది జైహింద్ బాబుకి. ఉన్నదంతా ఈడ్చుకుపోగా వ్యాసమూర్తి దగ్గిర అప్పుకూడా చెయ్యవలసి వచ్చింది.
ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చి తగ్గాక గుండె చాలా బలహీనంగానూ ఉంటుందనీ, రోగి బాగా విశ్రాంతి తీసుకోవాలనీ, బలమైన ఆహారం తీసుకోవాలనీ చెప్పారు డాక్టర్లు - రెండవసారి హార్ట్ ఎటాక్ వస్తే బ్రతకటం కష్టమని కూడా చెప్పారు. ఇంటికి రాగానే పనిలోకి బయలుదేరబోయింది అన్నమ్మ. దెబ్బలాడి మానిపించాడు జైహింద్ బాబు.
"నేను పనిలోకి పోకపోతే ఎట్టా గడుస్తుంది?" అని బావురుమంది అన్నమ్మ.
జైహింద్ బాబు తల్లిని సముదాయిస్తూ "అమ్మా, నువ్విలా చీటికీ మాటికీ బెంగపడిపోతే నీ గుండె జబ్బు ఎక్కువయిపోతుంది. నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నారు డాక్టర్లు" అన్నాడు.
"పోనీయ్ రా! నేను బ్రతికి ఎవడినుద్దరించాలి? నా కోసం డబ్బు తగలెయ్యబోకురా! నువ్వు సదువుకోవాలి! రత్తికి పెళ్ళిసెయ్యాలి" వగురుస్తూ అంది అన్నమ్మ.
జైహింద్ బాబు భయపడిపోయి "అమ్మా! నువ్వు కళ్ళు మూసుకుపడుకోపోతే నేనెక్కడయినా పారిపోతాను" అన్నాడు.
ఆ మాటలతో మాట్లాడకుండా పడుకుంది అన్నమ్మ.
జైహింద్ బాబు తల్లిపక్కలో కూచుని "అమ్మా! చూస్తూ చూస్తూ నిన్నెట్లా చంపుకుంటామే? ప్రాణాలు పోతే పోనియ్యని ఎవరూరుకుంటారే! మాలో ఎవరినైనా నువ్వట్లా చంపుకోగలవా చెప్పు" అన్నాడు!
"ఓయ్! దేవుడా! మీరంతా సల్లగుండాలి" భయంగా అంది అన్నమ్మ.
"మరి. మేమూ అలాగే నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటాం. అయ్య ఇట్లాతాగి ఇల్లు పట్టకుండా తిరుగుతాడు. నువ్వు కూడా మమ్మల్ని అన్యాయం చేసి పోతానంటే ఎలాగే.
"లేదురా! లేదు- నేను సావను. నువ్వు పెద్ద పెద్ద సదువులు సదివి సానా గొప్పోడివయితే సూడొద్దూ?"
ఎప్పటిలా తల్లిమాటలు ఖండించలేదు. జైహింద్ బాబు గుండెలు చీల్చుకుని రాబోయే నిట్టూర్పుని అతిప్రయత్నం మీద అణచుకున్నాడు.
జబ్బుపడ్డ అన్నమ్మను చూట్టానికి వచ్చింది చంద్రి. నాలుగు బత్తాయిపళ్ళు కూడా తెచ్చింది. చంద్రిని చూడగానే అన్నమ్మ ముఖం వికసించినా, వెంటనే మూతిముడుచుకుని బత్తాయిపళ్ళు చేత్తో పక్కకు నెట్టేసి "ఇయ్యన్నీ నాకేంవద్దు. ఎందుకొచ్చినావీడికి? ఎల్లెల్లు. మీ అమ్మ సూస్తే మల్లీ బాగోతం!" అని కసిరింది.
చంద్రి చిన్నబుచ్చుకోకుండా అన్నమ్మ పక్కనే కూచుని "నా మీద కోపమెందుకత్తా! నేనేం చేశాను?" అంది ముద్దుగా.
చంద్రిని మరోసారి కసరలేకపోయింది అన్నమ్మ.
రెండు బత్తాయిపళ్ళు వొలిచి ఆ తొనలన్నీ"వద్దు, వద్దం"టున్న అన్నమ్మచేత తినిపించింది చంద్రి.
చంద్రిని వాత్సల్యంగాచూస్తూ "వరస కాకపోయెగదటె." అని నిట్టూర్చింది అన్నమ్మ.
చంద్రీ, జైహింద్ బాబూ, నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు.