"సార్! నేను వస్తాను. హేమసుధగార్నీ, కృష్ణచైతన్యగారిని ఇంటర్వ్యూ ఐ మీన్ ఇంటరాగేట్ చెయ్యాలి."
రంజిత లేచి బయటకు వెళ్ళిపోయింది. ఎస్.పి. కాన్ ఫరెన్స్ హాల్లోంచి లోపలగావున్న తన క్వార్టర్స్ లోకి వెళ్ళిపోయాడు. అతని మనసంతా చాలా వ్యాకులపాటుగా వుంది. డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి సోఫాలో కూర్చుని అలసటగా కళ్ళు మూసుకున్నాడు.
"డాడీ" అన్న మృదువయిన తియ్యని కంఠం వినిపించింది.
కళ్ళువిప్పి చూశాడు. ఎదురుగా ఇరవై, ఇరవై రెండేళ్ళ మధ్య వయసున్న యువతి నిలబడి వుంది. అందంగావున్న ముఖం, మెరిసిపోయే శరీర లావణ్యం, కాంతులు విరజిమ్ముతూ, వెలిగే సోగ కన్నులు...
ఆమెను చూడగానే ఆయన ముఖం సంతోషంతో వికసించింది.
"ఎప్పుడొచ్చావమ్మా?" అనడిగాడు.
"వచ్చి రెండు గంటలయింది డాడీ! కాన్ ఫరెన్స్ హాల్లో డిపార్ట్ మెంట్ వాళ్ళతో మాట్లాడుతూంటే, డిస్టర్బ్ చెయ్యటం ఇష్టంలేక వూరుకున్నాను" అన్నదామె. ఆమె పేరు రసజ్ఞ. కోయంబత్తూరులో ఎమ్.ఎస్.సి. హోమ్ సైన్స్ చదువుతోంది. ఫస్టియర్ అయిపోయింది.
"ఎగ్జామ్స్" బాగా రాశావమ్మా."
"రాశాను డాడీ!"
ఒక్కక్షణం కూతురి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు. ఆమె అంటే ఆయనకు పంచప్రాణాలు. రసజ్ఞకు పోలీస్ శాఖ అంటే ఎంతో ఇష్టం. ఐ.పి.ఎస్. అవ్వాలని ఎంతో కోరికగా వుండేది. "ఒద్దమ్మా. ఈ డిపార్ట్ మెంట్ లో పవరుందిగాని కఠినంగావుంటే దుర్మార్గులకి శత్రువులవుతూ ఉంటాం. మంచిగా ఉంటే అసమర్థులుగా పరిగణించబడతాం. నిజాయితీగా వుంటే రాజకీయవేత్తల అధికారానికి నలిగిపోతూ ఉంటాం. మనదేశంలో ఏ శక్తీ క్షాళనం చెయ్యలేనంత ఘోరంగా అవినీతి పేరుకుపోయింది. నిజాయితీ, సమర్థత, పరిపాలకుల అవగాహన. ఇన్ని కలిస్తేగాని పోలీసువృత్తికి రాణింపు తీసుకురాలేము. ఇవన్నీ సమకూడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంభవం. ఈ వృత్తి కత్తిమీద సాములాంటిది. ఈ రొంపిలోకి నువ్వు దిగటం నాకిష్టం లేదు. ప్రశాంతమైన కుటుంబ జీవితం గడపటానికి వీలయ్యే కోర్సు చదువుకోమ్మా" అని ఆమెను ఒప్పించి బి.ఎస్.సి.లోనూ, ఆ తర్వాత హోమ్ సైన్స్ కోర్సులో చేర్పించాడు.
"డాడీ! ఇక్కడ వాడెవరో చేస్తోన్న దురాగతాల్ని గురించి విన్నాను. అందమైన జీవితాలని అంధకార బంధురం చేసేస్తోన్న ఆ దుర్మార్గుడ్ని వదిలిపెట్టకూడదు అంది రసజ్ఞ.
"మా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నామమ్మా, ప్రజలకి, ప్రత్రికలకు వాడ్ని పట్టుకోలేకపోవటమే కనిపిస్తుందిగాని, అందులోవున్న కష్టం అర్థంకాదు" అన్నాడు జయసింహ.
"డాడీ! వాడెవడో నా కళ్ళబడితే, వాడు నాకు దొరికితే వాడి కళ్ళు పీకిపారేస్తాను. వాడ్ని చిత్రవధ చేసి చంపుతాను" అంది రసజ్ఞ ఆవేశంగా.
ఆ కళ్ళు...
గొప్పగా, నీలంగా, చిత్రంగా మెరిసే ఆ కళ్ళు క్రోధారుణిమాతో ప్రజ్వరిల్లుతున్నాయి.
ఆ దుర్మార్గుడి కళ్ళు... వీటి మీద...
"నో" అనుకున్నాడు. అతని శరీరం భయంతో జలదరించింది.
"ఒద్దమ్మా. ఇటువంటి వ్యవహారంలో నువ్వు జోక్యం కల్పించుకో కూడదు అన్నాడు. ఎంత నిగ్రహించుకుందామన్నా అతని గొంతులోకి వణుకు రాకుండా వుండలేదు.
9
రంజిత మొదట కృష్ణచైతన్యను కలుసుకోగలిగింది. ఆయన ఈ దుర్ఘటన జరిగాక కేసులేమీ చూడటంలేదు. అసలు తన గదిలోంచి బయటకు రావడంలేదు. ఆయనకు భార్యాపిల్లలూ ఎవరూ లేరు. వేరే ఇల్లంటూ ఏమీలేదు. హాస్పటల్లోనే ఉంటాడు.
ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా ఓపిగ్గా సమాధానాలిచ్చాడు. ఆ రాత్రి తను హేమసుధనెప్పుడు కలుసుకున్నదీ, ఆమెతో ఎంతసేపు మాట్లాడిందీ, ఏమి మాట్లాడిందీ అన్నీ వివరంగా చెప్పాడు. ఆయన మనసులో ఎంత మధన పడుతున్నాడో, ఎంత వేదన అనుభవిస్తున్నాడో అతని మాటల్నిబట్టి గ్రహించింది. నిజంగా అతనికేవీ తెలీదు. అంతకంటే అతన్నుంచి రాబట్టలేదు.
"సార్! మీరు చాలా ఆందోళనలో వున్నారని తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను. ఒక్కప్రశ్న అడుగుతాను. మీకు ప్రత్యేకంగా ఎవరిమీదనయినా అనుమానం వున్నదా?"
"లేదు."
"క్షమించండి. ఇంకోపని చెయ్యటానికి పర్మిషనివ్వాలి."
"చెప్పండి."
"హేమసుధగారు ఆగంతకుని గొంతు విన్నది. హాస్పటల్లో డాక్టర్సందరి గొంతుల్నీ ఆమెకోసారి వినిపించేలా చేస్తే? డాక్టర్లంటే నాకు అపారమైన గౌరవమున్నది. ఇది వాళ్ళని కించపరచాలని కాదు. ఎంతో పేరు ప్రతిష్టలున్న పద్మనేత్రాలయ మీద ప్రజల్లో ఏర్పడుతూన్న అపవాదు తొలగించటంకోసం."
కృష్ణచైతన్య ఆమె ముఖంలోకి చూచాడు.
ఆ కళ్ళు...
వాటిలో కర్తవ్య నిర్వహణ తహతహతోబాటు చిత్తశుద్ధి వుట్టి పడుతోంది. ఆయన కళ్ళని చూసి మనసుని చదవగలడు. ఆమెలోని నిజాయితీని గుర్తించాడు. "అలాగే" అన్నాడు.
రంజితకు ఆయన్తో మాట్లాడే అవకాశం వచ్చేసరికి పత్రికా విలేఖరులు కూడా ఆయన్ని సమీపించగలిగారు. కృష్ణచైతన్య ఒక విధమైన నిర్లప్తతతో ఉన్నారు అందుకని కాదనలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి చాలా ఓపికతో సమాధానాలిచ్చారు. పత్రికా విలేఖరులలో ఓ ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళ యువకుడున్నాడు. అతను చాలా ఎగ్రిసివ్ గా ఉన్నాడు.