అందరూ చిరిగి పీలికల్లా వేలాడుతున్న బట్టలతో ఓ ఫోటో!"
ఓ పిల్ల ఎండిన డొక్కలతో నేలమీద చచ్చిపోయినట్లు పడి ఉన్న ఫోటో! అందరూ ఆకలి బాధకు తాళలేక ఎంగిలి విస్తరాకులు నాకుతున్న ఫోటో-
ఇలా అన్నీ కటిక దరిద్రం చూపించే ఫోటోలే! ఏ ఫోటో చూసినా మనకు ఏడుపు కలగక తప్పదు. ఇంగ్లీష్ లో ఉందా ఉత్తరం. గట్టిగా చదివాడు శాయిరామ్!
బీదల పాలిట జీసస్ క్రైస్ట్, శ్యామల్రావ్,
మీరు ప్రతిరోజూ రాస్తోన్న ఉత్తరాలూ, మీ ఆశ్రమం పిల్లల దారుణ పరిస్థితిని చూసే ఫోటోలూ మా కందుతున్నాయ్. అవి చూస్తుంటే మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండటం లేదు. రాత్రుళ్ళు నిద్రపట్టడంలేదు. భారతదేశం మహా దరిద్రగొట్టు దేశమని మాకు తెలుసు గానీ- ఇలా చిన్నచిన్న పాపలు రోడ్ల మీదపడి ఆకలితో చచ్చిపోతుంటారని మాకింతవరకూ తెలీదు.
మీరు పంపిన ఆ ఫోటోలు చూశాక మేము ఛీలీ భూకంపం బాధితుల కోసమని సేకరించిన ఆహారం, బట్టలూ, సామగ్రీ, రగ్గులు- మొదలైనవన్నీ కూడా ముందు మీకు మళ్ళించాము.
మా సొసైటీకున్న ఫండ్స్ అన్నీ కూడా బాంక్ నుంచి విత్ డ్రా చేసి మీ ఆశ్రమం కోసం పంపించాము. ప్రస్తుతం మా దగ్గర ఇంకేమీ డబ్బులేదు. మళ్ళీ ఇప్పట్లో పోగుజేసే శక్తి కూడా లేదు. ఎందుకంటే మావీ మధ్య తరగతి కుటుంబాలే! మీకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో!
భారతదేశంలో రోడ్లమీద ఆకలితో చనిపోయే పిల్లల ఫోటోలు చూశాక మేమంతా గత పదిహేను రోజులుగా ఒక్కపూటే భోజనం చేస్తూ ఆదా అయిన డబ్బు మీకు పంపాము.
దయచేసి మమ్మల్నింకా బాధించకండి! మా దగ్గరున్న సర్వస్వం మీ ఆశ్రమం కోసమే పంపించాము. ప్రస్తుతం మా సొసైటీ మెంబర్లందరం ఇంచుమించుగా కట్టుబట్టలతో ఉన్నామంటే అతిశయోక్తి కాదు. ఫండ్స్ అన్నీ అయిపోయిన కారణంగానూ, అప్పులెక్కువగా చేయాల్సి వచ్చిన కారణంగానూ మేము మా 'లవర్టన్ లేడీస్ సొసైటీ"ని మూసివేస్తున్నాము. మీ భారతదేశం పిల్లల్ని ఆ భగవంతుడే కాపాడాలని మా ఆకాంక్ష!"
కొద్ది క్షణాల వరకూ మాకెవరికీ నోటమాట రాలేదు.
"అమ్మ రాస్కెల౧ చూశారా- పాపం ఆ ఆడాళ్ళ క్లబ్ ని పట్టుకుని ఎంత మోసం చేస్తున్నాడో! ఆ పెద్ద ఇంటికి అద్దె, ఆ స్కూటరూ, ఫ్రిజ్, కలర్ టీవీ అన్నీ వాళ్ళను ముంచే సమకూర్చుకున్నాడు" అన్నాడు శాయిరామ్.
ఉత్తరం మళ్ళీ అంటించి పోస్ట్ మెన్ కిచ్చి పంపించివేశాం.
ఏదేమయినా సాయంత్రం శ్యామల్రావ్ ఆటకట్టేయాలని నిర్ణయించుకున్నాం.
అందరం కలసి ఆశ్రమానికి వెళ్ళేసరికి శ్యామల్రావ్ ఖంగారు పడ్డాడు.
పిల్లలంతా గదుల్లో కూర్చుని అగ్గిపుల్లలు లెక్కబెట్టి అగ్గి పెట్టెలో ఉంచుతున్నారు.
"చూశారా ఈ పిల్లల వల్ల రెండు లాభాలు-" అన్నాడు రంగారెడ్డి.
"ఆస్ట్రేలియా సొమ్ములు మంచిగా అందుతున్నాయా సార్?" అడిగాడు యాదగిరి. శ్యామల్రావ్ ఉలిక్కిపడ్డాడు గానీ వెంటనే సర్దుకున్నాడు.
"ఎంతోమంది సహాయాలు చేస్తే గానీ ఈ యజ్ఞం సజావుగా సాగదు" అన్నాడు చిరునవ్వుతో.
"పాపం. ఈ పిల్లల ముఖాలు చూస్తుంటే కేవలం గంజి తాగి బ్రతుకుతున్నట్లుంది." అన్నాడు జనార్ధన్.
"భలేవారే! నా చిన్నారి పాపలను నేను పస్తుంచుతానా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు-"
అందరం అదో పెద్ద 'జోక్' అన్నట్లు గట్టిగా నవ్వాం.
"అబ్బ హబ్బ. ఏం జోకేశారు సార్." అన్నాడు రంగారెడ్డి కింద కూలబడిపోయి నవ్వుతూ.
"మీకు నామాట మీద నమ్మకం లేకపోతే ఈ చిన్నారి బాలలనే అడగండి నాయినా." అన్నాడు తాపీగా శ్యామల్రావ్.
శాయిరామ్ వెంటనే వెళ్ళి ఓ కుర్రాడిని చేయిపట్టుకుని తీసుకువచ్చాడు, వాడు సన్నగా చీపురు పుల్లలా ఉండి- ఏ క్షణాన్నయినా ప్రాణాలు వదిలేటట్లున్నాడు.
"ఒరేయ్. నిజం చెప్పమ్మా. రోజూ మీరు ఏమేం తింటున్నారిక్కడ?" అడిగాడు. జనార్ధన్ వాడిని ఆప్యాయంగా.
వాడు కళ్ళు మూసుకుని బట్టీ పట్టినట్లు గడగడా చదివేశాడు.
బ్రేక్ ఫాస్ట్ రెండు గుడ్లు- నాలుగు బ్రెడ్ స్లైసెస్- బటర్- ఒకగ్లాసు పాలు- మధ్యాహ్నం నాలుగు రొట్టెలు - అన్నం రెండు వెజిటేరియన్ కర్రీస్- పప్పు- పెరుగు- సాయంత్రం - ఎనిమిది బిస్కెట్లూ- పాలు- రాత్రి బ్రెడ్, అన్నం- రెండు కూరలూ- పప్పు- పెరుగూ నాలుగు రకాల పండ్లు-"
ఎవ్వరం మాట్లాడలేకపోయాం.
అవన్నీ తిన్నా వాళ్ళ ఆకారాలు అలా ఉన్నాయంటే- చాలా ఆశ్చర్యంగా వుంది.
"ఇంకా నమ్మకం కలుగలేదా నాయినా?" చిరునవ్వుతో అడిగాడు శ్యామల్రావ్.
"శ్యామల్రావ్! నువ్వు చేస్తున్నదంతా నాకు తెలుసు! పాపం ఈ పసిపిల్లలను అడ్డుపెట్టుకుని ఆ పారినర్స్ ని ఫూల్ చేస్తున్నావ్! వాళ్ళు పంపేవన్నీ అమ్ముకుని- నువ్వు డబ్బు సంపాదిస్తున్నావ్-" అన్నాడు జనార్ధన్.
"రేపే మా పేపర్లో హెడ్ లైన్స్ లాగించేస్తాను. బాలల ఆశ్రమం పేరుతో విదేశీ మహిళల దోపిడీ! నిర్భయ్ నగర్ కాలనీ వాసుల సెన్సేషన్ ఇన్ వెస్టిగేషన్! ఎలా వుంది గురూ కాప్షన్?" అడిగాడు గోపాల్రావ్.
"అమాయకులారా! బాలల సేవే మాధవ సేవయని నమ్మినవాడిని నాయనా." మమ్మల్నందరినీ జాలిగా చూస్తూ అన్నాడు శ్యామల్రావ్.
రంగారెడ్డికి ఛటుక్కున ఓ ఉపాయం తట్టినట్లుంది. నా చెవిలో ఊదాడు.
"ఒండర్ ఫుల్ అయిడియా" అన్నాన్నేను.
రంగారెడ్డి వెంటనే పక్కగదిలో గోడకు వేలాడుతున్న బెల్ట్ తీసుకుని ఓ కుర్రాడిని మా మధ్యకు లాక్కొచ్చాడు.
"ఒరేయ్. నిజం చెప్పకపోతే బెల్టుతో చావగొడతాను. నీకు రోజూ తినడానికేమి పెడుతున్నాడ్రా శ్యామల్రావ్?"
వాడు ఏడుపు మొఖం పెట్టాడు.
"చెప్తే మీరెళ్ళిపోయాక నన్ను కొడతాడు..." అన్నాడు భయంగా.
"మేము నిన్ను మాతో తీసుకెళ్ళి పోతాంలే- చెప్పు త్వరగా-"
వాడు భయంభయంగానే చెప్పసాగాడు.
"మాకేమీ పెట్టడు, మధ్యాహ్నం, రాత్రీ కొంచెం గంజి ఇస్తాడు-"
"మరి ఇందాక గుడ్లు, బ్రెడ్, బటర్ అన్నావు గదురా"
"అవన్నీ చెప్పకపోతే కొడతాడు-"
శ్యామల్రావ్ కి చెమటలు పట్టేసినాయి.
"ఇదంతా మీకు అనవసరం వెళ్ళండి" అన్నాడు బెదిరింపుగా.
"సరే. రేపు జైల్లో కూర్చోవాల్సిన రాత నీకుంటే మేమేం చేస్తాం" అంటూ అందరం బయటకొచ్చేశాం.
మర్నాడు పొద్దున్నే రాజేశ్వరి అందరినీ తీసుకొచ్చింది మా ఇంటికి.
"ఏమిటి?" విషయం తెలీక అడిగాను.
"ఆశ్రమం క్లోజ్ చేసేశాడు దొంగ రాస్కెల్-" అందామె.
"మరి పిల్లలు?"
"మళ్లా మన కాలనీలోకొచ్చేసి మన వరండాలో కూర్చున్నారు!"
మా అందరికీ సంతృప్తి కలిగింది.
"పోనీలే- ఎక్కడ అడుక్కుతిన్నా- స్వేచ్చగా బ్రతుకుతారు!" అన్నాన్నేను.
* * * * *