Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 23


    ఎవ్వరం మాట్లాడలేదు. వారం రోజులు గడిచిపోయినయ్. అందరం రోజూ ఏదొక వంక పెట్టుకుని శ్యామల్రావ్ ఇంటి మీదుగా రౌండ్స్ కొడుతూ లోపలేం జరుగుతుందో తెలుసుకోడానికి ప్రయత్నాలు చేయసాగాము గానీ ఏమీ తెలీటం లేదు.

 

    హఠాత్తుగా ఓ రోజు మధ్యాహ్నం ఓ చిన్న లారీలో నాలుగయిదు పెద్ద పెద్ద పాకేజీలు శ్యామల్రావ్ ఇంటికి చేరడం మా కాలనీలో ఆడాళ్ళందరూ చూశారు.

 

    ఇది జరిగిన రెండో రోజున ఆశ్రమం పిల్లలందరూ రంగు రంగుల బట్టలతో ముచ్చటగా కాలనీ మధ్య కాసేపు డ్రిల్ చేయటం నేర్చుకున్నారు.

 

    ఆ రాత్రి మళ్ళీ సమావేశం జరిగింది మా ఇంట్లో.

 

    "శ్యామల్రావ్ సంగతి ఏమాత్రం అంతుబట్టటం లేదు. ఆ పిల్లలందరికీ అంత ఖరీదయిన బట్టలెలా కుట్టించాడో-" అన్నాడు జనార్ధన్.

 

    "అదే నాకు అర్థం కావటం లేదు. ఏదో కొంపలు ముంచే కార్యక్రమం చేపట్టాడనటం మాత్రం ఖాయం!" అన్నాడు రంగారెడ్డి.

 

    "ఇప్పుడే మనందరం ఏదొక విధంగా వాడి కార్యక్రమాలు కూపీ లాగకపోతే మన కాలనీని మనకు తెలీకుండా ఎవరికో అమ్మేస్తాడు" అన్నాడు శాయిరామ్.

 

    "మరి ఆ డిటెక్టివ్ పని ఎవరు చేస్తారు?" అడిగాను నేను.

 

    "ఇంకెవరు? మన డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరే ఇలాంటి విన్యాసాలు అద్భుతంగా చేయగలదు-" అంది పార్వతీదేవి.

 

    రాజేశ్వరి మొఖం సంతోషంతో విప్పారింది.

 

    "ఓ! ఆ విషయం నాకొదిలేయండి. వారం రోజుల్లో మొత్తం వివరాలు సేకరిస్తాను-" అందామె ఉత్సాహంగా.

 

    మర్నాడు మేమంతా కేవలం ఆశ్రమం ఎలా నడుస్తోందో చూడటానికన్నట్లు బయల్దేరాము.

 

    శ్యామల్రావ్ మమ్మల్ని చిరునవ్వుతో ఆహ్వానించాడు. లోపల గదుల్లో పిల్లలందరి పక్కబట్టలు నీట్ గా సర్ది ఉన్నాయ్. పిల్లలు పెరట్లో చెమటలు కక్కుతూ తోటపని చేస్తున్నారు.

 

    "కమాన్ చిల్డ్రన్! మిమ్మల్ని చూడ్డానికి అంకుల్స్ వచ్చారు." అన్నాడు శ్యామల్రావ్ వాళ్ళతో. మరుక్షణంలో అందరూ వచ్చి మా ముందు రెండు లైన్లు కట్టి నిలబడ్డారు.

 

    "మీ కందరికీ ఇక్కడ ఆనందంగా ఉందా?" అడిగాడు రంగారెడ్డి ఆత్రుతగా.

 

    "ఓ! చాలా హాపీగా ఉన్నాము!" అందరూ చిరునవ్వుతో చెప్పారు.

 

    "కడుపునిండా భోజనం పెడుతున్నారా?" అనుమానంగా అడిగాడు శాయిరామ్.

 

    "ఓ! మాణింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం డిన్నరు, సాయంత్రం బిస్కెట్, టీ, రాత్రి సప్పర్-"

 

    అందరం మొఖాలు చూచుకున్నాం.

 

    అలాంటి ఆహారం మేము కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నాము. మరి శ్యామల్రావ్ అంత ఖరీదయిన మెనూ వాళ్ళకెలా సమకూరుస్తున్నాడో అర్థం కావటం లేదు.

 

    ఆ తరువాత పదిహేను రోజులకు మళ్ళీ పెద్ద పార్శిల్స్ లారీలో శ్యామల్రావ్ ఇంటికొచ్చాయి.

 

    ఆ తరువాత మరో వారానికి శ్యామల్రావ్ కలర్ టీవీ సెట్ కొనుక్కొని రావటం అందరం చూశాము.

 

    మరో వారానికి శ్యామల్రావ్ మా కాలనీలోనే తన కుటుంబం కొడుకు కుటుంబం కోసం త్రీ బెడ్ రూమ్ ఇల్లొకటి అద్దెకు తీసుకున్నాడు.

 

    శ్యామల్రావ్ ఏదో మాయ చేస్తున్నాడని అందరికీ నమ్మకమయితే కుదిరింది గానీ ఏం చేస్తున్నాడో మాత్రం ఎవరికీ అంతుబట్టటం లేదు.

 

    డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి ఇంకా తన 'పరిశోధన' పూర్తికాలేదని చెప్పేసింది.

 

    "ఒకవేళ అనాథాశ్రమం అన్జెప్పి డొనేషన్లు పోగుజేసి తినేస్తున్నాడేమో!" తన అనుమానం వెలిబుచ్చాడు రంగారెడ్డి.

 

    "అవునవును! ఆ విషయం వెంటనే ఆరా తీయాలి!" అన్నాడు శాయిరామ్. అప్పటికప్పుడే జర్నలిస్టు గోపాల్రావ్ కి శ్యామల్రావ్ కార్యకలాపాలన్నీ కనిపెట్టి వివరాలు సేకరించే కార్యక్రమం అప్పజెప్పాం.

 

    వారం రోజుల తరువాత గోపాల్రావ్ వివరాలతో వచ్చాడు.

 

    శ్యామల్రావ్ ఎక్కడా డొనేషన్లు కోసం తిరగటం లేదు. కానీ రోజూ పోస్టల్ కరస్పాండెన్స్ మాత్రం చాలా విపరీతంగా జరుగుతోంది. ఉదయం సాయంత్రం పోస్టాఫీస్ కెళ్ళటమే అతని కార్యక్రమం-

 

    మేమంతా మాట్లాడుతూండగానే రాజేశ్వరి తన పరిశోధన రిపోర్టుతో సహా వచ్చేసింది.

 

    "పూర్తి వివరాలు దొరకటం లేదుగానీ- నాకు తెలిసిందేమిటంటే- శ్యామల్రావు ఆ పిల్లలందరికీ గంజినీళ్ళు రెండు సార్లు తాగించటం తప్పితే ఇంకేమీ తిండి పెట్టడం లేదు. తరచుగా వాళ్ళని బెల్టు తీసుకుని వాతలు తేలేట్లు కొడుతున్నట్లు పనిమనిషి చెప్తోంది..."

 

    అందరికీ ఆ పిల్లల మీద జాలి కలిగింది.

 

    "వాళ్ళనెలాగయినా ఆ దుర్మార్గుడి బారినుంచి రక్షించాలి. వాడు తిండి పెట్టకుండా, అలా చావకొడుతూంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి?" అన్నాడు జనార్ధన్.

 

    "మనం చేయాల్సిన పనేంటంటే ముందు ఆ పార్శిల్స్ ఎక్కడి నుంచి ఎందుకొస్తున్నాయో, ఆ కరస్పాండెన్స్ ఎవరితో జరుపుతున్నాడో తెలుసుకోవాలి." అన్నాడు రంగారెడ్డి.

 

    అందరూ రంగారెడ్డిని బలపరచారు.

 

    ఆ మర్నాడు అందరం ఆఫీస్ కి శెలవుపెట్టి పోస్టుమెన్ కోసం ఎదురు చూడసాగాము.

 

    మా ఇంటికి లెటరు ఇవ్వటాని కొచ్చి మా అందరినీ చూసి ఆశ్చర్యపోయాడు పోస్టుమన్.

 

    "ఏం గురూజీ ఎమర్జెన్సీ మీటింగా?"

 

    "అబ్బేకాదు. మీ కోసమే ఎదుర్చూస్తున్నాం రండి. ఇలా కూర్చోండి" అన్నాన్నేను. పోస్టుమన్ లోపలికొచ్చి కూర్చున్నాడు.

 

    అతనికి శ్యామల్రావ్ 'అపూర్వ ప్రేమాశ్రమం' గురించి మా అనుమానాలు చెప్పాక అసలు విషయం కదిపాము.

 

    "మరేం లేదు, అతను కరస్పాండెన్స్ ఎవరితో జరుపుతున్నాడు అనే వివరాలు కావాలి."

 

    దాన్దేముంది సార్. నాకు తెలుసు ఆ అడ్రస్. ఆస్ట్రేలియాలో 'లవర్టన్' అనే ఊరు నుంచీ అతనికి పార్సెల్స్ ఉత్తరాలు తరచుగా వస్తుంటాయ్."

 

    "అక్కడినుంచీ ఎవరు పంపుతున్నారు?"

 

    అతను తన సంచీలో నుంచి ఓ ఉత్తరాల కట్టతీసి అందులోనుంచి ఓ పెద్ద కవరు బయటకు లాగాడు.

 

    "ఇదిగో - ఫ్రమ్ అడ్రస్ చూడండి! 'లవర్టన్ లేడీస్ సొసైటీ' అన్న రబ్బరు స్టాంప్ ఉంది!"

 

    అందరం ఆ కవరుని పరీక్షించాము.

 

    "గురూ! వీడు పెద్ద ఎత్తున దేశాన్ని అమ్ముతున్నట్లున్నాడు. అసలే ఈ మధ్య విదేశీ గూఢచారుల గురించి రోజూ పేపర్లలో వార్తలొస్తున్నాయ్" అన్నాడు శాయిరామ్.

 

    "ఒక్కసారి! ఈ కవరు ఓపెన్ చేసి చూస్తే బావుంటుంది!" అన్నాడు పోస్టుమన్ వంకచూస్తూ.

 

    "బాబోయ్ నా ఉద్యోగం పోతుంది..." భయంగా అన్నాడతను.

 

    "నువ్ ఫికర్ చేయకన్నా! ఈ సీక్రెట్ ఎవళ్ళతోను చెప్పం మళ్ళా" అన్నాడు యాదగిరి భరోసా ఇస్తూ.

 

    ఎలాగయితేనేం అరగంట సేపు బ్రతిమాలాక పోస్టుమన్ వప్పుకున్నాడు. వెంటనే జాగ్రత్తగా కవరు విప్పి ఉత్తరం బయటకు లాగాము.

 

    ఉత్తరంలో నుంచి జలజలా కార్ట్ సైజ్ ఫోటోలు బోలెడు కిందకు రాలినయ్.

 

    వాటిని చూస్తూనే అందరం ఆశ్చర్యపోయాము.

 

    అవన్నీ 'అపూర్వ ప్రేమాశ్రమం'లోని పిల్లలవి.

 Previous Page Next Page