Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 25

                                 


                           సెన్సార్ కత్తెర జిందాబాద్!


                              


    సెన్సార్ ఆఫీసుకి వరుసగా నాలుగు టాక్సీలు వచ్చి ఆగాయి.

 

    మొదట టాక్సీలో నుంచి విప్లవ్ దిగాడు. అతని వెనుకే అతని యూనిట్ సభ్యులు. మరుక్షణంలో ఆ ప్రాంతమంతా వారి కేకలతో దద్దరిల్లి పోసాగాయ్.

 

    సెన్సార్ బోర్డ్ డౌన్ డౌన్.

 

    ముర్దాబాద్ ముర్దాబాద్- సెన్సార్ బోర్డ్ ముర్దాబాద్.

 

    సెన్సార్ పాలసీ - ఛీ - ఛీ!

 

    సెన్సార్ బోర్డు సభ్యులు- భో భో!

 

    సెన్సార్ కత్తెర - ఛీ ఛీ!

 

    సెన్సార్ నిబంధనలు- హెల్! హెల్!

 

    "ఏము నిర్మించిన "మారణహోమం' సినిమాకు వెంటనే క్లీన్ సర్టిఫికెట్- ఇవ్వాలి. అర్థం లేని అంట కత్తెరలు- నశించిపోవాలి!"

 

    ఈ హడావుడికి అప్పటికే అక్కడ గారడీ వాడికి పోగయినట్లు జనం పోగయ్యారు.

 

    విప్లవ్ కేకలు కాసేపు వాయిదావేసి తనవెంట వచ్చిన వాళ్ళందరిని పిలిచి ఏదో చెప్పాడు.

 

    వాళ్ళిద్దరూ చెరో స్పీకరూ సంచీల్లోనుంచి తీసిపాట మొదలెట్టారు.

 

    "సూర్యకాంతి నాపడం- నీ యబ్బతరమా?
    విప్లవాన్ని ఆపడం- నీ తాత తరమా?
    మా సినిమాకు కత్తిరించడం- నీ తలలో జేజెమ్మ తరమా?

 

    అక్కడ చేరిన వారందరూ ఆ పాటకు ఆనందిస్తున్నట్లే కనబడింది వాతావరణం.

 

    ఈ హడావిడికి సెన్సార్ బోర్డు ఆఫీసరు ఖంగారుగా బయటికొచ్చాడు.

 

    "ఏమిటి? ఏం జరిగింది?" అనడిగాడు ఎదురుగ్గా నిలబడ్డ విప్లవ్ ని.

 

    "ఏం జరగటమా. హు? ఏం జరిగిందీ అనడుగుతున్నారా? హు హు! నేను నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రప్రథమ చిత్రాన్ని త్రొక్కిపడతారా? అరవై కట్లు సజెస్ట్ చేస్తారా? బాన్ చేస్తారా? హుహుహు చూస్తాను- ఇవాళ నా సినిమాని ఆపగలరు! కానీ రేపు విప్లవాన్ని ఆపగలరా? లేరు, లేరు, లేరు!" ఆవేశంగా అరిచాడు విప్లవ్.

 

    "అయ్యా! మీరనేదేమీ నాకు తెలీటం లేదు" అన్నాడు ఆఫీసరు అయోమయంగా.

 

    "అదే! మీరు నిర్ధాక్షిణ్యంగా, నిరంకుశత్వంగా సర్టిఫికెట్ ఇవ్వకుండా అణచిపెట్టిన నా సినిమా సంగతేమిటి, అని మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను."

 

    "చూడు నాయనా! సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలు రెండొందలు పాతిక ఉన్నాయ్! అందులో మీదేది!"

 

    "ఆ! ఏమిటి? మా సినిమాయే తెలీదా? కాదు! తెలుసు! కానీ తెలీనట్లు నాటకం! ఎందుకంటే మీలో ఉన్నది బూర్జువా రక్తం.!"

 

    "నా రక్తం ఎ.బి. గ్రూప్ అని డాక్టరు చెప్పారు బాబూ! బూర్జువా గ్రూపు కాదు."

 

    "అయితే అరవై కట్స్ విధించిన మా సినిమా సంగతేమిటి? అన్ని కట్స్ ఎందుకు విధించారు? ఎందుకు బాన్ చేశారు?"

 

    "అయ్యా! అరవై కట్స్ విధించిన సినిమాలు మా లిస్ట్ లో నూటపాతిక ఉన్నాయ్. బాన్ చేసినవి డెబ్బయ్ ఆరున్నయ్ అందులో మీదేదో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది."

 

    "మాది విప్లవాత్మకమైన చిత్రం! పేరు 'మారణహోమం!"

 

    "చూడు నాయనా! ప్రభుతం ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఎగ్జామినింగ్ కమిటీ ఆ కట్స్ విధించింది. మీరు ఆ కట్స్ చేయడానికి నిరాకరించడం వల్ల అది రివైజింగ్ కమిటీ కెళ్ళింది. వాళ్ళు మీ సినిమాను బాన్ చేయాలని తీర్మానించారు. దీనికి మేమేం చెయ్యం?" అనేసి ఆఫీసరు లోపలికెళ్ళిపోయాడు.

 

    "అదే కుట్ర! అదే మోసం! అదే దగా! నా సినిమాను బాన్ చేసి నా పరువూ, ప్రతిష్టా, నా భవిష్యత్తూ, నా సినిమా కలెక్షన్లూ, అన్నీ మంట కలపాలని, నా విప్లవ భావాల్ని నాలోనే అంతం చేయాలని మీరాడుతున్న నాటకం ఇది! కానీ నేను మీ కుట్రకు బలయ్యే పక్షిని కాదు. మీ సెన్సార్ విధానాల్ని, మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ నీ, మీ తెలివితేటల్నీ, మీ కత్తెరనూ- నా కంఠంలో ఆఖరి ప్రాణం బొట్టు ఉన్నంతవరకూ ఎదిరిస్తాను, పోరాడతాను."

 

    అనేసి వెనక్కు తిరిగి "సెన్సార్ బోర్డ్" అని అరిచాడతను.

 

    అందరూ "డౌన్ డౌన్" అంటూ ముక్తకంఠంతో అరిచారు. ఈసారి అక్కడ ఈ గొడవ చూడ్డానికని గుమిగూడిన బఠానీలవాళ్ళూ, ఐస్ క్రీమ్ కుర్రాళ్ళూ సిటీ చూడ్డానికొచ్చిన పల్లెటూరివాళ్ళూ- ఇంకా అనేకరకాల జనం కూడా ఉత్సాహంగా అరవడం ప్రారంభించారు.

 

    సెన్సార్ బోర్డ్ డౌన్ డౌన్!

 

    ముర్దాబాద్ ముర్దాబాద్- సెన్సార్ బోర్డ్ ముర్దాబాద్.

 

    సెన్సార్ పాలసీ - ఛీ ఛీ!

 

    సెన్సార్ బోర్డ్ మెంబర్స్- భో - భో!

 

    సెన్సార్ కత్తెర ఛీ - ఛీ!

 

    సెన్సార్ రూల్స్ హెల్ హెల్!

 

    మారణహోమం - రిలీజ్ చెయ్. అరవై కట్లూ- గో బాక్!

 

    వుడ్ డిమాండ్ - క్లీన్ సర్టిఫికెట్.

 

    మా చిత్రం మీద నిషేధం- తీసేయాలి ఈ క్షణమే ఇప్పుడే! 

 

    అరుపులు, కేకలు, ఈలలూ క్రమక్రమంగా పెరిగిపోతూండేసరికి ఆఫీసరు హడావుడిగా బయటికొచ్చాడు.

 

    "అయ్యా- మీరిలా అల్లరి చేస్తుంటే అవతల మా ఆఫీస్ పని ఎలా జరుగుతుంది చెప్పండి! మీరు చెప్పదల్చుకుందేదో నినాదాల రూపంలో కాకుండా మొమొరాండం రూపంలో ఇస్తే పై అధికారులకు పంపుతాను" అన్నాడు వినయంగా.

 

    "అదేం కుదరదు! ఇవాళ సాయంత్రం వరకూ అరుస్తూనే ఉంటాం! రేపట్నుంచీ నేనూ, మా యూనిట్ సభ్యులు- అందరం ఇక్కడే నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాం! ఆ తరువాత పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది" అని అరిచాడు.

 

    చేసేది లేక ఆఫీసరు మళ్ళీ లోపలికెళ్ళిపోయాడు.

 

    మర్నాడు అందరూ నిరాహారదీక్ష ప్రారంభించారు.

 Previous Page Next Page