Previous Page Next Page 
నానీ పేజి 22


    సాయంకాలం అయిదుగంటలు దాటి ఇరవై నిముషాలు గడిచాయి.

 

    ఆకాశం మేఘావృతమై వుంది.

 

    ఆగివున్న గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఎక్కాల్సిన ప్రయాణికులు ముసురుతున్న ఈగల్లా బోగీల్లోకి చొచ్చుకువచ్చే గాలి దుమ్మురేపుతూ స్టేషన్ సమీపంలోని తటాకాలపై తన ప్రభావాన్ని చూపుతుంటే...

 

    చీకటి గుండెలో బ్రతకాలనే ఆశాదివ్వెని వెలిగించుకున్న నానీ భయంతో పరుగెత్తుకొస్తున్నాడు.

 

    అప్పటికే ఫ్లాట్ ఫాం పై అడుగుపెట్టిన రాజారావు పొదలమధ్య పరుగెత్తే కళింగనాగులా జనాన్ని తోసుకుంటూ నానీకోసం గాలిస్తున్నాడు.

 

    రేపటికోర్టులో నానీ నిజం చెప్పకూడదని ఈరోజు ఏటిలో నెట్టేద్దామనుకుంటే నేక్ గా తప్పించుకున్నాడు నానీ.

 

    మామిడి తోపుల్లోనుంచి ఒత్తు మర్రిచెట్ల మధ్యగా అనుసరిస్తూ వచ్చాడు.

 

    కాదు... చేతికి చిక్కితే పీకపిసికి శారదానదిలో పారేద్దామని దృఢ సంకల్పంతో వున్నాడు.

 

    ఎక్స్ ప్రెస్ కూతపెట్టింది.

 

    ఉస్సురోమంటున్న రాజారావు బండి కదులుతుండగా చూశాడు నానీని.

 

    రాజారావుని చూసి భయంతో వణికిపోతున్న నానీ అప్పటికే ఓ కంపార్టుమెంటులోకి జొరబడిపోయాడు.

 

    రాజారావు ఆలస్యం చేయలేదు.

 

    తనూ అదే బోగీనెక్కేశాడు.

 

    రాజమండ్రిని చేరేది మరో మూడుగంటల్లో...

 

    ఆ మాత్రం వ్యవధి చాలు నానీని చేజిక్కించుకోడానికి, చీకటి గోదావరిలోకి విసిరిపారేయటానికి.

 

    దురదృష్టవశాత్తు నానీ కంగారుగా ఎక్కింది ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు.

 

    ప్రయాణీకులంతా కూర్చునేది కూపేల్లో కాబట్టి ఇప్పుడు నానీ బిక్కమొహం వేసుకుని దాక్కోడానికి చోటులేనట్టు సన్నని మార్గంలో నిలబడివున్నాడు.

 

    అప్పటికే ట్రైను వేగం పుంజుకుంది.

 

    రాజారావు ఒక్కో అడుగు ముందుకేస్తూ నానీని చేరుతుంటే భయంతో వణికిపోతున్నాడు నానీ.

 

    మరో అరక్షణం నానీచేతిని బలంగా పెట్టుకునేవాడే...

 

    కాని అప్పటికే టి.టి.ఇ. నానీ వెనుగ్గా రావడంతో ఆగిపోయి కిటికీలో నుంచి బయటకుచూస్తూ వుండిపోయాడు రాజారావు.

 

    అదే రాజారావు చేసిన చిన్నపొరపాటు.

 

    ఆ కొద్దిపాటి అవకాశాన్ని జారవిడుచుకోకుండా వారగా తెరుచుకునివున్న ఓ "కూపే" ద్వారంలోనుంచి లోపలికి జొరపడిపోయాడు నానీ.

 

    స్నేహితురాలు ఆశతో మాట్లాడుతున్న హరిత ఒక్కక్షణం నిస్మయంగా చూసింది.

 

    మనిషి జీవితంలో చాలా సంఘటనలు ముఖ్యంగా చాలా అపూర్వమైన సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగిపోతుంటాయని తెలీని నానీ తాను ఎలాంటి ఆపదలేనిచోటు చేరుకున్నాడో వూహించలేకపోయాడు.

 

    భయంతో బిక్కమొహం వేసుకు నిలబడ్డ నానీ ప్రస్తుత మానసిక స్థితేమిటో తెలుసుకోకపోయినా బహుశా టిక్కెట్టు లేకుండా ఏ టి.టి.ఇ. చేతనో తరమబడుతున్నాడనుకుంటూ ద్వారం మూసేసింది హరిత.

 

    అదే తేరుకున్న రాజారావుని చేష్టలుడిగిపోయేట్టు చేసిందికూడా.

 

    "ఏంటి మాష్టారూ... ఆడవాళ్ళ కూపేలో మగాళ్ళు ఇలా పర్మిషను లేకుండా దూరిపోవచ్చా?" అంది హరిత నానీని చూస్తూ.

 

    "మరేమో..." రాజారావు తరుముతున్నట్టు చెప్పాలనుకున్నాడు కానీ అలా చెబితే ఆడవాళ్లు కాబట్టి రాజారావుకి భయపడి అప్పచెప్పేస్తారేమో అని ఆందోళన పడిపోయాడు "చోటుంటుందని"

 

    "ఎంతమాట... ఉంటుంది... కాని నువ్వు మగాడివిగా! పైగా వచ్చేది రాత్రిప్రయాణం... మాకు ప్రమాదంకదూ."

 

    "ఎందుకూ?" అమాయకంగా అడిగాడు.

 

    "నువ్వు మగాడివి కాబట్టి" అంటూ నవ్వేసిన హరిత "పోనీలే ప్రమాదకరమైన మగాడిలా లేవు" అంటూ పక్కున కూర్చోబెట్టుకుంది. "అవునూ ఆడపిల్లలా వణికిపోతున్నావేంటి ?"

 

    "నేను వణికిపోవడంలేదూ" దీర్ఘం తీస్తున్నట్టుగా అన్నాడు.

 

    "ఏం..."

 

    "నేను మగాడ్నిగా."  

 

    ఈసారి ఆశ ఫక్కున నవ్వేసింది. "మొత్తానికి ఒప్పేసుకున్నావు."

 

    "మా అమ్మకూడా అంటుండేది."

 

    "ఏమని?" హరిత ఉత్సుకతగా అడిగింది.

 

    "నేను మగపిల్లాడ్ని అని."

 

    "నాకు డౌటే..."

 

    "ఈసారి మీ అమ్మని అడిగేయి... 'నా మొహం చూస్తే పేంటేసుకున్న ఆడపిల్లలా వుంటావూ అని ఆడపిల్లలన్నారని' సరేనా?"

 

    తల అడ్డంగా వూపాడు వీలుకాదన్నట్టుగా.

 

    "ఏం... అడగడానికి సిగ్గా?"

 

    "కాదు."

 

    "మరి?"

 

    "అమ్మలేదుగా!"

 

    "ఏమైంది?"

 

    "చచ్చిపోయింది. మూడ్రోజులక్రిందటే."

 

    హరిత అవాక్కయిపోయింది. మనసులో ఏ మారుమూలో సన్నని బాధలాంటిది మొదలై అమాయకంగా చూసే నానీపై అది జాలిగా మారిపోయింది. "ఎక్కడికెళుతున్నావు?"

 

    "ఏడోస్టేషనుకి."

 

    "వ్వాట్" అర్థంకాలేదు హరితకి.

 

    "అవునూ... తాతయ్యకి బాగోలేదుగా... అందుకు మందుకోసం పంపారు."

 

    "మరి ఏడో స్టేషనేంటి?"

 

    "అదంతే... ట్రైనెక్కాక ఆరుస్టేషన్లలో ఆగేవరకూ వూరుకుని ఏడోస్టేషనులో దిగితే ఓ గెడ్డం డాక్టరుంటాడట. ఆయన దగ్గరకెళ్ళి తాతయ్యకి మందంటే ఇస్తాడట" నానీ కళ్ళింతగా చేస్తూ చెబుతుంటే విస్తుపోతూ వింది.

 

    "ఏడో స్టేషనంటే అసలే ఊరు?"

 

    "ఏమో! లెక్కపెడుతుంటానుగా"

 

    "అంతకంటే మీ తాతయ్యనడగాల్సింది."

 

    "ఎందుకూ... నాకు లెక్కలు బాగానేవచ్చు. కరెక్టుగా దిగిపోతాను."

 Previous Page Next Page