త్రుళ్ళిపడినట్లయ్యాడు. "ఏమన్నావు దెయ్యమా?" అని చెయ్యెత్తి కొట్టబోయాడు.
తప్పించుకుని "ఆగండి సార్! పరాయివాడి భార్యను మీరనుభావించటానికి అభ్యంతరం లేదుగానీ మీ భార్యని ఇంకొకరు ముట్టుకుని వుంటారంటే ఆగ్రహమా? పరాయివాడి భార్య మీకు తేలికగా లొంగిపోతుందన్న నమ్మకము వున్నప్పుడు మీ భార్య ఇంకొకరికి వశమవుతుందంటే నమ్మబుద్ధి కావటంలేదా సేఠ్ జీ?"
"నోరు ముయ్యవే రాకాసీ!"
"అన్నట్లు.....మీ అమ్మాయి ఒకర్తి యూనివర్సిటీ హాస్టల్లో వుండి చదువుతోంది కదూ?"
"అయితే ఏం?"
"ఆమెకో పద్దెనిమిదేళ్ళు ఉండవచ్చు. అవునా?"
నేనేమంటానో అర్ధంగాక అయోమయంగా చూస్తున్నాడు.
ఆమె వర్జిన్ అని మీకు నమ్మకమేనా?"
సేఠ్ గారి కళ్ళు చింతనిప్పులయ్యాయి. "చూడు నిన్నేంచేస్తానో" అంటూ మీదకు రాబోయాడు.
"కొంచెం తమాయించండి సేఠ్ జీ! పద్దెనిమిదేళ్ళ వయసులో వున్న వాళ్ళలో నూటికిడెబ్భైమంది కన్యలు కాదని ఆ మధ్య హాస్టల్సులో వున్నవాళ్ళని పరిశోధించగా తేలిందట. ఇంకొకటి విన్నారా? ఈ మధ్య ఒకామె పెళ్ళయి భర్తతో నిక్షేపంగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళని వారివారి ఆంతరంగిక జీవితాలను గురించి ఇంటర్యూ జరిపిందట. దానిలో తేలిందేమిటంటే వారిలో నూటికి తొంభైమంది పెళ్ళికి ముందు - చేసుకోబోయే భర్తలతో కాదు సుమండీ! శారీరానుభావం కలిగిన వాళ్ళేట. అంతేకాదు, అందుగురించి ఆవగింజంతయినా వాళ్ళలో పశ్చాత్తాపం కనిపించలేదట."
"పాపం సేఠ్ జీ చిందులు త్రొక్కాడు, జుట్టు పీక్కున్నాడు, మరో రెండు పెగ్గులు వేసుకున్నాడు......"
అతని దగ్గరకు వెళ్ళి "రండి సేఠ్ జీ!" అన్నాను చెయ్యి పట్టుకుని.
ముఖంలోకి దీనంగా చూశాడు.
"స్త్రీ జాతిలో నేనూ ఒకదాన్ని. మీ భార్య, కూతురూ, నేనూ అంతా ఈ స్త్రీ జాతిలో భాగమే."
షాక్ కొట్టినట్లు చెయ్యి వదిలేశాడు. "వెళ్ళిపో, ఇక్కడ్నుంచి వెళ్ళిపో" అని పిచ్చెత్తినట్లు అరిచాడు.
చెప్పటం ముగించి భానుమతి పెద్దపెట్టున నవ్వసాగింది.
ఆ నవ్వులో మాలతికి అనేక అర్ధాలు కనిపించాయి. స్త్రీకి రక్షణలేదు. స్త్రీ ఎప్పుడో ఒకప్పుడు పతనంకాకతప్పదు. ఈ ఊబినుంచి ఎవరూతప్పించుకోలేరు. అది అలా సహజమైన సంఘటనల్లో ఒకటి. దాన్ని గురించి బాధేమిటి? దానికి అలవాటు పడిపో!
"ఆపు అని అరుద్దామనుకుంది, కానీ ఏడ్చేసింది మాలతి.
"మాలీ ఏడవకే!" అంది భానుమతి జాలిగా. "అత్యంత భయంకరమైన నిజాలు కొన్ని సహజంగా పరిణమించాయి కాలక్రమాన. ఇష్టంలేని వాళ్ళని అనుభవిస్తూ తెలియనట్లు నటించటం మినహా గత్యంతరం లేదు."
మాలతికి ఆవేశం వచ్చింది. "అన్నీ భయంకరమైన నిజాలు కావు, అర్ధంలేని అబద్ధాలు."
"అవన్నీ ఆత్మవంచన చేసుకునేవాళ్ళు పలికే ప్రగల్భాలు."
"భానూ! నేను ఆత్మవంచన చేసుకునే మనిషిని కాను."
"ఈ నిజాన్ని కాదనే శక్తి నాకులేదు. ఒప్పుకుంటున్నాను."
ఇహ సంభాషణ మారుద్దామని మాలతి అంది "అయితే ఉద్యోగం పోలేదా?"
భానుమతి నవ్వింది "పోలేదు. బహుశా - నేనతన్ని మోసం చెయ్యలేదు గనుక."
"పోన్లే" అని మాలతి నిట్టుర్పు విడిచి ఉండు "కాఫీ తీసుకువస్తాను" అంటూ లోపలకు వెళ్ళింది. వంటింట్లో తలుపులు జారవేసుకుని గోడకానుకుని బావురుమని ఏడ్చేసింది-మనసారా. అలా రెండు నిముషాలు ఆస్ధితిలో వుండి పోయాక కళ్ళు తుడుచుకుని, సింక్ దగ్గరే ముఖం కడిగేసుకుని, గబగబ కాఫీ కలపసాగింది.
"అన్నట్లు.....నీకు ఒక్కటే చెప్పాను. ఇంకా వున్నాయి చెప్పవలసిన సహజ విచిత్రాలు" అంది భానుమతి కాఫీ త్రాగుతూ.
"నాకు తెలుసు, మళ్ళీ గుండెల్ని పగులకోట్టేస్తావు."
"అయినా వినకతప్పదు. మనం అనుక్షణం చిందరవందరగా వుండే ఈ జనసందోహం, తలలు పగిలిపోయేలా వినిపించే ఈ చప్పట్లు ఎలా భరిస్తున్నామో కొన్ని సత్యాలుకూడా భరించకతప్పదు. అదేమిటంటే నేను మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాను."
నిజంగానే గుండె పగిలిపోతుంది. ముఖం రక్తంలేనట్లు పాలిపోయింది. "ఎవర్నీ?" అనడిగింది ముంచుకొస్తూన్న నీరసంతో.
"రామ్మోహన్! మనతో పనిచెయ్యాలా? నన్ను వెన్నంటి తిరుగుతున్నాడు. ఒక రకమైన ప్రేమ వ్యవహారమనుకో. అతను ప్రేమను బహిర్గతం చెయ్యటం, మేమిద్దరం సినిమాలూ, షికార్లూ సాగించటం ముమ్మరంగా సాగాయి. అతను పెళ్ళి చేసుకోమని అడిగాడు. నాకు అభ్యంతరం చెప్పే అవసరం కనిపించలేదు. సరేనన్నాను...."
"ఛీ ఛీ!"అనుకుంది మాలతి. "అతన్తో నీకు ఇదివరకే పెళ్ళయినట్టు చెప్పావా?" అని అడుగుగామనుకుంది. కానీ ఎందుచేతనో అడగలేక పోయింది.
"భానూ! భానూ! ఎన్ని దశల్లో నిన్ను చూడాల్సివస్తుందో? ఎలాగే - ఎలాగే?" అని మనసులో వాపోయింది.
12
ఆరోగ్యం కొద్దిగా కుడుటపడేసరికి శేఖర్ లో చలాకీతనం వస్తూంది. అవసరాన్ని మించి అలసటచెందటం, చీటికీ మాటికీ బయటకు వెడదామని పేచీపెట్టటం ఎక్కువయింది.
ఒకరోజు ఇంట్లో "బోర్" అయిపోతున్నానని మారాంచేసి మాలతితో టాక్సీలో పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళాడు.అక్కడ ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా అటూఇటూ షికార్లు కొట్టేసరికి గుండెల్లో నొప్పివచ్చింది. ఒళ్ళంతా ముచ్చెమటలు వచ్చేసినట్లయింది. మాలతి అతన్ని ఎలాగో టాక్సీలో ఇంటికి తీసుకోచ్చేసరికి గుండెల్లో నొప్పి మరీ ఎక్కువై కారులోంచి క్రిందకి దిగలేకపోయాడు. మాలతి తను ఒక్కతే అతన్ని దింపలేక "గోపయ్యా! గోపయ్యా!"అనికేకేసింది.