ఇద్దరూ షాపుకెళ్ళి షాపు యజమానికి కవరు ఇచ్చారు. పద్మాకర్ చూపిస్తూ "ఇతని చెల్లెలు వస్తుంది. కాస్త ఆ కవరు ఇవ్వండి" అని బయటకు వచ్చేసి కార్లో ఒక రౌండ్ తిరిగి, దూరంగా ఆపి, మొహం చాటు చేసుకుంటూ వచ్చి దూరంగా, రోడ్డుకి అవతలివైపు వున్న హోటల్ లో కూర్చుని షాపు వైపే చూడసాగారు.
అయిదు నిముషాలు...
పది నిమిషాలు గడిచాయి.
"కేవలం మనల్ని ఏడిపించటానికి చేసిందేమో గురూ" అన్నాడు పద్మాకర్ నిస్పృహగా.
"నేననుకోను."
"లేకపోతే మీ ఇంటికి మళ్ళీ ఫోన్ చేసి, మీ అమ్మగారిని అడిగి నీ జ్వరం సంగతి తెలుసుకుందేమో."
"అపశకునం మాటలు మాట్లాడకు."
మరో ఐదు నిముషాలు గడిచాయి. విహారి కూడా విసుగ్గా వాచీ చూసుకున్నాడు. ఎవరూ వస్తున్నా జాడలేదు.
"ఏం చేద్దాం పద్మాకర్?" అడుగుతూ వుండగా విహారి హఠాత్ గా లేచి నిలబడ్డాడు.
దూరంనుంచి సునాదమాల వస్తోంది.
ఇద్దరూ వూపిరి బిగపట్టారు. సునాదమాల మెడికల్ షాపు మెట్లు ఎక్కుతూంది.
"పద" అన్నాడు. ఇద్దరూ బిల్ డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చారు.
"లోపల షాపువాడు- "పద్మాకర్ చెల్లెలు మీరేనా?" అని అడుగుతున్నాడు.
"కాదే" అంది మాల విస్మయంతో. "నెవోక్విన్ టాబ్లెట్లు అరడజను కావాలి"
ఆమె బామ్మకి రెండ్రోజుల్నించీ మలేరియా. షాపువాడు టాబ్లెట్లు కవర్ లో పెట్టి ఇచ్చాడు. వాటిని తీసుకుని ఆమె మెట్లు దిగుతూ వుండగా వెనుకనుంచి హఠాత్తుగా విహారీ కంఠం "దొరికిపోయారు" అని వినిపించింది.
కెవ్వున అరవబోయి, నడిబజారని చూసి అతికష్టంమీద తమాయించుకుంది.
"ఇన్నాళ్ళూ ఏడిపించినందుకు- మేం పన్నిన వలలో ఇరుక్కుపోయి రెడ్ హేండెడ్ గా దొరికిపోయారు" అన్నాడు.
"దయచేసి నన్నిలా వెంటాడడం మానేస్తారా?" ఏడుపు దిగమ్రింగుకుని అంది.
"ఇంకెందుకు వెంటాడటం? దొరికిపోయారు కదా?"
పద్మాకర్ కల్పించుకుని "ఇంక చాలు మేడమ్! మీ చేతిలో కవరే చెపుతోంది మొత్తం విషయమంతా" అన్నాడు.
"ఇవి నెవోక్విన్ టాబ్లెట్లు."
"అయితే తెల్లకాగితం చూశారన్నమాట."
"తెల్ల కాగితం ఏమిటి? దొరికిపోవడమేమిటి?"
"మీరు అద్భుతంగా నటించగలరు, వప్పుకుంటున్నాను."
ఆమె ధైర్యం తెచ్చుకుంది. "చూడండి మిస్టర్! నేను మెత్తగా వున్న కొద్దీ మీరు మరీ చనువు తీసుకుంటున్నారు."
"అయితే మీరు కేవలం ఫోన్ లో కవ్వించి సంతృప్తి చెందుతారన్నమాట. బోర్లా పడుకుని" విసురుగా అన్నాడు.
సునాదమాల కళ్ళు పెద్దవయ్యాయి. "వ్వాట్" అంది.
"కొంతమంది అంతే. పైకి ధైర్యం చెయ్యలేరు అంతా లోలోపలే."
ఆమె మొహం ఎర్రబడింది. "వాట్ డూ యూ మీన్?" అంది కోపంగా.
"చూడండి మిస్! ఏ పని చేసినా ధైర్యంగా చెయ్యాలి. బరువు చూడాలని వుంటే డైరెక్ట్ గా చూడాలి. ముద్దు పెట్టుకోవాలని వుంటే చెంపమీద పెట్టుకోవాలి. ఇంటికెళ్ళి నేను పట్టుకున్న చేతిమీద పదివేలసార్లు పెట్టుకోవడం కాదు. నా బరువు ఊహించుకుని రాత్రిళ్ళు సంతృప్తి చెందడం కాదు."
"మీరు వెంటనే నా దారినుంచి అడ్డు తొలక్కపోతే పోలీసుల్ని పిలవాల్సి వుంటుంది."
"పిలవండి. నేనూ చెప్తాను."
"ఏం చెప్తారు? ఏం చెప్తారండీ మీరు?"
"మీరు నన్ను ప్రేమించి, ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నారని."
"నేను మిమ్మల్ని ప్రేమించడమా? నా కంఠంలో ఊపిరుండగా అది జరగదు."
అతడామె చెయ్యి పట్టుకుని- "అయితే ఇరవయ్ నాలుగు గంటల్లో మీ కంఠంలో ఊపిరినే- మీచేతే 'ఐ లవ్యూ' అనే పదాలుగా మార్పించి చూపిస్తాను! అలా చెయ్యకపోతే నా పేరు విహారే కాదు" అన్నాడు.
"చెయ్యి వదులు."
"పాణిగ్రహణం వరకూ వదల్ను."
ఇంతలో పోలీసు వచ్చాడు అక్కడికి.
"ఏమిటి గొడవ?"
"ఏదో ప్రేమికుల గొడవ. నీకెందుకయ్యా మధ్యలో" అన్నాడు పద్మాకర్.
"యు ఆర్ అండర్ అరెస్ట్" అన్నాడు విహారితో పోలీసు.
"ఐ వాంట్ టు బి అరెస్టెడ్ అండర్ హర్ ఓన్లీ" అన్నాడు విహారి.
"ఇదిగో- నా కింగ్లీషు రాదని ఏవేవో మాట్లాడబోక. పద పోలీసు స్టేషన్ కి" అంటూ విహారిని లాకెళ్ళబోయాడు.
వెళుతూ వెళుతూ విహారి అరిచాడు. "ఎలాగైనా మీతో ఐ లవ్యూ అని అనిపిస్తాను మాడమ్. గుర్తుంచుకోండి."
దాదాపు పరుగెడుతున్నట్టు సునాదమాల అక్కణ్నుంచి వడి వడిగా వెళ్ళిపోయింది.
"పదవయ్యా పోలీస్ స్టేషన్ కి."
"ఎందుకు? నీకు మాత్రం పిల్లల్లేరూ? నువ్వు మాత్రం ప్రేమించలేదూ?"
"నోర్ముయ్."
"ఎందుకు ముయ్యాలి? అరచేత్తో సూర్యుడిని ఆపలేరు- లాఠీ కర్రతో ప్రేమని ఆపలేరు." అన్నాడు విహారి.
"సలసలా మరిగే మొగవాడి ప్రేమని శీతల పవనంలాంటి లంగా, ఓణీలే తప్ప, లాఠీలు ఆపలేవు" ఆవేశంగా అరిచాడు పద్మాకర్.
వాళ్ళు ముగ్గురూ ఆ విధంగా ఘర్షణ పడుతూ వుండగా అక్కడికో కారు వచ్చి ఆగింది. అందులోంచి ప్రవల్లిక దిగి "ఏమైంది?" అంటూ అక్కడికి వచ్చింది.
"ఇతనో పెద్ద రౌడీ మేడమ్."
"ఈయన నాకు తెలుసు. వదిలిపెట్టు" అంది.
"ఓహో! అయితే మీరూ ఆకేసే అన్నమాట" అన్నాడు పోలీసు ఎగతాళిగా.
"షటప్" అంటూ కార్డు తీసి చూపిస్తూ- "సి.బి.ఐ. డిప్యూటీ చీఫ్ ని" అంది అధికారయుక్తంగా.
పోలీసు చెయ్యి అకస్మాత్తుగా పైకిలేచి సెల్యూట్ చేసింది. "సారీ మేడమ్."
రెండు నిముషాల తర్వాత ఆమెని కారువేపు దిగబెడుతూ అన్నాడు విహారి. "థాంక్యూ సమయానికి వచ్చారు."
"నిజంగా సమయానికే వచ్చానా?" నవ్వుతూ అడిగింది.
"ఒక అయిదు నిమిషాల ముందు వచ్చి వుంటే మంచి డ్రామా చూసి వుండేవారు."
"నిజమా! అయితే నేను దురదృష్టవంతురాలిని అన్నమాట" కారు ఎక్కుతూ నవ్వింది మళ్ళీ.
"డ్రామా అంటే గుర్తువచ్చింది. ఎల్లుండి ఓ నాటకం వుంది. తప్పకుండా రండి. 'లవకుశ' అని మా జూనియర్స్ వేస్తున్నారు."
"మళ్ళీ మన విలన్స్ కూడా వస్తారేమో?"
"ఈసారి వస్తే మనల్ని తప్పించుకోలేరు."
"వెళ్ళొస్తాను. ఇరవై నాలుగ్గంటల్లో చెయ్యవలసిన ముఖ్యమైన పనొకటి వుంది."
"అలాగా! బెస్టాఫ్ లక్- గుడ్ బై."
12
"How to tell somebody that you are in love with him or her" అన్న అంశంమీద ఎవరూ ఇంతవరకూ ఏ పుస్తకమూ వ్రాయకపోవటానికీ, ఏ రచనా చేయకపోవటానికీ కారణం బహుశా అంత అనవసరమైన సబ్జెక్టు మరొకటి వుండకపోవటం అయివుండవచ్చు.
పదిమందిలో వున్నప్పుడు పరధ్యానంగా వుండటం, చేస్తున్న పనిని సగంలో ఆపి ఆలోచనలో పడటం, ఆ కారణంగా తనలో తను నవ్వుకోవటం, మామూలుకన్నా ఎక్కువయిన హుషారు... లేక మామూలు కన్నా ఎక్కువ దిగులు- మొత్తం మీద మామూలుకన్నా ఏదో ఒకరకంగా భిన్నంగా వుండటం- ఇవన్నీ ప్రేమ తాలూకు లక్షణాలు. అయితే ప్రేమలో పడటం వేరు, దాన్ని అవతలివారికి తెలియబర్చటం వేరు.
కొంతమందికి ఇది కష్టమైన ప్రక్రియ అయితే అయివుండవచ్చుగానీ, ఆ శాతం చాలా తక్కువ. పసిపిల్లలకి పాలు తాగటం తెలిసినట్టే బ్రహ్మదేవుడి అవసరంగానీ, డార్విన్ అవసరంగానీ లేకుండానే వయసులో వున్న వారికి తమ ప్రేమని అవతలివారికి తెలియజెప్పే విధానం తెలుస్తుంది. చిరునవ్వులు, మెరుపు చూపులు, వేలికొనలు చాలు.
ఈ రెండూ కాకుండా మూడో విభాగం 'నే నసలు పెళ్ళే చేసుకోను' అంటూ చివరివరకూ లాగి, చివర్లో తప్పదన్నట్టు పెళ్ళాడి, సుఖప్రసవ గృహానికి దారితీసే మనస్తత్వం మానవ ప్రపంచంలో లిండెల్ థియరీ అంత సహజం.
ఇలా వడపోసుకుంటూ పోతే చివరకు మిగిలేది ఇంట్రావర్ట్ లు, ప్లేకాట్స్ లు, కాకెట్ లు, సూడో ఫిలాసఫర్లు, వయసుకన్నా ముందే మెచ్యూర్ అయిపోయామనుకునే వాళ్ళు వగైరా... ఇందులో సునాదమాల రెండో వర్గానికి చెందుతుంది.
క్లాసులో లెక్చరర్ చెప్పే పాఠం వింటున్నదన్న మాటేగానీ, సునాదమాల మనసు మనసులో లేదు. ఆమె క్రితం రాత్రి తనకు వచ్చిన రెండు కలల్నుంచి ఇంకా తేరుకోలేదు. మొదటి కలలో- పదిమంది నికుంజ్ విహారిలు పదిరకాల ఆయుధాలు పట్టుకుని ఆమెని చీల్చి చెండాడుతున్నట్టు కనపడ్డారు. ప్రొద్దున్న లేవగానే పదిసార్లు రామచరిత మానస్ చదివినా ఆమె గుండెదడ తగ్గలేదు. ఆమెని భయపెట్టింది నిజానికో రెండో కళ. అందులో ఆమె ఒక హంసతూలికా తల్పంమీద పడుకుని నిద్రిస్తూ వుండగా విహారి వచ్చి ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. అంతవరకూ బాగానే వుంది. రెండు రోజులకి బుగ్గవాచి, అందులోంచి చిన్న చెట్టు బయల్దేరింది. జనం తండోపతండాలుగా చేరి దాన్ని గురించి చర్చించుకోసాగారు. ఆ వైపరీత్యాన్ని నయం చేసిన వాడికి తన కుమార్తెనిచ్చి చేస్తానని రాజుగారు ప్రకటించారు. ఒక వైద్యుడు దూర తీరాల్నుంచి వచ్చి ఆమె బుగ్గ మళ్ళీ మామూలుగా చేసేసేడు. అతడెవరో కాదు విహారే. రాజుగారు ఎంతో సంతోషంతో తన కూతుర్ని వివాహమాడమన్నాడు. విహారి తనకి అప్పటికే ఇద్దరు భార్యలున్నారని చెప్పి తృణీకరించాడు. ఆ తర్వాత సునాదమాల జీవితాంతం అవివాహితగా వుండిపోయింది.
అదీ కల.
ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనుష్యులకు ఎటువంటి కలలు వస్తాయో తెలిసిన వారికి, సునాదమాల ప్రస్తుత స్థితిని విశ్లేషించటం పెద్ద కష్టం కాదు.
* * *
ఏ బళ్ళోనో చదవనవసరం లేకుండానే, ప్రేమని అవతలి వారికి తెలియజెప్పే ప్రక్రియ మనుష్యులకి ఎలా తెలుస్తుందో, ప్రేమలో పడ్డ మనిషిని గుర్తుపట్టటం కూడా అంత సులభంగా తెలుస్తుందని ముందు చెప్పటం జరిగింది.
"ఈ విహారి తండ్రి ఏం చేస్తూ వుంటారమ్మా?" అని ప్రతాపరావు అడిగినప్పుడు ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. ఎంత సి.బి.ఐ. ఆఫీసరైనా, ఎంత ఎక్స్ ప్రెషన్ థెరపీ అనుభవం వున్నా, కొన్ని ఫీలింగ్స్ ని నొక్కి పెట్టివుంచటం అసాధ్యం అని ఆ అమ్మాయికి ఆ పాటికే తెలిసిపోయింది. ఇక దాచకుండా నవ్వేసింది. ఆయన కూడా నవ్వేడు.