Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 23


    ఆ సమయంలో ఓ వ్యక్తి నెమ్మదిగా ముందుకు కదిలాడు.

    ఇక రోషాన్ని తాళలేని కట్లపాము కాటేయాలని బలాన్ని కూడగట్టుకుంటూ తలని కాస్త వెనక్కి జరిపింది కసిగా...


                                                        *    *    *    *


    ఆడిటోరియ మంతా గుండెలుగ్గ పట్టుకుని చూస్తున్న ఆ తరుణంలో అలా ముఖ్యమంత్రిని సమీపించిన వ్యక్తి అంతవరకూ ఫంక్షన్ కి ప్రిసైడ్ చేస్తున్న శివానంద్. చాలాసేపటి నుంచి ఫంక్షన్ లో పాముల వేటేమిటి అనుకున్న శివానంద్ ఎంత సాహసం చేసాడూ అంటే వేదిక ముందుభాగంలోనుంచి మైక్ ని చేరి ముందుచేతికి ఓ హేండ్ కర్చీఫ్ చుట్టుకున్నాడు. మరో అరక్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో...

    ఇప్పుడేం జరగబోతున్నదీ అందరూ గ్రహించేలోపుగానే కదలబోయిన కట్లపాముతలని ఒడుపుగా పట్టుకుని ఒక్క ఉదుటున వేగంగా వెనక్కి లాగేడు.

    ఆ ప్రత్యర్ధిని ముందే వూహించివుంటే పాము ఏం చేసేదో కాని ఇప్పుడు తల అతడిచేతిలో చిక్కుకుపోవడంతో కసిగా మెలితిరిగిపోతూ అతడి మోచేతికి చుట్టుకుంది.

    నిశ్శబ్దంగా వున్న జనంలో మళ్ళీ చైతన్యం...కేకలు.

    ఈ సమయోచితమైన సాహసానికి అభినందనగా మళ్ళీ కరతాళధ్వనులు.

    అప్పటికే ఆడిటోరియం దాటి అందరిమధ్యగా బయటికి నడిచిన శివానంద్ రవీంద్రభారతి లాన్ లో మరో చేత్తో తోకపట్టు విడిపించుకుని దూరంగా విసిరేసాడు.

    ఈ కార్యక్రమం మొత్తం మూడు నిముషాల వ్యవధిలో పూర్తిచేసేసి శివానంద్ మామూలుగా వెనక్కి వస్తుండగా జరజరా నేలపై ప్రాకుతున్న పాముని పోలీసులు కొట్టి చంపేసారు.

    అక్కడ స్టేజ్ పై స్పృహతప్పిపోయిన ముఖ్యమంత్రి మెడలోని పూలదండలతో మరణించిన ఓ మహానాయకుడి భౌతికకాయాన్ని గుర్తు చేస్తున్నాడు.

    ఉద్వేగంగా వేదికపై కుప్పకూలిన ముఖ్యమంత్రి చేతినాడి పట్టుకుని చూసిన ఆర్ధికశాఖామంత్రి అది ఆనందమో, దుఃఖమో అర్ధం కానట్టు "ఇంకా బ్రతికేవున్నారు" అన్నాడు.

    కెమెరాలు క్లిక్ మన్నాయి.

    ఇప్పుడు మరణించిన పాముని, ఇంకా బ్రతికేవున్న ముఖ్యమంత్రిని ఫోటోలుతీసి అర్జెంటుగా తమ పత్రికల్లో రాసి అర్జంటుగా న్యూస్ రాయాలని పరుగెత్తబోయిన పత్రికా విలేఖర్లు "ఆగండి" అన్న ఓ కేకకి ముందు అదిరిపడి వెనక్కి చూశారు.

    ఇలా అరిచింది ఎవరో కాదు....

    మళ్ళీ పైకిలేచిన ముఖ్యమంత్రిగారు...


                      *    *    *    *


    ఆ రాత్రి ఇక విశ్రమించదలుచుకొని ముఖ్యమంత్రిగారు వెంటనే తన ఇంట ఓ హాల్లో పత్రికావిలేఖర్లతో కాన్ ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

    ఆ హాలు అహర్నిశలూ పేదప్రజలకి సేవచేయాలన్న ధ్యేయంతో బ్రతికే ముఖ్యమంత్రిగారు పాతికలక్షలు ఖర్చుచేయించి కట్టించింది.

    ఆ డబ్బు ప్రభుత ఖజానాలోదే అయినా పదిపైసలు కూడా జీతంగా తీసుకొని తను ఆ మాత్రం ఖర్చుచేయించడం తప్పులేదని మొన్నీమధ్యనే గట్టిగా సమర్ధించుకున్నారు.

    సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ తో ఆ హాలు చల్లగా వుంది. అయినా ఆ చలిలోకూడా ముఖ్యమంత్రి నుదుట చెమటపడుతూనే వుంది.

    అప్పటికే ఈ దుర్వార్త గురించి తెలిసిన డి.జి.పి. పోలీస్ కమీషనరూ మంత్రివర్గ సహచరులూ పత్రికా విలేఖర్లతోబాటు అక్కడికి చేరుకుని ఆయనకి అభిముఖంగా వున్న కుర్చీల్లో కూర్చున్నారు.

    పూలదండలూ గట్రా రవీంద్రభారతిలోనే విడిచిపెట్టేయడంతో ఇప్పుడు ఆయన సర్పాల గురించి అంతగా బెదరడంలేదు...

    అంతా సవ్యంగా కొనసాగితే మెరిన్ మన్రో 'బ్రా'ని ఈ మధ్యనే వేలంవేసి లక్షల డాలర్లకి అమ్మినట్టు మెడలో పూలదండల్ని అమ్మేసి ఆ డబ్బుని ప్రజాహిత కార్యక్రమాలకి వినియోగిద్దామనుకున్నారు కూడా...కాని మధ్యలోనే విఘాత మేర్పడటంతో ప్రజల దురదృష్టానికి చింతిస్తూ వేదికపై కొంతసేపు పచార్లు చేస్తూ ముందువరసలో కూర్చున్న శివానంద్ వేపు ఓ క్షణం చూశారు.

    "ఎంతటి సిగ్గుమాలిన చర్య యిది. మరెంతగా చరిత్ర గర్హించదగ్గ సంఘటన ఇది" ఆవేశాన్ని పంటిబిగువున నొక్కిపట్టి మళ్ళీ మెట్ల చెంబు నవ్వొకటి నవ్వారు..."మా తెలుగుతల్లి మెడలో నేనొక మల్లెపూదండనే. సర్వమానవాళి సుఖసంతోషాలకోసం జీవితాన్ని పణంగా పెట్టాలని వువ్విళ్ళూరే అసలు సిసలైన ప్రజాసేవకున్నే సిగ్గు సిగ్గు..." డయాస్ పై వున్న కుర్చీపై చేతినానించి ప్రోఫెల్లో నిలబడి ఓ క్షణం బాధగా తల వాల్చారు. "ప్రజలకోసం ప్రాణాలొడ్డే మాపై ప్రయోగమా...ఆ పాము పళ్ళునూరుతూ నన్ను పరిహాసంగా చూడటమా... అందరిమధ్య మేము చేష్టలుడిగి శిలనై స్థాణువునై చైతన్యరహితుడనై ప్రాణాలుగ్గపట్టుకుని ఆ క్షణంలో మాయీ ప్రజలేమైపోతారని కుమిలి పోవడమా...మేమేనా అక్కడ మృత్యువుతో ముఖాముఖీ పోరాడింది? అన్న ఆలోచనే నన్నింత కలవరపరుస్తూందే! రేపు నాయీ ఆరుకోట్ల తెలుగు ప్రజలు మీ అనాగరిక చర్యతో ఎంతగా కుమిలిపోతారో వెల్లువలై వరదలై పారే అశ్రువులతో ఎంతటి అశక్తులై భీతిల్లుతారో తెలుసుకున్న మేము ఎలా భరించగలం? ఏమని వారిని ఊరడించగలం."

    "సిగ్గు సిగ్గు" ఓ విలేఖరి మంటగా అరిచాడు.

    "బహుచక్కగా వక్కాణించారు" వెంటనే జవాబుగా రియాక్టయిన ముఖ్యమంత్రిగారు "యిప్పుడు మన తక్షణ కర్తవ్యం..." మరేదో చెప్పబోతుండగా మరో విలేఖరి అడ్డంపడ్డాడు.

    "ఎందుకీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసారు తెలియపరచండి"

    "ఇదీ చక్కని ప్రశ్నగానే అంగీకరిస్తున్నాం."

    "అసలు ఈ పాముల ప్రహసనంనుంచి ఈ రాష్ట్రానికి విముక్తి లేదా?"

    "ఉంది" ధృడంగా పలికారు ముఖ్యమంత్రిగారు.

    "అసలిదంతా చేయిస్తున్నదెవరు...?"

    "బ్లాక్ మాంబా అనే ఓ ముఠా!" ముఖ్యమంత్రి నోరుజారుతుంటే డి.జి.పి.కి కంగారుగా వుంది. ఇది గోప్యంగా వుంచాలని ముందే నిర్ణయించుకున్నారు. కాని ఆయన ఆవేశంలో ఒక్కొక్కటి వాంతిచేస్తున్నారు. ఓ ఖైదీని విడిపించాలని యింతటి మారణకాండకి సిద్ధపడుతున్నారు.

    పరిస్థితి చేయిదాటి పోతూందని గ్రహించాడు డి.జి.పి.

    "అంటే ఆ ముఠా బెదిరింపులకి లొంగి ఓ ఖైదీని విడుదల చేస్తున్నారా!" విస్మయంగా అడిగాడు ఓ విలేఖరి.

    "తప్పదుగదా! నా ప్రజలు...నా బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారే. వారికోసమైనా అంగీకరించక తప్పదుగదా!"

    "ఆ ఖైదీ..." మరో విలేఖరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి జవాబు చెప్పబోతుండగా డి.జి.పి. వేగంగా ఆయన్ని చేరుకుని చెవిలో ఏదో అన్నాడు రహస్యంగా.

    ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. "మేం ఏదీదాయం... మాకు దాపరికాలులేవు. దాపరికం లేనివాడ్ని కాబట్టే నన్ను ప్రజలూ పత్రికలూ ఇంతగా ఆరాధించేది. కాబట్టి మీరు నన్ను వారించకండి..." ఉన్మాదిలా అంతా చెప్పేసాడు...అసలు ప్రదీప్ సక్సేనాని విడుదల చేయాల్సి వస్తుందో లేదో తెలీని స్టేజిలో ఉద్వేగంగా మాటాడసాగారాయన. "మాకు తెలుసు నన్ను పదవినుంచి దించాలని కొన్ని శక్తులు గట్టిగా కృషిచేస్తున్నాయి. మా అసాధారణ ప్రజ్ఞ ప్రజల్లో మాకుగల స్థానాన్ని విచ్చిన్నం చేయాలని కొన్ని విదేశీహస్తాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ విషయం మేము కనిపెడుతూనే వున్నాం...అయితే మేం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడంలేదు."     

    "ఏం చేయబోతున్నారు?" ఎవరో అడిగారు.

    "ప్రకృతిపరమైన తుఫాన్లు, బీభత్సాలూ, వేళకి కురియని వర్షాలుగాని, ఇప్పుడీ పాములా వీటన్నిటీవెనక ఎవరి హస్తం వున్నదీ గుర్తించలేని అవివేకులం కాదు మేము...అంతా ఇప్పటికే గ్రహించాం. కాబట్టి సత్వరచర్యలు గైకోబోతున్నాం."

    తుఫాన్లకీ విదేశీహస్తాన్ని అంటగడుతున్న ముఖ్యమంత్రిగారి వీరావేశాన్ని చూస్తూ "ఏం చర్యలు చేపట్టేదీ వివరాలు తెలియజేస్తారా" అన్నాడు ఓ విలేఖరి.

    "సర్పయాగం..." టక్కున జవాబిచ్చాడు.

    అర్ధంకాలేదెవరికీ. "నోరులేని జీవాలని ఇన్నాళ్లూ తలపోసాంగాని కోరలున్న పాములని గుర్తించలేకపోయాం. కాబట్టి వెంటనే పండితుల్ని రప్పించి భాగ్యనగరం నడిబొడ్డున ఓ యాగాన్ని నిర్వహిస్తాం. అప్పుడు పాములన్నీ ఆ బడబాగ్నిలో దహించుకుపోతుంటే సోదరులారా ఇక మీరు నిశ్చింతగా నిద్రపోండి అని మమ్మల్ని పిలిచి ఆ వినోదాన్ని కనులారాచూపిస్తాం" అంటూ పురాణాల్లోని పరీక్షితుడి కథని చెప్పి సర్పాల్ని యాగాలద్వారా ఎలా అంతంచేయబోయేదీ ఉటంకించారు... "వెంటనే రాష్ట్రానికి ఓ ఆస్థాన పాముల మంత్రగాణ్ణి నియమిస్తాం. వారితో విరివిగా చర్చలు జరుపుతూ పాములకి గుణపాఠం చెబుతాం. అంతేకాదు ఆరుకోట్ల ప్రజలిక ఇబ్బందిపడకుండా ఈ సిటీలోనే ఓ కోటిరూపాయల ఖర్చుతో ఒంటి స్థంభం మేడని కడతాం...ఆ కాంట్రాక్టు మా ప్రాణాల్ని కాపాడిన శివానంద్ గారికే ఇప్పించి సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసే కార్యక్రమంలో నిమగ్నులమౌతాం."

 Previous Page Next Page