తెల్లవారితే ఏమి జరుగుతుందో అనే భయం కంటే, అసలు ఈ రాత్రి ఎలా గడుస్తుందా అనేదే వాళ్ళ సమస్య. సమస్యకు పరిష్కారాన్ని ఎవరికి వారుగా మౌనంగా వెతుక్కుంటున్నారు.
సన్నసన్నగా వాన తుపర ప్రారంభమయింది. అది జల్లుగా మారుతున్నది.
కాపలా వున్న సాయుధులు నలుగురూ చెట్టు చాటుకు చేరారు.
"వర్షం తగ్గేవరకు ఆ పాకలో వుండండి!" హుకుం జారీ చేశాడు ఒక సాయుధుడు. అతని గొంతు గరగరలాడింది. కర్కశత్వం తొంగిచూసింది.
వానలో తడుస్తున్నా, అక్కడి నుంచి కదల లేదు ఆషా.
"పాకలోకి వెళితేనే బాగుంటుందేమో...." కిరణ్ కుమార్ అనునయంగా అన్నాడు.
"నన్నొక్కదాన్నే వెళ్ళమంటారా?" సంశయంగా అడిగింది ఆషా.
"పదండి, నేనూ వస్తాను!" చాప మడుస్తూ అన్నాడు కిరణ్ కుమార్.
ఆ చీకటి గుయ్యారంగా ఆషా కాలు ముందుకు వేసింది. మెత్తగా ఏదో తగలడంతో ఖంగారుగా రెండడుగులు వెనక్కు వేసి కిరణ్ కుమార్ చేతిని గట్టిగా ఒడిసి పట్టుకుంది భయంతో.
ఆషా చేయి పట్టుకుని తను ముందు వుండి పాకలోకి దారి తీశాడు కిరణ్ కుమార్. చాప పరచి, ఆషాను కూర్చోమన్నాడు. ఆమె బిక్కుబిక్కుగా కూర్చున్నది.
దుప్పటి కప్పుకుంటూ వచ్చి పాక బయట చూరు కింద కూర్చున్నాడు కిరణ్ కుమార్.
"నాకు భయమేస్తోంది. మీరు కూడా వచ్చి లోపలే పడుకోండి...." కిరణ్ కుమార్ తడుస్తుండడం గమనించి, కీచుగా అన్నది ఆషా. ఆమె కన్నులు జాలిగా చూస్తున్నాయి.
క్షణం తటపతాయించి లోనికి నడిచాడు కిరణ్ కుమార్. చాప పక్కగా దుప్పటిని పరచుకుని, ఆషాకు దూరంగా జరిగి జరిగి ఒదిగి ఒదిగి పడుకున్నాడు. ఇబ్బందిగా వుంది. బెరుకు బెరుకుగా....
అర్దరాత్రి ఏదో జరజరా పాకుతున్న శబ్దం.
కెవ్వు కెవ్వున కేకలు పెడుతూ హఠాత్తుగా లేచి కూర్చుంది ఆషా. ఆమె నవనాడులూ కుంగిపోతున్నాయి భయంతో.
శబ్దం మరికొంచెం దగ్గరయింది. ఆషా మరింత ముందుకు జరిగింది.
కిరణ్ కుమార్ శరీరం తగిలింది. అది వెచ్చగా వుంది. అతను మేలుకునే వున్నాడు.
అదే క్షణంలో__
ఒక సాయుధుడు టార్చ్ లైట్ ను పాక వైపుకు ఫోకస్ చేశాడు.
ధన్ ధన్ ధన్....
రైఫిల్ ఆటోలో వుంచి గురి చూసి కాల్చాడు సాయుధుడు.
"ప్లీజ్! స్టాపిట్....స్టాపిట్...."
ఆషా, కిరణ్ కుమార్ కేకలు పెట్టారు. బెంబేలుపడ్డారు వాళ్ళు.
తాము లోన లేమనుకుని, ఫైర్ చేసారేమోననే అనుమానంతో తమ ఉనికిని తెలియచేయడానికి ప్రయత్నించారు. దిగ్గున లేచి బైటకు వచ్చారు.
అప్పటికే సాయుధులు నలుగురూ పాక దగ్గరకు పరుగెత్తుకు వచ్చారు.
పాక బయట పెద్ద పులి చచ్చి పడివుంది!
విషయం తెలుసుకున్న ఆషా, కిరణ్ కుమార్ చేష్టలుడిగి, స్థాణువులుగా వుండిపోయారు.
తమ ప్రాణాలను పులి బారి నుంచి కాపాడిన సాయుధులకు కృతజ్ఞతలను తెలుపుకుందా మనుకుంటున్న క్షణంలోనే....
సాయుధుడొకడు ఆషాను గబుక్కున రెండు చేతులలోకి ఇరికించుకుని, చెట్టు చాటుకు మోసుకుపోయాడు. దాదాపు పరుగెత్తాడు.
మిగిలిన ముగ్గురు సాయుధులు కూడా కేరింతలు కొడుతూ అటే నడిచారు....
ఊహించని ఈ విపరిణామానికి క్షణం తెల్లబోయిన కిరణ్ కుమార్ వెనువెంటనే తన కర్తవ్యాన్ని గుర్తించాడు.
అతని నరాలు ఉబ్బాయి. రక్తం వేడెక్కింది....
* * *
అది యూనివర్శిటీ మెన్స్ హాస్టలు.
చివరిగా వున్న గది గోడమీద ఎర్రక్షరాలతో రాసి వుంది: భగత్ సింగ్ బ్లాక్.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహించిన లాలా లజపతి రాయ్ ని లాఠీలతో చితకకొట్టి పొట్టనపెట్టుకున్న లాహోర్ పోలీస్ ఆఫీసరు శాండర్స్ ను భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు రివాల్వర్లతో కాల్చిచంపారు.
బ్రిటీష్ ప్రభుత్వం విచారణ తంతు నడిపింది.
"స్వేచ్ఛకోసం విప్లవం మానవాళి జన్మహక్కు. అందుకే, విప్లవం వర్ధిల్లడానికి మా జీవితాలను అర్పిస్తున్నాం. ఇంక్విలాబ్ _ జిందాబాద్! ఇంక్విలాల్ _ జిందాబాద్!" అంటూ కరడుగట్టిన ఆంగ్లేయుల గుండెలు తల్లడిల్లేట్టు సింహనాదం చేసి దేశంకోసం విప్లవవీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు ఉరికంబాలు ఎక్కారు.