"చెవిలో ఏదో స్వరం వినిపించింది. ఆఁ! అదే ప్రసాద్ గారు లాభాల గురించి మాట్లాడుతుంటే అది రాదు అని చెపుతున్నట్లనిపించింది. ఎందుకలా అవుతోంది డాక్టర్? ఇంతకు ముందు కూడా ఒకటి రెండుసార్లు జరిగిందిలా."
"రేపోసారి మా క్లినిక్ కు రండి. అన్నీ మాట్లాడుకుందాం" అన్నాడు రామకృష్ణ.
ఆనందం, ఆశ్చర్యం, భయాందోళనల మధ్య నూతన సంవత్సరం అడుగుపెట్టిందా గదిలో.
తెల్లవారింది. ప్రపంచమంతా నూతన సంవత్సరానికి అతి వైభవంగా స్వాగతం పలుకుతోంది. రాత్రి పార్టీలోనించి ఆలస్యంగా వచ్చిన పద్మజ గాడనిద్రలో వుంది.
తలుపు మీద ఎవరో చిన్నగా శబ్దం చేశారు.
పద్మజ కళ్ళు తెరిచింది. కాసేపు ఏమీ అర్ధంకాలేదు. మత్తుగా ఉంది. పక్కన గిరి హాయిగా నిద్రపోతున్నాడు. తలుపుమీద మళ్ళీ చప్పుడయింది. లేచి తలుపు తీసింది. ఎదురుగా హిమజ.
"అక్కా! డాక్టర్ వచ్చారు. నీతో అర్జంటుగా మాట్లాడాలిట."
"పద. ఇప్పుడే వస్తున్నానని చెప్పు."
ఆమె మత్తంతా వదిలిపోయింది. రాత్రి సంఘటన గుర్తుకువచ్చి ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పొడిచినట్లయింది. క్రింది కొచ్చింది.
"గుడ్ మార్నింగ్ !" అనబోయి తమాయించుకుంది. రామకృష్ణతో పాటు ప్రసాద్ కూడా వున్నాడు. అతని మొహం పాలిపోయి ఉంది.
"ఏం జరిగింది?" అడిగింది.
సమాధానంగా పేపరు తీసి అందించాడు రామకృష్ణ. అయోమయంగా విప్పింది పద్మజ. ఉలిక్కిపడింది. పైనే హెడ్ లైన్ లో __
"నైజీరియాలో కూప్" అని పెద్ద అక్షరాలతో వ్రాసి వుంది.
జనవరి 1,1984 లాగోస్. నిన్న రాత్రి నైజీరియాలో మిలటరీ కుట్ర జరిగింది. కూ(ప్) రాష్ట్రపతి షేకు షాగారిని బంధించి మిలటరీ అధికారులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. పాత ప్రభుత్వాధికారంలో జరిగిన అవినీతినీ, అక్రమాలనూ ప్రభుత్వం ఖండిస్తుందని నూతన ప్రభుత్వం ప్రకటించింది. షాగారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఒడంబడికలకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండబోదని ఒక ప్రకటన వెలువడింది." చదవటం పూర్తిచేసి-
"నిన్న ఫోన్ చేసినప్పుడు ఏమీ లేదన్నారుగా" అడిగింది ప్రసాద్ ను.
"అవును. ఇదంతా తర్వాత జరిగి వుంటుంది. మనకూ, వాళ్ళకూ అయిదున్నర గంటల తేడా వుంది."
"కాని గిరికి ముందుగా ఈ విషయం ఎలా తెలిసింది?"
"అదే ఆశ్చర్యం. నిన్న ఫోన్లో మాట్లాడి ఏమీ లేదంటే ఆయన ఏదో మాట్లాడేసి ఉంటారనే అనుకున్నాను. కాని పొద్దుట పేపర్ చూడగానే మతిపోయినంత పనయింది. దీనివల్ల మా బిజినెస్ చాలా దెబ్బతింటుంది" అన్నాడు ప్రసాద్ విచారంగా.
"ఇదేదో మానవాతీత శక్తి అన్నది నమ్మక తప్పడంలేదు పద్మజా!"
"ఇప్పుడేమిటి చెయ్యడం?" భయంగా అడిగింది పద్మజ.
"భయపడి చేసేదేముంది! ఈ రోజు గిరి నా దగ్గరకు వస్తానన్నాడు. అన్ని పరీక్షలూ చేస్తాను. తర్వాత చూద్దాం."
"అలాగే" నీరసంగా అంది పద్మజ.
హిమజ హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తోంది. రాత్రి జరిగిన సంఘటన గురించి ఏమీ తెలియదామెకు. రామకృష్ణ, ప్రసాద్ వెళ్ళిపోయాక పద్మజ వచ్చి కూర్చుంది. ఆమె ముఖంలో దైన్యం కలచివేసింది హిమజను.
"ఏమిటక్కా, ఏమిటిదంతా?" అడిగింది.
రాత్రి జరిగిన సంగతి చెప్పింది పద్మజ. చెపుతుంటే ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి.
హిమజ ఆశ్చర్యపోయింది. ఎంత ఆత్మవిశ్వాసం, ధైర్యం వుండేవి అక్కలో! అక్కతో మాట్లాడాలంటేనే భయపడేది. అలాంటిది ఈనాడు ఇంత బేలగా తయారయిందెందుకు? గిరితో పెళ్ళి ప్రస్తావన వచ్చినప్పటి నుండీ ఇంతే.
"అక్కా! ఈ దెయ్యాలూ, భూతాలూ అంతా ట్రాష్. నువ్వు నమ్ముతున్నావా?" ఆశ్చర్యంగా అడిగింది.
"నమ్మకుండా వుండేదెలా హిమా! నేనొక్కదాన్నేకాదు అక్కడున్న అందరూ ప్రత్యక్షంగా చూశారు."
"ఏమోనక్కా! ఐ. ఏ. ఎస్. చదువుకున్నదానివి నువ్వు కూడా...." ఆగిపోయింది అక్క మొహంలో సీరియస్ నెస్ చూసి.
"అన్నింటినీ చదువుతో ముడిపెట్టకు హిమా! బి. ఏ. చదువుకున్న వాళ్ళు కూడా ఐ. ఏ. ఎస్. ఆఫీసరు కావచ్చు. కానీ ఒక్కమాట చెప్పు! పెద్ద పెద్ద సైంటిస్టులు, ఫారిన్ రిటర్న్ డ్, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో మంది బాబాలకూ, సాధువులకూ దాసోహం అంటున్నారు. వాళ్ళంతా తెలివిలేని మూర్ఖులంటావా? నా కళ్ళతో ప్రత్యక్షంగా శేఖరం ఆత్మను చూశాను, నమ్మకుండా ఎలాగుంటాను?"
'మూర్ఖత్వం అక్కా! నువ్వెప్పుడూ దేశాన్ని గురించి బాధపడుతుంటావ్. ఇలాంటి మూర్ఖులుంటబట్టే దేశం ఇంత అథోగతిలో వుంది' మనసులోనే అనుకుంది హిమజ పైకి అనే దైర్యం రాలేదింకా.
* * *
శివయ్య మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. దూరంగా లాన్ లో గిరి చేతిలో పేపరుతో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు. ముఖం బాగా వాడిపోయి ఉంది.
"హలో బావగారూ! ఏమిటంత దిగులుగా ఉన్నారు ?" అడిగింది అప్పుడే వచ్చిన హిమజ.
"ఏం లేదు హిమజా!" పేపర్లో మళ్ళీ తల దూర్చేశాడు గిరి. పేపర్లో వార్తనే పదేపదే చూసుకుంటున్నాడతను.