Previous Page Next Page 
నిషా పేజి 22

    "ఆ ఇంట తీసిన కాలు తిరిగి పెట్టేది లేదు!" అన్న రాజ్యలక్ష్మి అక్షరాలా తన మాట నిలబెట్టుకొంది. ఈ ఇరవయ్యేళ్ళలో ఆమె ఇక్కడికి రావడం గాని, మోహనవంశీ అక్కడికి వెళ్లడం గానీ జరుగలేదు. పెద్ద భార్య, ఆమె కొడుకు విషయం ఆయన పూర్తిగా మరిచిపోయినట్టుగానే ప్రవర్తించాడు.

    ఒకప్పుడు మోహనవంశీలో భోగలాలసత ఎంతగా ఉండేదో, వయసు పైబడుతున్న కొద్దీ ఆ లాలసత తగ్గుముఖం పడుతూ ధనకాంక్ష ప్రారంభమైంది.  బిజినెస్ లో అడుగుపెట్టాడు. అందుకు సౌదామిని అన్నదమ్ముల ప్రోత్సాహసహకారాలు కూడా తోడయ్యాయి.

    ఆయన ధన సంపాదన మూడు పువ్వులు, ఆరుకాయలన్నట్టుగా సాగుతున్న తరుణంలో, అడవికి వేటకు వెళ్ళిన ఆయన, ఆయనతోపాటు వెళ్ళిన సౌదామిని హత్యకు గురి అయ్యారు.

    మోహనవంశీ జీవితంలో ప్రియురాలిగా అడుగుపెట్టి, పెళ్ళన్నా సంప్రదాయాలన్నా నమ్మకం లేదన్న సౌదామిని, అతడితో చివరంటానడిచి అతడితోపాటే చితిలో బూడిద అయ్యింది.

                                                                 *    *    *

    "ఇదండీ బాబూ మీ కన్నవారి కథ!" అంటూ ముగించింది తుంగభద్ర.

    "లలితా పరమేశ్వరి కథ వింటే మనసు కదిలిపోతూంది, తుంగభద్రా!" వికలమైన కంఠంతో అన్నాడు వికీ.

    "లలితా పరమేశ్వరి అన్నగారి కూతురే ఈ భ్రమరాంబిక. ఆమె మేనత్త చావుకి కారణమైన వాడి కొడుకుగా మీరా కుటుంబానికి ఆగర్భశత్రువు. నిజానికి మీరెంత ఉత్తములైనా భ్రమరాంబిక మిమ్మల్ని అర్ధం చేసుకోలేదు. ఆమె అపార్ధాన్ని తొలగించడం మీకు సాధ్యం కాదు. ఎందుకంటే, మీ తండ్రిగారు చేసిన పాపం మిమ్మల్ని నీడలా వెంటాడుతూ వుంటుంది కాబట్టి!" అంది తుంగభద్ర.

    "రక్తంలో వున్న బుద్దులు అప్పుడే బయటపడుతున్నాయన్నమాట" భ్రమరాంబిక ఛీత్కారం వెనుక హృదయవిదారకమైన ఒక కథ వుంది. తన రక్తంలో తండ్రి బుద్దులు లేవని తెలియజెప్పాలి.

    ఒక దృఢనిశ్చయానికి వచ్చాడు వికీ.

    ఆ రాత్రంతా అదే ఆలోచన! మరుసటి రోజు సంధ్యా సమయం. సరిగ్గా నిన్నటి సమయం.

    గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి ముందు చేతులు జోడించి నిలబడింది భ్రమరాంబిక. శఠగోపం పెట్టి తీర్ధం ఇవ్వబోయాడు శిఖామణి.

    ముందుకు చాచిన భ్రమర చేతుల్ని చూసి  "ఏమిటమ్మా ఇది?ఎలా కాలింది?" అనడిగాడు కలవరపాటుతో.

    "కాలలేదు కాల్చుకున్నాను తాతయ్యా. అపవిత్రుడ్ని తాకినందుకు ఈ చేతులకంటిన మాలిన్యం అగ్నిస్పర్శతో తప్ప పోదనిపించింది."

    "ఎంతపని చేశావమ్మా. మరీ ఇంత పిచ్చి ఏమిటి తల్లీ?" ఆర్ద్ర స్వరంతో అడిగాడు శిఖామణి.

    "ఎంత సిగ్గు లేకుండా అతడికి పరిచర్య చేసాను తాతయ్యా?"

    "మానవతా దృష్టితో చేసిన సేవకు ఈ చేతులకింతశిక్షా?"

    "వాళ్లు మానవతా దృష్టితో చూడవలసిన మనుషులా? వాళ్లు కలలోకి వచ్చినా మైలపడిపోతాం. అలాంటిది అతడిని తాకినందుకు ఈ శిక్షవద్దా?"

    "నువ్వు స్వయంగా ఒక అగ్నిశిఖవి. నిన్ను చెడుభావంతో తాకినవాళ్లు భస్మమైపోతారు. నువ్వు మైలపడడం ఏమిటమ్మా? చూడు అరచెయ్యి పుండు ఎలా అయిందో?"

    "రెండు రోజుల్లో మానిపోయే పుండు గురించి అంత బాధ దేనికి తాతయ్యా?"

    సరిగ్గా అప్పుడే వికాస్ చంద్ర ప్రవేశం జరిగింది. అతడి ముఖం బాగా వడిలిపోయి ఎన్నో లంకణాలు చేసినట్లుగా వుంది. "భ్రమరాంబికగారూ......." ఏదో చెప్పాలని సమీపించబోయాడు.

    భ్రమర అతడికేసి ఒకసారి తీక్షణంగా చూసి పూజా ద్రవ్యాల బుట్ట చటుక్కున అందుకుని చరచరా వెళ్ళిపోయింది.

    ముఖంమీద ఛెళ్లున చరిచినట్లుగా అయిందతనికి.

    ఖిన్నవదనంతో ఆమె వెళ్లిన దిక్కే చూడసాగాడు.

    శిఖామణి అన్నాడు "ఇంకా ఏం జరగాలని ఆమెను కవ్విస్తున్నారు చినబాబు? నిన్న మిమ్మల్ని తాకిన పాపానికి ఆమె తన చేతుల్నే కాల్చుకుంది. అరచేతుల్లో కాలిన పుళ్లను చూసేసరికి నా కళ్లు తిరిగాయి. ఇంకా ఆమె జోలికి ఎందుకు వెళతారు. ఆమె దక్షకన్యలా దహించుకుపోతే తప్ప మీరు శాంతించరా?"

    వికీ కళ్లల్లో భరించలేని బాధ కదలాడింది. "ఆమె నన్ను తాకినందుకు చేతుల్ని కాల్చుకుందా? ఏమిటి నేను చేసిన పాపం?" విహ్వలమైన స్వరంతో అడిగాడతడు.

    "మీ పూర్వీకులు చేసిన పాపాలకు మీరు బాధ్యత వహించక తప్పదు చినబాబూ! ధనబలంతో, అధికార బలంతో అందమైన స్త్రీ కంటబడితే చాలు రేకులు చిదిమిన పువ్వుల్లా చేసిగాని వదిలేవాళ్లు కాదు మీ తాత తండ్రులు"

    "పాపం వాళ్లదయితే శిక్ష నాకా?"

    "నిన్న ఆమె చెక్కిళ్లు స్పర్శించి మీరు పూర్వీకులకీ వారసులనిపించుకోలేదా?"

    నిస్సహాయత వ్యక్తం చేస్తూ నుదురు కొట్టుకున్నాడు "అది కేవలం ఒక సౌందర్య భావన అని మీకెలా చెబితే అర్ధమవుతుంది?"

    "రెడ్డొచ్చె మొదలాడు అన్న చందంగా ఇంక ఆ విషయం పోనీండి వికాస్ బాబు భ్రమరాంబిక విషయం ఇక మరిచిపోండి. ఇటువైపు రావాలనిగానీ, ఆమెను కలవాలనిగానీ ప్రయత్నించకండి."

    "సరే, కానీ ఆమెకు చెప్పండి. నేనామెను చెడు తలపుతో తాకలేదని స్త్రీలపట్ల నాకింతవరకూ వున్నది పవిత్రమైన భావమేగానీ చెడు ఆలోచనలేవీలేవని ఆమె ఎంత పవిత్రమైనదనుకుంటోందో నేనూ అంత పవిత్రమైనవాడినని" ఆ మాట అని చివ్వున కదిలాడు వికీ.

 Previous Page Next Page