తలా ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నారు.
"నువ్వూ తిను పద్మావతీ!" మారుతీరావు ఒక బిళ్ళ తీసి బలవంతం భార్య నోట్లో కుక్కాడు. ఏదో విషం నోట్లో పెట్టినట్లుగా అయింది ఆమెకు. హఠాత్తుగా పనేదో గుర్తువచ్చినట్లుగా లోపలకు పరుగెత్తి వాష్ బేషిన్ లో ఉమ్మేసి నీళ్లు పోసేసింది.
"అబ్బాయి వచ్చాక ఒక మంచిరోజు చూసి ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈ విషయం అందరిలో డిక్లేర్ చేద్దాం. ఏమంటావు మారుతీ?"
"నేనేమనగలను? నీమాట నేను కాదంటానా?"
వాళ్లని పంపడానికి మర్యాదకోసం కూడా రాలేదు పద్మావతి. బిగుసుకుపోయినట్లుగా హాల్లో సోఫాలో కూర్చుంది. నట్టింటిలో పెద్ద మంట చెలరేగినట్లుగా వుందామె మనసు.
వాళ్లను పంపించేసి, అతడు ఇంటిలోకి రాగానే అగ్నిపర్వతం భళ్లున బ్రద్దలైనట్లుగా అరిచిందామె.
"అబ్బాయికి ఒక్కమాటైనా చెప్పకుండా, ఈ సంబంధం ఖాయం చేయడంలో ఏమిటి మీ ఉద్దేశ్యం? పిల్ల ముఖమయినా చూడకుండా వాళ్లకి మాటివ్వడం ఏమిటండీ? నాకేమీ అర్దం కావడంలేదు."
"అంత గొప్పవాడు ఇంటికి వచ్చి పిల్లనిస్తానంటే, మాటివ్వక చస్తానా?"
"ఎంత గొప్పవాడయితే మాత్రం? అతడి గొప్పతనాన్ని మనమేం చేసుకుంటాం....? మనం చూడాల్సింది పిల్లను. వాళ్లనీ వాళ్ల అంతస్తు ఐశ్వర్యం కాదు.
"పిల్లను చూస్తే ఏమొస్తుంది? పిల్ల అందం కొరుక్కుతింటామా? మనవాడు ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు మనం తెలివి తక్కువగా వ్యవహరించకూడదు. దిగంబరం బాగా ఆస్తులు సంపాదించుకోవడమే కాదు. రాజకీయ చతురత కూడా పెంచుకున్న మనిషి.
రేపటి ఎలక్షన్ లో నిలబడి గెలిచి మినిస్టర్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అలాంటి్వాడు మనవాడికి మామగారు కావడం అంటే గొప్ప అదృష్టంగా భావించాలిగానీ, అసలు పిల్ల ఎలా వుందో నీకేం తెలుసు? చూడకముందే బాగాలేదన్న అభిప్రాయానికి రావడం ఎందుకు?"
"ఆవిడ కూతురి ఫోటో పట్టుకొచ్చిందిలెండి. పిల్ల నలుపు. ఫుల్ మేకప్. అసలు బండారం లేకేకదా ఈ పై మెరుగులు?"
"తల్లిలాగే వుంటుందట పిల్ల. ఇహ ప్రత్యక్షంగా చూడక్కర్లేదు."
"తల్లికేమైంది? ఫాషన్ బుల్ గా, చలాకీగా బాగానే వుంది కదా?"
"ఫాషనబుల్ గా, చలాకీగా వుంటే చాలా? నాకొక్కడు. చంద్రుడి కయినా మచ్చ వుంటుందేమోగానీ నా కొడుకు ఏ మచ్చాలేనివాడు. వాడి కొచ్చే పిల్ల చిదిమి దీపం పెట్టుకునేలా వుండాలి. నల్లటిపిల్ల నా కొడుక్కి వద్దేవద్దు. మనింటికి వచ్చేది పిల్లగాని, ఆమె బాబుకున్న ఐశ్వర్యం కాదు కదా!"
"ఒసే పిచ్చిమొహమా! ఆమె బాబు ఐశ్వర్యానికి ఆమె ఒక్కతే వారసురాలు. అదీ నాకు నచ్చిన పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటంటే దిగంబరం నాకు ఒకనాటి బిజినెస్ పార్టనర్. స్నేహితుడు. అతడు ఎన్నో అంతస్తులు దిగి, నా కొడుక్కి పిల్లనిస్తానని వస్తే ఎలా బెట్టు చేయగలను?"
"అబ్బాయి అభిప్రాయం కనుక్కుని చెబుతానని ఒక్కమాట చెప్పవచ్చు కదా?"
"అబ్బాయినడిగి చెప్పడమేమిటి?అప్పుడే అంత పెద్దవాడై పోయాడా నీ కొడుకు? తండ్రి మాట విననంత పెద్దవాడా?" చివరిమాట నొక్కి పలుకుతూ అన్నాడు.
"మీమాట విననంత. పెద్దవాడేం కాలేదుగానీ ఎలాగా వింటాడు కదాని, మన ఇష్టాలు బలవంతంగా అతడిమీద రుద్దడం భావ్యంకాదు. అది మన పెద్దరికానికే కళంకం. పెళ్లిలాంటి అతి ముఖ్యమైన విషయాలలో వాడి ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలిగానీ మన ఇష్టాల్ని, పెద్దరికాన్ని వాడి మీద రుద్దడం ఏమిటి?"
"వాడి ఇష్టానికి వదిలిపెడితే, వాడు ఏ దొరసానమ్మనో కట్టుకుని విమానం దిగుతాడు. అప్పుడా కోతిమొహం దాన్నిచిదిమి దీపం పెట్టుకుందువుగానీ."
"మరీ అంత మంచీ చెడ్డా తెలీనివాడేం కాదు నా కొడుకు."
"నీ కొడుకంటే నీకెంత నమ్మకమే పద్మావతీ?"
"వాడిని ఈ చేతులతో పెంచాను. వాడి మనసు నాకు తెలుసు. వాడు బంగారమండీ బంగారం!"
"ఆపిల్లా బంగారమే. నల్లబంగారమనుకో. ఇహ ఈ విషయంలో చర్చలు అనవసరం. దిగంబరంతో వియ్యం ఖాయమైనట్టే!"
"ఇప్పుడు కూడా వాడికి ఫోనే చేసో,ఉత్తరం వ్రాసో చెప్పరా?"
"వారం పదిరోజుల్లో వస్తాడు కదా. వచ్చాక ఎలాగూ తెలుస్తుంది. ఇప్పుడు చెబితే అనవసరంగా వచ్చేముందు డిస్టర్బ్ అవుతాడు."
"ఇదేం విడ్డూరమండీ బాబూ! ఒక్కమాటైనా పిల్లాడి చెవిలో వేయకుండా సంబంధం ఖాయపర్చడం ఏమిటో అర్దం కావడంలేదు"
"ఇందులో అంత అర్దం కాకపోవడానికి ఏమీలేదు. సంబంధం మంచిది. ఖాయం చేశాను."
* * * * *
ఎయిర్ పోర్ట్ లో తల్లిదండ్రులతోపాటు, కాబోయే అత్తమామలతో కలిసినిలబడింది వినోదిని. శ్రీచక్ర మెడలో వేయడానికి ఆమె చేతిలో పూలమాల రెడీగా వుంది. సరోజిని చేతిలో పుష్ప గుచ్చం వుంది.
శ్రీచక్ర ప్పేన్ దిగగానే అతడి మెడలో మాలవేసి పుష్పగుచ్చం చేతికందించి చిన్నగా నవ్వింది వినూ.
ఆమెనుగానీ, మిగతావాళ్లనుగానీ పట్టించుకోలేదు శ్రీచక్ర. అంత దూరంలో వస్తుండగానే అతడి చూపు తల్లిమీద పడింది. రాగానే ఆమె పాదాలు స్పృశించి కౌగలించుకున్నాడు.
"నిన్ను విడిచి ఎలా వున్నానోకన్నా" ఆవిడ గాద్గదికంగా అంటూ కొడుకు నుదుటిమీద ముద్దు పెట్టుకుంది.
దీర్ఘ వియోగం తరువాత కలసిన తల్లీ కొడుకులు.
వాళ్లని డిస్టర్బ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు. చివరికి మారుతీ రావు కూడా.
కాస్సేపటికి శ్రీచక్ర ఇటు తిరిగాడు.
"బాగున్నారా డాడీ?"
"ఆ..... బాగున్నానురా. డాడీ ఇంతసేపటికి కనిపించాడా?" తెచ్చి పెట్టుకున్న అలుకతో అన్నాడు మారుతీరావు.
"మరీ వచ్చేసేముందు ప్రతీక్షణం అమ్మే కళ్ళముందు మెదిలేది డాడీ! అమ్మని విడిచి ఇన్ని నెలలు ఎలా వున్నానోనని ఆశ్చర్యం వేసేది."
"డాడీ మాత్రం గుర్తుకు రాలేదు."
"మీరు కూడా వచ్చారు డాడీ! కానీ అమ్మఎక్కువగా వచ్చేది.
"సరేగానీ వీళ్లను నీకు పరిచయం చేయలేదుకదూ? ఈయన దిగంబర రావని నా ఫ్రెండు. ఈమె ఆయన సతీమణి. మిస్ వినోదినిని నీకు పరిచయం చెయ్యక్కర్లేదనుకుంటా. నీకు తెలిసిన అమ్మాయేకదా!"
అతడినే రెప్పార్పకుండా చూస్తోంది వినోదిని.
శ్రీచక్రది కొద్దిగా పసుపు కలిపిన తెలుపు. ఇంకా మంచి రంగు తేలాడు. ఆ రంగు ఎంత బాగుందంటే, సందెవేళ అప్పుడే విడుతున్న మల్లెపువ్వంత ఫ్రెష్ గా వుంది. మంచి ఒడ్డూ, పొడవుతో హాండ్ సమ్ గా తయారయ్యాడు. ముఖంలో ఇదివరకటికంటే ఆకర్షణ పెరిగింది.
కాలేజీ చదివే రోజుల్లో అతడంటే అమ్మాయిలు పడి చచ్చేవాళ్లు ముఖ్యంగా తనకి అతడంటే పిచ్చి ఇష్టం. కానీ, ఆడపిల్లకుండే సహజమైన సిగ్గుతో బయటపడేదికాదు. తను పెద్ద అందగత్తె కాదన్న న్యూనతా భావం కూడా వుండేది. అతడు ఆడపిల్లలందరితో స్నేహపూర్వకంగా మెలిగేవాడు. కానీ ఎవరితోనూ రొమాన్స్ నడిపినట్లు కనిపించేదికాదు.
కాలేజీలో చదువుముగిసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయినా ఇష్టంపోలేదు. అది రోజురోజుకూ బలపడి ఆరాధనగా రూపుదిద్దుకుంది. తను సి. ఎ. చేశాక సంబంధాలు చూడడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. హృదయంలో ఆరాధ్యపీఠం మీద అతడుండగా ఇంకెవరినో చేసుకుని సుఖపడలేననుకుంది. ధైర్యంచేసి మనసులో మాట అమ్మతో చెప్పింది.
తన మాట అమ్మా నాన్నా ఏనాడూ కాదనలేదు.
ఈనాడూ కాదనలేదు.
ఒకప్పుడు తన బిజినెస్ పార్టనర్ కొడుకు. అమెరికాలో చదివి వున్నతమైన డిగ్రీ తీసుకున్నవాడు, అందగాడు. కాదనడానికి వాళ్లకేమీ కనిపించలేదు.
కూతురి ఇష్టానికి సంతోషంగా ఆమోదముద్ర వేశారు.
ఆలస్యం చేయకుండా పెళ్లి సంబంధం ఖాయం చేసుకువచ్చారు.
ఆ మాట విన్నప్పటినుండి తనకి నేలమీద కాలు నిలువడంలేదు. ఊహల పల్లకిలో ఊరేగుతున్నట్టుగా వుంది" పూల తెప్పమీద తేలిపోతున్నట్లుగా వుంది.
ఇహ కలలుకనే అవసరంలేదు. అతడే వచ్చేశాడు.
అప్పుడు ముఖం త్రిప్పి చూశాడు. ఇంతకుముందు తన మెడలో పూలదండ వేసిందికదూ?
మిస్ వినోదిని. బి. కాం. లో తన క్లాస్ మేట్.
"ఓ ... వినోదిని! హౌ ఆర్యూ?"చిరునవ్వుతో చెయ్యి చాస్తూ అన్నాడు.
అదే పాణిగ్రహం అన్నంత ఇష్టంగా అతడి చేతిలో చెయ్యి కలిపింది. ఆమె మనసులో మేళతాళాలు మ్రోగాయి.
దిగంబరరావు మారుతీరావును ప్రక్కకు తీసుకెళ్లి "ఈ నెల ఎయింటీంత్ కు వినూ బర్త్ డే వుంది. బర్త్ డే ఫంక్షన్ లో ఇద్దరూ రింగులు మార్చుకునే ప్రోగ్రాం వుంటుంది. ఈ సంగతి మీ అబ్బాయితో చెప్పివుంచు" అని చెప్పాడు.
అలాగే - అలాగే!"
ఎవరైనా చూస్తే ఇతడే ఆడపిల్ల తండ్రి, అతడు మగపిల్లాడి తండ్రి. అన్నట్లుగా వుంది అతడి దబాయింపు ధోరణి.
శ్రీచక్ర దగ్గరికి వచ్చి "మేం వస్తాం. రేపొచ్చి కలుస్తాను. ఎలాగా నువ్వు బాగా టైర్డ్ అయివుంటావుకదా?"అని వీడ్కోలు తీసుకుని సతీసమేతంగా వెళ్లిపోయాడు.