Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 23


    "ఎలా వుంది?" అన్నాడు శేఖరం.

 

    "ఏమిటి?" బుస్సున లేచింది రాణి.

 

    "పల్లెటూళ్ళంటే నీకు ఎగతాళిగా? రోడ్డుకు రెండువైపులా పంటచేలూ, ఆ చేలల్లో మోటబావులూ వాతావరణం ఎలా వుంది?"

 

    రాణి జవాబివ్వలేదు.

 

    కారు ఆపి "అదిగో అటుచూడు" అన్నాడు శేఖరం జొన్న చేలోకి చోపిస్తూ.

 

    జొన్న చేలో మంచెమీద నిలబడి ఒక యువతి ఒడిసెలతో పిట్టలు తోల్తూ వుంది.

 

    రాణి కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.

 

    మోకాళ్ళ పైకి మడిచి కట్టిన ఎర్రటి చీర, ముదురు ఆకుపచ్చ రవిక, నల్లగా నిగనిగలాడుతున్న శరీరం....ఏదో వింత ఆకర్షణ.

 

    కారు ఆగటం చూసి ఆ యువతి మంచెమీద నుంచి దూకింది.

 

    అంత ఎత్తునుంచి అంతతేలిగ్గా దూకిన ఆ యువతిని ఆశ్చర్యంగా చూసింది రాణి.

 

    జొన్న కంకులు పిడికెళ్లు నిండుగా కోసుకొని చేసుకు అడ్డంపడి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికొచ్చింది ఆ యువతి.

 

    "దండాలండీ బాబుగోరూ! ఈ బుల్లెమ్మగోరూ....?" అంటూ నల్లటి ముఖంలో తెల్లటి కళ్ళనూ, పళ్ళనూ మెరిపిస్తూ నవ్వింది.

 

    "బుల్లెమ్మ గోరినే అడుగు!" రాణికేసి కొంటెగా చూస్తూ అన్నాడు శేఖరం.

 

    రాణి చెక్కిళ్లు జేవురించాయి.

 

    తెలిసిందిలే అన్నట్టు నవ్వింది ఆ యువతి.

 

    "ఆగో! తీసుకోండి బుల్లెమ్మగోరూ!" జొన్నకంకులు రాణికి అందించింది.

 

    రాణి అందుకొని "ఎందుకు?" అన్నట్టు చూసింది.

 

    "పాలకంకులు! నలుపుకుతింటే బలే గుంటయ్ అమ్మాయిగోరూ!"  

 

    మళ్ళీ నవ్వింది. బుగ్గలు చొట్టలు పడ్డాయి. రాణికి, ఆమెలో తను ఎన్నడూ పట్నంలో చూడని అందం ఏదో కన్పించింది. కళ్ళార్పకుండా ఆమె ముఖంలోకి వింతగా చూడసాగింది.

 

    "వస్తాం మాణిక్యం! రాముడు ఊళ్ళోనే వున్నాడా?" అడిగాడు శేఖరం.

 

    "ఆఁ ఉన్నాడు దొరా! తమరికోసమే సూత్తున్నాడు!" అన్నది మాణిక్యం కొంచెం సిగ్గుపడుతూ.

 

    శేఖరం కారు స్టార్టు చేశాడు.

 

    "నల్లగా, మొరటుగావున్నా ఆమె అందంగానే వుంది బావా!" అన్నది రాణి.

 

    శేఖరం సమాధానంగా చిరునవ్వు నవ్వాడు.


                                         14


    సునంద సూట్ కేసు పట్టుకొని రైలు దిగింది. ప్లాట్ ఫారంమీద తండ్రి కోసం వెదికింది. తండ్రి కన్పించలేదు. బయటికి వచ్చి రోడ్డుమీద పక్కగా నిల్చుంది.

 

    నాన్న ఎందుకురాలేదో! ఆరోగ్యం బాగాలేదేమో? తను రాకపోయినా చంద్రయ్యనో, ఏసోబునో పంపిస్తాడే? ఏమయి వుంటుంది? ఒకవేళ తను రాసిన ఉత్తరం నాన్నకు అందలేదేమో?

 

    "సునందమ్మగోరా? ఈడ నిలబడ్డారేందమ్మా! రండి! ఊళ్ళోకే ఎల్తంది బండి!" అన్నాడు వెంకడు సునందను గుర్తించి.

 

    ఆలోచిస్తూ నిలబడ్డ సునంద తలెత్తి చూసింది. ఎదురుగా రెండెడ్లబండి నిల్చుని వుంది. బండి తొట్టిలో, ఎర్రకుచ్చుల చరణాకోల పట్టుకొని వెంకడు కూర్చుని వున్నాడు.

 

    "నువ్వా వెంకా? బండి ఊళ్ళోకి వెళ్తుందా?" ఆశ్చర్యంగా అడిగింది సునంద.

 

    "తవరికి తెలవదేంది! శేఖరం బాబుగోరు పెసిడెంటు అయినాక ఊళ్లోకి రోడ్డు ఏయించారుగా? మన ఊరే మారిపోనాది అమ్మాయిగోరూ!"

 

    "అట్లాగా?" ఆలోచిస్తూ అన్నది సునంద.

 

    "ఎక్కండి అమ్మాయిగోరూ!" అన్నాడు వెంకడు.

 

    సునంద బండి ఎక్కి కూర్చుంది. వెంకడు ఎడ్లను అదిలించాడు. ఎడ్లు పరుగు లంకించుకున్నాయి. మెళ్ళో మువ్వలు గలగల మోగుతున్నాయి.

 

    సునంద పొలాలను చూస్తూ "ఈ సంవత్సరం పంటలు బాగానే పండినట్టున్నాయి కదూ వెంకన్నా?" అడిగింది.

 

    వెంకడు ఆయేటి పంటల గురించీ, ఊళ్ళో వచ్చిన మార్పులు గురించీ, శేఖరం మంచితనాన్ని గురించీ చెబుతూవుంటే వింటూ కూర్చుంది సునంద, గత గత మంటూ పోతూన్న బండిలో.

 

    పరుగులు తీస్తున్న ఎడ్ల వెనక కారు హారన్ మ్రోగింది. తోకలు పై కెత్తి ఎడ్లు ఉరకలు పరుగులు లంకించుకున్నాయ్. వెంకడు ఆపటానికి ప్రయత్నించినా ఆగటంలేదు.

 

    "ఎడ్లు బెదిరినట్లున్నయ్!" భయపడుతూ, బండిలో ఎగిరెగిరిపడుతూ అన్నది సునంద.

 

    "మాలావు కోడెలు! ఈటికేం అదురూ బెదురూ లేదమ్మాయ్ గోరూ! రోసం! మాలావు రోసం!" అన్నాడు వెంకదు పరుగులు తీస్తున్న కోడెల్ని గోముగా నిమురుతూ.

 

    బండి ధర్మయ్య ఇంటిముందు ఆగింది. బండి దాటుకెళ్ళే అవకాశం లేక కారు కూడా ఆగిపోయింది. బండి ఆగిన శబ్దం విని ధర్మయ్య బయటికి వచ్చాడు.

 

    సునంద బండిదిగి కారులోకి చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది.

 

    శేఖరం, రాణీ కూడా ఆశ్చర్యంగా సునందను చూశారు.

 

    "అరే! సునందా! మీది ఈ ఊరా?" అంటూ రాణి కారుదిగింది.

 

    శేఖరం కూడా దిగి సునంద దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.

 

    చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి తెల్లబోయాడు ధర్మయ్య.

 

    "ఏమిటమ్మా ఉత్తరమన్నా రాయకుండా వచ్చావ్?" అన్నాడు ధర్మయ్య కూతురి దగ్గరకు వస్తూ.

 

    "నమస్కారమండీ!" ధర్మయ్యకు శేఖరం నమస్కారం చేశాడు.

 

    "నువ్వా బాబూ? మా అమ్మాయి సునంద"! అంటూ ధర్మయ్య కూతుర్ని పరిచయం చేశాడు.

 

    "సునంద మీ అమ్మాయా అండీ?"-శేఖరం కళ్ళలో ఇంద్రధనుస్సులు విరిశాయి. కంఠంలో ఆనందాశ్చర్యాలు దోబూచులాడాయి.

 

    "అయితే మీరేనన్నమాట ఈ ఊరి ప్రెసిడెంటు?" అన్నది సునంద నవ్వుతూ.

 

    "శేఖరం నీకు తెలుసా తల్లీ!" ధర్మయ్య అడిగాడు.

 

    "తెలుసు నాన్నా! ఆ అమ్మాయి రాణి, నా క్లాసుమేట్! శేఖరం గారు రాణీకి బావ!" అన్నది సునంద.

 

    "అంటే, ఆ అమ్మాయి పరమేశంగారి కూతురు గదూ?"

 

    "అవునండీ!" అన్నాడు శేఖరం.

 

    రాణి విసుగ్గా ముఖం పెట్టింది. "వెళ్ళొస్తాం సునందా!" అంటూ కారుకేసి నడవబోతున్న రాణి చెయ్యి పట్టుకుంది సునంద.

 

    "అదేమిటి రాణీ మా యింట్లోకి రాకుండానే వెళ్తారా?" సునంద శేఖరం ముఖంలోకి చూసింది.

 

    శేఖరం సునందనే ఆరాధనా పూర్వకంగా చూస్తున్నాడు. సునంద కళ్ళు మరల్చుకుంది.

 

    "ఇప్పుడా? తర్వాత వస్తాంలే!" అన్నది రాణి తన నలిగిపోయిన చీరెను చూసుకుంటూ.  

 

    "ఐదు నిముషాలు వుండి వెళ్దాం పద!" అన్నాడు శేఖరం.

 

    రాణీ నొసలు చిట్లించింది.

 

    "దూరాబారం నుంచి వచ్చారు, తీరిక చూసుకొని వస్తార్లే" అని, ధర్మయ్య శేఖరంతో "చూడుబాబూ! అమ్మాయిని తీసుకొని ఒకసారి తీరిగ్గా రా!" అన్నాడు ధర్మయ్య.

 

    "అలాగేనండీ!" ధర్మయ్యతో అని "వస్తాను!" అంటూ సునంద ముఖంలోకి చూసి కారుదగ్గిరకు నడిచాడు శేఖరం.

 

    "వెంకడూ! అట్లా చూస్తూ నిలబడ్డావేం! బండి పక్కకుతియ్!" అన్నాడు ధర్మయ్య.

 

    కారు సాగిపోయాక "రామ్మా!" అంటూ కూతురిచేతిలో పెట్టె అందుకొని ఇంట్లోకి నడిచాడు ధర్మయ్య.

 

    "అదేమిటే అమ్మాయ్! చెప్పాపెట్టకుండా ఊడిపడ్డావ్?" వసారాలో ఎదురొచ్చి సరస్వతమ్మ కూతుర్ని అడిగింది.

 

    "ఉత్తరం రాశాగదమ్మా!"

 

    "ఉత్తరం రాశావా? అందలేదే?" అన్నాడు తండ్రి.

 

    "నేనూ అదే అనుకున్నాలే నాన్నా నువ్వు స్టేషన్ కు రాకపోతే!"

 

    "పరీక్షలు ఎట్లా రాశావు తల్లీ?" ధర్మయ్య అడిగాడు.

 

    "బాగానే రాశాను నాన్నా! క్లాసు వస్తుందనే అనుకుంటున్నాను. అన్నది సునంద.

 

    "అవన్నీ తరవాత మాట్లాడుకోవచ్చులే! లేతల్లీ! స్నానం చెయ్యి ముందు. బాగా ఎండెక్కింది, అన్నం తిందువుగాని_" సరస్వతమ్మ అంటూ సునంద చెంపలు నిమిరింది.

 

    "పదమ్మా! లే! లే!" అంటూ ఏదో గుర్తొచ్చినవాడిలా ధర్మయ్య త్వరత్వరగా బయటికి వెళ్ళిపోయాడు.

 

    సునంద స్నానానికి లేచింది.

 Previous Page Next Page