Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 23

 

    ఎందుకు?"
    "షర్టు మీద లిప్ స్టిక్ తులసి చూసిందంటే అపార్ధాలు, అపోహలు అనుమానాలు తలెత్తుతాయి."
    'ఇందులో అపోహ ఏముందీ?"
    "అది మనిద్దరం రేపు మధ్యాహ్నం తేల్చుకుందాం.......తులసి ఆఫీస్ కెళ్ళాక ......ఈలోగా ఒక షర్ట్ అర్జంట్."
    "ఇంత సిగ్గులేని వాళ్ళను నేనెక్కడా చూళ్ళేదు."
    "నేనూ చూళ్ళేదు."
    ఆమె నవ్వాపుకుని లోపల గదిలో కెళ్ళి బాగా నలిగిపోయిన షర్ట్ తెచ్చిచ్చింది.
    "మళ్ళీ నాకిచ్చేయాలిది. గుర్తుగా దాచుకున్నాను."
    "పోనీ దాని బదులు నేను గుర్తు చేస్తుంటాను.'
    "ఏం అక్కర్లేదు" కోపంగా అంది - "లోపల గదిలో కెళ్ళి షర్ట్ మార్చుకోండి."
    సురేష్ లోపల గదిలో కెళ్ళి షర్ట్ మార్చుకుని తిరిగి వచ్చాడు.
    "థాంక్యు గంగాభవాని ....మీ ఋణం వుంచుకొను.....అప్పుడప్పుడు కాయకష్టం చేసి తీర్చుకుంటా......" అతని మాట ఆగిపోయింది.
    ఎదురుగ్గా కుర్చీలో కూర్చుని తనవంకే చూస్తోంది తులసి!!
    పెదాల మీద చిరునవ్వు తెచ్చి పెట్టుకోవడానికి సురేష్ ప్రయత్నించాడు గాని వుపయోగం లేకపోయింది.
    "ఓ నువ్వింకా నిద్రపోలేదా?" అతి కష్టం మీద కూడదీసుకుని అన్నాడు సురేష్.
    తులసి మాట్లాడలేదు.
    వెనక్కు తిరిగి తమ ఇంటి వైపు నడిచింది. తనూ వెనుకే బయల్దేరబోయాడు సురేష్. గడపవరకూ వెళ్ళాక గుర్తుకొచ్చింది తులసిని గంగాభావానే పిలుచుకొచ్చి వుంటుందన్న విషయం.
    వెనక్కు తిరిగి గంగాభవాని వైపు చూశాడు.
    విజయగర్వంతో నవ్వుతోందామే.
    "వచ్చే జన్మలో మీరు ద్రౌపది అయి పుడతారు. చూస్తుండండి" అన్నాడు కసిగా.
    "వచ్చే జన్మ సంగతేమో గానీ ముందిప్పుడు మీ సత్యభామ టన్నుల నుంచి తప్పించుకోండి" హేళనగా నవ్వుతుంది.
    ఇంట్లో కొచ్చేసరికి తులసి కోపంగా మంచం మీద కూర్చుని ఏదో నవల చదువుతోంది.
    ప్రక్కనే కూర్చున్నాడు సురేష్.
    "సీన్ ఎప్పుడు స్టార్టవుతుంది?" అడిగాడు సీరియస్ గా.
    "ఏం సీన్?"
    "అదే -సత్యభామ కృష్ణుడిని తన్నే శీను."
    ఆమె నవ్వలేదు. "మళ్ళీ తాగావు కదూ?"
    "ఇదే లాస్ట్ అని చెప్పమన్నాడు డార్క్ డెవిల్."
    "ఆ షర్ట్ సంగతేమిటి?"
    సురేష్ రాకూడదని కోరుకుంటున్న క్షణం రానే వచ్చింది.
    "ఏ షర్ట్?"
    "అదే తెలీనట్లు బూకాయించకు."
    "అదా - హహ దాని మీద లిప్ స్టిక్ అంటుకుంటేనూ -------నువ్వు చిరాకు పడతావని...."
    "సురేష్!" అతనివంక చూడకుండానే పిలిచిందామే.
    "ఎస్ డియర్!" ఆమెను తన వేపు తిప్పుకోబోయాడు గాని అతని చేతులు తోసివేసింది.
    "నిజం చెప్పు ఇంత రాత్రి వరకూ ఎక్కడున్నావ్?"
    "టు టెల్ యూ ది ఫాక్ట్."
    "తెలుగులో మాట్లాడు."
    "ఇలాంటి సమయంలో ఇంగ్లీషు వాడాలని చెప్పాడే మా భవానీ శంకర్."
    "టు టెల్ విత్ భవానీ శంకర్? ముందు చెప్పు."
    'అనుకోకుండా అంటే అయ్ మీన్ తెలీకుండా నటాషా గదిలో గడిపాను. నిజమే చెపుతున్నాను. అక్కడికేలా వెళ్ళాను, ఎందు కెళ్ళానో నాకే తెలీదు."
    "నాకు తెలుసు - తాగితే నివ్విలాంటిదేదో చేస్తావని."
    "అబ్బే ఏమీ చేయలేదు ప్రామిస్" మళ్ళీ ఆమె నడుము మీద చేయి పడింది.
    "మరి?" అతని చేతిని తోసివేస్తూ అందామె.
    "తమాషా ఏమిటంటే - నాకు నిద్ర మెలుకువ వచ్చేసరికి పక్కన రాజ్యలక్ష్మి వుంది నటాషా కాదు."
    "మీకంటే బటర్ ప్లై కంటే నేనే నయం.'
    ఆమె సీరియస్ గా చూసింది.
    "నిజం తులసీ! నాకేమీ తెలీదు. కళ్ళు తెరిచేసరికి పక్క నున్నది నువ్వే అనుకుని మన అలవాటు ప్రకారం నీ మోకాలు........"
    తులసి ఎంత ప్రయత్నించినా నవ్వాపుకోలేకపోయింది.
    "నిజం డియర్!"
    "మరీ సత్య హరిశ్చంద్రుడు లాగా ఫోజు పెట్టకు."
    "సత్య హరిశ్చంద్రుడు నటాషా రూమ్ లో ఎప్పుడూ లేడు కదా?"    
    మళ్ళీ నవ్వు - ఆపడానికి వృధాగా ప్రయత్నిస్తూ.
    ఫర్వాలేదు కరిగిపోతోంది. ఇంకొంచెం సేపు మాట్లాడితే చాలు.
    'అయినా నీ కొలతల ముందు రాజ్యలక్ష్మి కొలతలు బలాదూర్."
    "యూ సిల్లీ!"
    "నో! రియల్లీ! ఎంత చీకటిలో వున్నా ఐ కెన్ మేజర్! గాడ్స్ గిప్ట్ అది. అందరూ చేయలేరు" ఆమె పెదాలు అందుకున్నాడు.
    తల వెనక్కు జరిపిందామే.
    "నువ్వూ అందరూ మగాళ్ళలాంటివాడివే కదూ?"
    "మిగతా అందరి సంగతి నీకెలా తెలుసు?"
    "షటప్?"
    "అంటే కోపం పోయినట్లేనా?"
    "నాతో మాట్టాడవద్దు"
    "ఫెంటాస్టిక్!"
    "బెడ్ రూమ్ లో మాట్లాడకుండా వుండటమే నాకిష్టం అసలు.'
    అతని చేతులు విసిరికొట్టిందామె.
    "సురేష్" అంది అసహనంగా.
    "వెరీ గుడ్! ట్రాక్ లో కొచ్చేశావ్! ఇంకో రెండు సార్లు పేర్లు పిలుచుకుందాం!"
    సురేష్....
    తులసి....
    సురేష్.....
    తులసి......
    అప్పుడు కౌగిట్లో ఇరుక్కుపోతాం. ఇంకో రెండు సార్లు సురేష్ .......
    తులసి...
    సురేష్....
    తులసి.....
    అప్పుడు పక్క మీదకు ఇలా వాలిపోతాం. నువ్వు నా చెవి దగ్గర మెత్తగా, మెల్లగా అంటావు.
    సురేష్ యూ ఆర్ రియల్లీ వండర్ పుల్.
    "యాజ్ లాంగ్ యాజ్ యూ విష్" అంటాన్నేను.
    "అబ్బా - సురేష్ ఇంకా దగ్గరకు రావూ........"
    తులసి నవ్వాపుకుని అతని చేతిని తన గుండెల కేసి అదిమి పట్టుకుంది.
    'ఇంకోసారి ఇలా జరగదని ప్రామిస్ చెయ్."
    "అంటే ఇంకోలా జరిగితే ఫర్లేదా? అలా కోపంగా చూడకు.......నా ఉద్దేశ్యం ఏమిటంటే .......ప్రామిస్ ప్రామిస్........అయినా నీ అంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని.....నేనేం పిచ్చివాడినా చీకటి రూమ్స్ లో గడపడానికి?"
    తులసి అతని వేపుకు తిరిగి పెదాల మీద ముద్దు పెట్టుకుంది.
    సురేష్ ఆనందంగా రొటీన్ లో కొచ్చేశాడు.
    వేడిగా ఉచ్చ్చ్వాస నిశ్వాసాలు.
    రహస్య కలవరింతలూ,
    తామిద్దరూ బ్రతుకుతోంది ఈ క్షణాల కోసమే అన్నట్లు ......పైగా ఇవే ఆఖరి అనుభవించే క్షణాలయినట్టూ.......ప్రతిసారీ లాగానే ఒకర్లో ఒకరు లీనమై పోతూ , ఒకరినొకరు తమలో ఐక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తూ.....
    తలుపు మీద సున్నితంగా తట్టిన చప్పుడు......
    ఒక్క ఉదుటున కౌగిలి విడిపోయింది.
    "ఎవరు?" మత్తుగా , నెమ్మదిగా అడిగింది తులసి అతనిని.
    "బహుశా పాలపాకేట్ అయింటుంది."
    'అప్పుడేనా?"
    "ఈ మధ్య ఫామిలీ ప్లానింగ్ కూడా వాళ్ళకే యిచ్చారేమో?"
    సురేష్ లేచివెళ్ళి తలుపు సందులో నుంచే చేయి బయటకు పెట్టాడు పాలపాకేట్ కోసం.
    అతని చేతిని ఎవరో గిల్లెసరికి అదిరిపోయి వెనక్కు లాక్కుని బయటకు చూశాడు.
    గంగాభవాని నవ్వుతోంది.
    "తలుపులు మూయటం మర్చిపోయినట్లున్నారు గుర్తు చేద్దామని...."
    'అబ్బే మర్చిపోలేదు."
    ఆమె విసురుగా వెళ్ళి పోయిందక్కడి నుంచి.
    సురేష్ అంతకంటే విసురుగా తలుపులు మూసివేశాడు.
    "యాంటీ క్లయిమాక్స్" అంది తులసి మంచం మధ్యలో కూర్చుని త్రుళ్ళి త్రుళ్ళి నవ్వుతూ.
    
                                                      *    *    *    *

 Previous Page Next Page