Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 23

                                 


                               మణిగుప్తుడు - ధనగుప్తుడు

           

    ఒక గ్రామములో మణిగుప్తుడు ధనగుప్తుడు అను నిరువురు మిత్రులు కలరు. వారు చిన్నతనము నుండియు కలసిమెలసి తిరుగుచు వ్యాపారము చేయుచుండెడి వారు.
    ఒకప్పుడు మణిగుప్తుడు దూరదేశమునకు పోవలసివచ్చినది. అతడు తనదగ్గరనున్న బంగారు నాణెములు ఒక పాత్రలో పోసి దాచిపెట్టుటకై ధనగుప్తుని దగ్గరకు వెళ్లెను.
    ధనగుప్తుడు స్నేహితుని కోరిక ప్రకారము నాణెములపాత్రను దాచియుంచుటకు అంగీకరించెను. మణిగుప్తుడు మిత్రునివద్ద సెలవు గైకొని వెడలిపోయెను. ధనగుప్తుడు పాత్రలోని బంగారు నాణెములను ఎట్లయిన అపహరింపవలెనని నిశ్చయించుకొనెను. వెంటనే అతడు స్వర్ణఖండములను తీసి రహస్యముగా దాచుకొనెను. వానికి బదులు కొన్ని ఇనుప ముక్కలు తెప్పించి పాత్రనిండుగ బోసి మరల ఎప్పటివలె వాసెనగట్టి దాచిపెట్టెను.
    కొంతకాలము గడచినది మణిగుప్తుడు దూర దేశమునుండి తిరిగివచ్చెను. వచ్చిన వెంటనే అతడు ధనగుప్తుని దగ్గరకుబోయెను. కొంతసేపు కుశల ప్రశ్నలతో గడచినది. మణిగుప్తుడు "మిత్రమా! నేను నీ దగ్గర దాచిపోయిన పాత్రను ఇత్తువా?" అని అడిగెను.
    ధనగుప్తుడు విషపు నవ్వు నవ్వి "ఇదిగో తెచ్చి యిచ్చెదను. ఇంతకాలము కంటికి రెప్పవలె కపాడితిని. నేటితో నా భారము తీరినది" అని పాత్రను తీసుకొనివచ్చి మణిగుప్తుని చేతబెట్టెను.
    మణిగుప్తుడు దానినందుకొని వాసెన విప్పి చూచెను. అందలి ఇనుపముక్కలు చూచునప్పటికి అతని గుండెలు పగిలిపోయెను. అతడు ధైర్యము తెచ్చుకొని ధనగుప్తుని చూచి "ఓయీ! ఈ పాత్రలో బంగారునాణెములు భద్రపరచితిని. ఇప్పుడు దీనిలో లోహపు ముక్కలున్నవి. ఈ చిత్రమేమి?" అని ప్రశ్నించెను.     
    ధనగుప్తుడు ఆశ్చర్యము నటించుచు "ఏమో! నీదగ్గర తీసికొన్నప్పుడు మరల ఇప్పుడు నీకిచ్చుచున్నప్పుడుతప్ప నేను ఎన్నడును ఆ పాత్రను ముట్టుకొనలేదు. దానిలో బంగారు ముక్కలే దాచితివో, వెండి ముక్కలే ఉంచితివో నాకు తెలియదు" అని విసుగుకొనుచు పల్కెను.
    మణిగుప్తుడు ధనగుప్తుడు చేసిన మోసమును గ్రహించెను. కాని అప్పుడు అతడేమియు మాట్లాడలేదు. కొంచెముసేపు కూర్చుండి సెలవు తీసుకొని అతడు తన యింటికి బయలుదేరెను.
    ధనగుప్తుని ఐదేండ్ల కుమారుడు ఇంటిముందు ఆడుకొనుచుండెను. మణిగుప్తుడు ఆ బాలుని ఎత్తుకొని తాయము పెట్టెదను రమ్మని తన యింటికి తీసుకొనిపోయి వానిని రహస్యముగా ఒక గదిలో దాచి యుంచెను.
    ఎంతసేపటికిని కుమారుడు ఇంటికి చేరలేదు. ధనగుప్తుడు ఊరంతయు వెదకెను. ఎక్కడను కొడుకు జాడ లేదు. అంతలో మార్గమధ్యమున అతనికి మణిగుప్తుడు కన్పించెను. ధనగుప్తుడు అతనిని చూచి కన్నుల నీరుగార్చుచు "మిత్రమా! మా పిల్లవాడు కన్పించినాడా?" అని విచారముగా అడిగెను.
    మణిగుప్తుడు మందహాసముచేయుచు "రమ్ము మా యింటి దగ్గర ఉన్నాడు. తీసికొనిపొమ్ము" అని పలికెను.
    ఇద్దరును మణిగుప్తుని గృహ సమీపమునకు పోయిరి. అక్కడ చొక్కా లాగు తొడుక్కున్న కోతియొకటి కుప్పిగంతులు వేయుచుండెను. మణిగుప్తుడు ధనగుప్తునకు వానరమును చూపి "మిత్రమా ఇదిగో మీ పిల్లవాడు ఎత్తుకొనిపొమ్ము" అని పలికెను.
    ధనగుప్తుడు మండిపడుచు "దుర్మార్గుడా! కుమారునడిగిన కోతిని చూపెదవేమి? నీవే నా బిడ్డను చంపివేసి యుందువు. బాలుడు వానరముగా ఎక్కడైన మారునా?" అని గద్దించి అడిగెను.
    మణిగుప్తుడు మెల్లగా నవ్వుచు "మిత్రమా! బంగారము ఇనుముకాగా బాలుడు కోతి ఏలకాకూడదు?" అనెను.
    ధనగుప్తుడు జరిగినదానిని గ్రహించెను. అతడు బుద్ధి తెచ్చుకొని బంగారము తెచ్చి యిచ్చి తన కుమారుని తీసుకొని పోయెను.

                                         *  *  *  *

 Previous Page Next Page