Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 23

 

    దిసీజ్ టూ మచ్ సార్! ఆ మేడమ్ మీద చీటింగ్ కేస్ పెట్టాలి మనం!' అన్నాడు కెమెరా మెన్.
    "ఒరే! కెమెరామేన్నూ! మనక్కావలసింది చీటింగ్ కేస్ లు కాదురా! రేటింగ్ రేస్ లు! ఎలాగోలా ఆ మేడమ్ తో ప్రస్తుతానికి కంప్రమైజ్ అయి - ఆ ఇంటర్యూ మన చానెల్లో కూడా అదే టైమ్ కి చూపించాలి! అప్పుడు కొంతవరకయినా మన చానెల్ కి వాల్యూ వస్తుంది -"
    భవానీ పోలీస్ అధికారి దగ్గరకు నడిచాడు.
    "మీరు అయిడెంటిటీ కార్డ్ లు చూడకుండా ఇంకెవరినో లోపలకు పంపించారు! ఈ విషయం మా చానెల్లో చూపించాలనుకుంటున్నా-"
    అతను కొంచెం కంగారు పడ్డాడు.
    "ఏదో చిన్న పొరపాటు జరిగింది -"
    "చిన్నదని మీరంటున్నారు -- కానీ ఆ చానెల్ వాళ్ళ దగ్గర లంచం తీసుకుని వాళ్ళను లోపలకు పంపించారు అని మా న్యూస్ లో చెప్తాం!"
    అతను టోటల్ గా బెదిరిపోయాడు.
    "అదేంటి సార్- అంత డైరక్టుగా అబద్దాలు చెప్తారా?"
    "ఈ ప్రాబ్లం సాల్వ్ అవాలంటే ఒక్కటే దారి!"
    "ఏమిటి సార్ అది?"
    "వాళ్ళు బయటకు రాగానే వాళ్ళ కెమెరా , ఆ ఇంటర్యూ సీడీ - కానిఫిస్కేట్ చేయండి -- మేమిద్దరం రాజీ కొచ్చేవరకూ తిరిగి ఇవ్వవద్దు-"
    "థాంక్యూ సార్ - మీరెలా చెప్తే అలా--"
    భవానీ వచ్చేసి రిసెప్షన్ లో కూర్చున్నాడు.
    మరో అయిదు నిమిషాల్లో మల్లిక హడావుడిగా భవానీ దగ్గర కొచ్చింది.
    "హాయ్! ఇంపర్సనేటర్!"
    "ఇవన్నీ ఈ ఫీల్డ్ లో కామన్- నువ్వేం ఆ ఫేండవక్కర్లేదు -" టీజింగ్ గా అంది.
    "నీలాంటోళ్ళను కిడ్నాప్ చేసి సీడీ లాక్కోవటం కూడా కామనే-"
    "ఓకే- ఆ ఇంటర్యూ సీడీ ఇద్దరం షేర్ చేసుకుందాం-"
    "ధర్డ్ రేట్ అఫరది- కొంచెం మంచి ఆఫర్ ఆలోచించు -"
    "అయితే నువ్వే చెప్పు -"
    "మా చానెల్లో ఒకసారి టెలికాస్ట్ చేశాక అప్పుడు మీ చానెల్లో చేసుకో-"
    "ఓకే - ఎగ్రీద్-"
    "అప్పుడే అవలా -- ఇంకా వుంది -"
    "ఇంకేంటి ?"
    "ఆ ఇంటర్యూ మా చానెల్లో ఫలానా టైం కోస్తోందని మీ చానెల్లో గంట ముందే స్క్రోలింగ్ ఇవ్వాలి - దానికి చార్జీ మేము పే చేస్తాం -"
    "దిసీజ్ టూ మచ్! ఒక ప్రిస్టేజియస్ చానెల్ ఒక చెత్త చానెల్ ప్రోగ్రామ్స్ గురించి యాడ్ యాక్సెప్ట్ చేస్తుందా?"
    "చానెల్ కి ప్రిస్టిజ్ ఉంది గానీ - దాని క్రియేటివ్ హెడ్ కి లేదు కదా!"
    మల్లిక కొద్ది క్షణాలు ఆలోచించింది.
    "ఒకవేళ నేను ఒప్పుకోలేధనుకో-"
    "ఇంటర్యూ ఇద్దరికీ దొరకదు -"
    "ఓకే - వప్పుకుంటున్నా - కానీ ఈ ఒక్కసారికే -"
    "నీ టెస్ట్ అంతేలే! ఒక్కసారికయితే - దేనికయినా వప్పుకుంటారు -"
    మల్లిక కోపంగా చూసింది.
    "డైలాగ్ కొంచెం ఒవరయింది !"
    'అది నా వీక్ నెస్ అని మా డాక్టర్ చెప్పాడు -"
    ఆమె వెళ్ళిపోయింది.
    మరో అరగంట తర్వాత 'సంపూర్ణ' చానెల్ చూస్తోన్న రోజా, జైరాజ్ అప్పుడే స్టార్టయిన స్క్రోలింగ్ చూసి ఉలిక్కిపడ్డారు.
    "అదేంటి? మన చానెల్లో రాబోతున్న ఇంటర్వ్యూ గురించి సంపూర్ణ చానెల్లో టెలికాస్ట్ చేస్తున్నారు ?" ఆశ్చర్యంగా అడిగింది రోజా.
    "నాకెందుకో రాకేష్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేశావేమో అనిపిస్తుంది -' రోజా నవ్వింది.
    "అతనికంత సీన్ లేదు డాడీ! స్కూల్లో కూడా చూసేదాన్ని కదా! అన్నీ పాస్ మార్కులే!"
    "బుక్ నాలెడ్జ్ వేరు- జనరల్ నాలెడ్జ్ వేరు రోజా-"
    "ఏదేమయినా - నేను - అమెరికాలో అంత స్టడీ చేసి వచ్చి కూడా ఫెయిలయిపోయా! అలాంటిది ఆప్టరాల్ ఈ రాకేష్ వల్లే మవుతుంది ?"
    "ఏ పుట్టలో ఏ పాముందో-" అన్నాడు జైరాజ్.
    భవానీ ఊహించినట్లే దివ్యాసేన్ ఇంటర్వ్యూ చూడ్డానికి యూత్ ఎగబడ్డారు మిగతా చానెల్స్ వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    సడెన్ గా బృందావన్ చానెల్ పేరు అటు న్యూస్ పేపర్లో- ఇటు యూత్ లో మార్మోగిపోవటం వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తోంది.
    అదేరోజు యాభై మంది భారత సంస్కృతీ పరిరక్షణ సమితి అనే బానర్ లు పట్టుకుని ఉదయం పది గంటలకు ఊరేగింపు ప్రారంభించారు. ముఖ్యంగా అందులో పాల్గొన్న లేడీస్ చాలా మంది దృష్టి నాకర్శించారు. వాళ్ళలో ఒక సెక్సీ లేడీ జుట్టు విరబోసుకుని అర్ధనగ్నంగా ఒక వాన్ టాప్ మీద నిలబడింది. ఆమె పక్కనే దుర్యోధనుడి గెటప్ లో విజయ్ యాదవ్ ఆమె చీర ఊడదీయటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని వీపుకి బృందావనం చానెల్ అన్న బోర్డు తగిలించి ఉంది -
    "బృందావనం టీవీ చానెల్లో భారత స్త్రీ లను కించపరచటం -- సహించం -- సహించం -"
    "భారత సంస్క్కృతిని దిగజారుస్తున్న బృందావనం చానెల్ - డౌన్ - డౌన్ -"
    "ప్రభుత్వం వెంటనే బృందావనం చానెల్ ని - మూసేయాలి - మూసేయాలి -"
    "బృందావన్ చానెల్ మేనేజ్ మెంట్ వెంటనే - క్షమార్పణలు చెప్పుకోవాలి -"
    అంటూ వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళకు తోడూ మామూలు గానే పానీ పాటా లేని జనం మరికొంతమంది ఊరేగింపులో జాయినయారు. మొదట్లో పోలీసులు కూడా పట్టించుకోలేదు గానీ దారి పొడుగుతా ట్రాఫిక్ జామ్ అవటం మొదలు పెట్టేసరికి వాళ్ళూ ఆ ఊరే గింపుతో పాటు నడుస్తూ ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయటం మొదలుపెట్టారు. తమాషా ఏంటంటే ఆ ద్రౌపది వస్త్రాపహారణం సీనూ, ఆ ఊరేగింపునీ లైన్ కవరేజ్ చేయిస్తున్నాడు భవానీ! ఆ కవరేజ్ చూసినవాళ్ళూ ఆ ఊరేగింపు ఏ రోడ్ లో వస్తోందీ తెలుసుకుని ఇళ్ళల్లో నుంచి బయటికొచ్చి బాల్కనీల్లో , టెర్రేస్ ల మీదా నిలబడి చూడసాగారు.
    "సంపూర్ణ ' టీవీ చానెల్ ఎండి భరద్వాజ్ రూమ్ లో కూర్చుని ఉంది - క్రియేటివ్ హెడ్ మల్లిక!
    భరద్వాజ్ చేతిలో రెండు వారాలకు సంబంధించిన రేటింగ్ చార్ట్ ఉంది.
    "నాకిదే అర్ధం కావటం లేదు మల్లికా! రెండు వారాల క్రితం వరకూ "జీరో' వ్యూయర్ షిప్ ఉన్న ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్ కి , బృందావన్ చానెల్లో సడెన్ గా నాలుగు రేటింగ్ ఎలా వచ్చింది? ఆ టైమ్ లో వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చూపిస్తున్నారు? అని ప్రేక్షకులను  ఎందుకు ఎట్రాక్ట్ చేస్తున్నాయ్?" అడిగాడు ఏం.డి.

 Previous Page Next Page