Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 23


    ఈఫిల్ టవర్ మూడో అంతస్థులో, కాకలు దీరిన సేనల రక్షణ కింద, మూడు నెలలకు సరిపోయే ముడి ఫిల్మూ, మాగ్నెటిక్ టేపులూ పెట్టుకున్న సేనాపతులు బీరు తాగుతున్నారు.
    ఫ్రాన్స్ లో రాత్రి పడింది. ఫ్యాక్టరీలలో కార్మికులు నిద్రిస్తున్నారు. యూనివర్శిటీలో విద్యార్థులు నిద్రిస్తున్నారు. మిగిలినవాళ్లూ నిద్రిస్తున్నారు.
    యూనియన్లు మళ్ళీ రాయబారాలు ప్రారంభించాయి.
    మరునాటి ఉదయం పదకొండు గంటలకి మిట్టెరాండ్ గుర్తిస్తాడు- ప్రభుత్వమనేది లేదని! మరో కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపాదిస్తాడు.
    సహజంగా, మెండే - ఫ్రాన్స్ పేరు ప్రతిపాదితమవుతుంది. వాల్డెక్ రోషే (కమ్యూనిస్టు నాయకుడు) గంటలు లెక్కిస్తున్నాడు. వర్కర్లు "వీల్లేదు" ఒక ప్రహ్త్యేకమైన కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఉపయోగపడాలి. ఆ ప్రజా ప్రభుత్వంలో కార్మికులనూ, శాంతిభద్రతలనూ కమ్యూనిస్టులు కాపాడుతారు. ఉభయులూ కలిశారు.
    సెగీ విద్యార్థి నాయకులను కూడా కలుసుకుంటాడు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి వీళ్ళ అవసరం ఉంది- లేత చేతులయినా, కాకపోయినా! కాని దేవదూతల ప్రతీక అయిన కాన్ -బాందీ భూతం మాత్రం సంభాషణలను సాగనివ్వదు.
    ప్రస్తుతం ఈ భూతం ఫ్రాన్సు- జర్మనీ సరిహద్దును దాటుతోంది - పడదొబ్బరా సరిహద్దుల్ని- సీలు వేసిన రైలు పెట్టెలో కాదు. రాత్రి పన్నెండు కొట్టేసరికి రెండు వందలమంది మెక్ లుహనైట్లు సోర్బాన్ ప్రెస్ ఆఫీసులో విద్యుదార్త వినడానికి వేచుకున్నారు.
    కాన్- బాందీ చిన్నగా నవ్వుతాడు. సోర్బాన్ విరగబడి నవ్వుతుంది. పందొమ్మిదవ శతాబ్దం కనిపించని ఒక అంగుళం మేరకు నిశ్శబ్దంగా వెనుకంజ వేస్తుంది. అప్రయత్నంగా, అయినా ఎంతో బిగుతుగా ఒక నూతన కార్మిక శక్తి ఎముకల గూడు రూపుదాల్చుతోంది.
    దానికై ఎదురుచూస్తున్న దేవదూతల స్వప్నాలు కూలిపోతున్న పాతలోకపు శూన్యావకాశాలను నింపుతున్నాయి - భౌగోళిక, మానసికావకాశాలను.
    నాంటెస్ పట్టణానికి కావాల్సిన ఆహారమూ, రాకపోకలూ కొత్త అధికారం కిందకొచ్చాయి. వర్కర్ల "వీల్లేదు" ఎంగిలి మెతుకుల్ని తిరస్కరించింది.
    "ఈ "వీల్లేదు" విస్పష్ట చర్యగా ఆకృతి ధరించాలి. కాలం చేజారిపోతోంది.
    కార్మికులు ఆహారం అనేదాన్ని విద్యార్థి దేవదూతలు స్వప్నాలంటారు.
    ఈ గతి తార్కికం నుంచి ఒక కొత్త మాట, ఒక కొత్త ప్రపంచం.
    అద్దాల ఎదుట చాలాకాలం గడిచింది.... కామ్రేడ్స్! అప్పుడే ఇది బుధవారం ఉదయం.
    సి.జి.టి. తన మనుష్యుల్ని ప్రవేశపెడుతుంది- రానున్న ప్రజా ప్రభుత్వపు బలాన్ని ప్రదర్శించడానికీ, అరాచకం నుంచి దేశాన్ని రక్షించడానికీ పవిత్రమైన ఫ్రెంచి పతాకం పేరిట. డిగోల్ విస్మృతుడయ్యాడు- అతని జనవాక్య సేకరణలాగే.
    యూనివర్శిటీలను అధికారం పట్టుకుంది. మేం ఫ్యాక్టరీలను పట్టుకున్నాం.
    అధికారానికి అధికారం మాత్రమే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకుందాం.
    మంత్రి వర్గాల ప్రధానాధికారుల రహస్య పత్రాలను తగలబెడుతున్నారు.
    ప్రతివారం జరిగే ప్రహసనం కోసం మంత్రి భూతాలు ఎలిసీ భవనానికి వస్తున్నాయి.
    సమావేశం వాయిదా పడిందని వాళ్ళకొక ద్వారపాలకుడు చెబుతాడు- రేపు మళ్లీ మూడు గంటలకి. సేనాని డిగోల్, కుట్రదారు డిగోల్ ముసుగు లాగి పారేస్తాడు.
    అతనికి నెపోలియన్ లాగే "ఫిరంగి తిండి" వంటి ప్రజలంటే నిర్లక్ష్యం. పొగ తెరల గుట్టల్లాంటి ఉప సమస్యల పొరలను కోసుకొస్తుందది. అసహ్యం ప్రకాశమానమవుతుంది.
    అదీ, అంతంలేని అశుద్ధం. జన ప్రవాహం. ఫ్రాన్సు హృదయం మళ్ళీ కుళ్లు కాలవల్లోంచి పైకి లేచింది - 1789, 1848, 1871.
    అవే కారణాలు. అవే సమస్యలు. అవే శక్తుల తూకం.
    ఫ్రాన్సు చరిత్రలో అప్పుడప్పుడు తిరగబడే బాధా సర్ప దుష్టులైన గుడ్డి గొర్రెల మందలకీ, ఆకారం మారని, వయస్సులేని అధికారపు ముసుగుకీ మధ్యగల రాజకీయ గతి తార్కికం.
    అధికారాన్ని నువ్వు లాక్కోవు, ఏరుకుంటావు. డిగోల్ చాలాకాలం తమాయించాడు- మెత్తని రాచకురుపన్న నమ్మకంతో. కాని అది గట్టిది. శస్త్ర వైద్యం చెయ్యాలి.
    ప్రజల బలం ఎప్పుడూ భాగాహారమవుతుంది. వాళ్ళకి హృదయాలే తప్ప మెదళ్ళు లేవు. మూర్ఖుల గుంపు.
    చర్య తీసుకొనడంలో జాప్యం కూడదు. ఒక పిసరు బెదిరింపు కూడా రంగరించి ఆ చర్యను సమర్ధించాలి. కమ్యూనిస్టులు హాయిగా లొంగిపోతారు- నడిమంత్రపు సిరి పట్టిన వాళ్ళలాగ. వాళ్ళకి కావలసింది సరుకులు, సాంఘిక మర్యాద. మూర్ఖులు!
    ఫ్రాన్సును రక్షించవచ్చు. (అనిడిగోల్ అంచనా)

 Previous Page Next Page